'గామి' మూవీ రివ్యూ
టీజర్లతో ట్రైలర్స్ తో ప్రేక్షకులలో ఎక్స్పెక్టేషన్స్ పెంచి, ఆసక్తి కలిగించి, అంచనాలు పెంచిన " గామి" చివరకు ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. రివ్యూ చదవండి
ఐదు సంవత్సరాలు క్రితం మొదలుపెట్టి, క్రౌడ్ ఫండింగ్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, మధ్యలో ఒక యువి క్రియేషన్స్ లాంటి సంస్థ చేయూతని ఇవ్వగా, చాలా కష్టపడి తీసిన సినిమా ఇది. ఒక మాటలో చెప్పాలంటే సగటు ప్రేక్షకులను కష్టపెట్టే సినిమా కూడా ఇదే. అత్యల్ప వర్గ ప్రేక్షకులకి ఇది కొంచెం నచ్చవచ్చు.. కానీ మిగతా ప్రేక్షకులకు ఇది ఒక అర్థం కాని పజిల్ లాంటిది. సినిమాను అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అయినా సినిమా పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. దీన్ని అనుభవరాహిత్యం కింద కొట్టి పడేయడానికి వీల్లేదు. ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. అయితే దర్శకుడికి ఏం తీయాలి? ఎలా తీయాలి? అన్నదానిమీద స్పష్టత కరువైంది. అదే సినిమాకు ప్రధానమైన మైనస్ పాయింట్.
హై క్వాలిటీ విజువల్స్
ఒక మాట అయితే చెప్పాలి. ఈ సినిమా విజువల్స్ అద్భుతం స్థాయి నుంచి, బాగున్న స్థాయి వరకు ఉన్నాయి. ముఖ్యంగా హిమాలయ పర్వతాల లో జరిగిన సన్నివేశాల చిత్రీకరణ హాలీవుడ్ చిత్రాలను తలపించే స్థాయిలో ఉంది. అయితే ఒక సినిమాకి అవే సరిపోవు. ఇంకా వేరే విషయాలు కూడా ఉండాలి. అటువంటి చాలా విషయాలు లోపించిన సినిమా ఇది. దర్శకుడు విద్యాధర్ కాగితకి ఇది మొదటి సినిమా. సాధారణంగా మొదటి సినిమా అంటే కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోకూడదు అన్న మినహాయింపు ఉంటుంది. కానీ ఈ సినిమాలో దాదాపు అన్ని విషయాలు పట్టించుకోకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది.
గామి సినిమా కథ మనుషుల స్పర్శని తట్టుకోలేని విచిత్రమైన వ్యాధి ఉన్న శంకర్(విశ్వక్సేన్) అనే ఒక అఘోర తనని తాను తెలుసుకునే ప్రయత్నం తోపాటు తన వ్యాధికి మందు కోసం 36 సంవత్సరాల కు ఒకసారి దొరికే మాలిపత్రాల కోసం హిమాలయ పర్వతాలలో అన్వేషించడం, మనుషుల మీద ప్రయోగాలు చేసే ఒక సీక్రెట్ లాబరేటరీ లో బందీగా ఉన్న ఒక అబ్బాయి, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల పల్లెటూర్లో దేవదాసి కూతుర్ని కూడా దేవదాసిగా మార్చడానికి చేసే ప్రయత్నాల సమాహారం. దాన్ని నేరుగా చెప్తే సరిపోయేది. మూడు పాత్రల ద్వారా చెప్పడం వల్ల సినిమా అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులకు టైం పడుతుంది, సీక్రెట్ లాబరేటరీలో అబ్బాయి మీద తీసిన కొన్ని సన్నివేశాలు చూడడం కష్టమే. ప్రతి కథను ఎక్కువసేపు లాగడం వల్ల కథనంలో కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఇంత ముందే చెప్పినట్లు ఓ నలభై నిమిషాల సినిమా కట్ చేసి ఉంటే, కొంత ఎఫ్ఫెక్టివ్ గా ఉండేదేమో.
