అపుడు ఎన్టీఆర్ కు జరిగిందే ఇపుడు బన్నీకి జరుగుతుందా?
అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన తప్పే.. ఇప్పుడు బన్నీ కూడా చేస్తున్నాడా?
వరుసగా విజయాలు సాధిస్తున్నప్పుడే ఏ వ్యక్తి అయినా మరింత అణకువ, వినయంతో ఉండాలి. విజయాలు చూసి పొంగిపోతే.. కన్నూమిన్నూ గానక ప్రవర్తిస్తే ఆ తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేని మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారం అలాగే ఉందని హార్డ్ కోర్ మెగాభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
మెగా ట్యాగ్ నుంచి అల్లు అర్జున్ దూరంగా జరుగుతున్నాడు. ఇది నిజమని అందరూ అంగీకరిస్తున్నదే. అందరు హీరోలకు అభిమానులు ఉంటారు కానీ తనకు ఆర్మీ ఉందని అతడే పలుమార్లు చెప్పుకున్నాడు. గతంలో ఒక ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి.. ‘చెప్పను బ్రదర్’ అంటూ పెద్ద వివాదమే రేపాడు.
ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు తన భార్య (స్నేహా రెడ్డి)కు స్నేహితురాలి భర్త అంటూ కర్నూలు జిల్లా నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికిశోర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించాడు. ఆయన అడగకపోయినా సరిగ్గా ఎన్నికల ముంగిట నంద్యాలకు వెళ్లి శిల్పా రవికిశోర్ కు తన మద్దతు తెలిపి వచ్చాడు. తద్వారా పరోక్షంగా తన మద్దతు వైసీపీకే అనే అభిప్రాయం కలిగేలా అల్లు అర్జున్ చేశాడనేది మెగాభిమానుల అభియోగం.
ఓవైపు తన సొంత మేనత్త (చిరంజీవి సతీమణి సురేఖ) మరిది పవన్ కళ్యాణ్ వైసీపీపై ఊపిరిసలపని పోరాటం చేస్తూ ముందుకు వెళ్తుంటే ఏ కోశానా మద్దతు ప్రకటించని బన్నీ పిలవని పేరంటానికి వెళ్లినట్టు నంద్యాల వెళ్లి శిల్ప రవికిశోర్ కు మద్దతు ప్రకటించడం మెగాభిమానుల్లో ముఖ్యంగా జనసేన శిబిరంలో కాకరేపింది.
అల వైకుంఠపురం, పుష్ప సినిమాలతో అల్లు అర్జున్ మార్కెట్ పెరిగిందన్న మాట వాస్తవం. అతడు స్టార్ హీరోల్లో ఒకడనడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇందులో అతడి సొంత కష్టం ఉన్నా.. ఇదంతా మెగా హీరో అనే ట్యాగ్ వల్లే లభించాయనేది కూడా అంతే నిజమంటున్నారు. మెగా కుటుంబం హీరో కాకపోయింటే అల్లు అర్జున్ మొదటి సినిమా.. ‘‘గంగోత్రి’’తోనే అతడి సినీ కెరీర్ కు ఎండ్ కార్డు పడేదనే అభిప్రాయాలు అప్పట్లోనే బలంగానే వినిపించాయి. ముఖ్యంగా గంగోత్రి విడుదలయినప్పుడు బన్నీ లుక్స్ పైన వచ్చిన విమర్శలు ఇప్పటివరకు మరే హీరో మీద రాకపోవడం గమనార్హం.
నందమూరి కుటుంబ హీరో... జూనియర్ ఎన్టీఆర్ సైతం మొదట్లో స్టూడెంట్ నంబర్ వన్, ఆది, సింహాద్రి ఇలా వరుస హిట్లతో దూసుకుపోయినప్పుడు.. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు కొంచెం తలగెరేశాడనే టాక్ నడిచింది. ఆ తర్వాత టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉండి ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇలా పలు సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ వైఖరి తీవ్ర విమర్శలపాలైంది.
