తెరమీద  జీన్ హాక్ మాన్  ఒక అయస్కాంతమై పోతాడు...
x

తెరమీద జీన్ హాక్ మాన్ ఒక అయస్కాంతమై పోతాడు...

ఆవేశం, భావోద్వేగాల అగ్నికీలలు ఎప్పుడూ ఆయన నటనలో పెల్లుబుకుతూ కనిపిస్తాయి.


ప్రఖ్యాత హాలివుడ్ న‌టుడు జీన్ హాక్ మాన్ (95), భార్య బెట్సీ అర్కావా(64), పెంపుడు కుక్క అనుమానాస్ప‌ద మృతి చెంది ఉండటం హాలివుడ్ లో క‌ల‌క‌లం రేపింది. 4 ద‌శాబ్ధాల పాటు ఆయన హాలివుడ్ ను ఏలేశాడు. 80 చిత్రాల్లో న‌టించాడు. అయిదు సార్లు ఆస్కార్ కు నామినేట్ అయినా రెండు సార్లు ఆస్కార్ అవార్డు పొందారు. న్యూ మెక్సికో లోని శాంటా ఫే (Sants Fe) నివాసంలో వారంతా చనిపోయిఉండటం పోలీసులు కనుకొన్నారు. ఈ విషయాన్నినగర్ షరీఫ్ కార్యాలయం ప్రకటించింది. ఎలా చనిపోయింది పోలీసులు చెప్పడం లేదు. అయితే, విచారణ చేస్తున్నామనిచెప్పారు. హాక్ మాన్ ‘మడ్ రూం’లో పడి ఉన్నాడు, భార్య బాత్ రూంలో పడిపోయి ఉంది. పక్కనే వాళ్ల పెంపుడు కుక్క జర్మన్ షెఫర్డ్ చనిపోయి ఉంది.

బుధవారం మధ్యాహ్నం 1:45 గంటలకు వారు మరణించినట్లు మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. 1960లో హాక్ మ‌న్ హాలివుడ్ కెరీర్ మొద‌లైంది. అయిదు సార్లు ఆస్కార్ అవార్డు నామినేట్ అయ్యారు. రెండు సార్లుగెలుచుకున్నారు. చిత్రాలతో పాటు టెలివిజన్ సిరీస్‌లలో న‌టించాడు. 1967లో వచ్చిన `బోనీ అండ్ క్లైడ్` (Bonnie and Clyd) సినిమాలో బ్యాంక్ దొంగకు సోదరుడిగా నటించాడు. ఈ అద్భుతమైన పాత్రకు ఆయన తొలి ఆస్కార్ నామినేషన్ పొందారు. 1971లో `ఐ నెవర్ సాంగ్ ఫర్ మై ఫాదర్` సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా కూడా నామినేట్ అయ్యారు. దర్శకుడు విలియం ఫ్రైడ్కిన్ థ్రిల్లర్ `ది ఫ్రెంచ్ కనెక్షన్` (The French Connection)లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల డీలర్లను వెంబడించే న్యూయార్క్ డిటెక్టివ్ పొపాయ్ డోయల్ పాత్ర స్టార్ డ‌మ్ ఆకాశాన్నంటింది. ఈ పాత్రకు ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డును ఇచ్చింది. ఆయన నటించిన కొన్ని మరచిపోలేని చిత్రాలు కొన్ని: ది ప్రెశిడెంట్ అడ్వెంచర్ (The President Adventure), మిసిసిపి బర్నింగ్ (Mississippi Burning), అన్ ఫర్ గివన్ (Unforgiven), సూపర్ మన్ (Superman), ది కాన్వర్జేషన్ (The చొన్వెర్సతిఒన్) వగైరా.

ఈ సందర్భంగా హాక్ మన్ చిత్రాల కొన్ని జ్ఞాపకాలను రామ్ సి అందిస్తున్నారు.


తెరమీద జీన్ హాక్ మాన్ ఒక అయస్కాంతమై పోతాడు...


రామ్ సి

అతన్ని మొదటిసారి నెల్లూరులో French Connection లో చూసాను, ఎదో ప్రత్యేకంగా తోచాడు. కానీ తరువాతి సినిమాల్లో అతని నటన పూర్తీ ప్రత్యేకం అని గ్రహించాను. Gene Hackman తెరపై కనిపిస్తే, ఇక ఇంకెవరూ కనపడరు; ఓ అయస్కాంతం పాత్ర. అతని నటనలో ఉన్న బలమైన మానసిక ఉనికి, ప్రతిసారీ ప్రేక్షకులను కదిలించే శక్తిని కలిగి ఉంటుంది. అతని నటనలో అంతర్లీనమైన అనిశ్చితి, ఆవేశం, భావోద్వేగాల అగ్నికీలకాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి.

