రామ్ గోపాల్ వర్మ (RGV) పేరు వినగానే సగటు ప్రేక్షకుడికి వివాదాస్పద సినిమా దర్శకుడుకనిపిస్తాడు. గ్యాంగ్‌స్టర్ సినిమాల సృష్టికర్త లేదా సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించే వ్యక్తిగా మాత్రమే కనిపిస్తారు. కానీ, ఆయనను కేవలం ఒక సినీ దర్శకుడిగా మాత్రమే పరిమితం చేయడం ఆయన మేధోపరమైన ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడమే అవుతుంది. గత మూడు దశాబ్దాలుగా ఆయన రూపొందించిన సినిమాలు, వివిధ వేదికలపై ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు, రాసిన పుస్తకాలు, సోషల్ మీడియా వ్యాఖ్యానాలు అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన భావజాలాన్ని ప్రతిపాదిస్తాయి. దీనినే ఆయన అభిమానులు "రాముఇజం" అని పిలుచుకుంటారు. కానీ, రాజకీయ తత్వశాస్త్రం, సమాజ శాస్త్ర కోణంలో లోతుగా విశ్లేషిస్తే, వర్మను ఒక “అనార్కిక్-లిబరలిస్ట్”గా గుర్తించడం అత్యంత సముచితమైన విశ్లేషణ అవుతుంది.
ఈ అనార్కిక్-లిబరలిస్ట్ దృక్పథం పునాది అపరిమిత వ్యక్తిగత సార్వభౌమత్వం (Absolute Individual Sovereignty) మీద నిర్మించబడింది. వ్యక్తి తన జీవితానికి తానే అంతిమ నిర్ణేత కావాలని, తన కోరికలను తానే నిర్వచించుకోవాలని, తన చర్యల వల్ల కలిగే ఫలితాలకు తానే బాధ్యత వహించాలనే బలమైన ఆకాంక్ష వర్మ ప్రతి మాటలోనూ ప్రతిఫలిస్తుంది. ఈ ధోరణి అమెరికన్ తత్వవేత్త ఐన్ ర్యాండ్ ప్రతిపాదించిన “ఆబ్జెక్టివిజం” ప్రభావానికి చాలా దగ్గరగా ఉంటుంది. (అనార్కిక్-లిబరలిస్ట్ (Anarchic-Liberalist) అనే పదానికి తెలుగులో "అరాజక-ఉదారవాది" అని అర్థం చెప్పుకోవచ్చు.) ప్రభుత్వ నియంత్రణ లేదా అధికార క్రమాన్ని వ్యతిరేకించే ధోరణి. అంటే, వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, ఆ స్వేచ్ఛకు అడ్డుపడే ఏ వ్యవస్థనైనా (ప్రభుత్వం వంటివి) నిరాకరించే ఆలోచనా విధానం. దీనికి కొంచెం దగ్గరగా ఉండే రాజకీయ-ఆర్థిక పదం "లిబర్టేరియన్ అనార్కిజం" (Libertarian Anarchism).
ర్యాండ్ సిద్ధాంతం ప్రకారం "హేతుబద్ధమైన స్వార్థం" (Rational Self-interest) అనేది ఒక గొప్ప గుణం. వర్మ ఈ భావనను స్వీకరించి, దానిని ఒక నియంత్రిత స్వేచ్ఛగా కాకుండా, ఎటువంటి సామాజిక లేదా నైతిక పరిమితులు లేని వ్యక్తిగత స్వేచ్ఛగా విస్తరించారు.
ఈ క్రమంలో ఆయన సమాజిక నిర్మితులు విధించిన హద్దులను సైతం తృణీకరిస్తారు, దీనివల్ల ఆయన లిబరలిజం సాధారణ స్వేచ్ఛావాదం నుండి విడివడి, ఒక అరాచక (Anarchic) స్వరూపాన్ని సంతరించుకుంటుంది.
