ఓటిటి ట్రెండ్‌పై ‘ది గాడ్‌ ఫాదర్‌’ డైరక్టర్ కపోలా ఏమన్నారో తలుసా?
x

ఓటిటి ట్రెండ్‌పై ‘ది గాడ్‌ ఫాదర్‌’ డైరక్టర్ కపోలా ఏమన్నారో తలుసా?

ఈ రోజు ప్రపంచ సినిమాని ఓటిటి సంస్దలు శాసిస్తున్నాయి. కోవిడ్ ముందు దాకా పెద్దగా ప్రభావం లేకపోయినా తెలుగులోనూ ఇప్పుడు ఓటిటి సంస్థలు పెద్ద, చిన్న సినిమాల ఫేట్‌ని..


ఈ రోజు ప్రపంచ సినిమాని ఓటిటి సంస్దలు శాసిస్తున్నాయి. కోవిడ్ ముందు దాకా పెద్దగా ప్రభావం లేకపోయినా తెలుగులోనూ ఇప్పుడు ఓటిటి సంస్థలు పెద్ద, చిన్న సినిమాల ఫేట్‌ని డిసైడ్ చేస్తున్నాయి. పెద్ద సినిమాలు తెలుగులో ఈ మధ్య ఓటీటీ డీల్స్ పూర్తికాక రిలీజ్‌లు వాయిదా పడ్డాయి. కొన్ని సినిమాలు సరైన ఓటిటి రేటు వచ్చేలా లేవని ప్రాజెక్టులు కాన్సిల్ అయిపోయాయి. ఇలా ఓటిటి సంస్థల్ల నుంచి సినిమా ఇండస్ట్రీపై ఒత్తిడి కూడా పెరిగింది.

ఒకప్పుడు సినిమా ప్రారంభానికి ముందే అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఓటీటీ సంస్థలు ఇప్పుడు మాత్రం అందుకు సిద్ధపడటం లేదు. చెప్పిన సమయానికి సినిమా విడుదల చేసి రిజల్ట్‌ని బట్టి అనుకున్న డేట్‌కు లేదంటే ముందుగానే ఓటీటీలో విడుదల చేయాల్సింది అనేలా డీల్స్ మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇక సినిమాల విడుదల డేట్స్ వాయిదా పడితే మాత్రం ముందుగా అనుకున్న రేట్ల విషయంలో తేడాలు వచ్చేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ విషయమై ప్రపంచ సినిమాకు పెద్ద దిక్కులాంటి దర్శకుడు ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కపోలా మీడియాతో మాట్లాడారు.

ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కపోలా రీసెంట్‌గా 120 మిలియన్ డాలర్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం Megalopolis. ఈ సినిమాకు imax తరుపు నించి గ్లోబల్ కమిట్మెంట్ వచ్చింది, కానీ us లో డిస్ట్రిబ్యూట్ చేయటానికి ఎవరూ ఇప్పటి వరకు ముందుకు రాలేదు. అంత పేరున్న దర్శకుడి సినిమాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించరు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న హాలీవుడ్‌లో సినిమాల థియేట్రికల్ రిలీజ్ గురించి మీరేం చెబుతారు, స్ట్రీమింగ్ (OTT) ప్లాట్ ఫామ్‌లలో రిలీజ్ చేయటం అనే దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? అని మీడియా వాళ్లు ప్రశ్నించారు.

కపోలా మాట్లాడుతూ.... ‘‘స్ట్రీమింగ్ అనేది మేము మా కాలం లో హోం వీడియో (cable tv) అని పిలిచేవాళ్ళం. హోం వీడియో డీవీడీ ఇవన్నీ ఒకే కోవలోకి వచ్చేవి. మీకు తెలుసా అసలు స్ట్రీమింగ్ మొదట ఎవరు కనిపెట్టారో... మేజర్ లీగ్ baseball. వాళ్లకు రైట్స్ అప్పట్లో భారీ రేటుకే అమ్మేవారు. ఇక నా వరకు నాకు మంచి సినిమాని మనం చక్కటి థియేటర్‌లో 700 నుంచి 800 మంది మధ్యలో నేను వాళ్ళలో ఒక్కడిగా చూడటం నచ్చుతుంది. ఇదే థియేటర్‌లో సినిమా చేసే అద్బుతమైన ప్రక్రియ.

