హయ్, నాన్న :  మూవీ రివ్యూ
x
హాయ్ నాన్న మూవీ (సోర్స్ X)

'హయ్, నాన్న' : మూవీ రివ్యూ

కథ పాతదే, కానీ కథనం కొంచెం కొత్తది. అందులో సినిమాకు అత్యంత బలమైన ట్విస్ట్ ఒకటి ఉంది! అదేంటంటే...


(సలీమ్ బాషా)

ఒకప్పటి మణిరత్నం "గీతాంజలి", చిరంజీవి "డాడీ" సహా(ఇది కొంచెం హాయ్ నాన్న కు దగ్గరగా ఉంటుంది)."తండ్రి కూతురు-అనుబంధం" నేపథ్యంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కూతురుకు సమస్య ఉండడం అన్న అంశంతో కొన్ని సినిమాలు వచ్చాయి. "హాయ్ నాన్న" సినిమా కూడా అలాంటిదే.

ఇదొక రొమాంటిక్ డ్రామా. దాదాపు అన్ని నాని సినిమాల లాగే ఎంటర్టైనింగ్, ఫ్యామిలీ, ఫీల్ గుడ్ మూవీ. దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే. ఈ సినిమా చూడొచ్చు. బిర్యానీలు, మటన్లు, ఫిష్ చికెన్లు, పాస్తాలు, విపరీతంగా తిన్న తర్వాత.. వేడి వేడి అన్నం, నెయ్యి, ఆవకాయ కలిపిన ముద్ద ఎలా ఉంటుందో ఈ సినిమా అలాగే ఉంటుంది.

ఈ సినిమాకి అది వర్తిస్తుంది. అక్కడక్కడ కొంచెం రొటీన్ గా, ఇంతకుముందు సినిమాల్లో చూసిన కొన్ని సన్నివేశాలు, సరిగ్గా సింక్ కాని సన్నివేశాలు, కొన్ని అనవసర సన్నివేశాలు ఈ సినిమా క్వాలిటీని కొంతవరకు తగ్గించినప్పటికీ ఈ సినిమాని ఆసాంతం కాకపోయినా కొంతలో కొంత ఎంజాయ్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని యాక్షన్, సస్పెన్స్, పీరియాడికల్ థ్రిల్లర్స్ తో పోలిస్తే మాత్రం ఇది ఒక ఆహ్లాదకరమైన, కుటుంబం తో సహా చూడదగిన సినిమాగా తేల్చి చెప్పొచ్చు. ఈ సినిమా గురించి ఇంకొంచెం ప్రశంసించాలంటే, యువతకు బాగా నచ్చి, మిగతా వాళ్ళకి పర్వాలేదు అనిపించే సినిమాగా ఇది నిలుస్తుంది.

కథ పాతదే, కానీ కథనం కొంచెం కొత్తది.కొంచెం సస్పెన్స్ అని చెప్పలేము కానీ, ఓ రెండు మూడు ట్విస్టులు కథలో కొంత ఆసక్తిని పెంచాయి. అందులో సినిమాకు అత్యంత బలమైన ట్విస్ట్ ఒకటి ఉంది!

కథ గురించి చెప్పాలంటే.. ఫోటోగ్రాఫర్ విరాజ్(నాని) సింగిల్ పేరెంట్. కూతురు "మహి" (బేబీ కియారా ఖన్నా. బాగానే నటించింది). తండ్రి జయరాం(!) తో కలిసి ఉంటాడు. విరాజ్ కి ఒక గతం ఉంటుంది. మహికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం పేరు 65 రోజెస్. (మొదట్లో ప్రేక్షకులకు అర్థం కాదు. సినిమా మధ్యలో. అది సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ప్రాణాంతక వ్యాధి అని తెలుస్తుంది. మహి దాన్ని సరిగా పలకక పోవడం వల్ల అది 65 రోజెస్ గా మారిందని విరాజ్ చెప్తాడు. ఇది కొంచెం సరదాగా అనిపిస్తుంది. ఇలాంటి ఇంకా కొన్ని సినిమాలో ఉన్నాయి.. ఇది లంగ్స్ సంబంధించిన, చికిత్స లేని వ్యాధి అని చెప్పుకోవచ్చు).

