సంగీత్ శోభన్ ‘రాకాస’ మూవీ రివ్యూ
x

సంగీత్ శోభన్ ‘రాకాస’ మూవీ రివ్యూ

ఈ కోటలో మ్యాటర్ ఉందా?


అనగనగా రాకవనం అనే ఓ మారు మూల ఊరు. ఆ ఊరి చివర ఒక పాత కోట.. అందులో సెటిలైన ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసుడు (రాకాస). ఆ రాక్షసుడికి తోక చుక్క కనపడినప్పుడల్లా ఆకలేస్తూంటుంది. అప్పుడు ఆ ఉళ్లోనుంచి ఎవరో ఒకరిని 'బలి' ఇస్తేనే ఆ ఊరు సేఫ్ గా ఉంచుతూంటాడు. ఇదో వెయ్యేళ్ల గా జరుగుతున్న వింత వ్యవహారం. పూర్వం ఒక రాజు ఆ రాకాసని ఖతం చేద్దామని సైన్యంతో మరీ ఆ కోటలోకి వెళ్లి సీన్ రివర్స్ అయ్యి చనిపోతాడు. అప్పటి నుండి ఆ కోట అంటే ఊరి జనాలకి వణుకు. అయితే అలా ప్రాణాలు పణంగా పెట్టాల్సిన ఊళ్లో ఎందుకు నివాసం ఉండటం అని జనం వెళ్లిపోరు..టైమ్ వచ్చినప్పుడు ఎవరో ఒకరిని బలి వేసేద్దాములే అన్నట్లు అక్కడే తోక చుక్క కోసం వెయిటింగ్.

కట్ చేస్తే.. 2026లో మన హీరో వీరు (సంగీత్ శోభన్) సీన్ లోకి వస్తాడు. అమెరికా నుండి ఎగిరి గంతేస్తూ ఆ ఊరికి వచ్చి తన క్రష్‌కి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే, ఆమె ఆల్రెడీ వేరే వాడితో తాళి కట్టించుకుంటూ మనోడికి గట్టి హార్ట్ బ్రేక్ ఇస్తుంది. ఆ బాధలో ఫుల్లుగా బాటిల్ ఎత్తేసి, రచ్చ చేస్తూ.. అనుకోకుండా సోము (వెన్నెల కిషోర్) మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. పోలీసులు పాస్‌పోర్ట్ సీజ్ చేయడంతో, ఎలాగైనా సోముని కనిపెట్టి తన పాస్‌పోర్ట్ తిరిగి తెచ్చుకోవాలని స్నేహితుడు బాలు (గెటప్ శీను) తో కలిసి ట్రై చేస్తుంటాడు.

కథలో ట్విస్ట్ ఏంటంటే.. అదే టైమ్‌లో కోట నుండి 'నరబలి' కోసం పిలుపు వస్తుంది. ఊరి పెద్దలు కోటలోకి ఎవరో ఒకరిని పంపాలని ప్లాన్ చేస్తుంటే, మన హీరో మిత్రుడు బాలు (గెటప్ శీను) బలి పశువు అవుతాడు. తన ఫ్రెండ్‌ని కాపాడదామని అతి తెలివి వాడి, ఆర్పకూడని దీపం ఆర్పేసి.. చివరకు మన హీరోయే కోటలోకి గెస్ట్ ఎంట్రీ ఇస్తాడు.

