సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌ కాల్వన్ OTT మూవీ రివ్యూ
x

సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌ 'కాల్వన్' OTT మూవీ రివ్యూ

స్టార్ డైరెక్టర్ నటుడిగా మారి చేసిన సినిమా ‘కాల్వన్’. థియేటర్లో విడుదలైన నెలలోనే ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసా..


ఒకప్పటి తమిళ స్టార్ డైరక్టర్ భారతీరాజా నటుడుగా మారి ఓ సినిమాలో దాదాపు ఫుల్ లెంగ్త్ రోల్ చేసారంటే jచ్చితంగా అందులో ఏదో విషయం ఉందనే భావిస్తాము. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండానే ఆ మూవీని చూడాలనుకుంటాము. అలా ఆయన నటించిన సినిమా ఒకటి ఓటిటిలోకి వచ్చింది. ఆ సినిమా ఏమిటి అంటారా జీవి ప్రకాష్ హీరోగా చేసిన తాజా చిత్రం 'కాల్వన్' . ఏప్రియల్‌లో థియేటర్‌లో రిలీజైన ఈ సినిమా నెలలోగా ఓటిటిలోకి వచ్చేసింది. ఇదో సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌. కొంత కామెడీ కూడా ఉంది. ఈ సినిమాలో జీవి ప్రకాష్‌కు జోడిగా లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్‌గా నటించింది. సీనియర్ డైరెక్టర్ భారతీరాజా సినిమాలో కీలక పాత్ర పోషించాడు.

కథేమిటంటే..

సత్యమంగళం ఫారెస్ట్‌కు ఆనుకుని ఓ గ్రామం. అంత పెద్ద అడవి పక్కనే ఉందంటే ఆ పల్లె పరిస్థితి ఎలా ఉంటుంది. ఏనుగులు, పులులు ఇలాంటి జంతువులు అప్పుడప్పుడూ ఊళ్లోకి వచ్చేస్తూంటాయి. ఒక్కోసారి ఆ జంతువుల బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటారు. ఇక మన హీరో కెంపరాజ్ (జీవీ ప్రకాశ్ కుమార్) తన ఫ్రెండ్ సూరి (దీనా)తో కలిసి దొంగతనాలు చేస్తూ జీవిస్తూంటాడు. అలాగే పనిలోపనిగా నర్సింగ్ చదువుతూ ఉన్న ఆ ఊరి అమ్మాయి బాలమణి (ఇవాన) వెనకపడుతూంటాడు.

అయితే ఇలా తాడు బొంగరం లేకుండా కేవలం దొంగతనాలు వృత్తిగా బ్రతికే వారికి పిల్లను ఎవరు ఇవ్వరని కెంపరాజ్‌కు స్పష్టంగా తెలుసు. ఉద్యోగం కోసం ట్రై చేస్తే రెండు లక్షలు లంచం అడుగుతారు. ఇటు ప్రేమ, అటు ఉద్యోగం సాధించటానికి ఓ స్కెచ్ వేస్తాడు. అక్కడ ఆ ప్రాంతంలో ఏనుగు దాడిలో చనిపోయిన వారికి ప్రభుత్వం రూ.4 లక్షలు సాయం ఇస్తూంటుంది. అవి సంపాదించి తన అవసరాలు తీర్చుకోవాలనకుంటాడు. అయితే కెంపరాజ్‌కు ముందూ వెనక ఎవరూ లేరు. కానీ తన వాళ్లు ఎవరైనా మరణిస్తినే ఆ పరిహారం డబ్బులు తనకు వస్తాయి. ఏం చేయాలి.

