The Goatlife  ఆడు జీవితం: మూవీ రివ్యూ
x

The Goatlife ఆడు జీవితం: మూవీ రివ్యూ

కమల్ కు నచ్చిన,మణిరత్నం మెచ్చిన సినిమా. 2018లో సినిమా షూటింగ్ మొదలుపెట్టి 2022లో పూర్తి చేసి 2024 లో విడుదల చేసిన సినిమా ఇది. విశేషాలేమిటో చదవండి


“ఇంటర్వెల్లో మనకు నీళ్లు ఎక్కువ తాగాలనిపిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ గొప్పగా నటించాడు. ముఖ్యంగా ఒకచోట నగ్నంగా నటించడం చాలా కష్టం. ఇది తీసిన కెమెరామెన్ సునీల్ కు కూడా ఇది కష్టమే. సినిమా వాళ్లు గా మేము ఈ కష్టాన్ని అర్థం చేసుకోగలం. ప్రేక్షకులు కూడా అర్థం చేసుకొని సినిమాను సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా ను." ప్రముఖ నటుడు కమలహాసన్ ఈ సినిమా గురించి తన వీడియోలో చెప్పిన సంగతులు ఇవి.

అలాగే ప్రముఖ దర్శకుడు మణిరత్నం కూడా తన వీడియో సందేశంలో" అద్భుతం. ముఖ్యంగా విజువల్స్ గొప్పగా ఉన్నాయి. ఈ సినిమా టీం ఇది ఎలా తీసిందో అర్థం కావడం లేదు. చాలా కష్టమైన పని. వారికి నా అభినందనలు" అని చెప్పి ఈ సినిమా మీద ప్రేక్షకుల అంచనాలు పెంచారు. సినిమా చూసిన తర్వాత ఆ ఇద్దరు ప్రముఖులు చెప్పిన మాటలు అతిశయోక్తి కాదని ప్రేక్షకుల కు అర్థం అవుతుంది.

లేటుగా తీసినా ... లేటెస్ట్ గా తీశారు

2008లో వచ్చిన " ఆడు జీవితం" అనే బెస్ట్ సెల్లర్ నవల మీద ఆధారపడి తీసిన సినిమా ఇది. బెన్యామిన్ రాసిన ఈ నవల చదివి, సుకుమారన్ హీరోగా సినిమా తీయాలని ప్రముఖ దర్శకుడు బ్లేస్సిఅనుకున్నప్పటికీ మార్పులు చేర్పుల సమస్యలు, చర్చలు వల్ల ఒక దశాబ్దం తర్వాత 2018లో సినిమా షూటింగ్ మొదలుపెట్టి 2022లో పూర్తి చేసి 2024 లో విడుదల చేసిన సినిమా ఇది. . సినిమాలో నజీబ్ కష్టాల లాగే సినిమాకు కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి. చివరకు అవి పరిష్కరించుకొని సినిమా విడుదల అయింది. ఇదొక సర్వైవల్ డ్రామా. బతకడం కోసం చేసిన ప్రయత్నంపై ఇది కుడా ఒక క్లాసిక్ అనొచ్చు. సుకు మారన్ చెప్పినట్టుగానే సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కూడా నజీబ్ పాత్రతో కనెక్ట్ అవుతారు, ఎడారిలో ఉన్నట్లే ఫీల్ అవుతారు. అది సినిమా యొక్క ప్రత్యేకత! ఇంత కు ముందే కమల్ హాసన్ చెప్పినట్లు ప్రేక్షకులు నీళ్లు తాగడం కోసం బయటికి వెళ్లి తీరుతారు.

సినిమా కథ ఏమిటంటే నజీబ్(పృథ్వీరాజ్ సుకుమారన్) అనే ఒక వ్యక్తి భార్య సైను (అమలా పాల్), తల్లి కోసం డబ్బులు సంపాదించడానికి దుబాయ్ కి వెళ్తాడు. అయితే అక్కడ జరిగిన తారుమారు వల్ల దుబాయ్ లోని మారుమూల ఎడారి ప్రాంతంలో బలవంతంగా గొర్రెల కాపరిగా బంది అయిపోతాడు. ఎటు వెళ్లడానికి వీల్లేని పరిస్థితి, తెలియని భాష. అక్కడ అష్ట కష్టాలు పడతాడు. చివరికి ఇబ్రహీం(జిమ్మీ జీన్-లూయిస్) అనే వ్యక్తి ద్వారా బయటి ప్రపంచంలోకి వస్తాడు. కొద్దికాలం జైల్లో ఉన్న తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు. సినిమా మొత్తం నజీబ్ పడే కష్టాల సమాహారం.
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతిభ

