ఈ సినిమా హాలుకొక పూర్వ జన్మ ఉంది... ఆ కథ వింటారా?
x
ముషీరాబాద్ శ్రీ సాయి రాజా ధియోటర్ (ఫేస్ బుక్ నుంచి)

ఈ సినిమా హాలుకొక పూర్వ జన్మ ఉంది... ఆ కథ వింటారా?

కెపి ఆశోక్ కుమార్ హైదరాబాద్ సినిమా హాళ్ల జీవిత చరిత్రలను కళ్లారా చూసిన వ్యక్తి. ఈ సారి ఆయన ఒక సినిమా హాలు పూర్వ జన్మ ముచ్చట్లు వినిపిస్తున్నారు.


-కెపి ఆశోక్ కుమార్


హైదరాబాద్ లోని ముషీరాబాద్ అనగానే జైల్ ఖానా, రహత్ మహల్ థియేటర్ జ్ఞాపకం వస్తాయి. ఎందుకంటే అవి ల్యాండ్ మార్క్ లుగా నిలిచిపోయాయి కాబట్టి. సికింద్రాబాద్ నుండి కోటికి పోయే దారిలో , అనగా నాలుగు కిలోమీటర్ల దూరంలో రహత్ మహల్ థియేటర్ ఉండేది. సికింద్రాబాద్ నుండి కాచిగూడలోని 'బసంత్' థియేటర్ వరకు,మధ్యలో ఏ థియేటర్ లేని దశలో "రహత్ మహల్ "థియేటర్ 1948లో నిర్మించడం జరిగింది. ఇది తెలుగు సినిమాల కోసం నిర్మించబడిన థియేటర్. ఇందులో విడుదలైన చిత్రాలలో "స్వప్న సుందరి"( 1950 )," బీదల పాట్లు"( 1950), "చంద్రవంక"( 1951 )," చెరపకురా చెడేవు"( 1955)," ఇలవేల్పు" (1956)," కనకదుర్గ పూజా మహిమ"( 1960), "చిన్ననాటి స్నేహితులు"( 1971 )మొదలైనవి ఉన్నాయి.

రేకులతో కప్పిన థియేటర్ వసారా. వసారాలో నుండి థియేటర్ లోపలకు పోవడానికి ప్రవేశద్వారాలు ఉండేవి. థర్డ్ క్లాస్ బెంచి, సెకండ్ క్లాస్ చెక్క కుర్చీలు ,ఫస్ట్ క్లాస్ లో స్పాంజీ కుర్చీలు ఉండేవి. ఫస్ట్ క్లాస్ వెనుక నిలువెత్తు గోడ దానిమీద పరదా, వెనుక లేడీస్ సీట్లు. సినిమా స్టార్ట్ అయినప్పుడు పరదాను ఒక వైపుకు నెడుతూ పోతే ఆడాళ్లకు స్క్రీన్ కనిపించేది. మగాళ్ళ కంటపడకుండా అలాంటి ఘోషా పద్ధతి అమలులో ఉండేది. విశాలమైన థియేటర్ ఆవరణలో ఎంట్రన్స్ లోనే క్యాంటీన్. క్యాంటీన్ ముందు ఖాళీ స్థలం. అది దాటిన తర్వాత సినిమా హాల్ వస్తుంది. అప్పటి కార్మిక నాయకుడు మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి బుల్లెట్ మీద ఠంచన్ గా రహత్ మహల్ కు రోజు వచ్చి జనతా అదాలత్ నిర్వహించేవాడు.

ఇందులో అప్పుడప్పుడు రిలీజ్ అయ్యే హిందీ చిత్రాలలో "హరే రామ హరే కృష్ణ, జంజీర్ "చిత్రాలు ఎక్కువ రోజులు నడిచాయి. రానురాను కొత్త థియేటర్లు రావడం, పోటీ పెరగడంతో క్రమంగా ఈ థియేటర్ 'బి 'థియేటర్ గా మారిపోయింది. హిట్ సినిమాల సెకండ్ రన్ థియేటర్ గా పేరుపొందింది. హాలీవుడ్ సినిమాలకు సెంటర్ అయిపోయింది. "పానిక్ ఇన్ బ్యాంకాక్"," బ్లో హాట్ -బ్లో కోల్డ్ "లాంటి చిత్రాలను ఇందులోనే చూశాను. అటు లైట్ హౌస్ ,లిబర్టీలు ఇటు ప్లాజా, టివోలీల మధ్య హాలీవుడ్ చిత్రాలను ప్రదర్శించే థియేటర్ రహత్ మహల్ ఒక్కటే .70వ దశకంలో మార్నింగ్ షో లను తగ్గింపు రేట్లలో పాత చిత్రాలను ప్రదర్శించడానికి ప్రభుత్వం వారు అనుమతించడంతో ,మంచి మంచి పాత చిత్రాలను ఎంపిక చేసి ఇందులో ప్రదర్శించేవారు. అలా "మా బాబు, రేచుక్క ,గాలి మేడలు" మొదలైన ఎన్నో సినిమాలను ఎక్కువగా 1973 -76 కాలంలో చూడగలిగాను.