చివరకు ఇద్దరి సమస్య సాల్వ్ అవుతుంది. ఎలా అయింది అనేదే ఈ సినిమా.

అయితే ఈ సినిమాకు ప్రధాన బలం, అందం, అభినయం కలబోసిన మృణాల్ ఠాకూర్, నాని. అయితే ఎవరు ఎక్కువ బాగా నటించారు అని చెప్పాలంటే, సినిమాకు కీలకం, కథ నడవడానికి అత్యంత అవసరం అయిన విషయాన్ని ప్రస్తావించాలి. ఫోటోగ్రాఫర్ విరాజ్ మహికి రోజు ఒక కథ చెప్తుంటాడు. కానీ ఆ కథలో అమ్మ ఉండదు. కూతురు "మహి" ఒకసారి ఎప్పుడు నాన్న కథలే చెప్తావు. అందులో అమ్మ ఎందుకు ఉండదు. అమ్మ కథ చెప్పు అని విరాజ్ ని అడుగుతుంది. అమ్మ కథ చెప్పు అని విరాజ్ ని అడుగుతుంది.

అప్పుడు విరాజ్ నువ్వు సెకండ్ ర్యాంక్( మహి క్లాస్మేట్ వరుణ్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఉంటాడు అది ఒక పర్సెంట్ తేడాతో) తెచ్చుకున్నావు కదా, ఈసారి పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో అప్పుడు తప్పకుండా అమ్మ కథ చెప్తాను అంటాడు. మహి సరేనంటుంది. సాధారణ సినిమాల్లో మాదిరి మహి తర్వాతి పరీక్షల్లో ఫస్ట్ టైం తెచ్చుకుంటుంది(అది 2% తేడాతో). ఇంత ముందు చెప్పినట్టు నాని, మృనాల్ ఠాకూర్ ఇద్దరిలో ఎవరు బాగా చేశారు అని చెప్పాలంటే వన్ పర్సెంట్ తేడా ఇద్దరి మధ్య ఉంది. మృణాల్ కే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.

సరే మళ్ళీ కథలోకి వస్తే

ఇప్పుడు ఫస్ట్ ర్యాంకు వచ్చింది కదా అమ్మ కథ చెప్పు అని మహి అడిగితే నేను అలసిపోయాను అంటాడు వీరాజ్. పొద్దున్నే లేచి చూస్తే మహి కనపడదు. గతంలో కీలకమైన కుక్క(ఫ్లూటో) మహి తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ ఫ్లూటో తప్పించుకుంటే దాన్ని పట్టుకునే క్రమంలో ఆమెకు యష్న(మృణాల్ ఠాకూర్) మహికి సాయం చేస్తుంది. ఇద్దరూ కలిసి హోటల్లో కూర్చొని ఉంటారు,

అప్పుడు విరాజ్ అక్కడికి వచ్చి ఇంటికి వెళ్దాం రా అంటే, అమ్మ కథ చెప్తే తప్ప రాను అంటుంది. నాటకీయంగా యష్న కూడా బలవంతం చేస్తే.. అప్పుడు అమ్మ కథ చెప్తాడు. మహి ఎప్పుడు అంటుంటుంది హీరోగా ఎవరిని ఊహించుకోవాలి అని, అప్పుడు విరాజ్ నన్నే ఊహించుకుంటుండు అని చెప్తుంటాడు. ఈసారి అమ్మ వచ్చింది కాబట్టి కథలోకి అమ్మగా ఎవరిని ఊహించుకోవాలి అని మహి అడుగుతుంది. అప్పుడు మధ్యలో కథ వింటున్న యష్న నన్ను ఊహించుకో అంటుంది. ఇది కొంచెం కొత్తగా ఉంది. ఇక్కడే డైరెక్టర్ తెలివిగా సినిమా ఇంటర్వెల్ వరకు నడిపాడు. ఇది క్రియేటివిటీ కీ సూచన. అది మొదటిసారి సినిమా తీసిన దర్శకుడు.. ఫ్లాష్ బ్యాక్ లో అమ్మతోపాటు కథ కూడా అనేక మలుపులు తిరిగి.. చివరికి ముగుస్తుంది.