Gene యొక్క కోపం సాధారణం కాదు, అది అసహనం, అణచివేత, వ్యంగ్యం, హింసను అదుపులో పెట్టుకుంటున్నట్టు నిండివుంటుంది. Mississippi Burning లో FBI ఏజెంట్ పాత్రలో, అతని మాటలు నిప్పుకణిలా ఉంటూ, నిజాయితీకి కేంద్రంగా, అతని నిశ్శబ్దం కూడా బెదిరింపులా అనిపిస్తుంది. ఒకే ఒక్క చూపుతో ఎదుటివారిని దెబ్బతీయగల ఓ వ్యక్తిగా, అతని నటన నిలుస్తుంది.

అతని క్రూరత్వం పదజాలంలో ఉండదు, ఆయన చూపులో ఉంటుంది,నడకలో ఎదో లయబద్దంగా అడుగులేస్తున్నట్టు ఉంటుంది. Unforgiven లో పోలీస్ షరీఫ్ గా, ఏకంగా మహా దిగ్గజం Clint Eastwood నే మింగేశాడంటే నమ్మాలి. బిల్ గా, అతను ఓ నియంత్రణలో ఉన్న మృగం. అతని మాటలు మృదువుగా ఉన్నప్పటికీ, అవి చీల్చివేయగల గాయం. అతను ఎదుటివాని మనసును ధ్వంసం చేయగలడు, మాటల్లో, కళ్లలో ఉన్న అహంకారం, అతని నైపుణ్యాన్ని నిరూపిస్తాయి. అతని హింస అనూహ్యంగా,ఆకస్మికంగా, ఖచ్చితంగా, భయంకరంగా ఉంటుంది.

The Quick and The Dead లో అతను విలన్ పాత్రలో మరింత భీకరంగా ఉంటూ, Sharaone Stone ను మర్చిపోయేలా చేసాడు. అసలు సినిమాకు వెళ్ళిన ఓ కారణం ఈ శృంగార తార దర్శనం కోసమే. అతను కేవలం గద్దించడు, తన మాటలతో ఎదుటివారిని గడ్డిపోచ అనిపించేలా చేస్తాడు. అతని నవ్వులో ఓ హీనత, అతని చూపులో ఏకాధిపత్య ధీమా కొట్టొచ్చ్చినట్టు కనిపిస్తాయి.

కానీ, హాక్‌మన్ నటన కేవలం ప్రతీకారం, హింసల మధ్య పరిమితం కాదు. అతను చక్కటి భావోద్వేగాలను కూడా అదే నైపుణ్యంతో ప్రదర్శించగలడు. Hoosiers లో బాస్కెట్ బాల్ కోచ్ డేల్‌గా, అతని తీవ్రత, పట్టుదల, ప్రేమ మూడింటినీ సమంగా ప్రదర్శించాడు.అతను కఠినంగా మాట్లాడినా, ప్రతి మాట వెనుక ఆశయముంటుంది. అతని కోపం ఎదుగుదల కోసం, అతని కఠినత ప్రేమతో కూడినది.

తరువాత యూటుబ్లో The Conversation లో హ్యారీ కాల్ పాత్రలో, అతను పూర్తిగా భిన్నంగా కనిపిస్తాడు. అతని శరీర భాషలో ఉన్న సంకోచం, అతని కళ్లలో ఉన్న భయం, తన బలమే తన బలహీనతగా మరి తనను తానూ అణచివేతకు గురిచేసుకోవడం చాల అరుదుగా చూసే పాత్ర. ఇవన్నీ అతను ఒక్క చూపుతోనే వ్యక్తం చేయగలడు. మౌనంలోనే అతని నటన చిగురిస్తుంది.

Gene మాటల్లో ఉండే బెదిరింపులు చాలు, పెద్దగా అరవవలసిన అవసరం ఉండదు. అతను విలన్ అయినా, హీరో అయినా, లేదా ఓ పాత్ర అయినా, ఆయన తెరపై ఉన్నంత వరకు, మన దృష్టి ఎక్కడా పడదు. అతని నటన ఒక అద్భుత కళ. అది బలాన్ని, హింసను, మృదుత్వాన్ని సమంగా మేళవిస్తుంది. అతను మాట్లాడే ప్రతి మాట, చూసే ప్రతి చూపు, చేసే ప్రతి చిన్న కదలికలో అర్థం ఉంటుంది. 2004లో ఆయన శిఖరమంత స్థాయిలో ఉన్నా, సినిమాలకు వీడ్కోలు పలికడం అరుదు. ఆయన అందించిన పాత్రలు ఎప్పటికీ మరువలేనివి నాకు.

Gene ! మీరు తెరపై చూపించిన తీవ్రతకు, శక్తికి, నటనలోని మాస్టరీకి సదా కృతజ్ఞుడిని.మీరు ప్రేక్షకుడికి సినిమా చూసినందుకు లభించిన మరపురాని అభినందన!


Read More
Next Story