మసాలా సినిమా మాంత్రికుడు మన్మోహన్ దేశాయ్ : నివాళి
నా సినిమా బాగుందని పేపర్లలలో రివ్యూ రాస్తే నాకు భయం. ఆ సినిమా ప్లాప్. అదే ఎవరైనా చెత్త అంటే సంతోషం.ఎందుకంటే, నేను తీసేది వాళ్లకోసం కాదు, ప్రేక్షకుల కోసం
" సినిమాలు.. విమర్శకుల కోసం, రివ్యూలు రాసే వాళ్ల కోసం తీయను. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకుల కోసం తీస్తా." అని ఘంటాపథంగా, నిర్మొహమాటంగా చెప్పి కేవలం అలాంటి సినిమాలే తీస్తూ, మసాలా సినిమాలు అంటే ఏంటో బాలీవుడ్ కు పరిచయం చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన మసాలా సినిమాల మాంత్రికుడు నిర్మాత, దర్శకుడు మన్మోహన్ దేశాయ్. తీసే సినిమాల పట్ల ఇంత క్లారిటీ ఉన్న దర్శకుడు మరొకడు కనిపించడు.
“ నా సినిమా బాగుందని ఎవరైనా పేపర్లలో, మ్యాగజైన్లో రాస్తే నాకు చాలా భయమేస్తుంది. ఆ సినిమా కచ్చితంగా ప్లాప్ అనిపిస్తుంది. అదే ఎవరైనా బాలేదని, చెత్త అని తిడితే నాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టరే" అని కూడా చెప్పగలిగినవాడు
మన్మోహన్ కి సెక్యులరిజం అంటే ఇష్టం. ఛలియా సినిమా నుంచి ఇది ఉంది. ఆ సినిమాలో ముఖేష్ పాడిన "ఛలియా మేరా నామ్.. హిందూ ముస్లిం సిఖ్ ఇసాయి సబ్ కో మేరా సలాం" అన్న పాట ఒకటి పెట్టాడు. అలాగే అవసరమైన చోట తన క్యారెక్టర్ల ద్వారా సెక్యులరిజాన్ని సినిమాల్లో చూపిస్తూ వచ్చాడు. దీనికి మంచి ఉదాహరణ అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమానే.. మానవ సంబంధాల కి ప్రాధాన్యతనిస్తాడు. పాటలు బావుండేలా చూసుకుంటాడు. ప్రతి సినిమాలో ఒకటో రెండో హిట్ పాటలు ఉంటాయి.
పడి లేచిన కెరటం
అన్న సుభాష్ దేశాయ్ ప్రొడ్యూసర్ గా మొదటిసారి 1960 లో స్టార్ జంట రాజ్ కపూర్ నర్గీస్ లతో "ఛలియా" అనే ఓ మాదిరి సక్సెస్ సినిమా తీశాడు. తర్వాత రాజ్ కపూర్ తమ్ముడు షమ్మీకపూర్ తో "బత్తమీజ్" అనే ఫ్లాప్ సినిమా తీశాడు. మళ్లీ ఒకటి రెండు సినిమాలు తీసినప్పటికీ విజయం దక్కలేదు. 1970 లో "సచ్ఛా-ఝూటా" సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.
1974 లో రాజేష్ ఖన్నా హీరోగా(సహనిర్మాత కూడా) తీసిన " రోటి" అనే హిట్ సినిమాతో మొదలైన విజయ పరంపర మళ్లీ తన ఫేవరెట్ హీరో అమితాబచ్చన్ తో తీసిన " గంగా జమున సరస్వతి" అనే ప్లాప్ సినిమాతో ముగిసింది. అదే మన్మోహన్ దేశాయ్ చివరి సినిమా.. చివరి సినిమా నీతోనే సినిమా తీస్తానని అమితాబ్ కు మాట ఇచ్చిన దేశాయి అదే మాట మీదనే నిలబడ్డాడు.
దేశాయికి రెండు నంబర్ అంటే ఇష్టం. ఏ హీరోతో అయినా సరే కనీసం రెండు సినిమాలు తీసేవాడు. తనకన్నా ఐదు ఏళ్ళు చిన్నవాడైన స్నేహితుడు అమితాబచ్చన్ తో మాత్రమే 9 సినిమాలు తీశాడు. నిర్మాతగా తన కుమారుడు కేతన్ దేశాయ్ దర్శకుడిగా రెండు సినిమాలు తీశాడు! భార్య జీవన్ ప్రభా గాంధీ 1979 లో చనిపోయిన తర్వాత తనకన్నా "రెండు" సంవత్సరాలు పెద్దదైన పాపులర్ హీరోయిన్ నందాని పెళ్లి చేసుకోవాలని నిశ్చితార్థం చేసుకోవడం విశేషం!
తన సినిమాలో అసంబద్ధత, తర్కం లేకపోవడం, అసాధారణ చిత్రీకరణ, చాలా సంక్లిష్టమైన కథ, కథనం గురించి కూడా చాలా క్లారిటీతో చెప్పాడు. పైగా వాటిని సమర్థించుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు " ప్రేక్షకులు వారి బాధలను, కష్టాలను, టెన్షన్ ను నా సినిమాలు చూసి కొంతసేపైనా మర్చిపోగలిగితే చాలు. " అని నిజాయితీగా చెప్పాడు.
అమితాబచ్చన్ మాటల్లో చెప్పాలంటే " ఏం తీస్తాడో ఎలా తీస్తాడో అతని కి తప్ప ఎవరికీ తెలియదు. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా లో ముగ్గురు వ్యక్తులు హాస్పిటల్ బెడ్లమీద పడుకుని ఉంటారు. వారి ముగ్గురి మధ్య ఒక ట్యూబ్ కనెక్ట్ అయి ఉంటుంది.
అది మళ్లీ ఒక తల్లి చేతికి కనెక్ట్ అయి. ముగ్గురి నుంచి రక్తం ఆమెకు చేరుతుంది. ఇది ఎంత అసంబద్ధమైనది, మెడికల్ గా సాధ్యం కానిది అని నేను చెప్తే నువ్వు ఊరికే ఉండు అని నాకు చెప్పాడు. ఇది ప్రేక్షకులకు నచ్చితే చాలు అన్నాడు.. నేను కూడా ఏమీ చెప్పలేదు. కానీ సినిమాలో ఆ సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి, అతనే కరెక్ట్ అనిపించింది"
చరిత్ర సృష్టించిన సినిమా
అమర్ అక్బర్ ఆంటోనీ ఒక బ్లాక్ బస్టర్. అప్పట్లో బొంబాయి లోని 25 థియేటర్లలో 25 వారాలు ఆడిన సినిమా బాలీవుడ్ చరిత్రలో ఇప్పటికి కూడా ఇదొక్కటే! అమితాబచ్చన్ ను అగ్రగామిగా నిలిపిన సినిమా కూడా ఇదే! ఇప్పటి లెక్కల ప్రకారం ఆ సినిమా 400 కోట్లకు పైగా వసూలు చేసినట్లే. దర్శకుడిగా అత్యంత విజయవంతమైన సినిమా నుండి మొదలుపెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన సినిమాతో ముగించాడు.
బాలీవుడ్ మాస్ మసాలా మహారాజు,1994 మార్చి 1న, బాల్కనీలో ఉన్న రెయిలింగ్ ను ఆనుకుని నిలబడి ఉండగా అది విరిగిపోయి పైనుంచి పడి మరణించాడు.
Next Story