అమ్మకానికి “ఆహా”? అసలు సమస్య ఏమిటి?
x

అమ్మకానికి “ఆహా”? అసలు సమస్య ఏమిటి?

ఓటీటీ ఫ్లాట్ ఫామ్.. ఆహాను అమ్మేస్తున్నారా? లాభాల కంటే నష్టాలే ఎక్కువొస్తున్నాయా? మార్కెట్ పోటీని తట్టుకోవడం అల్లు అరవింద్ వంటి సినీ దిగ్గజానికే సాధ్యం కావడం లేదా


ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ ని జనాల్లోకి తీసుకెళ్ళటం, పోటీ పడి నడపటం అనుకున్నంత ఈజీ అయితే కాదు. వరల్డ్ వైడ్ గా ఎంతో పాపులారిటీ ఉన్న నెట్ ప్లిక్స్, అమోజాన్ వంటి సంస్దలు రీజనల్ మార్కెట్ లోకి దూసుకు వచ్చి ఇక్కడ పాతుకుపోయేందుకు ఎంతైనా ఖర్చుపెట్టేందుకు వెనకాడటం లేదు.

ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ ఆ మధ్యన హైదరాబాద్ వచ్చి రామ్ చరణ్ ని, చిరంజీవి, ఇతర మెగా హీరోలని కలిసారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి కూడా టెడ్ సరండోస్ వెళ్లారు.

అంతేకాదు, ఎన్టీఆర్ ఇంట్లో టెడ్‌తో పాటు ఆయన టీమ్ మధ్యాహ్నం భోజనం కూడా చేసింది. అంటే వాళ్లు ఎంత దగ్గరగా మన టాలీవుడ్ కు వచ్చేసారో అర్దం చేసుకోవాలి. దాంతో తెలుగులో ఉన్న మిగతా ఓటీటీలకు సవాల్ విసిరినట్లైంది.

ఇక అల్లు అరవింద్ నడుపుతున్న ఆహా ఓటీటీ సంస్ద 2020లో లాంచ్ అయ్యింది. గీతా ఆర్ట్స్, మైహోమ్ గ్రూప్ జాయింట్ వెంచర్ గా ప్రారంభించారు. ‘ఆహా’తెలుగులో వచ్చిన కొద్దిరోజుల్లోనే పది లక్షలకు పైగా డౌన్‌లోడ్లు సాధించింది. ఈ సంస్ద తమిళంలోనూ 2022లో ఆహా తమిళ్ అంటూ అడుగుపెట్టింది. మొదట్లో బాగానే దూసుకుపోయిన ఈ సంస్ద ఇప్పుడు అడుగులు తడబడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
డిజిటల్ స్ట్రీమింగ్ సంస్దలన్నీ ఇప్పుడు ఆర్దికంగా కష్టమైన పరిస్దితులు ఎదుర్కొంటున్నాయి. వ్యూయర్ షిప్ నిలబెట్టుకోవటం,కొత్తవారిని ఆకట్టుకోవటం కోసం రకరకాల విన్యాసాలు చేయాల్సి వస్తోంది. అయితే కంటెంట్ మీద ఖర్చు పెట్టిన స్దాయిలో లాభాలు మాత్రం రావటం లేదని అంటున్నారు.
సినిమాలు,వెబ్ సీరీస్ లు, షోలు అని ఎన్ని చేసినా మిగతా ఓటీటీ సంస్దల నుంచి ఆప్షన్స్ పెరగటంతో అటువైపు కూడా ఓ కన్నేస్తున్నాడు ప్రేక్షకుడు. దాంతో ఆహా మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ నష్టాలు మాత్రం ఆదాయం కన్నా ఎక్కువగా నమోదవుతున్నట్లు వార్తలువచ్చాయి.
గత సంవత్సరం భారత కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన వివరాల ప్రకారం ఆహా నష్టాలు రూ. 92 కోట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది ఈ నష్టాలు కేవలం రూ. 26 కోట్లకు కొద్దిగా అటూ ఇటూగా ఉన్నాయి. గత సంవత్సరం కంటే , ఈ ఏడాది నష్టాలు భారీగా పెరిగిపోయినట్లు చెప్తున్నారు.


