ప్చ్ ... కంగన కి తెలుగులో బయ్యర్లు కరువు, ఏంటి సమస్య?
తెలుగు సినిమాలు నార్త్ బెల్ట్ లో విడుదలయినట్లుగా, బాలీవుడ్ సినిమాలు కూడా ఇప్పుడు దక్షిణాది పై దృష్టిపెడుతున్నాయి. అందులో భాగంగా కంగనా నటించిన ‘ఎమర్జెన్సీ’ ..
నార్త్ ని మన తెలుగు వాళ్లు తమ సినిమాలకు పెద్ద మార్కెట్ గా భావించి భారీ రిలీజ్ లు చేస్తున్నారు. దాంతో బాలీవుడ్ సినిమాలు ఇక్కడ తెలుగులో మార్కెట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. అది అయితే అనుకున్న స్దాయిలో సాధ్యపడటం లేదు.
ఇక్కడ మన డిస్ట్రిబ్యూటర్స్ షారూఖ్ వంటి స్టార్ సినిమాలు తప్పించి మిగతావాటిపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. దానికి తోడు రీసెంట్ గా అలియా భట్ నటించిన జిగ్రా డిజాస్టర్ అవటం కూడా తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ని హిందీ సినిమాలంటేనే భయం పట్టుకుంది.
మరీ ముఖ్యంగా ఉమెన్ సెంట్రిక్ సినిమాలను మన వాళ్లు ఆదరించటంలేదని డిస్ట్రిబ్యూటర్స్ క్లియర్ గా చెప్తున్నారు. మినిమం ఓపినింగ్స్ కూడా రావటం లేదని అంటున్నారు. దాంతో కంగనా తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’కు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ పెద్ద సమస్యగా మారింది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంది. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా గురించి ఇక్కడ మాట్లాడేవాళ్లే లేరు.
అయినా పట్టువదలకుండా తెలుగులో ఈ సినిమాని ప్రమోట్ చేయాలని కంగనా నిర్ణయించుకుని హైదరాబాద్ ప్రమోషన్స్ భారీ ఈవెంట్స్ తో ప్లాన్ చేసిందని సమాచారం. ఇక్కడ ఇప్పటిదాకా కొంచెం కూడా బజ్ లేదు. ఈవెంట్స్ చేసాక ఏమన్నా బజ్ క్రియేట్ అవుతుందేమో చూడాలి.
అందులోనూ తెలంగాణాలో కాంగ్రేస్ గవర్నమెంట్ నడుస్తోంది. మరో ప్రక్క ఆ సినిమా ప్రదర్శనను అనుమతించకూడదని తెలంగాణా సిక్కు సామాజిక తరగతి ప్రతినిధులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు. ఇందిరాగాంధీ పై కొంత విమర్శ కూడా ఈ సినిమాలో ఉండబోతోందనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఇక్కడ బిజినెస్ వర్గాలు ఎవరూ ఉత్సాహం చూపించటం లేదు.
అయితే బాలీవుడ్ కు చెందిన కొన్ని టీమ్ లు ఇప్పటికే తెలుగులో డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడుతున్నారు. రిలీజ్ స్మూత్ గా జరగాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఎగ్రిమెంట్స్ ఏమీ ఫైనలైజ్ కాలేదని తెలుస్తోంది. కమీషన్ బేసిస్ మీద అయినా సినిమా రిలీజ్ చేయాలని అడుగుతున్నారట.
వచ్చే కలెక్షన్స్ లో థియేటర్ రెంటల్ పోను, 8 నుంచి 10% కమీషన్ మినహాయించుకుని మేకర్స్ కు ఇచ్చేలా డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు . కంగనా రీసెంట్ చిత్రం చంద్రముఖి 2, ధకడ్ సినిమాలు ఇక్కడ తెలుగులో అస్సలు వర్కవుట్ కాలేదు. అది కూడా ఈ సినిమాకు పెద్ద దెబ్బే.
వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. చిత్రంలో తమని తక్కువగా చూపించారని.. విడుదలను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్ న్యాయస్థానాన్ని సంప్రదించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది.
ఈ క్రమంలో సినిమా విడుదల చాలా లేటు అవుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పంజాబ్ ఎన్నికల తర్వాత విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు.
ఇక ‘ఎమర్జెన్సీ’ చిత్రం తీస్తున్నట్లు 2021లో కంగనా ప్రకటించినప్పటి నుంచీ ఈ సినిమాకు చిక్కులే ఎదురయ్యాయి. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించారు. ఇది ఇందిరాగాంధీ బయోపిక్ కాదనీ, ఓ పొలిటికల్ డ్రామా అని ఎన్నో సార్లు కంగనా వెల్లడించినా వివాదాలు ఈ సినిమాను వదల్లేదు. ఎన్నో అవరోధాలు తట్టుకుని, విడుదలకు సిద్ధం చేస్తే ఇప్పుడు సిక్కుల నుంచి కంగనాకు ప్రతిఘటన ఎదురైంది. తమ ప్రభుత్వమే కేంద్రలో అధికారంలో ఉన్నా సెన్సార్ సమస్యలు తప్ప లేదు.
Next Story