The Bra: జర్మన్ కల్ట్ ఫిల్మ్  ది బ్రా రివ్యూ
x

The Bra: జర్మన్ కల్ట్ ఫిల్మ్ 'ది బ్రా' రివ్యూ

కొన్ని సినిమాలు చూసిన మరుక్షణం మర్చిపోతాం. మరికొన్ని కొద్ది రోజులు పాటు,నెలలు పాటు,సంవత్సరాలు పాటు వెంటాడుతాయి.


కొన్ని సినిమాలు చూసిన మరుక్షణం మర్చిపోతాం. మరికొన్ని కొద్ది రోజులు పాటు,నెలలు పాటు,సంవత్సరాలు పాటు వెంటాడుతాయి. అలాంటి వరల్డ్ క్లాసిక్ లలో 'ది బ్రా' The Bra ఒకటి. ముఖ్యంగా సినిమాటెక్ ఎక్సపీరియన్స్ ఇవ్వటంలో ఈ మూవీ ముందుంటుంది. టైటిల్ చూస్తే ఏదో అసభ్యకరమైన కంటెంట్ ఉందనుకుంటాం. అయితే సినిమా నీట్ గా ఎక్కడా కొద్ది గా కూడా అలాంటి ఛాయలు కనపడనీయకుండా తీసిన దర్శకుడు వెయిట్ హెల్మర్ (Veit Helmer)ని మెచ్చుకోకుండా ఉండలేం. ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై అవార్డ్ లు పొందిన ఈ సినిమా కథేంటి, అందులో గొప్పగా అనిపించిన అంశాలేంటో చూద్దాం.

కాన్సెప్టు

ట్రైన్ డ్రైవర్ నుర్లాన్ ది ఒంటిరి జీవితం. రిటైర్మెంట్ ముందు రోజు చివరి సారిగా ట్రైన్ ఎక్కుతాడు. అదో గూడ్స్ ట్రైన్. ఆ ట్రైన్ వెళ్లే దారి ఒక చోట చాలా ఇరుకుగా..జనావాశాల మధ్య నుంచి వెళ్తుంది. అంటే అటూ ఇటూ ఇళ్లు. మధ్యలో ట్రైన్ పట్టాలు. ఎంత దగ్గరగా అంటే ఆ ఇళ్లు..ట్రైన్ ని అంటుకుంటాయేమో అనే డౌట్ వస్తూంటుంది. ఆ ట్రైన్ ఆ దారిలో వెళ్లేటప్పుడు ట్రైన్ డ్రైవర్స్ చాలా అప్రమత్తగా ఉంటూంటారు. ఓ కుర్రాడు రోజు ఆ ట్రైన్ ఆ ప్రాంతానికి వచ్చేటప్పుడు విజిల్ వేసుకుంటూ వెళ్తాడు. ఆ విజిల్ విని అక్కడ పట్టాలపై కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్న జనం, రకరకాల పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్న వాళ్లు వెంటనే ఖాళీ చేసి ఆ ట్రైన్ కు దారి ఇస్తూంటారు. కొందరు అయితే అక్కడ దండాలు కట్టుకుని బట్టలు ఆరేసుకుంటూంటారు.

మన డ్రైవర్ నుర్లాన్ అవన్నీ చాలా ఆసక్తిగా గమనిస్తూంటాడు. ఒక్కోసారి ఆ దండాలపై వేసిన బట్టలు ఎగిరి వచ్చి డ్రైవర్ క్యాబిన్ లో పడుతూంటాయి. వాటిని తిరిగి అందిస్తూండటం అతనికో హాబీ లాంటి కాలక్షేపం. ఆ క్రమంలో ఓ సారి దండం మీద నుంచి ఓ బ్లూ బ్రా వచ్చి ఆ క్యాబిన్ లో పడుతుంది. దాంతో నిర్లప్తంగా ఉన్న నుర్లాన్ జీవితంలో ఓ ఉత్సాహం వస్తుంది. దాంతో అతను ఓ చిన్న ఎడ్వెంచర్ చేస్తాడు. అదే ఈ సినిమా మొత్తం. అదేమిటంటే ఆ బ్రా ఓనర్ ఎవరు అనేది పట్టుకుని వాళ్లకు ఇచ్చేయాలని.


