‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ రివ్యూ
x

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ రివ్యూ

యువ హీరో విశ్వక్‌సేన్ లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ మూవీ అనుకున్నంత ఇంటెన్స్‌ లేని యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఎందుకంటే…


‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా కథ గోదావరి నది ప్రాంతంలో కొవ్వూరు అనే లంక గ్రామంలోని లంకల రత్నాకర్(విశ్వక్సేన్) జీవన ప్రస్థానం. చాలా చిన్న స్థాయి నుంచి, ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగిన రత్నాకర్ బయోగ్రఫీ. ఒక విధంగా ఆటోబయోగ్రఫీ అని చెప్పొచ్చు. ఈ సినిమా గురించి దర్శకుడు ఎన్నో విషయాలు చెప్పాడు. స్క్రీన్ ప్లే గురించి కూడా బాగానే చెప్పాడు. ఒక అల్లరి చిల్లరిగా తిరిగే యువకుడు చివరికి ఒక కరుడుగట్టిన రాజకీయ నాయకుడిగా ఎలా మారాడు అన్నది చూపించడంలో దర్శకుడికి పాస్ మార్కులు వచ్చాయని చెప్పొచ్చు.

సాదా సీదా కథకు మెరుగులు..

అయితే దర్శకుడు ఈ సినిమా గ్యాంగ్ స్టర్ సినిమా కాదని చెప్పాడు కానీ ఇది గ్యాంగుల సినిమా. ఊర్లో ఉన్న వివిధ గ్యాంగు లను నడిపిస్తున్న ఇద్దరు రాజకీయ నాయకుల నేపథ్యంలో రాసుకున్న కథ. సిట్టింగ్ ఎమ్మెల్యే దొరస్వామి(రమణ గోపవరపు), ప్రముఖ రాజకీయ నాయకుడు నానాజీ(నాజర్) ల మధ్య చిచ్చు పెట్టి, కొంత రాజకీయం నడిపి చివరికి ఎమ్మెల్యే అవుతాడు రత్నాకర్. తర్వాత కథ అనేక విధాలుగా మలుపులు( గోదావరిలో సుడుల్లాగా) తిరిగి ముగుస్తుంది. ఇలాంటి సినిమాలకు కథకన్న కథనం ముఖ్యం. దర్శకుడు సాదాసీదా కథనే తీసుకున్నప్పటికీ దాన్ని తీసిన విధానంతో కొంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. పాటల రచయిత అయిన దర్శకుడు చైతన్య కృష్ణ ఎందుకని పాటలు మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా సమ గూర్చిన పాటలు అంత ఆసక్తికరంగా లేవు. . ఉన్న ఒక ఐటెం సాంగ్ సో సో గా ఉంది. అయితే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం, కొంతవరకు సినిమా మూడ్ ని ఎలివేట్ చేసింది. ఫోటోగ్రఫీ కూడా పల్లెటూరి నేపథ్యాన్ని, ఫైట్లను బాగానే చూపించింది. ఈ సినిమాలో ఒకటి రెండు ఫైట్లు రామ్ లక్ష్మణ్ ప్రతిభను చూపిస్తాయి. సినిమా లంక రత్నాకర్ జైల్లో తన కథను ఫ్లాష్ బ్యాక్ లో చెప్పడంతో మొదలవుతుంది. చివరికి జైల్లోనే ముగుస్తుంది

