దగ్గుపాటి రానా  35 చిన్న క‌థ కాదు రివ్యూ
x

దగ్గుపాటి రానా '35 చిన్న క‌థ కాదు' రివ్యూ

మన విద్యా వ్యవస్థ గురించి, టీచర్ల గురించి, అలాగే పిల్లల స్నేహాలు , క్లాస్ రూమ్ లో పిల్లలు మార్కుల కోసం పడే తపన, పిల్లలకు టీచర్స్‌తో ఉండే అనుబంధం గురించి చెప్పే కథలు తెరకెక్కటం అరుదు.

మన విద్యా వ్యవస్థ గురించి, టీచర్ల గురించి, వాళ్లు చెప్పే పాఠాలు, అలాగే పిల్లల స్నేహాలు గురించి, క్లాస్ రూమ్ లో పిల్లలు మార్కుల కోసం పడే తపన, పిల్లలకు టీచర్స్‌తో ఉండే అనుబంధం గురించి చెప్పే కథలు తెరకెక్కటం అరుదు. ఎందుకంటే అందులో కమర్షియల్ యాస్పెక్ట్ దర్శకులకు, నిర్మాతలకు కనపడదు. కానీ నిజానికి సమాజానికి అవసరమైన విషయాలు ఇవి. పిల్లలు తల్లితండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. వీటిని ముడిపెడుతూ ఓ తెలుగు దర్శకుడు సినిమా చేయటం, దానికి రానా వంటి స్టార్ ప్రమోట్ చేసి సమర్పకుడుగా ఉండటం గొప్ప విషయం. ఇంతకీ ఈ సినిమా లో చెప్పిన కథేంటి, మేసేజ్ లు మాత్రమే ఇచ్చారా లేక చూడదగ్గ కంటెంట్ ఉందా వంటి విషయాలు చూద్దాం.

కథేంటి

లెక్కల్లో అందరికీ అనుమానాలు ఉంటాయి.. కానీ మా వాడికి లెక్కల మీదే అనుమానం సర్ అనే డైలాగ్‌ చుట్టూ తిరిగే కథ. బస్ కండక్టర్ ప్ర‌సాద్ (విశ్వ‌దేవ్ రాచ‌కొండ) ది మిడిల్ క్లాస్ జీవితం. భార్య స‌ర‌స్వ‌తి (నివేదా థామ‌స్), త‌న భ‌ర్త‌, పిల్ల‌లు అరుణ్‌, వ‌రుణ్ సర్వస్వం. తిరుప‌తిలో ఉండే వీళ్లకు జీవిత సమస్యలు పెద్గగా ఉండవు కానీ పిల్లల వైపు సమస్యలు ఉంటాయి. అయితే అవి సమస్యలు అని వాళ్లకు తెలియదు. అవేమిటంటే వాళ్ల పెద్దబ్బాయి అరుణ్‌కి మ్యాథ్స్ లో వీక్. వాడికి లెక్క‌లు ఓ ప‌ట్టాన అర్థం కావు. అలాగని తెలివి తక్కువ వాడేమీ కాదు.

లాజిక్ గా వాడి అడిగే ప్రశ్నల మాస్టర్స్ ని ఇబ్బందుల్లో పడేస్తూంటాయి. సున్నాకి ఏమీ విలువ లేన‌ప్పుడు దానిప‌క్క‌న ఒక‌టి వ‌చ్చి నిల‌బ‌డితే ప‌ది ఎందుకవుతుంద‌ని అడిగితే, అదెలాగో వివరించి చెప్పలేరు. దాంతో లెక్క‌ల మాస్టారు చాణ‌క్య (ప్రియ‌ద‌ర్శి) ఫండమెంటల్స్‌ను ప్ర‌శ్నిస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్‌కి జీరో అని పేరు పెట్టి చివ‌రి బెంచీకి పంపేస్తాడు. ఆరోత‌ర‌గ‌తిలో ఫెయిల్ కూడా చేస్తాడు.

