‘గేమ్ ఆన్’ ఒటిటి మూవీ చూడొచ్చా లేదా: ఒక రివ్యూ
x

‘గేమ్ ఆన్’ ఒటిటి మూవీ చూడొచ్చా లేదా: ఒక రివ్యూ

సినిమాలో ఈగను చంపితే లక్ష ఇస్తాం అనే బ్రహ్మాండమయిన ఆఫర్ ఉంది. . ఈ సినిమా చూస్తే ఏమిస్తారు?

ఓటిటిలు వచ్చాక కొత్త కాన్సెప్ట్ లతో యూత్ చాలా మంది ఈజీగా సినిమాలు చేసేస్తున్నారు.


అయితే కాన్సెప్టు దాకానే కొత్తగా ఉంటున్నాయి. అంతకు మించి ఏమీ ఉండటం లేదనేది చాలా మంది నుంచి వస్తున్న కంప్లైంట్. దానికి తోడు ఈ సినిమాల్లో తెలిసున్న హీరో,హీరోయిన్స్ ఉండరు. గొప్ప టెక్నీషియన్స్ ఉండరు. షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువ ఫీచర్ ఫిల్మ్ కు తక్కువ అన్నట్లుంటాయి ఈ సినిమాలు. అందుకేనేమో ఈ మధ్యన మలయాళ సినిమా డిస్ట్రిబ్యూటర్..కేవలం చాలా మంది ఓటిటిలో అమ్ముకునేందుకే సినిమాలు తీసి నామ మాత్రంగా థియేటర్ లో రిలీజ్ చేయాలి కాబట్టి చేస్తూ డబ్బులు చేసుకుంటున్నారు.


అలాంటి సినిమాల వల్ల థియేటర్ లో రిలీజ్ అయ్యే నిజమైన చిన్న సినిమాల విలువ తగ్గుపోతోంది వాటిని అరికట్టండి మహాప్రభో అని మొరపెట్టుకున్నారు. ఆ మాటలు ఎవరైనా విన్నారా లేదా అనేది ప్రక్కన పెడితే ఈ గేమ్ ఆన్ కూడా కొంచెం అటూ ఇటూగా అలాగే అనిపిస్తుంది. కాన్సెప్టుగా ఇప్పటిదాకా తెలుగు తెరపై రాలేదు అనిపిస్తుంది. కానీ సినిమాగా చూస్తూంటే ఆ ఫీల్ మాత్రం రాదు.




ఇంతకీ ఈ చిత్రం కథేంటి అంటే.. టైటిల్ కు తగ్గట్లే ..ఓ గేమింగ్‌ కంపెనీలో పని చేస్తూంటాడు గౌతమ్‌ సిద్ధార్థ్‌ అలియాస్‌ సిద్ధు(గీతానంద్‌). ఈ కుర్రాడు అందరిలాంటోడు కాదు కొద్దిగా తేడా. దాంతో పర్శనల్ లైఫ్ కూడా కాస్తంత చిందరవందరగానే ఉంటుంది.


ఉద్యోగంలో టార్గెట్ రీచ్ కాకపోవటంతో జాబ్ పోతుంది. ఉన్న ఒక్క గర్ల్ ప్రెండ్ మోక్ష(వాసంతి) కూడా బ్రేకప్ చెప్పేసి ప్రెండ్ రాహుల్‌(కిరీటీ)తో జంప్ జిలానీ అంటుంది. ఇలా కష్టాలు మీద కష్టాలు మీద పడిపోతుంటే ఏం చెయ్యగలడు..ఆత్మహత్యే అందుకు మార్గం అనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో ఉండగా..అతనికి ఎవరో తెలియని వ్యక్తి నుంచి ఓ ఫోన్ కాల్ వస్తుంది. ‘నీ ముందు ఉన్న ఈగను చంపేస్తే లక్ష రూపాలయను అకౌంట్‌లో వేస్తాం’అని ఆఫర్ ఇస్తాడు.


ఈగను చంపితే లక్ష ఇవ్వటమేంటిరా అనిపించినా..సర్లే చచ్చేముందు ఓరాయి వేసి చూద్దాం అని చంపిన మరుక్షణమే.. అకౌంట్‌లోకి రూ.లక్ష క్రెడిట్‌ అవుతుంది. ఇదేందే బాగానే ఉంది ఈగలను చంపేసి అయినా బ్రతికేయచ్చు అని సూసైడ్ ఆలోచనను ప్రక్కన పెట్టేస్తాడు.


