సాధారణ ప్రాణి నుంచి మృగంగా మారిన యానిమల్
x
Animal Source: X

సాధారణ ప్రాణి నుంచి మృగంగా మారిన 'యానిమల్'

నవరసాలు ఉన్నాయి, అన్ని శ్రుతిమించాయి. బీభత్స, భయానక, శృంగార, వీర, రౌద్రం. శృంగారానికి పెద్ద పీట. తర్వాత బీభత్సం, వీరం. శాంత, కరుణ రసాలు చిన్నగా... ఎలా?


-సలీమ్ బాషా


యానిమల్(Animal) అంటే తెలుగులో ప్రాణి, జంతువు,గొడ్డు, పశువు, మృగము, అని నానార్థాలు ఉన్నాయి. యానిమల్ సినిమాలో ఈ రూపాలు అన్నింటిని చాలా చక్కగా చిత్రీకరించాడు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ సినిమాలో హీరో మొదట్లో సాధారణ ప్రాణి గా, సాధు జంతువుగా మొదలుపెట్టి (ఇంతవరకే ప్రేక్షకులు ప్రశాంతంగా ఉండగలిగేది) గొడ్డు లాగా తర్వాత పశువులా ప్రవర్తిస్తూ చివరకు (స్త్రీ ద్వేషి అయిన ) మృగం గా మారిపోతాడు ( నిజంగానే! )సినిమా క్లైమాక్స్ లో వరసకు తమ్ముడయ్యే విలన్ (బాబీ డియోల్) గొంతు కోయడం ఏ సినిమాలో చూసి ఉండరు ప్రేక్షకులు. అంతకు ముందు సొంత అక్క భర్తను గొంతు పిసికి చంపడం మృగత్వానికి పరాకాష్ట).

సినిమా గురించి చెప్పాలంటే నవరసాలు ఉన్నాయి, అయితే అన్ని శ్రుతిమించాయి. ముఖ్యంగా బీభత్స, భయానక, శృంగార, వీర, రౌద్ర రసాలు. వీటిలో శృంగారానికి పెద్ద పీట వేశాడు దర్శకుడు, తర్వాత స్థానంలో బీభత్సం, వీరం. శాంత, కరుణ రసా లను వేరే పాత్రల ద్వారా చిన్న స్థాయిలో చూపించాడు.

అక్కడక్కడ హాస్యరసం కూడా ఉంది, ఈ సినిమాలో విమానంలో హీరో హీరోయిన్(రన్బీర్ కపూర్, రష్మిక) లు భయానక, శృంగార రసాలను తారాస్థాయికి తీసుకెళ్లారు. కొన్ని వందల మందిని చంపడంతో మృగంగా మారిన హీరో వీర, రౌద్ర రసాలను బాగా పండించాడు. అద్భుత రసాన్ని మాత్రం సెన్సార్ వాళ్లు, ఈ సినిమా వసూళ్లు రికార్డు సాయికి చేర్చిన ప్రేక్షకులు పండించారు. తొమ్మిది రసాలు ఒక ఎత్తు, ఒకవేళ పదో రసం అంటూ ఉంటే దానికి జుగుప్స అని పేరు పెడితే, అది ఈ సినిమా ద్వారానే ప్రచారంలోకి రావాలి. ఇందులో భయానకమైనది ఏంటంటే అన్ని రసాలను 203 నిమిషాలు, అంటే మూడు గంటల 23 నిమిషాలు ప్రేక్షకులు రుచి చూశారు. ఒక వర్గం వారు చాలా ఆనందించారు కూడాను. అది ఏ వర్గంఅన్నది అందరికీ తెలిసిన విషయమే!

ఇక సినిమా గురించి సమీక్షించాలంటే ఇది తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని నేపథ్యంగా తీసుకుని తీసిన సినిమా.