ఈ క్రమంలో అరుణ్ త‌న త‌మ్ముడి క్లాస్‌లో కూర్చోవాల్సి వ‌స్తుంది. ఈసారి అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే లెక్క‌ల్లో క‌నీసం 35 మార్కులు సాధించాల్సిందే. అప్పుడు వాళ్ల అమ్మ సరస్వతి ఎలా లీడ్ తీసుకుంది. పదో తరగతి ఫెయిల్ అయ్యిన ఆమె తన కొడుకుని ఎలా గట్టెక్కించింది. అరుణ్ అస‌లు 35 మార్కులు తెచ్చుకున్నాడా లేదా? అనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉంది

కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన మనకు ఇలాంటి సినిమాలు ఎక్కటం కష్టమే. ఇదీ దర్శకుడుకి డౌట్ వచ్చినట్లుంది. మరీ పూర్తిగా మెసేజ్ ఓరియెంటెడ్ కథగా తీస్తే చూసేవారు ఉండరని భయపడి కాస్తంత కమర్షియల్ ఎలిమెంట్స్ కు చోటు ఇచ్చారు. అలాగే కథలో కొన్ని బ్యాక్ లాగ్స్ అలాగే వదిలేసాడు. స్కూల్ లో జరిగే కొన్ని సంఘటనలు కృతకంగా అనిపిస్తాయి. అలాగే ‘తల్లి ఒడి బిడ్డలకు తొలి బడి.’ అన్న విషయం అందరికీ తెలిసిందే అయినా సినిమాలో అవసరం వచ్చినప్పుడే దాన్ని వాడారు. నిజానికి తల్లి లీడ్ మొదటి నుంచి తీసుకోవచ్చు కదా , కొడుక్కు సమస్య వచ్చే దాకా ఆగటం ఎందుకు అనిపిస్తుంది.

అయితే ఇక్కడ సినిమా గ్రామర్ ప్రకారం వెళ్లాలి కాబట్టి కొడుకు 35 మార్కులు తెచ్చుకోవాలి అన్నప్పుడు మాత్రమే తల్లి ముందుకు వస్తుంది. అలాగే ఆ క్రమంలో కాస్తంత ఇంటెన్స్ గా కథ నడుస్తుందని భావిస్తాం. అలాంటిదేమీ జరగదు. అలాగే అరుణ్ ని స్కూల్ లో జీరో అని పిలుస్తారు. దాన్ని ఎలా తొలిగించుకున్నాడనే విషయం కూడా హైలెట్ కానివ్వలేదు. ఇలాంటి కొన్ని మైనస్ లు అనిపించేవి వదిలేస్తే ఈ సినిమా మంచి ప్రయత్నం. ఇలాంటివి ఆదరిస్తేనే మరిన్ని ఇలాంటివి తీసేందుకు దర్శక,నిర్మాతలకు ఉత్సాహం వస్తుంది.

నటీనటుల్లో ...లీడ్ రోల్ లో అరుణ్ తల్లిగా, ప్రసాద్ భార్యగా సరస్వతి కేరెక్టర్‌లో నివేద థామస్ ఫెరఫెక్ట్. చాణక్య వర్మగా ప్రియదర్శి నటన బాగుంది. . ప్రిన్సిపాల్‌గా భాగ్యరాజ్, లెక్కల మాస్టరుగా ప్రియదర్శి.. ప్రత్యేక పాత్రలో గౌతమి పిల్లలు బాగా చేసారు. చాలా కాలం తర్వాత కృష్ణ తేజ్ గుర్తుండిపోయే పాత్ర చేసారు.

టెక్నికల్ గా చిన్న సినిమా అయినా టెక్నీషియన్స్ అందరూ బాగా కష్టపడ్డారు. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు. పాటలు ప్లెజంట్ గా ఉన్నాయి. కెమెరా వర్క్ నాచురల్ గా అనిపిస్తుంది. డైలాగులు థాట్ ప్రవోకింగ్ గా మనని ఆలోచనలో పడేసాలా ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు కొత్త వాడైనా పిల్లల చేత ఆ స్దాయిలో చేయించటం మామూలు విషయం కాదు.

చూడచ్చా

ఇది తెలుగులో తారే జమీన్ పర్ స్దాయి సినిమా అనుకోవాలి. ఓటిటిలో చూడదగ్గ సినిమానే అనిపిస్తుంది కానీ థియేటర్ కు వెళ్లి పిల్లలతో కలిసి చూస్తే మంచి ఎక్సపీరియన్స్.

నటీనటులు : నివేదా థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌ ఆర్‌, గౌతమి, భాగ్యరాజ్‌, కృష్ణ తేజ, అభయ్‌, అనన్య, తదితరులు;

సంగీతం: వివేక్‌ సాగర్‌;

సమర్పణ: రానా దగ్గుబాటి;

నిర్మాతలు: సృజన్‌, సిద్ధార్థ్‌;

రచన, దర్శకత్వం: నందకిషోర్‌ ఇమాని;

విడుదల తేదీ: 6-09-2024

Read More
Next Story