కామెడీ తక్కువై.. క్రైం ఎక్కువైన గం గం గణేశా
x

కామెడీ తక్కువై.. క్రైం ఎక్కువైన "గం గం గణేశా"

ఆనంద్ దేవరకొండ నటించిన క్రైమ్‌కామెడీ మూవీ ‘గం గం గణేశా’. ఈ సినిమాలో కామెడీ కాస్త తక్కువై క్రైమ్ ఇంకాస్త ఎక్కువైంది. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందంటే..


వేసవి చివరి శుక్రవారం(31.5.24) విడుదలైన మూడు సినిమాల్లో ఈ క్రైమ్ కామెడీ ఒకటి. ఈ మధ్యకాలంలో యువ దర్శకులు చాలామంది, కొత్త పాయింట్‌తో కథలు ఎన్నుకుంటున్నారు, కానీ దాన్ని సరిగా రాసుకోలేకపోతున్నారు, అందుకే కథనం గందరగోళం అవుతోంది. ఇక బాగుంది కదా అని కొన్ని సన్నివేశాలను సాగదీయడం కూడా మామూలు అయిపోయింది. " గం గం గణేశా" కు కూడా ఈ బెడద తప్పలేదు. నూతన యువ దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తీసిన ఈ సినిమాలో క్రైమ్, కామెడీ కొంతమేరకు ఉన్నప్పటికీ, సినిమా కథకు ఏ విధంగానూ అవి ఉపయోగపడలేదు. చాలా చోట్ల కామెడీతో నవ్వించిన ఈ సినిమా, ఒక మల్లెపూల మాల లాగా లేదు.. ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలు, కాసింత కదిలించే సన్నివేశాలు, క్రైమ్ సంఘటనలు , ఎలక్షన్ల మీద విసుర్లు, ఒకటి రెండు పాటలు, బోలెడు తుపాకులు, ప్రేక్షకులు ఊహించగలిగే చిన్న చిన్న ట్విస్టులు మొత్తం కలిపి ఒక బట్ట మీద పరిస్తే ఎలా ఉంటాయో, సినిమా అలా ఉంది.

ఉత్సాహం ఎక్కువ- అనుభవం తక్కువ

ఈ సినిమా నిడివి 140 నిమిషాలు కాకుండా 110 నిమిషాలు ఉండి ఉంటే, మరి కొంత బాగుండేదేమో. దర్శకుడికి ఉత్సాహం ఎక్కువ, అనుభవం తక్కువ కావడం వల్ల అలా జరిగింది. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే ఈ సినిమాను ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడు తీసి ఉంటే ఓ మంచి క్రైమ్ కామెడీ అయ్యుండేదేమో. అయితే ఈ సినిమాని తక్కువ చేయవలసిన అవసరం లేదు. కొంచెం ఓపిక పట్టి, మొదటి సినిమా కాబట్టి దర్శకుడికి కొంత సౌలభ్యం ఇచ్చి, ఓపిగ్గా కూర్చోగలిగితే, ఈ సినిమా కొంత వరకు నవ్విస్తుంది. ఈ సినిమాను చూడగలిగేలా చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది చివరి అరగంట వెన్నెల కిషోర్ చేసిన కామెడీ. నిజానికి కామెడీ మొత్తం ఉండేది ఈ అరగంటలోనే. ఆ పల్లెటూర్లో ఉన్న నీలవేణి(ప్రగతి శ్రీవాస్తవ) ఫ్రెష్ గా ఆహ్లాదకరంగా ఉంది.

కథ కొత్తది.. కథనం పాతది

కథ గురించి చెప్పాలంటే గణేష్(ఆనంద్ దేవరకొండ), శంకర్ (జబర్దస్త్ ఇమ్మానియేల్) చిల్లరదొంగలు ఒక వజ్రాన్ని దొంగిలించే కాంట్రాక్ట్ తీసుకొని, అది దొంగిలించే క్రమంలో, నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కిషోర్ రెడ్డి(రాజ్ అర్జున్) ఎలక్షన్లలో పంచడానికి బొంబాయి నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకురావడానికి రుద్ర (కృష్ణ చైతన్య) అనే ఒక జైలులో ఉన్న ఖైదీకి కాంట్రాక్ట్ ఇవ్వడం. ఆ నూరుకోట్లు వినాయకుడి విగ్రహం లో పెట్టి రుద్రా తీసుకుని వచ్చే క్రమంలో, గణేషు తన వజ్రాన్ని కూడా, పోలీసులకు చిక్కకుండా వినాయకుడి తొండం నుంచి జారవిడవడంతో కథ రాజు వారి పల్లె అనే గ్రామానికి చేరుతుంది. ఇక అక్కడి నుంచి కథ నడిచి కంచికి చేరుతుంది. కథ మొత్తం గణేశుడి విగ్రహం చుట్టే తిరుగుతుంది కాబట్టే ఈ సినిమాకి గం గం గణేశా అని పేరు పెట్టారు. 1973 లో వచ్చిన ఎన్టీఆర్, కృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రం " దేవుడు చేసిన మనుషులు" కూడా కొంతవరకు వినాయకుడి చుట్టూ తిరుగుతుంది.

