దేవర తో పోటీకి దిగటమే ‘సత్యం సుందరం’చేసిన పొరపాటు,  మంచి సినిమా కిల్ అయ్యిపోయిందే
x

'దేవర' తో పోటీకి దిగటమే ‘సత్యం సుందరం’చేసిన పొరపాటు, మంచి సినిమా కిల్ అయ్యిపోయిందే

సాధారణంగా పెద్ద సినిమాలు రిలీజ్ టైమ్ లో పోటీగా మరో సినిమాని రిలీజ్ చేయటానికి భయపడతారు. పెద్ద సినిమా బజ్ లో తమ సినిమా ఆడదని చాలా మందికి తెలుసు. థియేటర్స్ సమస్య వస్తుందని తెలుసు.


సాధారణంగా పెద్ద సినిమాలు రిలీజ్ టైమ్ లో పోటీగా మరో సినిమాని రిలీజ్ చేయటానికి భయపడతారు. పెద్ద సినిమా బజ్ లో తమ సినిమా ఆడదని చాలా మందికి తెలుసు. థియేటర్స్ సమస్య వస్తుందని తెలుసు. అయితే కొన్ని సార్లు రిలీజ్ తప్పనిసరి అయ్యిపోతుంది. ముఖ్యంగా తమిళ డబ్బింగ్ సినిమాలు అక్కడా, ఇక్కడా ఒకే సారి రిలీజ్ చేయాలని అనుకున్నప్పుడే సమస్య మొదలవుతుంది. ఎక్కువగా సంక్రాంతికి ఈ సమస్య వస్తుంది. తమిళంలోనూ పొంగల్ అతి ముఖ్యమైన పండగ కావటం, మనకు తెలుగులో సంక్రాంతి కు భారీ రిలీజ్ లు ఉండటంతో తమిళ స్టార్స్ సినిమాలు ఇక్కడ అదే రోజు రిలీజ్ చేస్తూంటారు. అలా సంక్రాంతికి మన తెలుగు సినిమాల దెబ్బకు బాగుందనుకున్న తమిళ డబ్బింగ్ సినిమాలు సైతం నామ రూపాలు లేకుండా పోయాయి. రజనీకాంత్, అజిత్ ,విజయ్ లాంటి సినిమాలకే జనాలు కరువు అయ్యారు. ఇప్పుడు సంక్రాంతి కాకపోయినా మరో సారి అదే సీన్ రిపీట్ అయ్యింది.

బాక్సాఫీస్ బరిలో 'దేవర' భారీ నంబర్స్ నమోదు చేస్తూ దూసుకుపోతోంది. మొదటి రోజు ఈ సినిమా వంద కోట్ల మార్క్ చేరటం కేక్ వాక్ అయ్యిపోయింది. అందుకు కారణం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత 'దేవర'తో సోలో హీరోగా థియేటర్లలోకి రావటమే. దీనికి మొదటి రోజు భారీ ఓపెనింగ్ లభించింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు, వెనక ఎవరూ తమ సినిమాలు రిలీజ్ చేయటానికి ఎవరూ సాహసించలేదు. కానీ కార్తీ హీరోగా చేసిన సత్యం సుందరం చిత్రం దేవర రిలీజైన మరుసటి రోజు రిలీజ్ చేసారు. సత్యం సుందరం( Satyam Sundaram Movie ) సినిమాకు తెలుగు లో కూడా మంచి టాక్ వచ్చింది. రివ్యూలు కూడా చాలా బాగా వచ్చాయి. అయితే కలెక్షన్స్ మాత్రం కనపడటం లేదు. అందుకు కారణం మొహమాటం లేకుండా దేవర సినిమానే.

పెద్ద సంస్దలే డిస్ట్రిబ్యూట్ చేసినా కలిసి రాలేదు

తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది పెద్ద సంస్దలు సురేష్ ఏషియన్ అయినప్పటికీ పెద్దగా కలిసి వచ్చినట్లు కనపడటం లేదు. ఉన్నంతలో హైదరాబాద్ లో మంచి రిలీజ్ వచ్చేలా చేసుకున్నారు కానీ చాలా బిసి సెంటర్ లలో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్క్రీన్ లు మాత్రం దక్కలేదు.చిన్న కేంద్రాల్లో చాలా చోట్ల అసలు రిలీజ్ కాలేదని చెప్పాలి. రిలీజ్ ఉన్న చోట్ల కూడా ఎన్టీఆర్ సినిమాకే జనం మ్రొగ్గుతున్నారు.

