వెబ్‌సిరీస్‌గా మార్క్వెజ్ ‘హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్
x

వెబ్‌సిరీస్‌గా మార్క్వెజ్ ‘హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్'

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రచయిత గాబ్రియెల్ గార్సియా. ఆయన రచనల్లో హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్‌ చాలా ప్రత్యేకం. ఇప్పుడు అదే పుస్తకం వెబ్‌సిరీస్‌లా రానుంది.

మీరు వరల్డ్ ఫేమస్ రైటర్ గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ అభిమాని అయితే మా దగ్గర మీకు నచ్చే న్యూస్ ఉంది. ఆయన రాసిన కల్ట్ క్లాసిక్ నవల, వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్, ఇప్పుడు వెబ్ సిరీస్‌గా వస్తోంది. ఈ వెబ్ సిరీస్ టీజర్ రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ అద్బుతమైన మ్యాజిక్ రియలిజంతో నడిచే నవల గురించి వినటమే కానీ చదవలేకపోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లు ఈ పుస్తకంలో అసలు ఏముంది జనాలకు అంతలా నచ్చటానికి అనే ఆలోచనలో ఉన్నారు. వారు ఈ సీరిస్‌కు ఖచ్చితంగా ఆహ్వానం పలుకుతారు.

నవలలోని పాత్రలు 16 ఎపిసోడ్‌‌లుగా రూపొందే ఈ సిరీస్‌ రూపంలో సజీవంగా మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మార్క్వెజ్ సృష్టించిన మాయా ప్రపంచాన్ని ఈ టీజర్ మనకు గుర్తు చేస్తుంది. ఈ వెబ్ సిరీస్‌కు లారా మోరా, అలెక్స్ గార్సియా లోపెజ్ దర్శకత్వం వహించారు. కొలంబియా, లాటిన్ అమెరికాకు చెందిన నటీనటులు ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాస్టింగ్‌కు అక్కడ నటీనటులను తీసుకోవటం ద్వారా సిరీస్‌కు ప్రామాణికతను జోడిస్తుందని నమ్ముతున్నారు.

క్లాడియో కాటానో కల్నల్ ఆరేలియానో ​​బ్యూండియా పాత్రను పోషిస్తున్నారు. మార్కో గొంజాలెజ్ ఈ సీరిస్‌లో జోస్ ఆర్కాడియో బ్యూండీగా, సుసానా మోరేల్స్ ఉర్సులా ఇగ్వారన్‌గా కనిపించారు. స్పానిష్‌లో షూట్ చేయబడిన ఈ సిరీస్‌లో ఎక్కువ భాగం కొలంబియా చుట్టుపక్కల ప్రాంతాల్లో తీశారు. ఈ సీరిస్ నిర్మాణానికి మార్క్వెజ్ కుటుంబం నుండి కూడా మద్దతు లభించింది. మ్యాజికల్ రియలిజంలో సాగిన ఈ నవల ప్రపంచం వ్యాప్తంగా పలువురి ప్రశంసలు కూడా అందుకుంది. మార్క్వెజ్‌కి 1982లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందించిన నవల కూడా ఇదే.

పుస్తకం గురించి చెప్పాలంటే...

కొన్ని పుస్తకాలు అలా జన జీవితంలో కలిసిపోతాయి. ఎన్నాళ్లైనా మర్చిపోలేదు ప్రపంచం. అయితే పుస్తకం మెల్లి మెల్లిగా కనుమరుగు అవుతున్న దశాబ్దం ఇది. అక్షరం కన్నా దృశ్యానికి ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు, వెబ్ సీరిస్‌లకే జనం మొగ్గు చూపుతున్నారు. అయినా సరే కొందరు రచయితలు ఈ మాధ్యమంలో కూడా తమ ప్రమేయం లేకుండానే అజరామరమైన రచనలతో ప్రత్యక్షమై ఈ x జనరేషన్‌ని సైతం ఉర్రూతలూగిస్తున్నారు. అలాంటి రచనలు కొన్ని ఇప్పటికే సినిమాలుగా, సీరిస్‌లుగా వచ్చాయి. ఇప్పుడు మేజిక్ రియలిజం అన్న మాటకు నిజమైన అర్దంలా కనిపించే ఓ మహోత్తర గ్రంధ్రం లాంటి పుస్తకం Hundred Years of Solitude వెబ్ సీరిస్‌గా రాబోతోంది.

గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ రాసిన వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ మొదటిసారిగా మే 1967లో ప్రచురించబడినప్పటి నుండి 47 భాషల్లోకి అనువదించబడింది. 50 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి. ప్రపంచ ప్రముఖ సాహితీ వేత్తలంతా ఈ శతాబ్దంలో వచ్చిన గొప్ప నవలల్లో ఒకటిగా దీనిని చెబుతారు. కొలంబియలోని స్థానిక ఆచారాలను, కథలను, చరిత్ర అంశాలను మార్క్వెజ్ ఈ పుస్తకంలో కథలో భాగంగా చర్చిస్తాడు. అలాగే ఈ కథలో మనల్ని ఆకట్టుకునే అంశం మార్క్వెజ్ తన బాల్య జీవిత అనుభవాలు, జ్ఞాపకాలతో ముడివేసి ఈ నవలను నడిపించడమే అని చెప్పాలి. మధ్య మధ్యలో రాజకీయపరమైన అంశాలు కూడా తగులుతూంటాయి.

వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ కథ వందేళ్లలో జరిగింది. ‘మాకాండో’ అనబడే చిన్నపాటి ఊర్లో జరుగుతుంది. ఆ ఊరు ఎలా మొదలైంది.. ఎలా ఎదుగుతూ వచ్చింది. అక్కడ జన జీవితంలో భాగంగా ఏయే మార్పులు చోటు చేసుకున్నాయి. ఎక్కడైనా మానవ జాతి లక్షణం ఒకటే అన్నట్లు దక్షిణ అమెరికా ప్రాంతాన్ని సంపద కోసం ప్రకృతి వనరుల కోసం అమెరికా ఇతర యురోపియన్ దేశాలు నిర్దాక్షిణ్యంగా అమానుషంగా దోచుకున్న వైనాన్ని హృదయవిదారకంగా చూపిస్తుందీ నవల.

కథలో జోస్ ( Jose Arcadio Buendia)అతని భార్య ఉర్సులా తాము ఉన్న ఊరుని ఒక కారణంగా విడిచిపెట్టి, తన వాళ్లతో కలిసి ప్రయాణం చేస్తూ ఓ కొండ ప్రాంతం చూసి అక్కడ ప్రదేశం బాగుందని చెప్పి సెటిలవుతారు. ఇళ్లు కట్టుకుని ఊరుని నిర్మించుకోవటం ప్రారంభిస్తారు. ఆ పల్లె కి జిప్సీలు రావడం వారు వల్ల అక్కడ జన జీవితాల్లో వచ్చే మార్పులు.. ‘మాకాండో’ గురించి ప్రభుత్వానికి తెలిసి తన ప్రతినిధిని పంపటం...అలాగే . పెద్ద కొడుకు ఒకమ్మాయితో సంబంధం పెట్టుకుని గర్భం చేయడం... క్రమంగా కుటుంబం పెరగడం... మహమ్మారి వ్యాపించటం...ఆ తర్వాత కాల క్రమేణా ఎన్నో మార్పులు... కొందరు అభివృద్ధి చేస్తామంటూ వచ్చి మాకాండోలోని అరటితోటల్ని స్వాధీనం చేసుకుని స్థానిక రైతుల్ని కూలీలుగా బానిసలుగా మార్చివేయటం ఇలా సాగుతుంది.

చదువుతుంటే ఎపిసోడిక్ గా అనిపించినా ఎక్కడా విసుగు అనిపించదు. చరిత్ర పుస్తకాల్లో రాయని అసలైన మానవ చరిత్రను దర్శించినట్లు అనిపిస్తుంది. కొన్ని తరాలను, జీవితాలను , మన తాత,ముత్తాతల కథలు ఇవే కదా అనిపిస్తుంది. మనం ఉంటున్న భూమి మీద గతంలో ఎన్ని కుటుంబాలు నివసించాయో..ఎన్ని గొడవలు, యుద్దాలు, మోసాలు, కుట్రలు జరిగాయో, భవిష్యత్తులో జరుగుతాయో అనిపిస్తుంది. అలాంటి అరుదైన పుస్తకాన్ని ఇప్పుడు నెట్ ప్లిక్స్ వారు వెబ్ సీరిస్‌గా తీసి వదులుతున్నారు. టీజర్ ఇప్పటికే వచ్చింది. బాగుంది… చూస్తూంటే ఈ వెబ్ సీరిస్ బాగా వర్కౌట్ అవుతుందనిపిస్తోంది. వరల్డ్ మార్కెట్ కదా.. ప్రపంచం మొత్తం మీద ఈ పుస్తక అభిమానులు మొత్తం చూసినా చాలు.

Read More
Next Story