
జీవీ ప్రకాష్ 'హ్యాపీ రాజ్' మూవీ రివ్యూ
టైటిల్ హ్యాపీ.. సినిమా మాత్రం సారీ
రాజ్ అలియాస్ హ్యాపీరాజ్ (జీవీ ప్రకాష్) సుందరపల్లి అనే పల్లెటూరుకు చెందిన మిడిల్ క్లాస్ కుర్రాడు. అతని తండ్రి ముత్తు (జార్జ్ మరియన్) ఒక స్కూల్ టీచర్. అయితే, ముత్తు శారీరకంగా చాలా పొట్టిగా ఉండటంతో ఊరి వారందరూ ఆయన్ని 'గుర్రం గుడ్డు' అంటూ వెటకారం చేస్తుంటారు. తండ్రిని అందరూ అలా హేళన చేయడం, ఆ ప్రభావం తనపై పడటం హ్యాపీకి అస్సలు నచ్చదు. తన తండ్రి రూపం వల్ల ఇప్పటికే కొన్ని పెళ్లి సంబంధాలు కూడా క్యాన్సిల్ అవ్వడంతో, హ్యాపీలో తండ్రి పట్ల తెలియని అసహనం మొదలవుతుంది. తన తండ్రి నీడ పడకూడదని, తనెవరో తెలియని ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకుని బెంగళూరులో ఐటీ జాబ్‌లో చేరుతాడు.
ఇక సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీమ్ మేనేజర్‌గా పనిచేసే కావ్య (శ్రీ గౌరీ ప్రియ)ను చూసి హ్యాపీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ఇష్టపడతాడు. హ్యాపీలోని టాలెంట్‌ను గుర్తించిన కావ్య, అతన్ని ప్రోత్సహిస్తూంటుంది. కాలక్రమంలో రీళ్లు గడిచేకొద్దీ వీరిద్దరూ ప్రేమలో పడతారు. ఇక కావ్య తండ్రి రాజేష్ (అబ్బాస్) చాలా డబ్బున్నవాడు, పైగా ప్రతి విషయంలోనూ పక్కాగా ఉండే వ్యక్తి. హ్యాపీ పద్ధతి నచ్చడంతో రాజేష్ కూడా అతన్ని తన అల్లుడిగా చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అయితే, తన తండ్రిని చూస్తే వీళ్లు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని హ్యాపీ లోలోపల భయపడుతూనే ఉంటాడు.
ట్విస్ట్ ఏంటంటే.. కావ్య పేరెంట్స్ మ్యారేజ్ యానివర్సరీ పార్టీకి హ్యాపీ తండ్రి ముత్తును, కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తారు. హ్యాపీ కేవలం తన తండ్రిని మాత్రమే రమ్మని చెబితే, ముత్తు మాత్రం అత్యుత్సాహంతో బంధువులందరినీ వేసుకుని బెంగళూరులో ల్యాండ్ అవుతాడు. ఆ రిచ్ పార్టీలో ఈ పల్లెటూరి బ్యాచ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముత్తు రూపం, వారి ప్రవర్తన చూసి కావ్య తండ్రి రాజేష్ తీవ్రంగా అవమానిస్తాడు. ఆ అవమానం భరించలేక హ్యాపీ నాన్న తన అసలు స్వరూపం ఏంటో చూపిస్తాడు.
అసలు ముత్తుకు ఉన్న ప్రాబ్లం ఏంటి? ఆయన్ని అందరూ 'గుర్రం గుడ్డు' అని ఎందుకు పిలుస్తారు? తమకు జరిగిన అవమానానికి ఆ తండ్రీకొడుకులు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు? పరువు పోయిందని రగిలిపోతున్న కావ్య తండ్రి రాజేష్ ఏం చేశాడు? విభిన్న నేపథ్యాలు కలిగిన రాజ్, కావ్య చివరకు పెళ్లి పీటలు ఎక్కారా లేదా? అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
ఈ సినిమా మెయిన్ కాంప్లిక్ట్ 'రూపం vs గుణం'. తండ్రి శారీరక ఆకృతి వల్ల కొడుకు పడే అవమానం, ఆ తర్వాత తండ్రి చేసే త్యాగం బయటపడటం అనే పాయింట్ చాలా బాగుంది. అయితే, ఈ కాన్ఫ్లిక్ట్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు తీసుకున్న సమయం ఎక్కువైపోయింది.
ఇక సినిమా మొదలవ్వడమే హీరో లవ్ ఫెయిల్యూర్ సీన్‌తో స్టార్ట్ అవుతుంది. దానికి తండ్రే కారణమని చూపించడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు. తండ్రిని అందరూ ఎందుకు వెటకారం చేస్తున్నారో చూపించే సీన్లు ఫన్నీగా ఉండాల్సింది పోయి, విసుగు తెప్పిస్తాయి. ఇక హీరో బెంగళూరు వెళ్లడం, హీరోయిన్‌ను చూడగానే పడిపోవడం, ఆమె కూడా ఇతని టాలెంట్ చూసి లవ్ లో పడటం అంతా మెరుపు వేగంతో జరిగిపోతాయి. ఇంటర్వెల్ వరకు అసలు కథే మొదలవ్వదు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో వచ్చే బిజీఎం (BGM) ఫన్ క్రియేట్ చేయాల్సింది పోయి, ఆడియన్స్‌కు ఇరిటేషన్ తెప్పిస్తుంది.