ఆ తర్వాత ఈ 'రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్' నుంచి సిద్ధార్థ్ కి ఇంకో టాస్క్ వస్తుంది. చిన్న పిల్లను ఏడిపిస్తే..రూ.మూడు లక్షలు నీ ఎక్కౌంట్ లో వేస్తామని చెబుతారు. అలాగే చేస్తాడు. ఆ తర్వాత అర్జున్ గోస్వామి అనే అతను ఇంటికి వెళ్లి, అతని ల్యాప్ ట్యాప్ ను నాశనం చేయమని చెప్తారు.. సిద్ధార్థ్ అలాగే చేస్తాడు .. ఆ తరువాత అర్జున్ గోస్వామిని షూట్ చేయమని అజ్ఞాత వ్యక్తి చెబుతాడు. గేమ్ గా ఎంతవరకైనా వెళతానుగానీ, హత్య మాత్రం చేయనని సిద్ధార్థ్ తేల్చి చెబుతాడు. తాము చెప్పినట్టుగా చేయకపోతే, అతని గతాన్ని గురించి అందరికీ చెప్పవలసి ఉంటుందని అజ్ఞాత వ్యక్తి హెచ్చరిస్తాడు.

అప్పుడు ఏమైంది... ఇంతకీ ఈ కుర్రాడికి టాస్క్‌లు ఇస్తున్నదెవరు? డబ్బులు ఎక్కువై ఇలా ఇస్తున్నారా..లేక వేరే మోటివ్ ఉందా..? సైకాలజిస్ట్‌ మదన్‌ మోహన్‌(ఆదిత్య మీనన్‌)కు ఈ గేమ్‌తో ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటివన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాలి.

నిజానికి ఇలాంటి సైకలాజికల్ గేమ్ లు ఆ మధ్యన బాగా పాపులర్ అయ్యాయి. మన దేశంలోనూ బ్లూ వేల్ లాంటి గేమ్స్ ఆడి ప్రాణాలు తీసుకున్నవాళ్లు ఉన్నారు. అలాంటి ఆన్ లైన్ గేమ్ చుట్టూ ఈ కథ అల్లారు. గేమ్ పేరుతో హీరోను ఇరికించడానికి విలన్ వేసిన ప్లాన్, లాస్ట్ మినిట్ లో అది గ్రహించిన హీరో ఆ ఉచ్చులో నుంచి బయటపడటానికి ట్రై చేయడం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి. కానీ స్క్రీన్ ప్లేనే సరిగ్గా సెట్ కాలేదు. బాగా ఇమ్మెచ్చూరిటీ కనిపిస్తుంది.

కథలో మెలికలు వచ్చినప్పుడు మనకేమీ పెద్దగా థ్రిల్ అవ్వము. జస్ట్ ఓకే అనిపిస్తుంది. కొంతదూరం వెళ్లేసరికి కథ ముందుకు వెళ్లదు. అక్కడక్కడే తిరుగుతున్నట్లు ఉంటుంది. అందులోనూ కొత్త మొహాలు . పాపం వాళ్లు బాగానే చేసినా మనకేమీ అనిపించదు. టాస్కుల వరకు బాగానే ఉన్నా కొంతదూరం వెళ్లాక క్లారిటీ మిస్సైంది. వాట్ నెక్ట్స్ అనిపించదు. వావ్ ఫ్యాక్టర్ లేదు. సాధారణంగా ఇలాంటి కథలు వర్కవుట్ అవ్వాలంటే స్టోరీ టెల్లింగ్ లోనే ఓ కొత్తదనం ఉండాలి. అలాగే ఎమోషనల్ గ్రావిటీ కూడా ఫెరఫెక్ట్ గా సింక్ అవ్వాలి. ఏదైమైనా ఇంకాస్త టైట్ గా స్క్రీన్ ప్లే ఉంటే ఖచ్చితంగా బాగుండేది. టెక్నికల్ గా ..దయానంద్ మేకింగ్ .. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ .. అభిషేక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి.
చూడచ్చా
ఓటిటిలో కాలక్షేపంగా చూసే సినిమాగా ఫరవాలేదనిపిస్తుంది. అంతకు మించి ఎక్సపెక్ట్ చేస్తే ...మనమూ ఈ గేమ్ లో ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది.

నటీనటులు: గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీనన్‌, మధుబాల, వాసంతి, కిరీటీ, శుభలేఖ సుధాకర్‌ తదితరులు
నిర్మాత: రవి కస్తూరి
దర్శకత్వం: దయానంద్‌
సంగీతం: అభిషేక్‌ ఏఆర్‌(బీజీఎం), నవాబ్‌ గ్యాంగ్‌, అశ్విన్‌ అరుణ్‌(పాటలు)
సినిమాటోగ్రఫీ: అర‌వింద్ విశ్వనాథ‌న్‌
ఎడిటర్‌: వంశీ అట్లూరి
ఓటీటి విడుదల : అమెజాన్ ప్రైమ్


Read More
Next Story