హీరో మహేశ్‌ బాబుకు ఈడీ నోటీసు , వెనక అసలు కథేంటి?
x

హీరో మహేశ్‌ బాబుకు ఈడీ నోటీసు , వెనక అసలు కథేంటి?

ఈడీ నోటీసులకు సూపర్ స్టార్ ఎలా స్పందిస్తారు?

మహే‌ష్ బాబును ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయటం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసుల్లో ఈ నోటీసులు జారీ చేసారు. ఈ రెండు సంస్దలకు మహేష్ బాబు ప్రచార కర్తగా ఉన్నారు. పెట్టుబడి పెట్టేందుకు ఆయన ఇన్ ఫ్లుయెన్స్ చేసారనే అభియోగంపై ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. అయితే ప్రతీ విషయంలో ఆచి ,తూచి ముందుకు వెళ్లే మహేష్ బాబు ఇలా ఇరుక్కోవటం ఏమిటనేది ఇప్పుడు చర్చగా మారింది.

ఈ క్రమంలో మహేష్ బాబు తీసుకొన్న రెమ్యునరేషన్ ఎంత? వాటిలో చెక్ రూపంలో ఎంత? నగదు రూపంలో ఎంత? ఎంత మేరకు ఆర్థిక అవకతవకలు జరిగాయనే వివరాలు సైతం బయిటకు వస్తున్నాయి. పూర్తి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన రియల్ ఎస్టేట్ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కంపెనీలు ఆర్థిక వ్యవహారాల్లో భారీగా అవకతవకలు ఉన్నాయనే విషయం బయటకు వచ్చింది.

ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాలు పరిశీలించిన తర్వాత పెద్ద ఎత్తున్న మనీ లాండరింగ్ జరిగిందనే విషయం దృష్టికి రావడంతో వారి అకౌంట్లపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే వారు చేసిన చెల్లింపుల్లో మహేష్ బాబుకు ఇచ్చిన మొత్తాలు బయటకు వచ్చాయి. దాంతో ఆయనను విచారించాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

మహేష్ కు ఎంత ఇచ్చారు

సదరు రియల్ ఎస్టేట్ కంపెనీలకు బ్రాండ్ ఎండార్సింగ్ చేసినందుకు గాను మహేష్ బాబుకు భారీగా రెమ్యునరేషన్ చెల్లించారు. నేషనల్ వెబ్ సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహేష్ బాబుకు సుమారుగా 5.9 కోట్ల రూపాయలు చెల్లించారు. అందులో 3.4 కోట్ల రూపాయలు చెక్కు రూపంలో, 2.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో చెల్లించారు. ఈ చెల్లింపు మొత్తాలపై క్లారిటీ లేకపోవడం వల్ల మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది అని మీడియాలో వార్త కథనాలు వెలువడుతున్నాయి.

మహేష్ కు ఎందుకు నోటీసులు ఇచ్చారు

మహేష్ బాబుకు చెల్లించిన రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆయనకు చెల్లించిన నగదు మొత్తాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఎవరు చెల్లింపు చేశారు అనే కోణంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. అందుకోసమే మహేష్‌కు నోటీసులు జారీ చేశారు అని టైమ్స్ ఆఫ్ ఇడియా తన కథనంలో పేర్కొన్నది.

రియల్ ఎస్టేట్ చేసిన స్కామ్ ఏమిటి

రీసెంట్ గా హైదరాబాద్‌లోని సురానా డెవలపర్స్‌, సాయిసూర్య డెవలపర్స్‌ సంస్ధల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ రెండు సంస్ధలు రియల్‌ ఎస్టేట్‌ అక్రమాలకు పాల్పడ్డాయని, ఒకే ప్లాట్‌ పది మందికి అమ్మారని, వంద కోట్ల రూపాయలు పైగా నగదు రూపంలో డబ్బు తీసుకున్నారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

మహే‌ష్ బాబు చేసిన ప్రకటనలు చూసి చాలా మంది ఈ సంస్ధల్లో ప్లాట్లు బుక్‌ చేసుకున్నారని, తర్వాత సంస్ధ వ్యవహర శైలిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం. అనేక మంది బాధితుల నుంచి దాదాపు వంద కోట్ల రూపాయలను సురానా, సాయిసూర్య డెవలపర్స్‌ నగదు అడ్వాన్స్‌ రూపంలో తీసుకుని, వారిని మోసం చేశారన్న ఆరోపణల కేసులో హైదరాబాద్‌ పోలీసులతో పాటు, ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాంక్ లను ముంచేసారు

సురానా సంస్థ పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సునారా గ్రూప్ మూడు బ్యాంకులకు రూ. 3,986 కోట్లు ఎగ్గొట్టింది. రుణాలు తిరిగి చెల్లించకపోవడంపై సీబీఐ (CBI) మూడు కేసులు నమోదు చేసింది. సురానాకు అనుబంధంగా సాయిసూర్య డెవలపర్స్ పనిచేస్తోంది.

ఈ కేసులో మహేష్ బాబు క్లీన్‌గా బయటకు వస్తారా? లేదా? అనేది అభిమానుల్లో, సిని వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈడీ నోటీసులకు సూపర్ స్టార్ ఎలా స్పందిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా, రాజమౌళితో కలిసి ప్రస్తుతం మహేష్ బాబు ఓ సినిమాలో నటిస్తున్నారు. హైదరాబాద్, ఒడిశా ప్రాంతాల్లో ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొన్నది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read More
Next Story