ముఖ్యంగా విజయవాడలో ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి జగన్ ప్రభుత్వం పేరు మార్చిన ప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ‘కర్ర విరగదు.. పాము చావదు’ అన్నట్టు సోషల్ మీడియాలో స్పందించడం నందమూరి అభిమానులను బాధపెట్టింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అనుంగ అనుచరులుగా ముద్రపడి, అతడి సిఫారసులతోనే టీడీపీ టికెట్లు దక్కించుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్.. చంద్రబాబు, నారా లోకేశ్ లపై దారుణమైన బూతులతో విరుచుకుపడ్డా జూనియర్ ఎన్టీఆర్ వారిని వారించలేదు.. ఇదేంటని మందలించలేదు. దీంతో బలమైన కమ్మ సామాజికవర్గం జూనియర్ ఎన్టీఆర్ ను తమవాడిగా గుర్తించడం మానేసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. అప్పటివరకు కమ్మ సామాజికవర్గం యువతలో కాస్తో కూస్తో ఎన్టీఆర్ పైన ‘మనవాడు’ అని ఉన్న అభిమానం కూడా పోయిందనేవారు ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తన వ్యవహార శైలి ద్వారా బలమైన కమ్మ సామాజికవర్గం అండదండలు కోల్పోయారనే అంతా అంటున్నారు. ఆ సామాజికవర్గం సినిమాలపరంగా నందమూరి బాలకృష్ణతోనే ఇప్పటికీ ట్రావెల్ అవుతోంది. బాలకృష్ణ తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నడిచే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో కమ్మ సామాజికవర్గం తమ భవిష్యత్ సూపర్ స్టార్ ని మోక్షజ్ఞలోనే చూసుకుంటోంది.
ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికొస్తే అతడు కూడా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహార శైలితోనే సాగుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను వైసీపీ నేతలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడితే ఏనాడు ఖండించని బన్నీ.. వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాకుండా స్వయంగా నంద్యాలకు వెళ్లి తన మద్దతును తెలియజేశాడు. తద్వారా తన మద్దతు, తన అభిమానుల మద్దతు వైసీపీకే అనేదాన్ని స్పష్టంగా ధ్రువీకరించాడు.
అంతేకాకుండా ఈ వ్యవహారంపై విమర్శలు వచ్చినా బన్నీ స్పందించలేదు. పైగా ఇటీవల దర్శకుడు సుకుమార్ భార్య తబిత నిర్మాతగా వచ్చిన ఒక సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వెళ్లిన బన్నీ అక్కడ కూడా ఎవరూ అడగకపోయినా మరోసారి తేనెతుట్టెను కదిపాడు. ‘‘నా మనసుకు నచ్చితే నేనొస్తా’’ అంటూ స్ట్రెస్ చేసి మరోసారి వివాదాన్ని రేపాడని మెగాభిమానులు గుర్రుగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే స్పందించిన తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి సత్యనారాయణ.. అల్లు అర్జున్ పైన తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘అల్లు అర్జున్ ఏమైనా పుడింగా..? మాకు మెగా కుటుంబమే తెలుసు.. ఇక్కడ అంతా మెగాభిమానులే. అలా కాదని షామియానా దుకాణాల్లా, బ్రాంచ్ ఆఫీసుల్లా మేం వేరే పెట్టుకున్నాం అంటే వారిని మేం పట్టించుకోం. అల్లు అర్జున్ ను రావాలని మేమైనా అడిగామా? అయినా అతడు నంద్యాల వెళ్లాడు.. వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేసినా గెలిపించుకోలేకపోయాడు.. అంతకుముందు అనకాపల్లిలో అతడి తండ్రి అల్లు అరవింద్ పోటీ చేస్తేనే గెలిపించుకోలేకపోయాడు’’ అంటూ నిప్పులు చెరిగారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ అంతకుముందు హీరోలు పద్దతిగానే ఉండేవారని.. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్లూ హీరోలయ్యారని వ్యాఖ్యానించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పైన మాట్లాడుతూ పవన్ క్యాజువల్ గా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అల్లు అర్జున్ మామ (అల్లు అర్జున్ భార్య స్నేహ తండ్రి) ఒక యూట్యూబ్ చానెల్ తో మాట్లాడుతూ పవన్ ఆ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చిరంజీవి.. పవన్ తో మాట్లాడి ఈ వివాదాన్ని సర్దుబాటు చేయాలని కోరడం గమనార్హం.