సెకండాఫ్ మొత్తం హీరోయిన్ తండ్రికి, హీరో తండ్రి 'సారీ' చెప్పడం చుట్టూనే తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే డ్రామా చాలా ఓవర్‌గా అనిపిస్తుంది. కామెడీ కోసం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. అసలు ఈ సినిమాకు ‘హ్యాపీ రాజ్’ కంటే ‘సారీ రాజ్’ అనే టైటిల్ పెడితే బాగుండేదేమో అనిపిస్తుంది. ప్రీ-క్లైమాక్స్ వరకు కథలో ఎలాంటి చలనం ఉండదు. స్క్రీన్ ప్లే లోపల వల్ల ప్రేక్షకుడు ఎప్పుడు సినిమా అయిపోతుందా అని ఎదురుచూసే పరిస్థితి వస్తుంది.
సిట్యుయేషనల్ కామెడీ పండించాల్సిన చోట, ఫోర్స్డ్ హ్యూమర్ (బలవంతపు హాస్యం) వాడటం స్క్రిప్ట్‌కు పెద్ద దెబ్బ. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే సీన్స్, ఇరిటేషన్ తెప్పిస్తాయి. అలాగే స్క్రిప్ట్ డిమాండ్ చేయని చోట కూడా సౌండ్ ఎఫెక్ట్స్‌తో నవ్వించాలనుకునే దర్శకుడు తిప్పలని చూస్తే మనకు నవ్వు వస్తుంది.
సినిమాకు ఏకైక హైలైట్ అంటే అది క్లైమాక్స్ మాత్రమే. హీరో తండ్రి ముత్తు వెనుక ఉన్న బ్యాక్ స్టోరీ, ఆయన గొప్పతనం చెప్పే సీన్లు గుండెను బరువెక్కిస్తాయి. ఆ స్టోరీని హీరోయిన్ తండ్రికి లింక్ చేస్తూ ఇచ్చిన ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. మొన్నామధ్య వచ్చిన ‘ఆయ్’ సినిమాలోని వినోద్ కుమార్-మైమ్ గోపి ట్రాక్ గుర్తొచ్చినా, ఎమోషనల్ గా ఇది వర్కౌట్ అయ్యింది. ఈ ఒక్క సీన్ వల్ల జార్జ్ మరియన్ ఈ సినిమాకు అసలైన హీరో అనిపిస్తుంది. కానీ, ఆ పది నిమిషాల ఎమోషన్ కోసం రెండు గంటల సోదిని భరించడం సామాన్య ప్రేక్షకుడికి కష్టమే.
ఎవరెలా చేశారంటే?
జి.వి. ప్రకాష్ తన పాత్రకు న్యాయం చేసినా, అబ్బాస్ నటన రొటీన్ గా ఉంది. కానీ జార్జ్ మరియన్ మాత్రం క్లైమాక్స్ లో అదరగొట్టేశాడు. శ్రీ గౌరి ప్రియ తన నటనతో, అందంతో ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత ‘ప్రేమదేశం’ అబ్బాస్ ఈ సినిమాలో కనిపించడం ఇంట్రస్టింగ్ విషయం.
టెక్నికల్ గా..
దర్శకుడు మరియా రాజ్ పట్టుకున్న పాయింట్ మంచిదే అయినా, దాన్ని ఆసక్తికరంగా మలచడంలో విఫలమయ్యాడు. లాజిక్ పట్టించుకోకుండా, కేవలం ఎమోషన్స్ కావాలనుకునే వారికి ఈ సినిమా కొంతవరకు నచ్చవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగా స్లోగా సాగుతుంది. కామెడీ సీన్లు పండిన ధాకలాలు తక్కువ. స్క్రీన్ ప్లే కూడా బోర్ కొట్టించటానికి తన వంతు సాయిం చేసింది. పాటలు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాయి. మదన్ క్రిస్టోఫర్ సినిమాటోగ్రఫీ చెప్పుకోదగ్గ స్దాయిలో ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.మిగతా టెక్నికల్ విభాగాలు సోసోగా ఉన్నాయి.
ఫైనల్ థాట్
దర్శకుడు ఒక అద్భుతమైన క్లైమాక్స్ రాసుకుని, దాన్ని ఎలాగైనా సినిమాగా మార్చాలనే ఉద్దేశంతో మిగతా 90 నిమిషాలను నింపేసినట్లు అనిపిస్తుంది. సరైన Sub-plots , బలమైన Mid-point conversion లేకపోవడం వల్ల ‘హ్యాపీ రాజ్’ కేవలం ‘క్లైమాక్స్ బాగున్న సినిమా’గా మిగిలిపోయింది. ఫైనల్ గా క్లైమాక్స్ అదిరింది.. కానీ కథనం నగిలింది!