వర్మ ఆలోచనల్లో నైతికతకు (Morality) ఉన్న స్థానం అత్యంత వివాదాస్పదమైనది. ఆయన దృష్టిలో నైతిక విలువలు అనేవి ప్రకృతి సిద్ధమైన సత్యాలు కావు; అవి కేవలం సమాజం వ్యక్తులను అదుపు చేయడానికి, వారి ఆలోచనా ధోరణిని మార్చడానికి సృష్టించుకున్న కృత్రిమ నియంత్రణ వ్యవస్థలు మాత్రమే. సంప్రదాయాలు, కుటుంబ నిర్మాణం, వివాహ వ్యవస్థ, ఐడియాలజీ, మతం వంటి సంస్థలు వ్యక్తి స్వేచ్ఛను హరించడానికి, మనిషిని ఒక మూసలో బంధించడానికి పుట్టుకొచ్చాయని బలంగా వాదిస్తుంటారు.
ఈ దృక్పథం జర్మన్ తత్వవేత్త ఫ్రెడరిక్ నీత్షే (Friedrich Nietzsche) ప్రతిపాదించిన “నైహిలిజం” మరియు “మాస్టర్-స్లేవ్ మోరాలిటీ” సిద్ధాంతాలకు అత్యంత సన్నిహితంగా ఉంటుంది. బలహీనులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, బలవంతులను అదుపు చేయడానికి సృష్టించినవే ఈ నీతులు (Slave Morality) అనే నీత్షే భావన వర్మ సినిమాల్లో నిరంతరం పునరావృతమవుతుంది. అందుకే ఆయన సృష్టించే పాత్రలు సాధారణంగా 'మాస్టర్ మోరాలిటీ'ని అనుసరిస్తాయి; అవి జాలి, క్షమ, దయ వంటి విలువలను బలహీనతలుగా పరిగణించి తిరస్కరిస్తాయి.
సత్య, కంపెనీ, శివ, సర్కార్ వంటి చిత్రాలు ఈ తాత్విక దృక్పథానికి అత్యుత్తమ దృశ్యరూపాలు. ఈ సినిమాల్లో హింస అనేది కేవలం ఒక చట్టవిరుద్ధమైన చర్యగా మాత్రమే కాకుండా, వ్యక్తి తన ఉనికిని చాటుకునే సాధనంగా, శక్తిని స్థాపించుకునే మార్గంగా చిత్రించబడుతుంది. నీత్షే పేర్కొన్న “విల్ టు పవర్” (అధికా సంకల్పం) అనే భావన ఇక్కడ గాఢంగా ప్రతిఫలిస్తుంది. వర్మ పాత్రలు కేవలం మనుగడ సాగించడానికి (Survival) పరిమితం కావు; అవి తమ ప్రభావాన్ని విస్తరించడానికి మరియు తమకంటూ ఒక ప్రత్యేక శక్తి సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి నిరంతరం పోరాడుతాయి. ఈ ప్రయాణంలో వారు సామాజిక నైతికతను పూర్తిగా పక్కన పెట్టి, తమ స్వంత విలువలనే చట్టాలుగా, నియమాలు, సహజ విలువలుగా మార్చుకుంటారు. ఈ లక్షణమే నీత్షే చెప్పిన “ఉబర్‌మెన్ష్” (Ubermensch) భావనను స్మరింపజేస్తుంది. అంటే సమాజం నిర్ణయించిన మంచి-చెడులకు అతీతంగా నిలబడి, తన స్వంత నైతికతను స్వయంగా నిర్మించుకుని, వ్యవస్తీకరించే వ్యక్తి.
అయితే, వర్మ అనుసరించి తత్వశాస్త్రంలో ఒక ప్రాథమిక సమస్యను విమర్శకులు ఎత్తిచూపుతుంటారు. ఆయన ఈ సంక్లిష్ట తాత్విక భావనలను విమర్శనాత్మక కోణంలో విశ్లేషించకుండా, చాలాసార్లు కేవలం గ్లోరిఫికేషన్ (అతిగా కీర్తించడం) స్థాయిలోనే ప్రదర్శిస్తారు. ఉదాహరణకు, నిహిలిజం అనే భావన జీవితానికి సహజమైన అర్థం లేదని, మనం చేసే పనులకే అంతిమ విలువ ఉంటుందని సూచిస్తుంది; కానీ వర్మ దానిని "ఏది చేసినా పరవాలేదు, ఎవరినీ లెక్కచేయాల్సిన అవసరం లేదు" అనే ఒక సులభమైన అనుమతి పత్రంగా (Self Licensed) మార్చేస్తారు. అలాగే, “అమోర్ ఫాటి” (Amor Fati) మనకు సంభవించే విధిని, అది ఎంత కష్టమైనా సరే ధైర్యంగా స్వీకరించడం అనే ఉన్నతమైన ఆలోచన, ఆయన పాత్రల్లో కేవలం మరణానికి భయపడని మొండితనంగా లేదా ఆవేశంగా మాత్రమే కనిపిస్తుంది. ఈ లోతైన తాత్విక భావనలు ఆయన వద్దకు వచ్చేసరికి ఒక అతివాద అరాచక వ్యక్తివాద దృక్పథంగా మారిపోతాయి.
