హీట్ లేకుండానే హిట్ కొట్టిన హిట్ మ్యాన్
x

హీట్ లేకుండానే హిట్ కొట్టిన 'హిట్ మ్యాన్'

చడీచప్పుడు లేకుండా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న హిట్ మ్యాన్ ఇంగ్లీషు మూవీ సూపర్ హిట్ అయింది. రేటింగ్ లో నెంబర్ వన్ గా ఈ సినిమా కథేమిటంటే..


టెక్సాస్ మాస పత్రిక సీనియర్ జర్నలిస్టు స్కిప్ హాలాండ్స్‌వర్త్ రాసిన ఓ వాస్తవ కథనం ఆధారంగా తీసిన సినిమా హిట్ మ్యాన్. మనుషుల్లో ఉండే మకిలితనం, స్వార్థం, ఆశ, పేరాశ, మోసం, ఎదుటి వ్యక్తిని చంపైనా సరే తనది కాని దాన్ని సొంతం చేసుకోవాలనే దుర్భుద్ధి వంటి అనేకానేక అతి తెలివితేటలుండే మనుషుల మనసుల్ని ఎత్తి చూపే సినిమా ఇది. పోలీసు డిపార్ట్ మెంట్ కు అండర్ కవర్ గా ఉండే ఓ నకిలీ కాంట్రాక్ట్ కిల్లర్ అనుభవమే ఈ సినిమా. కథ చిన్నదే అయినా పెద్ద ప్లాట్ అవుతుంది.

సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి సైకాలజిస్టులు చెప్పే ఇగో, ఇడ్, సూపర్ ఎగో వంటి ప్రాధాన్యత తెలిసిన ఓ సైకాలజీ ప్రొఫెసర్ కమ్ అండర్ కవర్ పోలీసు ఇన్ఫార్మర్ హిట్ మ్యాన్ హీరో. హిట్ మ్యాన్ ఫాంటసీ మనల్ని ఎక్కడికో తీసుకువెళుతుంది. జీవితంలో అసంకల్పితంగా ఎదురైన సంక్లిష్ట సమస్యలకు ఓ సాదా సీదా పరిష్కారాన్ని చూపుతుంది. దుష్టుడు, దుర్మార్గుడైన భర్తను చంపడానికి ఓ కాంట్రాక్ట్ కిల్లర్ కి సూపారీ ఇవ్వబోయిన అమ్మాయితో ఈ నకిలీ కిల్లర్ ఎలా ప్రేమలో పడతాడు, ఆ భర్త ఏమవుతాడు, అతనికున్న ఇన్సూరెన్స్ పాలసీ ఏమవుతుంది? విలన్ గా మారిన సహోద్యోగి ఏమవుతాడు, ఇంతకీ ఈ హిరోహీరోయిన ఓ ఇంటి వారవుతారా? వంటి వాటికి సినిమా చూస్తేనే జవాబులు దొరుకుతాయి.
కొత్త "హిట్ మ్యాన్" గురించి మొదట తెలిసినపుడు అదేదో పిల్లల సిన్మానో, పాప్ కార్న్ సిన్మా అనో అనుకున్నారు. రిచర్డ్ లింక్‌లేటర్ దర్శకత్వం వహించిందని తెలిసినపుడు ఇందులో ఏదో కంటెంట్ ఉంటుందే అనుకున్నారు. చడిచప్పుడు లేకుండా హిట్ కొట్టే గ్లెన్ పావెల్ నటించిన సినిమాను థియేటర్లకు కాకుండా నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. మండు వేసవిలో మంచు బింధువులా ఈ సినిమా ఇప్పుడు అమెరికా సహా చాలా దేశాల వాసులు ఇళ్ల నుంచే వీక్షిస్తుండడంతో నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది.
ఇదీ కథ..
గ్యారీ జాన్సన్ న్యూ ఓర్లీన్స్ యూనివర్శిటీలో సైకాలజీ, ఫిలాసఫీ ప్రొఫెసర్. న్యూ ఓర్లీన్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ కు స్టింగ్ ఆపరేషన్‌ ఏజెంట్ కూడా. "కస్టమర్ల నుంచి వచ్చే కాల్స్ ను బట్టి కిరాయి కాంట్రాక్ట్ కుదుర్చుకుంటూ ఆ సమాచారాన్ని పోలీసులకు ఇచ్చి నిందితుల్ని పట్టిస్తుంటారు. ఈ గ్యాంగ్ లో ఉండే ఓ నకిలీ హిట్‌మెన్‌ జాస్పర్ సస్పెండ్ కావడంతో ఆ పాత్రను గ్యారీ పోషించాల్సి వచ్చింది. పోలీసు బాస్ చెప్పడంతో ఇష్టం లేకుండానే ఆ పాత్రను అంగీకరిస్తాడు. దీంతో గ్యారీకి త్వరత్వరగా కేసులు వస్తుంటాయి. కాంట్రాక్ట్ ఇచ్చే వారి గురించి పరిశోధించడానికి తన ఫిలాసఫీని, మనుషుల మనస్త త్వాన్ని తెలుసుకునేందుకు సైకాలజీని ఉపయోగిస్తూ కేసుల్ని కొలిక్కి తెస్తుంటాండు.