పాత్రలు ఎక్కువ- క్లారిటీ తక్కువ

ఈ సినిమా మరింత బాగా ఉండకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి సినిమా నిడివి. ఓ 20 నిమిషాల సినిమాని కత్తిరించి ఉంటే బాగుండేది. కామెడీ, విలన్ పాత్రలతో నడపడం సులభం కాదు ఇందులో అదే జరిగింది. అలాగే సినిమా నిండా పాత్రలు ఎక్కువై పోవడం వల్ల, దర్శకుడు సినిమాను సమర్థవంతంగా నడపలేకపోయాడు. చాలా చోట్ల గందరగోళం కనిపించింది.

ఎడారి లాంటి సినిమాలో ఒయాసిస్సులు ఆ ఇద్దరు

నటీనటుల్లో ఈ సినిమాకు మైనస్ ఆనంద్ దేవరకొండ. దానికి కారణం ఏంటంటే అతని డిక్షను, డైలాగ్ డెలివరీ విజయ్ దేవరకొండ లాగే ఉన్నాయి. బేబీ సినిమాలో చూపించిన నటన, ఇందులో చూపించలేకపోయాడు. మిగతా పాత్రల్లో రాజ్ అర్జున్ కొంతవరకు విలనిజాన్ని బాగానే పండించాడు. మరో ప్రధాన పాత్రలో రుద్రాగా కృష్ణ చైతన్య కూడా బాగానే చేశాడు. జబర్దస్త్‌లో కామెడీ చేసే ఇమ్మానియేల్ ఇందులో కొంత వరకే కామెడీ చేయగలిగాడు. ఇంతకుముందు చెప్పినట్టు కాసేపే కనిపించినప్పటికీ నీలవేణి పాత్రలో నటించిన ప్రగతి శ్రీ వాత్సవ తన ప్రతిభను చూపించింది. ఈమెతో ఎక్కువ సన్నివేశాలు చిత్రీకరించి ఉంటే మరింత బాగుండేది. . ఈమెకు భవిష్యత్తులో మరిన్ని పాత్రలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎడారి లాంటి సినిమాలో ఈమె ఉన్న సీన్లు, ప్లస్ వెన్నెల కిషోర్ ఫన్నీ ఎపిసోడ్స్ ఒయాసిస్సులు. ఇంకా మిగతా నటుల్లో ఒకరిద్దరు పర్వాలేదనిపించారు అందులో కిషోర్ రెడ్డి అనుచరుడు ఒకడు.

కొంత ఓపిక ఉండి లోపాలను పట్టించుకోకపోతే, చూడొచ్చు

ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని సన్నివేశాలు బాగానే వర్కౌట్ అయినప్పటికీ, సినిమాను నడపడానికి అవి సరిపోవు. ఈ సినిమాలో డైలాగులు కూడా అక్కడక్కడ నవ్వించాయి, ఆలోచింపజేశాయి. అయితే అంతవరకే వాటి పని. అయితే ఈ సినిమా దర్శకుడు ఉదయ్ శెట్టిని కొంతవరకు అభినందించాలి. మొదటి సినిమానే కాబట్టి, కొంతవరకు క్షమించాలి. అయితే దర్శకుడిలో స్పార్క్ మాత్రం ఉంది అన్న విషయం ఈ సినిమా తెలియపరుస్తుంది. భవిష్యత్తులో తన ఉత్సాహం తగ్గించుకొని, బాగా ఆలోచించి సినిమాలు తీసే అవకాశం ఉంది.

చివరగా చెప్పాలంటే ఈ శుక్రవారం విడుదలైన మూడు సినిమాల్లో ఈ సినిమానే కొన్ని నవ్వులను పంచి ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. దర్శకుడు కామెడీ మీద మరింత దృష్టి పెట్టి, సన్నివేశాల రూపకల్పనలో పరిమితి పాటించి ఉంటే, ఈ సినిమా ఓ మోస్తారు విజయవంతమైన క్రైమ్ కామెడీగా మారి ఉండేది.

నటీనటులు:

ఆనంద్ దేవరకొండ,వెన్నెల కిషోర్,రాజ్ అర్జున్,కృష్ణ చైతన్య, సత్యం రాజేష్,నయన్ సారిక,కరిష్మా,ప్రగతి శ్రీవాస్తవ,సాయిరాజ్ సుతారి, జబర్దస్త్ ఇమాన్యుయేల్

కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఉదయ్ బొమ్మిశెట్టి

సంగీతం: చైతన్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

నిర్మాతలు: వంశీకృష్ణ కారుమంచి,అనురాగ్ పరవతేనేని,కేదార్ సెలగంశెట్టి

నిర్మాణ సంస్థ: హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్

విడుదల: మే 31, 2024

Read More
Next Story