ఎన్టీఆర్ దారిలోనే పవన్? సినిమాలు కంటిన్యూ చేస్తారా?
x

ఎన్టీఆర్ దారిలోనే పవన్? సినిమాలు కంటిన్యూ చేస్తారా?

మన దేశంలో సినిమాలకు, రాజకీయాలకు మధ్య ఎప్పటి నుంచో బలమైన అనుబంధం ఉంది. చాలా మంది నటులు "ప్రజా సంక్షేమం కోసం పాటుపడటానికి" వారి సొంత పార్టీలను స్థాపించారు.


మన దేశంలో సినిమాలకు, రాజకీయాలకు మధ్య ఎప్పటి నుంచో బలమైన అనుబంధం ఉంది. చాలా మంది నటులు "ప్రజా సంక్షేమం కోసం పాటుపడటానికి" వారి సొంత రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు. అందరూ ఒకే స్థాయిలో విజయవంతం కాకపోయినా, రాజకీయ చర్చకు కొత్త కోణాన్ని జోడించడంలో ఈ ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్‌గానే సాగాయి. తమిళనాట ఎంజీఆర్, జయలలిత, తెలుగులో ఎన్టీఆర్ సినిమా నుంచి వచ్చి రాజకీయాల్లో ఎదిగి ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో ప్రయాణం చేస్తున్నారు. నిన్నటి జనసేన విజయం ఖచ్చితంగా భవిష్యత్‌లో పవన్‌ని ముఖ్యమంత్రిగా చూస్తామనే భరోసాని ఇస్తోంది. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలపై ఏమేరకు దృష్టి పెడతారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అందుకు అలనాటి ఎన్టీఆర్ టైమ్ నాటి సినీ, రాజకీయ ప్రయాణం గుర్తు చేసుకుంటున్నారు.

రాజకీయాల్లోకి వచ్చే దాకా తెలుగు చిత్ర సీమలో నటసార్వభౌముడుగా ఎన్టీరామారావు మకుటం లేని మహరాజులా వెలిగిపోయారు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో తాను మాత్రమే పోషించే విభిన్నమైన పాత్రలు వేసి తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేశారు. ఆ ఇమేజ్‌తోనే ప్రజల్లోకి వెళ్లారు. రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత అప్పటి వరకు రాజకీయం అంటే తెలియని మారుమూల పల్లెలో చదువుకోని వారికి సైతం రాజకీయ పాఠాలు నేర్పించారు.

అలా రాజకీయాల్లో కూడా ఆయన తన ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయన కూడా తెలుగు ఇండస్ట్రీలో మిగతా ఏ హీరోకు లేనంత మంది అభిమానులను సంపాదించారు. జనసేన అనే ఓ కొత్త పార్టీ ప్రజల్లోకి తీసుకు వచ్చి గెలిచారు. ఇప్పుడు జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇక చురుకైన పాత్ర పోషిస్తారని, రాజకీయ క్షేత్రంలో తడాఖా చూపించడానికి సిద్ధమవుతారని అంటున్నారు.

ఇన్నేళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఏ పార్టీకి రాని విధంగా జనసేన 100 % స్ట్రైట్ రేట్‌తో విజయం సాధించి రికార్డ్ గెలుపుని దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో పాటు తనతో పాటు పోటీ చేసిన ప్రతిఒక్కరిని గెలిపించుకున్నారు. ఈ గెలుపుతో ప్రజలు తనకు పెద్ద బాధ్యత ఇచ్చారని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు.

అయితే అదే జరగాలంటే మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న మూడు సినిమాలని వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. చాలా కాలం క్రితం మొదలెట్టిన హరి హర వీరమల్లు సినిమాను పూర్తి చేయాలి. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను కూడా పూర్తి చేయాలి. వీటితో పాటు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజి చిత్రం పూర్తి చేయాలి. అప్పుడే పవన్ ఫ్రీ అవుతారు. అప్పుడు మాత్రమే కొత్త సినిమాలు కమిటయ్యేందుకు అవకాశం కలుగుతుంది.

అయితే వీటిలో ఏ సినిమాను ముందు మొదలెడతారు. ఎంత వేగంగా పూర్తి చేస్తాడనేది నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం. అవకాశం ఉంటే ఈ ఏడాదిలోనే మూడు సినిమాలు పూర్తి చేసి పరిపాలనలో పవన్ కళ్యాణ్ భాగం కావాల్సి ఉంటుంది. ఈ సినిమాల తర్వాత సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. అలాగే ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో ఇద్దరు దర్శకుల కథలు విని రెడీగా ఉంచారని అంటున్నారు. మరి వాటిని ముందుకు తీసుకెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి అయిన తరువాత అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక.. అప్పట్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే ముందు ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా తీశారు. తర్వాత రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్నప్పుడు చేసిన మూవీ బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర‌.1988లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ స‌మ‌యంలో సినిమా మొద‌లు పెట్ట‌డం ప‌ట్ల విప‌క్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నేత‌ల నుంచీ విమర్శ‌లు వ‌చ్చాయి.ప్ర‌భుత్వ ఉద్యోగులు సైతం ఎన్టీఆర్ సినిమా ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త క‌న‌బ‌ర్చారు.

ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూనే ఈ సినిమాలో న‌టించారు. సినిమా షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు అధికారులు ఫైల్స్ తీస‌కొచ్చేవారు. అక్క‌డే ముఖ్య‌మైన ద‌స్త్రాల‌పై సంత‌కాలు చేసేవారు. అది చూసి ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా విమ‌ర్శించేవారు. సినిమా విడుద‌ల చేద్దాం అనే స‌మ‌యంలోనే ఎన్నిక‌లు వ‌చ్చాయి. దీంతో రిలీజ్ వాయిదా ప‌డింది.

ఎన్నో ఇబ్బందులకు గురైన ఈ సినిమా 1991 ఏప్రిల్ 19న విడుద‌ల అయ్యింది. ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ పొందింది.

అది గతం. ఇప్పుడు పవన్ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో ప్రక్క ప్రభుత్వంలో కీలకమైన మంత్రిత్వ శాఖ తీసుకుని నిర్వహిస్తారని అంటున్నారు. అలాగే జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడితే 2029 ఎన్నికలకి బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామని కార్యకర్తలు, అభిమానులు నమ్ముతున్నారు. అయితే పవన్ సినిమా వీరాభిమానులు మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉన్నా సరే... అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక సినిమా చేసి వదలాలని కోరుకుంటున్నారు. మరి పవన్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read More
Next Story