రెండురెళ్ళు ఆరు:  ఆనాటి  మూవీ  రివ్యూ :
x
వినోదాల విందు ఈ చిత్రం

రెండురెళ్ళు ఆరు: ఆనాటి మూవీ రివ్యూ :

మల్లాది వెంకటకృష్ణమూర్తి 'రెండు రెళ్ళు ఆరు' నవలలోని సొంపులూ, షోకులూ, చమక్కులూ, చమత్కారాలూ అన్ని ఒక్కటై ఈ చిత్రంలోకి కూడా స్మూత్ గా నైస్ గా ప్రవేశించాయి.


సినిమా గ్రేడ్: B1


అంబరమంత సంబరాన్నీ, ఆర్జవమంత ఆనందాన్ని ప్రేక్షకులపై దిమ్మరించి, వారిని హాస్యవృష్టిలో షర్బత్ చేయించి, సొక్కి, సోలి. సొమ్మసిలిపోయేలా చేసే చిత్రం విజయ కమర్షియల్స్ 'రెండు రెళ్ళు ఆరు!' రెండురెళ్ళు ఆరెలా అవుతుందో చూద్దురుగాని రండంటూ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించి, వారిమీదకి హాస్య పరిమళాన్ని గుప్పించి, చివరికి వారిని ఒప్పించి, మెప్పించే చిత్రం 'రెండురెళ్ళు ఆరు!'.

'రెండు రెళ్ళు ఆరు!' కధా రచయిత, ఈనాటి అగ్రశ్రేణి నవలా రచ యితల్లో ఒకరైన మల్లాది వెంకటకృష్ణమూర్తి. ఆయన తన 'రెండు రెళ్ళు ఆరు' నవలా రచనలో కనబరచిన సొంపులూ, షోకులూ, చమక్కులూ, చమత్కారాలూ అన్నీ అదే పేరు గల ఈ చిత్రంలోకి కూడా స్మూత్ గా, రంగరించి నైస్ గా ప్రవేశించాయి. వాటిని తన అద్భుత హాస్యసృష్టి చాతుర్యంతో అనితర సాధ్యమైన పాత్రకల్పనా సామర్థంతో సింగారించి, మాటలతో మాలిష్ చేసి, పాటలతో పాలిష్ పెట్టి ఒదిలిపెట్టాడు జంధ్యాల.

ఈ చిత్రంలోని పాత్రలూ సన్నివేశాలూ సంభాషణలూ అన్ని ప్రేక్ష కులకు కితకితలు పెడతాయి. పకపకమని నవ్విస్తాయి. పడీపడీ నవ్విస్తాయి. ఈ నవ్వులు చూసి దారేపోయే వారెవరైనా మ ల్ని మెంటల్ కేసేమో అని అనుమానపడేంటంతగా నవ్విస్తాయి! ముందస్తుగా, ఈ చిత్రంలో జంధ్యాల సృష్టించిన వింత వింత పాత్రల్ని పరిచయం చేస్తాను. మైకులు లేని రోజుల్లో స్టేజీమీద గొంతు చించుకొని పాటలు పాడిన నటుల్లా. 'మాట మార్చకు ' అన్న ఊతపదంతో అరిచినట్లుగా మాట్లాడే పి. యల్ నారాయణ పాత్రా దేవుడితో ఏదో డైరెక్ట్ కాంటాక్టు ఉన్నట్టు 'పితా! అంటూ మాటి మాటికీ ఆ జగత్పితను కేకేసే పొట్టి ప్రసాద్ పాత్రా, భార్య (కర్ణ) కఠోర సంగీత సాధనకీ, తను వంట చేసే దుస్థితికి పిచ్చెక్కిపోతూ. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది కాబట్టి. ఆ పనికి బదులుగా చొక్కా చించుకొనే సుత్తి వీరభద్రరావు పాత్రా, సి యస్. ఆర్ లా పెక్యూలియర్ వాయిస్తో మాడ్లాడే సుత్తి వేలు పాత్రా, అధికార భాషాసంఘం అధ్యక్షుడి గుండె పగి లేలా తెలుగును అర్ధంకానంత భయంకరంగా మాట్లాడే సాక్షి రంగారావు పాత్రా. చెప్పదలుచుకున్న ప్రతీ విషయాన్నీ రైల్వే ప్లాట్ఫారమ్ అనౌన్స్ మెంట్స్ మూడు నాలుగు భాషల్లో చెప్పే రాళ్ళపల్లి పాత్రా - ఈ పాత్ర లా లన్నీ సలక్షణమైనవి కాకపోవచ్చును గానీ విలక్షణమైన ఈ విలక్షణత నుంచి సలక్షణమైన హాస్యం పరవళ్ళు తొక్కుతూ ప్రవహించింది!