ఆపరేటింగ్ రెవిన్యూ రూ. 26 కోట్ల నుంచి రూ. 76 కోట్లకు పెరిగినా.. ఖర్చుల్లో అదుపు లేకపోవడంతో ఆదాయాన్ని మించి నష్టాలు చూడాల్సి వచ్చిందని చెప్తున్నారు. లాస్ట్ ఇయిర్ ఖర్చులో ఉద్యోగుల కోసమే పెద్ద మొత్తంలో కేటాయించినట్లు తెలుస్తోంది. కంటెంట్ ఇతర సాంకేతిక అంశాలపై రూ. 109 కోట్లు ఖర్చు పెట్టగా...ఒక్క కంటెంట్ కోసం ఇందులో రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారు.
ఇక ఆహాకు లభిస్తున్న అత్యధిక ఆదాయం సబ్ స్క్రిప్షన్స్ మీదనే వస్తోందనేది నిజం. ఇతర ఆదాయాలు పరిమితంగానే ఉన్నాయి. మిగతా ఓటీటీల సబ్ స్క్రిప్షన్స్ తో పోలిస్తే ఆహా సబ్ స్క్రిప్షన్స్ బాగా తక్కువ. ఆహా ఫ్లాట్ ఫామ్ తెలుగులో రిజినల్ లాంగ్వేజ్‌లో బాగా పట్టు సాధించినా పోటీ తట్టుకోలేకపోతోంది.
దానికి తోడు తమిళంలోనూ ప్రారంభించడంతో ఖర్చులు పెరిగాయంటున్నారు. ఇక బాలయ్యతో చేసిన అన్ స్టాపబుల్ షో ,.మిగతా ఒరిజనల్ ప్రొడక్షన్స్ కోసం చాలా ఖర్చుపెట్టారు. వాటితో వ్యూయర్ షిప్ వచ్చింది కానీ అందుకు తగ్గ ఆదాయం వచ్చిందా అంటే సందేహమే అంటున్నారు. దాంతో ఓటీటీ వ్యాపారం రోజు రోజుకు రిస్క్ గా మారిపోతోంది. తమకున్న బడ్జెట్ లో ఆహా వీడియోస్ వారు చిన్న చిన్న సినిమాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. పెద్ద సినిమాలు అన్నీ Netflix, Prime Video, Disney + Hotstar, Zee5 వంటి సంస్దలకు వెళ్లిపోతున్నాయి.
దానికి తోడు అంతర్జాతీయ స్థాయి కంటెంట్‌ను ఎక్కువగా స్ట్రీమింగ్ చేస్తోన్న నెట్‌ఫ్లిక్స్.. ఇకపై లోకల్ కంటెంట్‌పై కూడా దృష్టిపెడుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. లోకల్ ఆడియన్స్‌ను మరింతగా అట్రాక్ట్ చేయడానికి ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ను పెంచబోతోంది. దీని కోసం ఆయా భాషలకు చెందిన నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేయబోతోంది. ఈ విషయాన్ని ఇటీవల టెడ్ సరండోస్ వెల్లడించారు.దానికి తోడు పైరసీ కూడా ఆహా ని దెబ్బేసింది. వెబ్ సైట్స్ నుంచి ఆహా ఎపిసోడ్ ను ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టేయటం మైనస్ గా మారింది.
ఇలాంటి ఇబ్బందికర పరిస్దితుల్లో ఆహా సంస్ద అమ్మకానికి పెడుతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సోనీ నెట్ వర్క్, సన్ నెట్ వర్క్ , జియో వంటి సంస్దలతో ఇప్పటికే డిస్కషన్స్ మొదలయ్యాయి అంటున్నారు. అయితే ఇదేమీ అఫీషియల్ సమాచారం కాదు. ట్రేడ్ వినపడుతున్న వార్తలను ఆధారంగా చేసుకుని చెప్తున్న విషయాలే.


Read More
Next Story