
ఇమ్రాన్ హష్మీ “గ్రౌండ్ జీరో” రివ్యూ: పహల్గామ్ లింక్ కలిసొస్తుందా?
ప్రస్తుతం దేశం మొత్తం మాట్లాడుకుంటున్న పహల్గాం లింక్ ఈ సినిమా సక్సెస్ ఏ మేరకు ఉపయోగపడనుందేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.!!
ఇమ్రాన్ హష్మీ తాజా చిత్రం “గ్రౌండ్ జీరో” (Ground Zero). బాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ఈ చిత్రం కి రిలీజ్ కు ముందు మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. దానికి తోడు రీసెంట్ గా పహల్గాం లో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి కారణంగా ఈ సినిమా ఇంకాస్త ప్రత్యేకతను సంతరించుకుంది. నరేంద్రనాథ్ ధార్ దూబే అనే బోర్డర్ సెక్యూరిటీ ఆఫీసర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది, కథ ఏమిటి... ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటోంది. అలాగే ప్రస్తుతం దేశం మొత్తం మాట్లాడుకుంటున్న పహల్గాం లింక్ ఈ సినిమా సక్సెస్ ఏ మేరకు ఉపయోగపడనుందేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం .!!
స్టోరీ లైన్
2001లో జమ్మూలో చోటు చేసుకున్న పిస్టల్ గ్యాంగ్ అరాచకాలతో సినిమా మొదలవుతుంది. భారత జవాన్ల వరుస హత్యల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఘాజీ బాబాను పట్టుకోవడం ఇప్పుడు రక్షణ శాఖ టార్గెట్. అందుకు బీఎస్ఎఫ్ చీఫ్ నరేంద్రనాథ్ దూబే (ఇమ్రాన్ హష్మీ) రంగంలోకి దిగుతాడు.
రానా తహీర్ రహీమ్ అలియాస్ ఘాజి బాబా సామాన్యుడు కాదు. ఆర్మీ అధికారులు ప్రయాణించే వాహనాలను బ్లాస్ట్ చేయడంతో పాటు కాశ్మీర్ లోని అమాయక యువకులకు వల విసిరి కేవలం యాభై వేల రూపాయలకు వాళ్ళతో హత్యలు చేయించే రైఫిల్ గ్యాంగ్ సూత్రధారి. గతంలో 1995లో పహల్గామ్ లో ఆరుగురు ఫారిన్ టూరిస్టులను కిడ్నాప్ చేశారు.
అయితే.. ఆ క్రమంలో దొరికిన లీడ్స్ ను పట్టుకుంటూ వెళ్లిన నరేంద్రనాథ్ ఓ చోట ఆగుతాడు. అదే సమయంలో పార్లమెంట్ దాడి, జమ్మూలో ప్రధాని కాన్వాయ్ మీద దాడి వంటి అరాచకాల్లో ఘాజీ బాబా హస్తం ఉందని తెలుసుకుంటాడు. ఆ స్థాయి ప్రమాదకరమైన టెర్రరిస్ట్ ఘాజీ బాబాను, నరేంద్రనాథ్ ఎలా పట్టుకోగలిగాడు? అనేది “గ్రౌండ్ జీరో” కథాంశం.
విశ్లేషణ
ఈ సినిమా పూర్తిగా ట్రీట్మెంట్ బేసెడ్ గా నడుస్తుంది. స్క్రీన్ ప్లే కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నిజమైన సంఘటనలకు కొంత ఫంక్షన్ కలిపినా, ఎక్కడ ఓవర్ డ్రమ్ టైజ్ చేయకుండా జాగ్రత్తలు పడ్డారు. అలాగని మరీ బోర్ కొట్టేలా సినిమా తీయలేదు. డాక్యుమెంటరీ అవ్వకుండా , కథా గమనం కోసం సినిమా టెక్ ఎలిమెంట్స్ ని వినియోగించుకున్న విధానం ప్రశంసనీయం.
అన్నిటికీ మించి క్లైమాక్స్ ను రియలిస్టిక్ గా డీల్ చేసిన తీరు మన చేత చప్పట్లు కొట్టిస్తుంది. ప్రేక్షకులకు ఒక కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. ఈ విషయంలో కథకుడిగా, దర్శకుడిగా తేజస్ ప్రభ విజయ్ డియోస్కర్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు.
అలాగే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కి చోటివ్వకుండా ఘాజీ బాబాని మట్టుబెట్టడానికి ముందు వెనుక ఏం జరిగిందనే కోణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం సీరియస్ సీరియస్ సినిమా లవర్స్ కు నచ్చుతుంది. పాక్ తీవ్రవాదుల దుశ్చర్యలు ఎలా ఉంటాయో బాగానే చూపించారు. మిలటరీ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ను చాలా సిన్సియర్ గా చూపెట్టారు.
టెక్నికల్ గా..
ఈ సినిమాలో మొదటగా చెప్పుకోవాల్సిన ఆర్ట్ & ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పనితనం. వాళ్లు తమ బెస్ట్ ఇచ్చారు. సీజీ వర్క్ కూడా చాలా బాగుంది, బ్లాస్టింగ్ సీన్స్ చాలా నాచురల్ గా ఉన్నాయి. బుల్లెట్ సౌండింగ్ విషయంలో సౌండ్ డిజైనర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డిజైన్ చేశారు. దర్శకుడు డాక్యుమెంటరీ కథాంశాన్ని చూడదగ్గ రీతిలో ప్రెజెంట్ చేసారు.
నటీనటుల్లో ... ఇమ్రామ్ హష్మీ లోని నటుడ్ని సరికొత్తగా చూపించే ప్రయత్నం ఫలించింది. ఆయన సీరియస్ ఆర్మీ ఆఫీసర్ వేషంలో దర్శనమిచ్చాడు. మిగతా వాళ్లలో విలన్ గా ఘాజీ బాబా గా చేసిన తను చాలా బాగా చేశారు.
ఫైనల్ థాట్
దేశప్రజల ఎమోషన్లు తారా స్థాయిలో ఉన్న ఈ టైం లో గ్రౌండ్ జీరో మంచి ఫలితం అందుకుంటుందనే అనిపిస్తుంది. సినిమాలోని యాక్షన్ బ్లాక్ చూడటానికైనా, ఎమోషనల్ కనెక్టివిటీ కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా థియేటర్లలో చూడాలి.