అప్పుడు ఏమైంది ..అసలు కోటలో ఉంది రాక్షసుడేనా? లేక అదైమైనా వెయ్యేళ్ల నాటి 'బిగ్ బాస్' హౌసా? అమెరికా రిటర్న్, పిరికితనం లో పిహెచ్‌డీ చేసిన మన వీరు.. ఆ రాకాసని ఎలా డీల్ చేశాడు? తన పాస్‌పోర్ట్ పట్టుకుని మళ్ళీ ఫ్లైట్ ఎక్కాడా లేదా అనేదే ఈ క్రేజీ 'రాకాస' స్టోరీ! అలాగే ఈ డేంజర్ జోన్ లోకి సుబ్బలక్ష్మి (నయన్ సారిక) ఎలా, ఎందుకు దూరింది? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

ఈ సినిమా కథ మొదలు అవ్వగానే ఇది బకాసురుడు కథనుంచి ప్రేరణ తీసుకున్నారని అర్దమవుతుంది. తెలిసిన ఐడియా అయితే దాన్ని ఇంకెంత కొత్తగా చెప్తారో అని ఇంట్రస్ట్ గా ఎదురుచూస్తాం. అలాగే కొత్త డైరక్టర్ అనగానే ఒక కొత్త ప్రపంచం, కొత్త కథ, కొత్త ట్రీట్మెంట్ ఆశిస్తాం. కానీ “ఇది మనం ఎక్కడో చూసినట్టుంది కదా?” సినిమా మొదటి 10 నిమిషాల్లోనే అనిపిస్తుంది. అయితే ఎన్ని తెలుగు సినిమాలు అనిపించవు. తెలిసిన కథనే కొత్తగా చెప్పాలనుకున్న ప్రయత్నం ఇదే స్టోరీ డిజైన్ అయ్యింటుంది అని ఫిక్సై సినిమా చూస్తూంటాం.

సినిమా ఓ కోటలో ఉన్న రాక్షసుడు సీన్‌తో మొదలవుతుంది. అదే సీన్ మొత్తం కథకి ఒక ఫోర్‌షాడోలా పనిచేస్తుంది. కానీ సమస్య ఏంటంటే… అది చాలా స్పష్టంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే మిస్టరీ ఇవ్వాల్సిన చోట, ముందే క్లారిటీ ఇచ్చేస్తుంది. దాంతో సినిమా స్టార్ట్ అవ్వగానే క్లైమాక్స్ ఏంటో గెస్ చేసేయొచ్చు.

దీనికి తోడు ఫస్టాఫ్ ని నింపాలి కదా అన్నట్లు ..హీరో బ్రేకప్ పెయిన్, సోము మిస్సింగ్ అంటూ ఇంటర్వెల్ వరకు కథను సాగదీశారు. ఆడియన్స్ అందరూ 'ఎప్పుడు కోటలోకి వెళ్తాం రా బాబు' అని వెయిట్ చేసేలా ఉంది పరిస్థితి. ఫస్టాఫ్ లో కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయినా, మెజారిటీ గ్యాగ్స్ మాత్రం 'ట్రై హార్డ్' లాగే ఉన్నాయి. ఇంటర్వెల్ గొప్పగా అనిపిస్తుంది...ఎందుకంటే అప్పటికి కథలోకి వస్తారు.

థాంక్స్ టు సెకండాఫ్! కోటలోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చే 20-25 నిమిషాల అడ్వెంచర్ అండ్ కామెడీ మాత్రం ఫైర్. ముఖ్యంగా హీరో నటన, టైమింగ్ సినిమాకి కొంచెం ఎనర్జీ ఇస్తాయి.

అయితే రెగ్యులర్ సినిమాలు చూసే వాళ్లకి, ఇది మొత్తం చూస్తుంటే 1981లో వచ్చిన Raiders of the Lost Ark సీక్వెన్స్‌లను గుర్తు చేస్తుందేమిటి అనిపిస్తుంది. అలాగే Anji వైబ్ కూడా బలంగా ఉంటుంది.

