ఫైనాన్సియల్ క్రైసిస్, తెలుగు సినిమాలు ఆగిపోతున్నాయి
x

ఫైనాన్సియల్ క్రైసిస్, తెలుగు సినిమాలు ఆగిపోతున్నాయి

తెలుగు సినిమా ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. ఆర్థిక ఒత్తిడిలో అనేక తెలుగు సినిమాలు ఇప్పుడు మునిగి తేలుతున్నాయి అనే దాని కన్నా మునిగిపోతున్నాయని చెప్పాలి

తెలుగు సినిమా ఇప్పుడు ఓ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. ఆర్థిక ఒత్తిడిలో అనేక తెలుగు సినిమాలు ఇప్పుడు మునిగి తేలుతున్నాయి అనే దాని కన్నా మునిగిపోతున్నాయని చెప్పాలి. ఇప్పిటకే పూర్తైన చాలా సినిమాలు రిలీజ్ కు నోచుకోవటం లేదు. వాళ్లను వీళ్లను పట్టుకుని, కష్టపడి ఖర్చుపెట్టి థియేటర్స్ లో రిలీజ్ చేసినా రెవిన్యూ రావటం లేదు. ఓటిటిలు కొనటం లేదు. అన్ని సమస్యలు తెలుగు సినిమాని ఒకే సారి ముంచేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు సినిమా పరిశ్రమ (టాలీవుడ్) ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి తోడు మట్కా, కంగువ వంటి భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తగిన వసూళ్లు సాధించడంలో విఫలమవడం వల్ల నిర్మాతలు మరియు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీని నుంచి బయిటపడే అవకాసం లేదా..ఏ సినిమాలకు ప్రస్తుతం ఈ సినిమా వస్తోందో చూద్దాం.

గత కొంతకాలంగా భారతీయ సినిమా బిజినెస్ మోడల్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కోవిడ్ మహమ్మారి తరువాత, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి డిజిటల్ దిగ్గజాలు భారతీయ సినిమాలు, ముఖ్యంగా తెలుగు వంటి ప్రాంతీయ సినిమాలపై దృష్టి సారించాయి. అయితే తెలుగులో అనేక సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో, ప్రతి సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కొనుగోలు చేయడం అసాధ్యంగా మారింది. అందువల్ల, వారు సినిమాలు కొనుక్కునే విషయంలో ఆచితూచి వ్యవహరించడమే కాకుండా, తమ బడ్జెట్‌లను కూడా మార్పు పెంచటం వంటివి చేయలేదు. ఈ పరిస్థితి నిర్మాతలను ఒత్తిడిలోకి నెడుతోంది.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు... కొన్ని తెలుగు సినిమాల చిత్రీకరణలను నిర్మాతలు నిలిపివేశారు. శర్వానంద్ నటిస్తున్న, "సామజవరగమన" దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్థిక ఒత్తిడుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేయబడిందని సమాచారం. ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర గత సినిమాలలో భారీ నష్టాలను ఎదుర్కొని, రాబోయే షెడ్యూల్‌ల కోసం నిధులను సమీకరించలేకపోతున్నారని సమాచారం. అందువల్ల, ఈ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో తిరిగి ప్రారంభమవుతుంది.

మరో ప్రక్క 14 రీల్స్ ప్లస్ సంస్థ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, సాగర్ చంద్ర దర్శకత్వంలో "టైసన్ నాయుడు" అనే సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి బడ్జెట్ బాగా పెరగడంతో షూట్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు "అఖండ" వంటి క్రేజీ చిత్రంపై దృష్టి సారిస్తోంది. ఈ సమయంలో, బెల్లంకొండ కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. "టైసన్ నాయుడు" షూటింగ్ వచ్చే ఏడాది పునఃప్రారంభమవుతుంది.

ఇవే కాకుండా నితిన్ కొత్త సినిమాలు "రాబిన్‌హుడ్" , "తమ్ముడు" కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలకు మైత్రీ మూవీ మేకర్స్ మరియు దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాతలు మద్దతుగా ఉండటంతో, షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం, చిత్ర నిర్మాతలు డీల్స్‌ను ముగించేందుకు ఓటిటి సంస్దలతో చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి పరిస్థితి తెలుగులో చాలా సినిమాలలో కనిపిస్తోంది. దాంతో రాబోయే సినిమాల డ్జెట్‌లను పునర్విమర్శించుకోవాలని లేదా కొన్ని ప్రాజెక్ట్‌లను నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయించుకుంటున్నారు.