ఈ క్రమంలో కట్టుకున్నోడితే వేగలేకపోతున్న ఓ మగువ మాడిసన్ ఈ నకిలీ కిల్లర్ గ్యారీ (మారుపేరు రాన్)కి తన భర్తను చంపమని సుపారీ ఇస్తుంది. మాడిసన్ తో మాట్లాడుతున్నప్పుడే గ్యారీ ఆమెపై జాలిపడతాడు. మనసు పారేసుకుంటాడు. తన భర్తను చంపడానికి మాడిసన్ డబ్బు ఇవ్వబోతుంటే "రాన్" పేరుతో ఉన్న గ్యారీ దాన్ని వద్దంటాడు. ఆ డబ్బుతో నీ జీవితాన్ని బాగుచేస్కో అని కూడా చెబుతాడు. డబ్బిస్తానంటే వద్దంటున్న మన హీరో తీరును ఇన్ఫార్మర్ల గ్యాంగ్ లోని మిగతా సభ్యులు జాస్పర్, క్లాడెట్, ఫిల్‌ అనుమానిస్తారు. ఓ కంట కనిపెడతారు.
మరో పక్క గ్యారీ మాడిసన్‌ల ముచ్చట మాటలు దాటి బెడ్ రూమ్ దాకా చేరింది. అసలు పేరు చెప్పని గ్యారీ- రాన్ అనే మారుపేరుతోనే మాడిసన్ తో ముద్దుమురేపాన్ని తీర్చుకుంటుంటాడు.
ఒక రోజు రాత్రి క్లబ్ లో వీరిద్దరూ ఎంజాయి చేస్తుండగా మాడిసన్ భర్త రే కంటపడతారు. గొడవ జరుగుద్ది. మొగుణ్ణుంచి మాడిసన్ ను కాపాడడానికి గ్యారీ తుపాకీని బయటకి తీస్తాడు. చేసేదేమీ లేక అతగాడు మాడిసన్ అంతు చూస్తానంటూ ఓ హెచ్చరికలాంటి చావుకేకపెట్టి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇంకోరోజు రాత్రి రెస్టారెంట్‌ నుంచి బయటకువస్తుండగా గ్యారీ, మాడిసన్ జంట- పోలీసు డిపార్ట్ మెంట్ నుంచి సస్పెండ్ అయిన జాస్పర్‌ కంట్లో పడతారు. ఉద్యోగం పోయిన కోపంలో ఉన్న జాస్ఫర్ కూడా హీరో గ్యారీపై అనుమానపడతాడు.
సరిగ్గా ఈ సమయంలో భార్యపై కోపంతో ఊగిపోతున్న రే మాడిసన్ ను చంపడానికి ప్లాన్స్ వేస్తుంటాడు. తనకు తెలియకుండానే గ్యారీని సంప్రదిస్తాడు. రేతో మాట్లాడడానికి గ్యారీ ఓ రెస్టారెంట్ కి వెళ్తాడు. మొఖమొఖాలు చూసుకోకుండా ఒకరి సీటు వెనుక మరొకరు ఉండి మాట్లాడుకుంటారు. మాడిసన్ ను ఎందుకు చంపాలనుకుంటున్నాడో, దానికి ఎంత ఇవ్వాలనుకుంటున్నాడో వంటివనేకం చెబుతాడు రే. క్షణం ఆలస్యం చేయకుండా చంపేయాలంటాడు. ఆ వెంటనే గ్యారీ- మాడిసన్‌ ఇంటికెళ్లి ఆమెను మరోచోటికి తీసుకెళ్లాలని చూస్తాడు. ఆమె ఒప్పుకోదు. గ్యారీలోని ఫిలాసఫర్ కు బదులు రాన్ లోని కాంట్రాక్ట్ కిల్లర్ ను చూస్తున్న మాడిసన్ కి హీరో తీరు నచ్చదు. కిల్లర్ ఇలాంటి పిరికి పనులు చేస్తాడా అని ఇంట్లోంచి తరిమేస్తుంది.
ఆ తర్వాత మాడినస్ భర్త రే హత్యకు గురవుతాడు. దీంతో గ్యారీకి దిమ్మతిరుగుతుంది. రేని చంపేశారంటే నమ్మలేకపోయాడు. ఈ హత్య గురించి చర్చించడానికి పోలీసులు గ్యారీని పిలిపించారు. మాడిసన్ రైఫిల్ లోని బుల్లెట్లే రే గుండెల్ని చీల్చేశాయని చెబుతారు. ఇక అనుమానం లేదు, ఇది కచ్చితంగా మాడిసన్ పనేననుకుంటాడు గ్యారీ. అయితే ఆయన సహోద్యోగులైన పోలీసులు- డ్రగ్స్ తో ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందేమోనన్న అనుమానాన్నీ వ్యక్తంచేస్తారు. దీంతో గ్యారీ- రే హత్యపై మాట్లాడదామని మాడిసన్‌ని కలుస్తాడు. ఆమె తానే చేసినట్టు చెబుతుంది. ఈ విషయం తెలిసిన గ్యారీ భయపడిపోతాడు. మాడిసన్ గ్యారీ వ్యక్తిత్వానికంటే అతనిలోని హిట్ మ్యాన్ "రాన్" పర్సనాలిటీనే ఎక్కువ ప్రేమిస్తున్నట్టు అర్థమై వణికిపోతాడు.