పాత వైభవం అంతరించిన ఈ థియేటర్ మూతబడింది. కొత్త మేనేజ్మెంట్ నిర్వహణలో "రాజా డీలక్స్" గా పేరు మార్చుకొని 1980లో కొత్తగా ప్రారంభమైంది. పాత థియేటర్ రూపురేఖలనే మార్చివేశారు. ఆధునాతనంగా తయారైన ఈ లగ్జరీ థియేటర్లో ఆడాళ్లకు సపరేట్ సిటింగ్ తీసివేసి, బాల్కనీ క్లాస్ ను కొత్తగా ప్రవేశపెట్టారు. తెలుగుతో సమానంగా హిందీ సినిమాలు కూడా ఆడేవి. తర్వాత 20 ఏళ్లకే ఇది కూడా మూతపడింది.

తిరిగి ఈ థియేటర్ " శ్రీ సాయిరాజా" పేరుతో 2001లో పునః ప్రారంభమైంది. కమలహాసన్ నటించిన "బ్రహ్మచారి "ప్రారంభ చిత్రం .రహత్ మహల్ గా ఉన్నప్పుడు విశాలమైన ఆవరణ ఉండేది. తర్వాత కాలంలో ఈ ప్రాంతమంతా వాణిజ్య కేంద్రంగా తయారు కావడంతో రోడ్డు వైపుకు ఉన్న ప్రాంతంలో షాపుల కోసం మడిగలు కట్టి, అటువైపు ఇటువైపు థియేటర్ లోపలకు పోవడానికి గేట్లు పెట్టినారు. ఈ మడిగెల వెనుక బుకింగ్ కౌంటర్లు కట్టారు. థియేటర్ ముందు స్కూటర్ పార్కింగ్ ,కుడి ఎడమల కార్లు ,ఆటోల పార్కింగ్ ను ఏర్పరిచారు. సువిశాలమైన ఆవరణ వెనుక ఉన్న ఈ థియేటర్లో సెకండ్ క్లాస్ వేరుగా అప్పర్ ,స్టాల్ బాల్కనీలకు వేరుగా ప్రవేశం ఉంటుంది. ఇందులో " ఒంగోలు గిత్త ,నాయక్ ,లాహిరి లాహిరి లాహిరిలో, రాజారాణి ,చంటిగాడు" లాంటి చిత్రాలతో పాటు "అగ్నిపథ్, దబంగ్ ,క్రిష్, ఫనా, రాజ్ "లాంటి హిందీ చిత్రాలు కూడా విజయవంతంగా ప్రదర్శింపబడ్డాయి. నాగార్జున నటించిన "నేనున్నాను" శత దినోత్సవము జరుపుకుందని తెలియ వచ్చింది. ఇందులో 950 సీట్లు ఉన్నాయి. ప్రారంభంలో ఇందులో రేట్లు 30 రూపాయలు 50 రూపాయలు 70 రూపాయలు గా ఉండేది. ఇందులో 70 ఎంఎం స్క్రీన్ ను ఏర్పాటు చేసి, దానికి తగ్గట్టుగానే సౌండ్ సిస్టం డిజిటల్ ను ప్రవేశపెట్టారు. ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న థియేటర్లలో "శ్రీ సాయిరాజా" కూడా ఒకటి. ( సాహిత్యం-చలన చిత్రం ఫేస్ బుక్ పేజీ నుంచి)


(కెపి ఆశోక్ కుమార్, వృత్తిరీత్యా హైదరాబాద్ లోని ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో లైబ్రేరియన్. ప్రవృత్తి లో ఆయన ఎన్ సైక్లోపీడియా. కవి, విమర్శకుడు, సమీక్షుడు, వ్యాసరచయిత, అన్నింటికి మించి అద్భుతమయిన పరిశోధకుడు)

Read More
Next Story