కానీ ఇప్పుడు సినిమా పరిస్థితి చూస్తే నాకు కొంత ఆందోళనగా ఉంది. స్టూడియో వాళ్లు విపరీతమైన అప్పుల్లో ఉన్నారు. వాళ్ళు సినిమాలు తీస్తోంది వాళ్ళకున్న అప్పులు తీర్చడానికే. వాళ్ళకుండే టార్గెట్ మంచి సినిమా తీయటం కాదు, విపరీతమైన వసూళ్లు రాబట్టడం. ఇందులో భాగంగానే డబ్బున్న కంపెనీలు అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ ఈ రంగంలోకి వచ్చాయి. మనకి ఎంతో కాలంగా తెలిసిన ఎన్నో గొప్ప, అద్భుతమైన స్టూడియోస్‌ను మనం భవిష్యత్‌లో ఇక చూడకపోవచ్చు’’ అని తేల్చి చెప్పారు.

ఇక ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కపోలా దర్శకత్వం వహించిన ‘ది గాడ్‌ ఫాదర్‌’ చిత్రానికి అప్పటికీ ఇప్పటికీ చెరిగిపోనీ ఓ ప్రత్యేక ముద్ర ఉంది. ఇటాలియన్‌ మాఫియా గురించి ఆయన తీసిన ‘ది గాడ్‌ ఫాదర్‌’ సినిమా మూడు పార్ట్‌లను కూడా భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఈ సినిమా స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దర్శకులుగా సినిమా ప్రపంచానికి పరిచయం కాగా, మరెంతో మంది దర్శకులు అదే సినిమా స్ఫూర్తితో ఎన్నో సినిమాలు తీసి ప్రేక్షకుల మెప్పు పొందారు.

గాడ్ ఫాదర్ సినిమాలోని సీన్స్ మన హిందీ మూవీలలో చాలా వరకు వాడేశారు. ధర్మాత్మ, ఆతంక్ హాయ్ ఆటంక్, సర్కార్, రాజనీతి వంటి సినిమాల్లో గాడ్ ఫాదర్ సినిమాను గుర్తు చేస్తాయి. వీటితో పాటు ‘ నాయకన్ ‘ (1987), ‘ దయావన్ ‘ (1988), ‘ పరింద ‘ (1989) సినిమా కథలు గాడ్ ఫాదర్ ను పోలివుంటాయి. ఫైసల్ ఖాన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) ‘ గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ ‘ (2012) వంటి సినిమాల్లో గాడ్ ఫాదర్ మూవీ కనిపిస్తుంది.

అలాగే 1969లో మారియో పుజో రచించిన ది గాడ్‌ఫాదర్ అనే నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా ది గాడ్‌ఫాదర్. ఈ మూవీకి ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలా(Francis Ford Coppola) దర్శకత్వం వహించారు.. 1972లో వచ్చిన ది గాడ్‌ఫాదర్ సినిమా ప్రపంచ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాలలో ఆస్కార్ అవార్డులు అందుకోవడమే కాక మరెన్నో ప్రశంసలు అందుకుంది.

ఈ చిత్రం అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ టాప్ 10 చిత్రాలు జాబితాలో గ్యాంగ్‌స్టర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. గాడ్ ఫాదర్ లో మార్లొన్ బ్రాండొ పొషించిన డాన్ విటొ కొర్లీయొన్ పాత్రను రెండవ భాగంలో పొషించిన రాబర్ట్ డి నీరొకి 1974 సంవత్సర ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు పొందారు. ఒకే పాత్రను పొషించిన ఇద్దరు నటులకు ఆస్కార్ రావడం ఇదే ప్రథమం. ఎప్పుడో 1990లో తీసిన ‘ది గాడ్‌ ఫాదర్‌ పార్ట్‌–3’ కి ఇప్పుడు కూడా ‘రాటెన్‌ టమాటోస్‌’ 68 శాతం రేటింగ్‌ ఇవ్వడం విశేషం.

Read More
Next Story