మాటలు తప్ప కిరాయి హత్యలు ఎప్పుడూ చేయని గ్యారీ.. మాడిసన్ తో వాదన చేసినా ఫలితం లేకపోవడంతో చేతులూపుకుంటూ పోలీసుల వద్దకు వస్తాడు. అప్పుడు పోలీసులు అతనికి ఇంకో షాకింగ్ న్యూస్ చెబుతారు. మాడిసన్ భర్త చనిపోయే ముందు తన జీవిత బీమా పాలసీని రెట్టింపు చేశాడని, దాని కోసమే ఆమె చంపి ఉండొచ్చనంటారు.
అప్పుడు గ్యారీ "రాన్" పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆమెను కాపాడాలనుకుంటాడు. నేరం చేసినట్టు ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకోమని జాస్పర్ చెసిన సూచనతో గ్యారీ ఆమె ఇంటికి వెళ్లి విచారణ నాటకం మొదలుపెడతాడు. మొబైల్ యాప్ ద్వారా తాను అడగబోయే ప్రశ్నలను టైప్ చేసి మాడిసన్‌ కి చూపిస్తూ నటనను రక్తికట్టిస్తారు. ఆమెను విచారిస్తున్నట్లు పెద్దపెద్దగా అరుస్తూ దానికి అదే రీతిలో సమాధానాలు చెప్పమంటూ నాటకాన్ని రక్తికట్టిస్తారు. మాడిసన్ నిర్దోషని ఇద్దరు పోలీసులను ఒప్పిస్తాడు. కానీ జాస్పర్ మాత్రం ఇది నటనేనంటూ మాడిసన్ ఇంటి వద్దే ఉంటాడు.
గ్యారీ తిరిగి వచ్చే వరకు వేచి ఉంటాడు. ఉద్యోగం నుంచి సస్పెండ్ కావడం, ఆ పోస్టు గ్యారీకి దక్కడం, ఆదాయం లేక సతమతం అవుతున్న జాస్పర్ అప్పటికే హీరోపై కోపాన్ని పెంచుకున్నాడు. ఇదే అదునుగా జాస్పర్- మాడిసన్ భర్త రే జీవిత బీమా పాలసీ నుంచి అదనంగా వచ్చే డబ్బులో వాటా ఇవ్వాలంటాడు. జాస్ఫర్ తీరును ముందే పసిగట్టిన మాడిసన్ అతనికి ఇచ్చిన బీరులో మత్తు మందు కలిపింది. దీంతో స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత గ్యారీ అతని మొఖానికి ప్లాస్టిక్ బ్యాగ్‌ చుట్టి ఊపిరి ఆడకుండా చేస్తాడు. జాస్పర్ మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్లాన్ చేస్తాడు. ఇది నిజంగా ఆత్మహత్యా లేక హత్య అనేది మనకు కనిపించదు గాని గ్యారీ, మాడిసన్ ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నట్టు లాస్ట్ సీన్ ఉంటుంది.
హిట్ మ్యాన్లో అడ్రియా అర్జోనా, గ్లెన్ పావెల్ కెమిస్ట్రీ బాగా పండింది. పోటాపోటీగా నటించారు. రొమాన్స్, కామెడీ కలిసొచ్చాయి. దర్శకుడు రిచర్డ్ లింక్‌లేటర్ పాత్రల మధ్య సంభాషణ చాలా మామూలుగా సాగేలా చేయడంలో అద్భుతమైన ప్రతిభ చూపారు. ఓ నకలీ పాత్రలో హీరో తన జీవితాన్ని గడపడమే ఈ సినిమా ప్రత్యేకత.ఈ ఏడాది వచ్చిన అత్యంత ఆహ్లాదకరమైన సినిమాలలో ఇదొకటని సినీపండితులు మెచ్చుకుంటున్నారు. నెట్‌ఫ్లిక్స్ "హిట్ మ్యాన్"ని కొనుగోలు చేసింది. జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు నెంబర్ వన్ సినిమాగా నిలిచింది. సినీపండితుల్నుంచి ప్రశంసలు పొందింది. సగటు ప్రేక్షకుల మొదలు సినీ పండితుల వరకు ఎందరెందరో మన్ననలు పొందింది.

Read More
Next Story