ఇది బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) అనే అత్యంత ధనికుడైన తండ్రి, విజయ్ సింగ్ ( రణబీర్ కపూర్) అనే కొడుకు ల కథ. ఈ కథలో ట్విస్ట్ లు లేవు. ఉన్నదంతా ఒకటే.. సాధారణ ప్రాణి నుంచి(చిన్నప్పుడు), చివరకు మృగంగా మారిన కొడుకు కథ. కథ మొత్తం ఇద్దరి చుట్టే తిరుగుతుంది, వాళ్లతో పాటు మిగతా పాత్రలు వాళ్ళ చుట్టూ తిరుగుతాయి. తండ్రికి బాడీ డబుల్ ని తయారు చేయడం, విక్రమ్(కమల్ హాసన్) సినిమాలో లాగా ఒక పెద్ద ట్యాంకర్ గన్ తీసుకొని హీరో ఒకానొక పెద్ద హోటల్లో దాదాపు 500 మందిని కాల్చి చంపడం(ఈ సినిమాకి ఇదే కీలకమట.ఇంటర్వెల్ కి ముందు 18 నిమిషాల పాటు వచ్చే ఈ రక్తపాతమే సినిమాకు కీలకమట. అది పక్కన పెడితే ప్రేక్షకులకు పెద్ద రిలీఫ్ కూడా ఇదే!) తండ్రి కొడుకుల అనుబంధం అక్కడక్కడ చూపిస్తూ, వందల కొద్ది మనుషుల్ని కాల్చి, నరికి చంపడం, జుగుప్సాకరమైన సెక్స్ సీన్లు, గన్ ఫైట్లు, మధ్యలో కొన్ని సెంటిమెంటల్ సీన్స్ వెరసి యానిమల్ సినిమా.

కథ గురించే సరిగా చెప్పలేనప్పుడు, నటీనటులు నటన గురించి చెప్పడం కష్టం. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాలి రణ్ బీర్ కపూర్ చాలా చక్కగా నటించాడు. కానీ ఏం లాభం. మంచి సినిమా కానప్పుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే " గుడ్ యాక్టర్ ఇన్ ఏ బ్యాడ్ మూవీ".

చాక్లెట్ బాయ్ గా కనిపించే ఈ రొమాంటిక్ హీరో, మృగంగా మాత్రం అదరగొట్టాడు. అనిల్ కపూర్(భార్య కూడా) గురించి చెప్పేదేముంది. సినిమా మొత్తం శాంత రసాన్ని పండించడంలోనే సరిపోయింది. హీరోయిన్ గా రష్మిక కూడా అంతే. ఒకటి రెండు సన్నివేశాల్లో బాగానే నటించింది, శృంగార సన్నివేశాల్లో ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి బోల్డ్ గా నటించింది. ఇక మిగతా పాత్రల గురించి చెప్పేదేముంది. అన్ని అలా వచ్చి పోయే పాత్రలే. సినిమా మొత్తం విశ్వరూపం మృగానిదే, అంటే హీరోదే.

నిర్మాణ విలువలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. డబ్బులు కూడా బాగానే ఖర్చు పెట్టారని అర్థమవుతుంది. ఫైట్లు, తుపాకులు, విమానాలు, సెట్టింగ్ ల పై ఖర్చు పెట్టకుండా కథా, కథనం మీద ఇంకొంచెం దృష్టి పెట్టి ఉంటే సినిమ కాసింత బావుండేదేమో.

నటుడు బాలకృష్ణ "unstoppable" ప్రోగ్రాంలో పాల్గొన్న దర్శకుడు సందీప్ రెడ్డి ఈ సినిమా స్క్రిప్ట్ చాలా పకడ్బందీగా, కష్టపడి రాసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. అదేమీ సినిమాలో కనిపించలేదు. ఇది ఒక ఆర్డినరీ స్క్రిప్ట్. గన్స్ అండ్ బుల్లెట్స్, బ్లడ్ బాత్, సెక్స్ అధికమైన ఈ సినిమా స్క్రిప్టు రాయడానికి చాలా టైం పట్టడం ఆశ్చర్యకరమే. రణ్ బీర్ కపూర్ నటన గురించి కూడా చాలా ప్రశంసించాడు. ఇది మాత్రం నిజమే. ఎందుకంటే సాఫ్ట్ గా, లవర్ బాయ్ గా కనిపించే రణ్ బీర్ కపూర్ యానిమల్ లాంటి ఒక పాత్ర పోషించడం, దానికి చాలా వరకు న్యాయం చేయడం కూడా పెద్ద విషయమే.

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు తెలుగు సినిమా ప్రేక్షకులకు, తెలుగు సినిమాకు సరిపోనివి. ముఖ్యంగా ఆరోగ్యం బాగా అయిన తర్వాత యానిమల్ నగ్నంగా(ప్రేక్షకుల అదృష్టం బాగుండడం వల్ల నో, సెన్సార్ వల్ల నో భయపడటం వలన అది అస్పష్టంగా చూపించడం జరిగింది) ఇంట్లో తిరగడం . ఇంకా ఆసుపత్రిలో రణ్ బీర్ కపూర్ రష్మికా ల మధ్య జరిగే ఒక రొమాంటిక్ సన్నివేశం ఇంతవరకు ఏ మామూలు తెలుగు సినిమాలో కూడా చూసి ఉండరు ప్రేక్షకులు.

