గురక పెట్టింది:  డియర్ (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
x

గురక పెట్టింది: 'డియర్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

కొత్త కాన్సెప్టులతో సినిమాలు రావటం అవసరమే. అయితే అవి చూడగలిగేలా ఉండాలి. ఓటిటిలు పెరిగాక నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలతో కూడా..

కొత్త కాన్సెప్టులతో సినిమాలు రావటం అవసరమే. అయితే అవి చూడగలిగేలా ఉండాలి. ఓటిటిలు పెరిగాక నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలతో కూడా చక్కటి చిన్న సినిమాలు వస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే బాగుంటున్నాయి. మిగతావి స్టోరీ ఐడియా లెవిల్లో బాగుంటున్నాయి . కానీ సినిమాగా చీదేస్తున్నాయి. అలాంటివాటికి ఉదాహరణ రీసెంట్‌గా వచ్చిన డియర్ సినిమా. చిన్నపాటి శబ్దానికి నిద్రలేచిపోయే భర్త .. భారీగా గురక పెట్టే భార్య .. ఈ ఇద్దరి చుట్టూ తిరిగే కథనే ఈ సినిమా.

ఐశ్వర్య రాజేశ్, జీవీ ప్రకాశ్ కుమార్ జోడీగా ఆమె నటించిన ఈ సినిమా, క్రింద నెల 11వ తేదీన విడుదలైంది. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో కేవలం 16 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేసారు.తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. మలయాళ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్' లో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? కథేంటి

ఎప్పటికైనా పెద్ద న్యూస్ రీడర్ అవ్వాలనే జీవితాశయం అర్జున్‌(జీవీ ప్రకాశ్‌ కుమార్‌)ది. ఆ ప్రయత్నాల్లో ఉండగానే ఇంట్లో వాళ్లు అతనికి ఓ సంబంధం చూసి ఫిక్స్ చేస్తారు. అతనికి ఓ సమస్య ఉంటుంది. ఎంత గాఢ నిద్రలో ఉన్నప్పటికీ, చిన్నపాటి శబ్దానికి కూడా వెంటనే మెలకువ వచ్చేయడం అతనికి ఉన్న సమస్య. దానిని ఎలా అధిగమించాలో తెలియక ఇబ్బంది పడుతూంటాడు.

ఇక అతను పెళ్లి చూపులకు వెళ్లిన అమ్మాయి దీపిక(ఐశ్వర్య రాజేష్‌). మొదటి వద్దనుకున్నా ఆమె తెగ నచ్చేయటంతో పెళ్లికి ఓకే చెప్పేస్తాడు. అయితే దీపికకి ఒక సమస్య ఉంటుంది. నిద్రలో ఆమె గురకపెడుతుంది. అదీ అలా ఇలా కాదు కాస్తంత భారీగానే. పెళ్లి అయిన తన గురక వల్ల ఏ సమస్యలూ రాకూడదని పెళ్లి చూపుల్లోనే ఆమె అబ్బయిలకు ఆ విషయం చెబుతూ ఉంటుంది .. దాంతో ఏ సంబంధం ఓకే కాదు. అలాంటి సమయంలోనే అర్జున్‌తో పెళ్లి చూపులు జరుగుతాయి. కానీ తల్లి మందలించడం వలన, తన సమస్యను అర్జున్ దగ్గర ఆమె చెప్పదు.. దాచేస్తుంది. అర్జున్ కూడా తన సమస్య గురించి ఆమెతో ప్రస్తావించడు. ఇలా భిన్న ధృవాలైన వీళ్లిద్దరికీ పెళ్లి అవుతుంది. అక్కడ నుంచి అసలు సమస్య మొదలవుతుంది.

మొదటిరాత్రే అర్జున్ తన సమస్య చిన్న శబ్దానికే మెలుకవ రావడం గురించి ఆమెకు చెప్తాడు. దాంతో తన గురక విషయం చెప్పడానికి దీపిక భయపడి రాత్రంతా నిద్రపోకూడదనుకుంటుంది. కానీ ఆమె వల్ల కాదు.అలా ఫస్ట్ నైట్ రోజునే పెంట పెంట అయ్యిపోతుంది. ఆమె గురక చూసి అర్జున్ భయపడిపోతాడు. అక్కడ నుంచి వేరే దారి లేక ఇద్దరూ ఓ అగ్రిమెంట్ కు వస్తారు. ఒకరోజు ఒకరు నిద్రపోతే .. మరొకరు మెలకువతో ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. అదీ సవ్యంగా సాగదు.

నిద్రలేమి వలన అర్జున్ తన ఆఫీసులో ఉద్యోగాన్ని కోల్పోతాడు. అవమానం పొందుతాడు. దాంతో దీనికి కారణం ఆమె గురకే అని అర్జున్ తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. దీపిక నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు.ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే మిగతా కథ.

ఏదైమైనా ఇది సినిమాకు సరిపోయే కంటెంట్ అయితే కాదు. ఓ షార్ట్ ఫిలిం కు సరిపడే ఐడియా అని సినిమా ప్రారంభమైన కాసేపటికే అర్థమవుతుంది. చిన్న స్టోరీ లైన్ ని అదీ పెద్దగా మెలికలు లేకుండా స్క్రిప్ట్ రాయటంతో ఎంటర్ట్నైంట్ పాళ్లు తగ్గిపోయాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్‌లో ఫ్యామిలీ డ్రామా డోస్ ఎక్కువైపోయి మనం సినిమా చూస్తూ నిద్రపోతూ గురకలు పెడతాం. ఇలాంటి సినిమాలకు ఐడియా ఎంత గొప్పదో ట్రీట్మెంట్ అంతే గొప్పగా కుదరాలి. అప్పడే వర్కవుట్ అవుతాయి.

ఇక అర్జున్ తల్లిగా చేసిన రోహిణి, ఆమె అన్న కాళీ వెంకట్ ఎపిసోడ్స్ బాగున్నా అవేమీ ఈ గురక చుట్టూ తిరిగే మెయిన్ ప్లాట్ కి అతకవు. హీరోగారే ట్యూన్ కట్టుకున్న పాటలు బాగోలేవు. జగదీశ్ ఫొటోగ్రఫీ .. ముకేశ్ ఎడిటింగ్ మిగతా డిపార్టమెంట్స్ ఓ మాదిరిగా అనిపిస్తాయి ఐశ్వర్య రాజేశ్ మంచి ఆర్టిస్ట్ కూడా ఈ కథని నిలబెట్టలేకపోయి చేతులెత్తేసింది.

చూడచ్చా

నిద్ర రానప్పుడు ...ఆవలింతలు రప్పించటానికి ఈ సినిమా సహకరిస్తుంది

ఎక్కడుంది

నెట్ ప్లిక్స్ లో (తెలుగులో)

Read More
Next Story