కొద్దిగా నిడివి(172 నిమిషాలు) ఎక్కువైనప్పటికీ కుదురుగా కూర్చొని సినిమా చూసేటట్లు చేయడానికి గల కారణాల్లో మొదటిది పృథ్వీరాజ్ సుకుమారన్ నటన. సుకుమారన్ ఉన్నత స్థాయి నటన ప్రదర్శించాడు. చాలా సన్నివేశాల్లో కంటతడి పెట్టిస్తాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. బరువు బాగా తగ్గాడు. కొన్ని సందర్భాల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటన, ఇంగ్లీష్ సినిమాలు బాగా చూసే గత తరం ప్రేక్షకులకి, గతంలో దాదాపు ఇదే కథ లాంటి కథతో స్టీవ్ మేక్వీన్ ప్రధాన పాత్రలో తీసిన హాలీవుడ్ సినిమా " పాపిలాన్"(1973) గుర్తుకొస్తుంది. పాపిలాన్ సినిమాలో ఒక వ్యక్తి ఆశతో, ధైర్యంతో, పట్టువదలకుండా 17 సార్లు ప్రయత్నం చేసి చివరకు పటిష్టమైన జైలు నుంచి తప్పించుకొని పోవడం కథాంశం.

కష్టానికి తగిన ఫలితం

ఇక రెండో కారణం ఇంతకుముందు దర్శకుడు మణిరత్నం చెప్పినట్లు విజువల్స్ చిత్రీకరణ. అద్భుతంగా ఉన్నాయి. అందుకు కారణం సునీల్ ఫోటోగ్రఫీ . విజువల్ ఎఫెక్ట్స్ వాడినప్పటికీ ఎడారిలో ఎక్కువ భాగం నేచురల్ లొకేషన్స్ లోనే తీశారు . ఈ సినిమా కరోనా కారణంగా యూనిట్ మొత్తం మూడు నెలల పాటు ఎడారి ప్రాంతంలోనే ఉండిపోయారు. చివరికి కేరళ ముఖ్యమంత్రి తో సహా ఎంతోమంది సహకారంతో సినిమా తీయగలిగారు. సినిమా తీయడానికి నాలుగు సంవత్సరాలు పట్టినప్పటికీ సినిమా బిగువు ఎక్కడ చెడిపోలేదు. కంటిన్యూటీ కూడా పోలేదు. అదే ఈ సినిమాకి బలం.

మ్యాజిక్ చేసిన మ్యూజిక్

ఈ సినిమా బాగుండడానికి మరో కారణం ఏ ఆర్ రెహమాన్ సంగీతం. ఉన్న ఒకటి, రెండు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం, ఫోటోగ్రఫీతో కలిసి సినిమా తెరమీద ఒక అందమైన క్లాసిక్ వర్ణ చిత్రాన్ని ఆవిష్కరింప చేశాయి. ఇసుక తుఫాను సన్ని వేషాలు, ఎడారిలో సాయం సంధ్యలు చిత్రీకరించిన విధానం హాలీవుడ్ స్థాయిలో ఉంది.
పట్టుదలను ప్రతిబింబించే సినిమాను ప్రతిభావంతంగా తీసిన బ్లెస్సీ
ప్రశంసించదగ్గ స్థాయిలో దర్శకత్వ ప్రతిభను చక్కగా చూపించాడు. ఈ కాలం యువతకు కూడా అంతో ఇంతో నచ్చే సినిమా ఇది.

ఒక వ్యక్తిత్వ వికాస సబ్జెక్టు. పట్టుదల, పాజిటివ్ థింకింగ్, తన మీద తనకు నమ్మకం ఉంటే ఎవరైనా సరే తమ లక్ష్యాన్ని సాధించగలరు అన్న విషయాన్ని వెండితెర కాన్వాస్ పై అందంగా చిత్రీకరించిన ఒక పెయింటింగ్ " ఆడు జీవితం". కమల హాసన్ చెప్పినట్లు ఈ సినిమా ను ఎవరైనా సరే చూడొచ్చు.

నటీనటులు:

పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్, జిమ్మీ జీన్-లూయిస్, గోకుల్,
తాలిబ్ అల్ బలూషి మరియు రిక్ అబీ తదితరులు
:టెక్నికల్ టీం:
దర్శకుడు: బ్లెస్సీ
సంగీత దర్శకుడు: ఏ ఆర్ రెహమాన్
సౌండ్ డిజైనర్ : రసూల్ పూకుట్టి
సినిమాటోగ్రాఫర్‌: సునీల్ కె.ఎస్‌
ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్-లూయిస్, స్టీవెన్ ఆడమ్స్
విడుదల తేదీ : మార్చి 28, 2024


Read More
Next Story