అలా ఆలోచనలో ఉండగా ఓ రోజు వేరే ఊరిలో వృద్ధుల శరణాలయంకు పెయింట్స్ వేసే వర్క్ వస్తే వెళ్తారు. అక్కడ వారికి ఓ ముసలాయన (భారతీరాజా) తారసపడతాడు. ఆ పెద్దాయన తమ లాగే అనాధ అని, వెనకా ముందూ ఎవరూ లేరని తెలిసి వివరాలు లాగుతాడు. అక్కడ వాళ్లని పట్టుకుని పెద్దాయనని ఒప్పించి ఆయనను తాతయ్యగా దత్తత చేసుకుని, తన ఇంటికి తీసుకుని వెళతాడు. పెద్దాయన తెగ సంతోషపడతాడు. కానీ కెంపరాజ్ అసలు ఆలోచన ఏమిటంటే.. ఆ పెద్దాయనని ఏనుగుకు ఎరగా వేస్తే చచ్చి ఊరుకుంటాడు. ప్రమాదంలో చనిపోయాడని నాలుగు లక్షలు తనకు ఇస్తారు. లైఫ్ సెటిల్ అయ్యిపోతుందని. ఈ విషయాలు తెలియని ఆ పెద్దాయన వాళ్లతో పాటే వస్తాడు.

కెంపరాజ్ పూరి గుడిసెలో ఉండటానికి ఇబ్బంది అయినా ముసలాయన సర్దుకుంటాడు. అక్కడ నుంచి కెంపరాజ్ ఆయన్ని ఏనుగుకు బలి వేయటానికి ప్రయత్నాలు మొదలెడతాడు. ఏనుగులు సంచరించే ప్రదేశాలకు ఈ పెద్దాయన్ని ఏదో వంకతో తీసుకు వెళ్తూంటాడు. ఈ క్రమంలో ఆ పెద్దాయన గురించి ఓ కొత్త విషయం రివీల్ అవుతుంది. అది ఏమిటి...కెంపరాజ్ ఆ పెద్దాయనని చంపి డబ్బులు తెచ్చుకోగలిగాడా... పెద్దాయనకు అసలు విషయం తెలిసిందా...చివరకు ఏమైంది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఛాయాగ్రాహకుడుగా మంచి పేరున్న పీవీ శంకర్ తయారు చేసుకున్న కథ ఇది. ఫస్టాఫ్ మొత్తం లవ్ స్టోరీ, ఏనుగు దాడి .. ఇలా రకరకాల విషయాలపై నడుపుకుంటూ వెళ్లిపోయాడు. ఇంటర్వెల్‌కు కానీ కథలోకి రాలేదు. అంటే ఇంటర్వెల్‌కు మాత్రమే భారతీరాజాని దత్తతు తీసుకుని ఇంటికి తీసుకు వస్తారు. దాంతో కథ కదలినట్లు అనిపించదు. ఇంట్రస్టింగ్‌గా ఉండదు. అక్కడ దాకా అసలు ఏమీ జరిగినట్లు అనిపించదు.

అయితే భారతీరాజా వచ్చాక కథ పరుగెత్తింది. కానీ అనుకున్న స్థాయిలో సినిమాలో ఎమోషన్స్ బాలెన్స్ చేయలేక, డ్రామాని పండించలేకపోయారు. కానీ డైరక్టర్.. కెమెరామెన్ ఒకరే కావటంతో విజువల్స్ అదరకొట్టారు. ముఖ్యంగా అడవిని చాలా బాగా చూపించారు. పచ్చగా ఆ సీన్స్ తెరంతా పరుచుకుని భలే ఉందే అనిపిస్తుంది. ఇక మిగతా డిపార్టమెంట్స్ సోసోగా ఉన్నాయి. జివీ ప్రకాష్ నటుడుగా కొత్తగా చేసిందేమీ లేదు. ఇవానానికి పెద్దగా సీన్స్ లేవు. భారతీరాజా మాత్రం ఆయనలోని నటుడుని ఆవిష్కరించి ఉన్నంతసేపు తనవైపు దృష్టిని తిప్పుకున్నారు. లొకేషన్స్ చాలా బాగున్నాయి. కామెడీ కూడా కొంత బాగానే పండింది. ఓవరాల్‌గా చల్తాహై.

చూడచ్చా

ఫ్యామిలీతో కలిసి చూడచ్చు. అలాగే భారతీరాజా నటన కోసం చూడచ్చు. మరీ తీసిపారేసే సినిమా కాదు.

ఎక్కడుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read More
Next Story