“Cinema is a matter of what's in the frame and what's out.” – Martin Scorsese

కానీ ఇక్కడ ఫ్రేమ్‌లో ఉన్నది కంటే… మన మెమరీలో ఉన్న పాత సినిమాలే ఎక్కువగా కనిపిస్తాయి. అలాగని తీసి పారేయటానికి లేదు. సినిమాలో కొన్ని కామెడీ ఎపిసోడ్స్ నిజంగానే నవ్విస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు “లౌడ్ లాఫ్” మోమెంట్స్ ఇస్తాయి. కానీ ఫస్ట్ హాఫ్‌లో మాత్రం కామెడీ బలవంతంగా అనిపిస్తుంది. జోక్స్ ఎక్కువగా కావాలని ప్రయత్నించినట్లు కనిపిస్తాయి… ఫలితంగా వర్క్ కావు.

ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి రాక్షసుడికి హ్యూమన్ టచ్ అవసరమా? అనిపిస్తుంది. సినిమా మొత్తం ఒక క్రూరమైన రాక్షసుడిని బిల్డ్ చేస్తుంది.

కానీ చివరికి అతనికి ఒక సాఫ్ట్ బ్యాక్‌స్టోరీ ఇస్తుంది. ఇక్కడే పెద్ద మైనస్ గా అనిపిస్తుంది. అయినా ప్రతి విలన్‌కీ జస్టిఫికేషన్ ఇవ్వాలా?

కొన్ని సార్లు “ప్యూర్ ఈవిల్” కూడా స్టోరీకి అవసరం కదా.

టెక్నికల్ గా ..

అనుదీప్ మ్యూజిక్ అయితే మామూలుగా లేదు, సినిమాకి అసలైన బ్యాక్ బోన్. బిజీఎమ్ తో సీన్లని గట్టిగా హోల్డ్ చేశాడు.

రాజు ఎదురోలు (సినిమాటోగ్రఫీ): విజువల్స్ అన్నీ చాలా లైవ్లీగా ఉన్నాయి. ఆ కోట ఎన్విరాన్‌మెంట్‌ని, ఆ మూడ్‌ని బాగా క్యాప్చర్ చేశాడు. కొన్ని సీన్స్ పక్కా ఐ-ఫీస్ట్!

అన్వర్ అలీ (ఎడిటింగ్): ఎడిటింగ్ షార్ప్గా ఉంది. అనవసరమైన సోది లేకుండా సెకండాఫ్ ని పరుగెత్తించాడు.

వీఎఫ్ఎక్స్: విజువల్స్ అద్భుతం అనిపించకపోయినా కూడా.. నాసిరకం అనే ఫీల్ అయితే కలగలేదు.

నిహారిక కొణిదెల (పింక్ ఎలిఫెంట్): ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం టాప్ నాచ్. సినిమా రిచ్‌గా కనిపించేలా నిహారిక ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ప్యూర్ క్వాలిటీ!

నటీనటుల్లో ..

సంగీత్ శోభన్ వన్ మ్యాన్ షో . ఫస్టాఫ్‌లో గెటప్ శ్రీను, సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్‌తో సీన్లతో లాగేసారు. నయన్ సారిక బాగా చేసింది అనే కన్నా బాగుంది అనాలి. బ్రహ్మజీ, తనికెళ్ల భరణి, రోహిణి ఇతరులు తమ పాత్రలతో గుర్తుండిపోతారు.

ఫైనల్ థాట్

టైటిల్ చూసి, ఆ వెయ్యేళ్ల నాటి కోట సెటప్ చూసి గూస్‌బంప్స్ వచ్చే హారర్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం మీకు డిజప్పాయింట్‌మెంట్ తప్పదు. ఎందుకంటే ఈ సినిమాలో 'హారర్' కంటే 'హ్యూమర్' (కామెడీ) కే ఎక్కువ ఓటు వేశారు. లాజిక్ వెతక్కుండా, రొటీన్ స్టోరీని పట్టించుకోకుండా.. వీకెండ్ లో ఫ్రెండ్స్‌తో కలిసి ఒక చిల్ రైడ్ కోసం ఈ 'రాకాస' కోటలోకి ఎంట్రీ ఇవ్వొచ్చు!

Read More
Next Story