సినిమాలో మిగతా నటీనటుల్లో ప్రియదర్శి అలా అలవోకగా తన పాత్రను తాను పోషించుకుంటూ వెళ్ళాడు. ఇక జయరాం గురించి చెప్పేదేముంది. గతంలో వచ్చిన ఒకటి రెండు మూడు హిట్ సినిమాల్లో తండ్రిగా వేసి మెప్పించాడు. ఇక్కడ అంతే. ఇతర పాత్రల గురించి పెద్దగా చెప్పేదేమీ లేదు. ఎందుకంటే సినిమా మొత్తం అమ్మ నాన్న కూతురు మధ్యన నడుస్తుంది. అంగద్ బేడి, నాజర్ చిన్న పాత్రల్లో పర్వాలేదనిపించారు.

ఇంత ముందు చెప్పినట్టు మంచి అవకాయలో కరివేపాకు ఉండదు. ఇక్కడ ప్రముఖ నటి శృతిహాసన్, ఒక అనవసరమైన పాటలో, అనవసరమైన పాత్రలో కొంచెం సేపు కనిపించింది. సినిమా నేమి దెబ్బతీయలేదు గాని, అవసరం కూడా లేదు. పోనీ ప్యాడింగ్ కింద పెట్టుకున్నారా అంటే అది లేదు. మీ దర్శకుడి అనుభవరాహిత్యం మాత్రమే కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒక రకం ప్రేక్షకులు మాత్రం కాసింత ఎంజాయ్ చేసి ఉండే అవకాశం ఉంది

ఈ సినిమా కొంచెం కొత్తగా, ఆహ్లాదకరంగా తయారు కావడానికి వెనక సినిమాటోగ్రాఫర్ సాను వర్గీస్ పాత్ర ఉంది. బొంబాయిలో కథ జరగడం వల్ల సముద్రం, ఆహ్లాదకరమైన లొకేషన్స్ సినిమాను కొంచెం ఎలివేట్ చేస్తాయి. అలాగే సంగీతం. ఇది కూడా కొంచెం వినసొంపుగానే ఉంది. హేషం ఆబ్దుల్ వహబ్ కాబట్టి పర్వాలేదు అనిపించాడు. ఈసారి కొత్తగా ఒక సంగీత దర్శకుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సంగీతాన్ని అందించడం విశేషం(ఒక ఇంటర్వ్యూలో అతనే చెప్పాడు). అనంత శ్రీరామ్ రాసిన 3 పాటల్లో " సమయమా" పాట సంగీతం తో పాటు, చిత్రీకరణ కూడా ఆహ్లాదకరంగా ఉంది

కాస్ట్:

నాని, మృణాల్ ఠాకుర్, బేబి కియారా ఖన్నా, జయరాం, ప్రియదర్షి, నాజర్, అంగద్ బేడి

సంగీతం: హేషం ఆబ్దుల్ వహబ్

సినిమటోగ్రాఫర్: సాను జాన్ వర్గీస్

ఎడిటింగ్: ప్రవీణ్ ఆంథోని

దర్షకత్వం: షౌర్యువ్

నిర్మాతలు: మోహన్ చెరుకూరి, డా. విజేందర్ రెడ్డి తీగల

Read More
Next Story