నెమ్మదిగా సా...గిన కథనం
ఈ సినిమా నిడివి కూడా సినిమా వేగాన్ని తగ్గించింది. నూరు నిమిషాల నిడివి ఉంటే సరిపోయే సినిమా, 146 నిమిషాలు తీయడం వల్ల, సినిమాకు ఎక్కువ నష్టం కలిగింది. ఇది ఓటీటీల కాలం. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకి ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని ఓటీటీలలో వచ్చిన సినిమాలు, కొన్ని హాలీవుడ్ సినిమాలతో పాటు ఆ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన ఒకటి రెండు సినిమాలు కూడా గుర్తుకొస్తే అది ప్రేక్షకులు తప్పు కాదు. ఆ సినిమా లను ప్రస్తావించడం సమంజసం కాదు.
ఈ సినిమా విశ్వక్సేన్ కి మొదటి సినిమా. పర్వాలేదనిపించాడు. డైలాగులు తక్కువ ఉండడం కొంతవరకు ఉపయోగపడింది. ఈ సినిమా లో నటించిన చాందిని చౌదరి(" కలర్ ఫోటో" ఓటీటీ సినిమాలో హీరోయిన్) పాత్ర ఔచిత్యం ఏమిటో అర్థం కాదు. ఆ పాత్ర కథను మరింత కన్ఫ్యూజ్ చేయడానికి పనికొచ్చింది తప్ప మరేమి లేదు. వాళ్ళిద్దరి మధ్య నడిచిన సన్నివేశాలు, ఎప్పుడు అయిపోతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇతర నటీనటుల విషయానికి వస్తే దేవదాసిగా దుర్గ పాత్రలో అభినయ,CT-333 పాత్రలో మహమ్మద్, దుర్గ కూతురు ఉమ పాత్రలో హారిక పెడద నటన బాగానే ఉంది.
సినిమా ప్రారంభమైన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో చేసిన ప్రయత్నాలతో, కథనాలతో విజువల్స్ తో, టీజర్లతో ట్రైలర్స్ తో ప్రేక్షకులలో ఎక్స్పెక్టేషన్స్ పెంచి, ఆసక్తి కలిగించి, అంచనాలు పెంచిన " గామి" సినిమా కేవలం మంచి విజువల్స్ తో తీసిన సినిమాగా నిలిచి, పెద్ద నగరాలలో కొద్దిమంది ప్రేక్షకులను మాత్రమే అలరించి చిన్న నగరాలలో ఉన్నమెజార్టీ ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది.
చివరగా, అతి అన్నది ఎపుడూ ఎక్కడా మంచిది కాదు. ఈ సినిమా విషయంలో జరిగింది అదే. సినిమా పూర్తి చేయడానికి తీసుకున్న సమయం, సినిమా నిడివి, బాగుంది అనుకున్న సన్నివేశాలను ఎక్కువ సేపు చిత్రీకరించడం, ఎక్కువ కన్ఫ్యూషన్, కథనానికి చాలా సమయం పట్టడం వంటి అంశాలు ఈ సినిమా కు మైనస్ పాయింట్లు.
తారాగణం:
విశ్వక్సేన్,చాందిని చౌదరి,అభినయ,మహ్మద్ సమద్,హారిక పెడద
ఛాయాగ్రహణం: విశ్వనాథ్రెడ్డి చెలుమళ్ల,రాంపి నందిగాం
ఎడిటర్: రాఘవేంద్ర తిరున్
సంగీతం: నరేష్ కుమారన్
దర్శకత్వం: విద్యాధర్ కాగిత
స్క్రీన్ ప్లే: విద్యాధర్ కాగిత, ప్రత్యుష్ వత్యం
నిర్మాత :కార్తీక్ శబరీష్
(సహ నిర్మాత): శ్వేతా మొరవనేని
నిర్మాణ సంస్థలు:కార్తీక్ కల్ట్ క్రియేషన్స్,వీ సెల్యులాయిడ్, వీఆర్ గ్లోబల్ మీడియా,క్లౌన్ పిక్చర్స్
విడుదల తేదీ: 8 మార్చి 2024
Next Story