ఇలా వివాదాల మీద వివాదాలను కెలుక్కుంటూ వస్తున్న అల్లు అర్జున్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ వ్యవహారంలో బన్నీ చేసిన పని విమర్శలపాలైంది. అత్యాచారానికి గురయిన అమ్మాయికి అండగా నిలవడంతోపాటు ఆమెకు తన సినిమాల్లో అవకాశాలిస్తానని అల్లు అర్జున్ ఆఫర్ ఇచ్చాడు.
మరి ఇదే పని తనతో పుష్ప సినిమాలో నటించిన కేశవ పాత్రధారి విషయంలో అల్లు అర్జున్ ఎందుకు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. పుష్పలో అల్లు అర్జున్ కు సహాయకుడిగా నటించిన కేశవ (సినిమాలో పాత్ర పేరు) ఒక అమ్మాయిపైన అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడిపైన కేసు కూడా నమోదైంది. పోలీసులు అతడిని అరెస్టు చేస్తే పుష్ప 2 సినిమా షూటింగ్ ఆగిపోకూడదని అతడికి బెయిల్ ఇచ్చి మరీ చిత్ర యూనిట్ తీసుకొచ్చిందనే ఆరోపణలున్నాయి. మరి ఆ అమ్మాయికి అల్లు అర్జున్ ఎందుకు అండగా నిలవలేదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
మరోవైపు కులాభిమానం మెండుగా ఉండే ఆంధ్రాలో అల్లు అర్జున్ కు ఇప్పటిదాకా బలంగా మద్దతు తెలిపింది కాపులే. ఎవరు కాదన్నా ఔనన్నా అతడి సినిమాలకు ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు పెట్టేవారిలో 90 శాతం మంది కాపులే. మిగతా కులాల్లో కొంతమేర అభిమానులు ఉండొచ్చు. ఇటీవల వరకు అల్లు అర్జున్ ను మెగా హీరోగా, చిరంజీవి కుటుంబంలోని హీరోగానే గుర్తిస్తూ వచ్చారు. అయితే బన్నీ తనను తాను ఐకాన్ స్టార్ గా ప్రకటించుకోవడంతోపాటు, తనకు మాత్రమే ఆర్మీ ఉందని చెప్పుకోవడం, మెగాభిమానులను బాధపెట్టే పనులు చేయడం సహజంగానే కాపు సామాజికవర్గంలో అతడి పట్ల అయిష్టతను పెంచుతున్నాయనే టాక్ నడుస్తోంది.
సినిమాల పరంగా మెగాభిమానులకు, కాపు సామాజికవర్గానికి మొన్న చిరంజీవి.. నిన్న.. పవన్ కళ్యాణ్.. నేడు రామ్ చరణ్, భవిష్యత్ లో అకిరా నందన్ (పవన్ కళ్యాణ్ కుమారుడు) మాత్రమేనని అంటున్నారు. అల్లు అర్జున్ కు ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసని హార్డ్ కోర్ మెగాభిమానులు, కాపు యువకులు అంటున్నారు. వరుసగా విజయాలు సాధిస్తున్నప్పుడు ఏం చేసినా బాగానే ఉంటుంది.. ఎప్పుడయితే ఒక పరాజయం పలకరిస్తుందో అప్పుడు కానీ అసలు సంగతి బోధపడదని అల్లు అర్జున్ విషయంలో అభిప్రాయపడుతున్నారు.
భారీగా ఆస్తులు, మందీ మార్బలం, సోషల్ మీడియా, ఒక పత్రిక, టీవీ చానెల్, అధికారం ఇలా అన్నీ ఉంటేనే జనసేనాని పవన్ కళ్యాణ్ ధాటికి వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ కకావికలం అయ్యింది. మరి కోరి వివాదాలను, అది కూడా పవన్ కళ్యాణ్ తోనే పరోక్షంగా యుద్ధానికి సై అంటున్న అల్లు అర్జున్ తట్టుకోగలడా?
Next Story