హీరోలు షెడ్యూల్స్ ఫుల్ ..కలెక్షన్స్ నిల్

ఇదిలా ఉంటే గతంలో సంవత్సరానికి ఒకే ఒక సినిమా చేసే యంగ్ హీరోలు ఇప్పుడు విరామం లేకుండా బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇది వారికి మంచి రెమ్యునరేషన్ అందించగా, నిర్మాతలు ఆ సినిమాను అమ్ముకోవడంలో విఫలమవుతున్నారు. దాంతో స్టార్లకు అధిక రెమ్యునరేషన్, మిగతా ఖర్చులు సినిమాల పెట్టుబడులు తిరిగి పొందడానికి కష్టంగా మారాయి. అళాగే తాజాగా విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించకపోవడం వల్ల భారీ నష్టాలు వచ్చాయి.

ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ల పెరుగుదల

ఓవర్-ది-టాప్ (ఓటిటి) ప్లాట్‌ఫారమ్‌ల పెరుగుతున్న ఆదరణ ప్రేక్షకుల అభిరుచులను మార్చి థియేటర్ వసూళ్లపై ప్రభావం చూపుతోంది.తెలుగు సినిమా పరిశ్రమ (టాలీవుడ్)పై ఓటిటి (ఓవర్-ది-టాప్) ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రేక్షకుల ఆలోచనలను మార్చాయి. ఈ ప్రభావం పలు అంశాలలో కనిపిస్తోంది.

థియేటర్ ఆదాయంపై తగ్గుదల:

జనాల్లో ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చే కొత్త సినిమా విడుదలలను చూసే అభిరుచి పెరుగుతోంది. థియేటర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే సినిమాలను, వెబ్‌సిరీస్‌లను వీక్షించేందుకు ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాగే డిజిటల్ హక్కుల ద్వారా ఓటిటి ఫ్లాట్‌ఫారమ్‌లు నిర్మాతలకు స్థిరమైన ఆదాయం అందిస్తున్నాయి. కొన్ని సినిమాలు నేరుగా ఓటిటి కోసం రూపొందించడం సాధారణంగా మారింది.

మారాల్సిన కథా ప్రక్రియ :

ఓటీటిల ప్రభావంతో కథలు మరింత రియలిస్టిక్‌గా, బోల్డ్‌గా ఉండేలా రూపొందించాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది, ఎందుకంటే ఓటిటి ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆశిస్తున్నారు. ట్రెండింగ్ వెబ్‌సిరీస్‌లు మరియు విభిన్నమైన కథలతో టాలీవుడ్ ప్రయోగాలు ప్రారంభించింది. అంతర్జాతీయ కంటెంట్ సులభంగా అందుబాటులో ఉండడం వల్ల తెలుగు ప్రేక్షకుల అభిరుచి విస్తృతమైంది. ఇది స్థానిక కథా కథనాలను కూడా నాణ్యతతో పాటు సృజనాత్మకంగా ఉండేలా ప్రేరేపిస్తోంది.

ఇవి చాలదన్నట్లు ఓటిటి ద్వారా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు ప్రత్యక్ష పోటీగా మారాయి. ఈ ప్రభావం తెలుగు చిత్రాలను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా మార్చింది. తెలుగు పరిశ్రమ బాలీవుడ్, హాలీవుడ్ వంటి ఇతర పరిశ్రమల నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది.

ఈ నేపధ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. కానీ వ్యూహాత్మక ప్రణాళిక, వినూత్న కథా రచన మరియు అనుకూలతతో ఈ ఆర్థిక ఒత్తిడిని అధిగమించి, అభివృద్ధి చెందే అవకాసం ఉంది. థియేటర్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కలసికట్టుగా పనిచేయడం తెలుగు సినిమా భవిష్యత్తుకు ముఖ్యమని చెప్పవచ్చు.

Read More
Next Story