దాంతో రిటైర్మెంట్ అయ్యిన వెంటనే ఆ పనిలో పడతాడు. ఆ ప్రాంతంలో చిన్న గది ఒకటి తీసుకుని బ్రా ఓనర్ ఎవరనే అన్వేషణ మొదలెడతాడు. చాలా డెడికేషన్ తో ఆ అన్వేషణ మొదలువుతంది. ఆ ట్రైన్ ట్రాక్ దారిలో ఉన్న ప్రతీ ఇంటి తలుపు కొట్టి ఆ బ్రా మీదేనా , మీదే అయితే వేసుకుని చూపెట్టి తీసుకోండి అంటాడు. చాలా మంది ఉత్సాహంగా ఆ బ్రా తీసుకుని వేసుకోవటం మొదలెడతారు.

వాళ్ల జీవితంలో అంత ఖరీదైన బ్రాని చూడలేదు అన్నట్లు, దాన్ని తామే సొంతం చేసుకోవాలని కొందరు ప్రవర్తిస్తారు. మరికొందరు మొహం మీదే తలుపు వేసేస్తారు. వేరొక చోట్ల వాళ్ల భర్తలకు సందేహం వస్తుంది. వీడెవడు మన ఇంట్లోకి వచ్చి ఇలాంటి వేషాలు వేస్తున్నాడని. చీవాట్లు, చెప్పు దెబ్బలు తిన్నా బ్రా కనుక్కువాలనే ప్రాజెక్టు రోజు రోజుకీ ఉత్సాహంగా మారుతుంది నుర్లాన్ కు . అయితే ఎంత కష్టపడినా దాని ఓనర్ ని కనుక్కోవటం కష్టమవుతుంది. చివరకు ఆ బ్రా అతనికి తెలియకుండా దాని యజమానికి చేరుతుంది. అదెలాగ అంటే మీరు సినిమా చూడాల్సిందే.

ఏముంది ఈ సినిమాలో

మానవ సహజమైన ప్రవృత్తి , అన్వేషణ పై మానవ జాతికి ఉన్న బలీయమైన ఆపేక్ష మనకు ఆ పాత్రలో కనిపిస్తుంది. అలాగే అన్నటికన్నా ముఖ్యం ఈ సినిమాలో డైలాగులు ఉండవు. అంటే సైలెంట్ మూవీ అన్నమాట. ఓ రకంగా ఈ సినిమా ట్రాజిక్ కామిక్ స్టోరీ. ఫన్ ఉంటుంది. మనకు బైస్కిల్ థీఫ్ సినిమాలోని వెతుకులాట కనిపిస్తుంది. డైరక్టర్ ఎక్కడా అసభ్యత లేకుండా నడిపించిన తీరు ముచ్చటేస్తుంది. అందుకేనేమో ఈ దర్శకుడు ఇప్పటిదాకా తన సినిమాలకు 180 అవార్డ్ లు దాకా సాధించాడు. ట్రైన్ వెళ్లే దారి, లొకేషన్స్ విజువల్ గా స్టన్నింగ్ గా ఉంటాయి. దాదాపు గంటన్నర ఉండే ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఓ మనిషి తన ఒంటిరితనం పోగొట్టుకోవటానికి చేసే ప్రయత్నం చాలా సార్లు ఎంతమందిలో ఉన్నా మనం ఒంటిరిగా ఉండే విషయాలని గుర్తు చేస్తుంది.

చూడచ్చా

సినిమా ప్రియులు ఖచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా

ఎక్కడ చూడచ్చు

MUBI వంటి అనేక ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లో ఉంది. ఫ్రీ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల మీద కూడా చూసే అవకాసం ఉంది. ఓపికుంటే టోరెంట్స్ ట్రై చేసి చూడచ్చు.

Read More
Next Story