విశ్వక్సేన్ వన్ మ్యాన్ షో

దర్శకుడి తర్వాత ఈ సినిమాకు ప్రధాన బలం విశ్వక్సేనే. మాస్ క్యారెక్టర్లకు పేరు పొందిన ఇతను గామి అనే ఓ మాదిరి సక్సెస్ఫుల్ సినిమా తరువాత, ఇందులో బాగానే చేశాడు. డైలాగ్ డెలివరీ కోసం కష్టపడినట్లు అనిపిస్తుంది. తెలంగాణకు చెందిన ఈ హీరో, గోదావరి నది తీర ప్రాంతానికే పరిమితమైన యాసను పూర్తిగా పట్టుకోలేక పోయినా మెచ్చుకోదగ్గ స్థాయిలోనే మాట్లాడగలిగాడు. ఇది విశ్వక్సేన్ వన్ మ్యాన్ షో. ఫైట్లు మాత్రం మంచి ఎనర్జీతో చేశాడు. నటన పరంగా కూడా బానే చేశాడని చెప్పవచ్చు. బుజ్జి అనబడే ప్రధాన పాత్రలో నటించిన నేహా శెట్టి కూడా తన వంతు కృషి చేసింది. మొదటిసారి ఒక మాస్ పాత్రలో రత్నమాల (వేశ్యగా)గా నటించిన అంజలి కొంతవరకు దానికి న్యాయం చేసింది. ఈ సినిమా రెండు రత్నాల కథ అని ఇద్దరు చెప్పుకున్నారు. ఈ రత్నాలు కొంతవరకు మెరిసాయి.

రెండో భాగంలో నిదానించిన సినిమా

మొదటి భాగంలో ఎక్స్ప్రెస్ లాగా పరిగెత్తిన సినిమా రెండో భాగంలో లోకల్ ట్రైన్ లాగా పోవడమే ఈ సినిమాకు ఉన్న ప్రధాన లోపం. అయినప్పటికీ ఈ సినిమా యువ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

దర్శకుడు రౌడీ ఫెలో, చల్ మోహనరంగా తర్వాత తన మూడో సినిమాని కొంతవరకు బాగానే తీశాడు అని చెప్పాలి. అయితే ఫస్ట్ ఆఫ్ లో ఉన్న కథనం, స్పీడు రెండో సగంలో కనపడలేదు. ఇది ఎడిటింగ్ ప్రాబ్లం కాదు. దర్శకుడి స్క్రీన్ ప్లే ప్రాబ్లం.

త్రివిక్రం మార్క్ డైలాగులు

ఈ సినిమాలో కొంతవరకు బాగున్న మరో అంశం డైలాగులు. ఈ సినిమా దర్శకుడికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉన్న అనుబంధం వల్ల కొన్ని డైలాగులు సినిమాలో పేలాయి. మరికొన్ని అర్థవంతంగా ఉన్నాయి, ఇంకా కొన్ని విజిల్స్ వేయించాయి, మరికొన్ని త్రివిక్రమ్ ఫిలాసఫీని వ్యక్తపరిచాయి. ఈ అంశం కూడా సినిమా కొంత బాగుండడానికి కారణమైంది

వేసవిలో కాస్త చల్లదనం

ఈ వేసవిలో చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. అయితే విశ్వక్సేన్ సినిమా విడుదలకు ముందు చెప్పినట్లుగా కుటుంబ సమేతంగా ఈ సినిమా కొంతవరకు చూడవచ్చు. డైలాగులు కొంచెం బోల్డ్ గా, కొంచెం అశ్లీలంగా అనిపించినప్పటికీ, అక్కడక్కడ వాటిని సైలెంట్ చేసి సినిమాను విడుదల చేశారు. మొత్తం మీద ఈ సినిమా చూసిన తర్వాత, దీన్ని ఇంకా కొంచెం బాగా తీయగలిగే అవకాశం ఉండేదని అనిపిస్తే కూడా ఆ క్రెడిట్ అలా అనిపించేలా తీసిన దర్శకుడికే దక్కుతుంది. సినిమాకి ముందు చెప్పినట్లుగా దర్శకుడు తీయలేకపోయినా(అందరికీ నచ్చేలా సినిమాలు తీయలేము అని ముందే చెప్పాడు) ఓ మాదిరి విజయం సాధించగలిగే సినిమాను తీయగలిగాడు.

నటీనటులు: విశ్వక్సేన్, నేహాశెట్టి, అంజలి, నాజర్,గోపరాజు రమణ,హైపర్ ఆది,ప్రవీణ్, పమ్మి సాయి,మధునందన్,కోట జయరాం, సాయి కుమార్

కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కృష్ణ చైతన్య

సంగీతం: యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: అనిత్ మధాడి

ఎడిటర్: నవీన్ నూలి

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, వెంకట్ ఉప్పుటూరి, గోపీ చంద్ ఇన్నమూరి

నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్

విడుదల: మే 31, 2024

Read More
Next Story