ఈ దృక్పథం మరో ముఖ్యమైన అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. అదే సామాజిక వాస్తవాలు (Social Realities). కార్ల్ మార్క్స్, డా. అంబేద్కర్, అమర్త్యసేన్, జాన్ రాల్స్, సైమన్ డే బోవిఆర్ సిమోనే డే బేవోయిర్, బెల్ హుక్స్ ఇతర సామాజిక శాస్త్రవేత్తలు సూచించినట్లుగా, సమాజంలో ఉండే వర్గ అసమానతలు, ఆర్థిక నిర్మాణాలు, కుల, లింగ, వర్ణ, ప్రాంతీయ వివక్ష మరియు వ్యవస్థాగత అణచివేతలు వ్యక్తి అవకాశాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తి కేవలం తన "వ్యక్తిగత సామర్ధ్యం" తోనే ఎదిగిపోతాడు అనుకోవడం ఒక రకమైన ఊహాజనిత వాదన. భారతీయ సందర్భంలో కులవ్యవస్థ, పేదరికం మరియు లింగ అసమానత వంటి నిర్మాణాత్మక అంశాలు వ్యక్తి స్వేచ్ఛకు, ఎదుగుదలకు ప్రధాన అడ్డంకులుగా ఉంటాయి. కానీ వర్మ ప్రపంచంలో గెలిచినవాడు శక్తివంతుడు, ఓడిపోయినవాడు బలహీనుడు. ఓడిపోయినవాడికి అసలు సమాన అవకాశాలు అందాయా? లేదా? వ్యక్తి ఏ నియంత్రిత సామాజిక నేపథ్యం నుండి వచ్చాడు అనే ప్రశ్నలు విస్మరించబడతాయి. ఆయన దృష్టిలో శక్తి, అధికారం అనేవి కేవలం వ్యక్తిగత సామర్ధ్యం, సాహసం, తెలివితేటల ఫలితం మాత్రమే, అది సామాజిక హోదా వల్ల వచ్చే సదుపాయం కాదు.
ఈ పరిమిలు వర్మ సినిమాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, ప్రణయ్-అమృత కులాంతర వివాహం-హత్య నేపథ్యంలో తీసిన "మర్డర్" చిత్రంలో, కులహత్యను (Honor Killing) ఒక సామాజిక వ్యవస్థాపరమైన సమస్యగా కాకుండా, కేవలం ఒక తండ్రి తన కూతురి మీద ఉన్న అతి ప్రేమ వల్ల జరిగిన ఆవేశంగా చిత్రీకరిస్తాడు. ఇది అసమాన కులవ్యవస్థ మూలంగా తరాలుగా పాతుకుపోయిన హింసను, సామాజిక ఆధిపత్యాన్నిఉద్దేశ్యపూరితంగా విస్మరించడమే అవుతుంది. సామాజిక న్యాయం, సమానత్వం అనే కోణాలను వర్మ తన "బ్రాహ్మణీయ అనార్కిక్ - వ్యక్తివాద" దృక్పథం వల్ల పూర్తిగా విస్మరిస్తారు. అదే విధంగా, మహిళల ప్రతినిధిత్వంలో కూడా ఆయన సినిమాలు తరచుగా ఆబ్జెక్టిఫికేషన్ వైపు మొగ్గుచూపుతాయి. మహిళల స్వేచ్ఛ గురించి, వారి వ్యక్తిత్వం గురించి ఆయన పదే పదే మాట్లాడినా, వారిపై ఉండే సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక పరిమితులను లేదా పితృస్వామ్య వ్యవస్థ అణచివేతను చూడ నిరాకరిస్తాడు. ఆయనకు మహిళల స్వేచ్ఛ అంటే కేవలం వారి శారీరక లేదా బాహ్య ప్రదర్శన స్వేచ్ఛగానే పరిమితమవుతుంది తప్ప, అది ఒక సామాజిక విముక్తిగా రూపాంతరం చెందదు.