ఇక ఇంతకు ముందే చెప్పినట్టు ఈ సినిమాలో హీరో వాడిన ఒక ప్రత్యేకమైన టాంకర్ గన్, చాలా కష్టపడి తయారు చేశారు అంట. అది ఫేక్ కాదు నిజమేనట. అది కూడా హీరో రణ్ బీర్ కపూర్ ఐడియానే నట! ఈ సినిమాకు అస్సలు అవసరం లేని 18 నిమిషాల సన్నివేశంలో దీన్ని వాడారు.

ఈ సినిమాలో చాలా అబ్సర్డ్, అర్థం పర్థం లేని, లాజిక్కు అందని విషయాలు చాలా ఉన్నాయి.

* హీరో ఒక పెద్ద మీటింగ్ లో సొంత బావని ఐదు నిమిషాల పాటు గొంతుని బిగబట్టి చంపేస్తాడు. కొన్ని వందల మంది ముందు అలా చేసిన అది బయటికి రాదు, ఎవరు పట్టించుకోరు. ఇంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు.

** బాడీ డబుల్. ఇంతవరకు ఏ సినిమాలో చూడలేదు. మనదేశంలో చాలామంది పెద్దపెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇలా చేసిన దాఖలాలు లేవు. ఇది ఒకప్పుడు రష్యా దేశంలో స్టాలిన్ లాంటివాళ్ళు చేశారట. ఆ బాడీ డబుల్ కొంత కామెడీ రసాన్ని ఒలికించి ఆ లోటును కూడా తీర్చాడు.

* సినిమాలో పోలీసులు పెద్దగా కనపడరు. ఎందుకో మరి!?

* లాండ్రీలో హీరో అండర్ వేర్ సన్నివేశం సినిమాకి ఏ విధంగా సరిపోయిందో దర్శకుడే చెప్పాలి. బహుశా కామెడీ కోసం పెట్టి ఉంటారేమో.

ఇక చివరగా, సినిమా అయిపోయిందని ప్రేక్షకులంతా వెళ్లడానికి సిద్ధపడుతుండగా, మరొక క్యారెక్టర్ వచ్చి (రణ్ బీర్ కపూరే) రెండు కత్తులు తీసుకొని ఒకరిని ఎడా పెడ నరకడం చిట్టచివరి భీభత్సానికి ఉదాహరణ. దానివల్ల ప్రేక్షకులకు తెలిసిందేమంటే, దీనికి సీక్వెల్ రాబోతున్నదని. అది మరింత భయానకరమైనది. దాంతో సినిమా చిట్ట చివరికి ఎలాగోలా అయిపోతుంది.

ఈ సినిమా నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు ఏమో కానీ, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి ఈ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆ విషయం ట్విట్టర్ X లో స్వయంగా ఆయనే ప్రకటించాడు.

ప్రశంసించడమే కాకుండా ఇంకా ముందుకెళ్లి ఆయన స్టైల్ లో ఇలా చెప్పుకొచ్చాడు. ఫిజియోథెరపిస్ట్ అయిన సందీప్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన MENTAL THERAPY( (మానసిక చికిత్స) అనడంతో పాటు, ఈ సినిమా సందీప్ రెడ్డి ప్రేక్షకులకు ఇచ్చిన HYPNOTHERAPY (సమ్మోహన చికిత్స) అని కూడా కితాబు ఇచ్చాడు . అంతేకాకుండా సందీప్ రెడ్డి సినిమా సమాజానికి ఇచ్చిన ఒక వివరణగా (Social statement) కూడా చెప్పాడు. ఇంకాస్త ముందుకెళ్లి Wolf of Wall Street సినిమాలో Leonardo de Caprio కన్నా బాగా నటించాడని చెప్పాడు. వేరే వాళ్ళ సంగతి అటుంచి,ఈయనను మాత్రం ఈ సినిమా సమ్మోహితుడిని చేసిందని తెలుస్తుంది, మానసిక చికిత్స కూడా చేసిందని తెలుస్తోంది. ఎందుకంటే ఈయన కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడే కదా!

చివరికి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ సినిమా ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

ఈ నేపథ్యంలో ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్ని వస్తాయో అని ఒక రకం ప్రేక్షక వర్గానికి భయం పట్టుకుంది.

తెరముందు: రణబీర్ కపూర్,అనిల్ కపూర్, రష్మిక బాబీ డియోల్

తెరవెనక : దర్శకత్వం,ఎడిటింగ్,రచన:సందీప్ రెడ్డి వంగా

నిర్మాతలు: భూషణ్ కుమార్,కృష్ణ కుమార్,మురాడ్ కేతాని,ప్రణయ్ రెడ్డి వంగా

నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్

Read More
Next Story