ఈ సినిమా దేవర రిలీజ్ టైమ్ లో కాకుండా ఒక వారం లేటుగా వచ్చి ఉంటే బాగుండేదని ట్రేడ్ అంటోంది . అక్కడ తమిళ వెర్షన్ ముందే వచ్చినా ఇబ్బంది ఉండేది కాదని అంటున్నారు.అయితే రిలీజ్ కు ముందు నిర్మాతకు భయం ఉంటుంది. తమిళంలో నెగిటివ్ టాక్ వస్తే తెలుగులో ఎవరూ చూడరని రెండు వెర్షన్స్ ఒకేసారి రిలీజ్ చేసేసారు. దాంతో సత్యం సుందరం లాంటి మంచి సినిమాకు రిజల్ట్ ఇలా దారుణంగా ఉండడంతో చాలామంది ఈ సినిమాకు దేవర శాపం తగిలిందని అంటున్నారు.

సత్యం సుందరం విషయానికి వస్తే... ‘96’ చిత్రంతో ఓ సున్నితమైన ప్రేమకథను మనసులకు హత్తుకునేలా చూపించి మెప్పించిన దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్‌ సినిమా ఇది. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడాయన ‘సత్యం సుందరం’ (Satyam Sundaram 2024) అంటూ మరో ఆహ్లాదభరితమైన భావోద్వేగభరిత చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తి (Karthi), అరవింద్ స్వామి (Aravind Swamy) ఇందులో ప్రధాన పాత్రలు పోషించడం.. సూర్య, జ్యోతిక దంపతులు స్వయంగా నిర్మించడం.. దీనికి తోడు టీజరు,ట్రైలర్లు అలరించేలా ఉండటంతో ప్రేక్షకుల్లో దీనిపై మంచి ఎక్సపెక్సటేషన్స్ ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడతంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.

సత్యం సుందరం’ని ట్రిమ్ చేసారు

కలెక్షన్స్ రాకపోవటానికి కారణం సినిమా లెంగ్త్ ఎక్కువ అవటం అనుకుని నిర్మాతలు ఇప్పుడు దాన్ని ట్రిమ్ చేసారు. ఈ సినిమా మొదట 2 గంటల 57 నిముషాలు ఉంది. కొన్ని రివ్యూలలో లెంగ్త్ ఎక్కువ అని రావటంతో 18 నిముషాలు ట్రిమ్ చేసారు. అయితే నిజానికి తెలుగు వెర్షన్ కు లెంగ్త్ సమస్య కన్నా కూడా దేవర నే సమస్యగా మారింది. కానీ ఎవరు ఏం చేయలేని పరిస్దితి. దేవర వేడి తగ్గాక మెల్లిగా జనాలు వస్తారని వెయిట్ చేయటమే మిగిలింది.

సత్యం సుందరం’అంత నచ్చేందుకు ఏముంది

సత్యం సుందరంలో మన ఇంట్లో లేదా మన పక్కింట్లో జరిగే సంఘటనలే సినిమాలో కనిపించటంతో చూసిన వాళ్లకు బాగా నచ్చుతోంది. ఈ సినిమా కొన్నిచోట్ల నవ్విస్తే.... ఇంకొన్నిచోట్ల ఏడిపిస్తుంది. చిన్ననాటి ముచ్చట్లు, చిన్నప్పుడు మనందరి జీవితంలో జరిగే సరదాలు..ఇంకా చాలా గుర్తులు మన కళ్లముందు ప్రత్యక్షం చేసారు దర్శకుడు. సినిమా చూస్తున్నంతసేపు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ కార్తీ, అరవింద్ స్వామిలతో ప్రేక్షకుడు కూడా నడుస్తాడు. అయితే ఎన్ని ఉన్నా సినిమా జనాల్లోకి వెళితేనే కదా ఫలితం కనపడేది. మెల్లిమెల్లిగా పికప్ అయితే మరో మంచి సినిమా నిలబడుతుంది. డైరక్టర్ కు ఉత్సాహం వచ్చి మరిన్ని ఇలాంటి సినిమాలు తీయగలుగుతారు.

Read More
Next Story