రాజ్యం (State), చట్టం (Law) పట్ల వర్మకు ఉన్న దృక్పథం చాలా సంకుచితమైనది. మ్యాకియవెల్లి ప్రభావంతో, "గెలిచినవాడిదే న్యాయం" అనే తర్కాన్ని ఆయన బలంగా నమ్ముతారు. అయితే, వర్మ ఒక మిఖైల్ బకునిన్, పీటర్ క్రొపాట్కిన్ ల లాంటి అరాచకవాది కాదు. కానీ, రాజ్యం, చట్టం కేవలం ఒక కనిష్ట రక్షణ వ్యవస్థగా (Night Watchmen State) మాత్రమే ఉండాలని భావిస్తాడు. రాజ్యం ఒక వ్యక్తి జీవితాన్ని, అతని ఆలోచనలను లేదా నైతిక నిర్ణయాలను నిర్దేశించకూడదు. ఈ ఉద్దేశంతోనే ఆయన సెన్సార్ బోర్డుల వంటి నియంత్రణ వ్యవస్థలపై నిరంతరం విమర్శలు గుప్పిస్తారు. కళాకారుడికి, వ్యక్తికి సంపూర్ణ భావప్రకటనా స్వేచ్ఛ ఉండాలని, అది సమాజపు "మోరాలిటీ" పేరుతో అణచివేయబడకూడదని వాదిస్తారు. మనుషుల మధ్య జరిగే ఘర్షణను నిలువరించడానికి ఒక సామాజిక ఒప్పందం (Social Contract), సార్వభౌమ రాజ్యం (Absolute Sovereign State) అవసరమని థామస్ హాబ్స్ భావించినా, ఆ ఒప్పందం వ్యక్తి స్వేచ్ఛను ఏమాత్రం హరించకూడని పరిమిత రాజ్యస్థితి (Minimal State)ని వర్మ కోరుకుంటాడు. అయితే వర్మ వెస్ట్రన్ వ్యక్తివాద, ఉదారవాద ఆలోచనలు భారతీయ కుల, పితృస్వామ్య (బ్రాహ్మణీయ) భావజాల పరిధిని దాటలేకపొగ వాటిని మరింత వ్యవస్తీకృతం చేసే సమర్ధతను ఇస్తాయి.
వర్మను కేవలం ఒక వివాదాస్పద దర్శకుడిగా చూడటం కంటే, భారతీయ సినిమాకు ఒక నూతన అపరిమిత వ్యక్తివాద-ఉదారవాద భాషను (Anarchic-Individualist Language) అందించిన ఆలోచనాపరుడిగా గుర్తించడం అవసరం. ఐన్ ర్యాండ్, నీత్షే, మ్యాకియవెల్లి, స్పీనోజా మరియు షోపెన్‌హోవర్ వంటి పాశ్చాత్య తాత్వికుల భావాలను తనదైన శైలిలో స్వీకరించి, వాటిని సామాన్యులకు అర్థమయ్యేలా సిల్వర్ స్క్రీన్ పై ప్రతిబింబించిన ఘనత కచ్చితంగా వర్మదే. ఆయన "అనార్కిక్-లిబరలిజం" వ్యవస్థలోని కపటత్వాన్ని సహజత్వికరించే ప్రయత్నం చేసినప్పటికి, సామాజిక బాధ్యత, నిర్మాణాత్మక అసమానతల విషయంలో విఫలమవుతుంది.
ఏప్రిల్ 7న ఆయన జన్మదినం సందర్భంగా, వర్మను అర్థం చేసుకోవడం అంటే ఆయన వాదిస్తున్న అనార్కిక్ వ్యక్తివాద ప్రమాదాన్ని గుర్తిస్తూనే, ఆయన విస్మరించిన సామాజిక స్పృహను విమర్శనాత్మకంగా విశ్లేషించడం, నిరంతరం ప్రశ్నలు సంధించే వర్మను, మరింత లోతైన తాత్విక విమర్శనాత్మక ప్రశ్నలతో విశ్లేషించడమే ఆయనకు ఇచ్చే నిజమైన జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే ఆర్ జివి.
(Dr. Sudarshan Balaboina, Assistant Professor, Osmania University)