ఇక సంఘటనల పరమైన హాస్య, చిత్ర ప్రారంభంలోనే ఒక హీరోకు కల సన్నివేశాన్నికదాన్ని సృష్టించి, ఏమిటి పిచ్చి డైరక్షన్..ఎవరా డైరక్టర్ అని అతని చేత అనిపించి, జంధ్యాల అంటూ తెరపై తన పేరును ప్రదర్శించుకుంటాడు దర్శకుడు. మరో సీన్ లో హీరో తన ప్రేయసి తో తలకాయలు మోటించుకొనేలా మాట్లాడబోతూంటే, వెనక కుర్చీ ప్రేక్షకుడు హీరో తలకాయను ముందుకు వంగి ప్రక్కకు నెడతాడు. ఐరావతం చేతి వంటకాల రుచి మరిగిన ఆ వీధి బిక్షగాడు ఆ విషయాన్ని కామధేను గ్రైండర్ కంపెనీవాడికి చెపితే..ఆ కంపనీవాళ్లు ఐరావతానికా విషయం చెప్పి ,వాళ్ల ప్రొడక్ట్ అమ్మకానికి మోడల్ గా ఉండమని కోరతారు. పెళ్లి ఇష్టంలేని ఈశ్వరి మారాం చేస్తూంటే ఆ పిల్లను బుట్టలో పట్టి బుట్టలో పెట్టి తీసుకొస్తాడు మేనమామ. పితా అని అరుస్తూ సన్యాసి వస్తూంటే మేడ మీద నుంచి పూలు చల్లుతూ చివరకి బుట్టను కూడా నెత్తిన పడేస్తాడు తికమక.

నాది మంగలి కొట్టుకాదు ,బట్టలకొట్టు ..ఏ కొట్టు అయితేనేం కత్తిరించటమేగా, కాకుంటే బట్టా,జుట్టూ అంతే తేడా, ప్రేమలో పడటమేమిటి..ఏదో బురదలో పడ్డట్లు, ఉన్న ఒక్కగానొక్క భర్తను సుఖపెట్టలేకపోతున్నాను, ఏమండీ చారులు ఇరవై చెంచాల కారం వేసాను. చాలా కూరలో పంచదార ఎంత వేయను..కతికితే అతకదు... ఇలాంటివి బోలెడు కామెడీ డైలాగులుతో నింపేసారు.కాస్తందుకో ధరఖాస్తందుకో పాట చిత్రీకరణ బ్యూటీఫుల్, మెజీషియన్ బి.వి పట్టాభిరామ్ గారు కనపడి మేజిక్ లు చేయటం,హిప్నాటైజ్ చేయటం కథలో భాగంగా బాగా ఉపయోగించుకున్నారు జంధ్యాల.

ఆ సినిమా చూసిన ప్రేక్షకుడు ప్రకృతి చికిత్సాలయంలో వైద్యం చేయించుకుని వచ్చిన వ్యక్తిలాగ సంతోషంగా ,సంబరంగా , సంతుష్టిగా కళకళ్లాడుతూ,కిలకిల్లాడుతూ బయిటకు వస్తాడు.

(విజయావారి సినిమా అనుబంధంలో వచ్చింది)

రెండు రెళ్ళు ఆరు సినిమాలో రాజేంద్రప్రసాద్, ప్రీతి, చంద్రమోహన్, రజని ప్రధాన పాత్రలలో కనిపిస్తారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో విజయ కమర్షియల్స్ బ్యానర్‌పై జి.సుబ్బారావు నిర్మించిన ఈ సినిమా 1986, జనవరి 11వ తేదీన విడుదలయ్యింది. ఈ సినిమా మంచి విజయంసాధించింది.


Read More
Next Story