
రొమాంటిక్ కామెడీ జాహ్నవి కపూర్ ‘పరం సుందరి’ రివ్యూ
మ్యూజికల్ డ్రామా వర్కవుట్ అయ్యిందా?
పరమ్ సచ్ దేవ్ (సిద్దార్థ్ మాల్హోత్రా) కి బుర్ర నిండా స్టార్టప్ ఐడియాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ట్రై చేసి చూస్తే అవేమీ సక్సెస్ అవ్వలేదు. కోట్లు నష్టాలు తెచ్చిపెట్టాయి. తండ్రి పర్మిత్ సచ్‌దేవ్ (సంజయ్ కపూర్)ఎంత కోటీశ్వరుడు అయినా ఇలా కోట్లు తగలెట్టే పోగ్రామ్ పెట్టుకుంటే ఒప్పుకోడు కదా. అలాగని కొడుకూ ఊరుకోడు కదా. నేను సక్సెస్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తూంటాడు కదా. అలా ఎవరి బిజిలో వాళ్లు ఉండగా కొడుకు కి ఓ రోజు ఒకరు “AI తో డేటా అనలసిస్ ద్వారా ఆన్‌లైన్‌లో జంటలను కనుగొనడం” అనే డేటింగ్ స్టార్టప్ ఐడియా గురించి చెప్తారు.
అది నచ్చేసిన పరమ్ వెంటనే తన తండ్రిని ఓ 5 కోట్లు ఫండ్ ఇస్తే రీసెర్చ్ చేసి ఆ యాప్ ని లాంచ్ చేస్తానంటాడు. అప్పుడా తండ్రి ఒక కండీషన్ పెడతాడు “సరే నాయినా ఆ యాప్ సంగతి తర్వాత ముందు నువ్వు ఓ సోల్ మీట్ ని మీ యాప్ ద్వారా కనుక్కుని చూపెడితే ఆ కాన్సెప్టు నిజమని నమ్మి పెట్టుబడి పెడతా .” అంటాడు. తగ్గేదేలే అంటాడు కొడుకు పరమ్. ఆ ఛాలెంజ్ లాంటి కండీషన్ కి ఒప్పుకుని పరమ్ ఆ డేటింగ్ ప్లాట్‌ఫారమ్‌లో రిజిస్టర్ అవుతాడు.
ఆ తర్వాత అతనికి తెక్కెపట్టు సుందరి దామోదరన్ పిళ్లై ( జాన్వీ కపూర్) అనే కేరళ పల్లెలో ఉండే ఓ అమ్మాయి మ్యాచవుతుంది. ఆమె ఎవరా అంటే కేరళలో టూరిస్ట్‌లకు అతిథ్యమిచ్చే ఇంటిని నిర్వహిస్తూంటుంది. దాంతో ఎలాగైనా ఆమె ప్రేమను గెలుచుకోవాలని మన హీరోగారు అక్కడ ల్యాండ్ అవుతాడు. తన అభిరుచులకు భిన్నమైన సుందరిని ప్రేమలో పడేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.ఆమె ప్రేమను ఎలాగైనా గెలవాలని పరమ్ ఒక మలయాళ పాట నేర్చుకుంటాడు, ఇంకా అక్కడ కేరళ కలరిపట్టు క్రీడలో ప్రాక్టీస్ చేస్తూంటాడు. ఇలా బోలెడు చేస్తూండగా అతనికి ఓ ట్విస్ట్ పడుతుంది.
అదేమింటటే.. సుందరి చిన్నపాటి మిత్రుడు వేణు (సిద్ధార్థ శంకర్)తో ఆమెకు పెళ్లి నిశ్చయమవుతుంది. కథ ఇప్పుడు సుందరి వైపు కి టర్న్ తీసుకుంటుంది. ఆమె తనని వెతుక్కుంటూ వచ్చిన పరమ్‌ను ఎంచుకుంటుందా, లేదా వేణుని వివాహం చేసుకుంటుందా? అలాగే ఈ డేటింగ్ యాప్ విషయం ఆమెకు ఎప్పుడు తెలుస్తుంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
* విశ్లేషణ
‘పరం సుందరి’ సినిమా ని ఫెరఫెక్ట్ రొమాంటిక్ కామెడీ జానర్ లో తీర్చి దిద్దాలనే ప్రయత్నం చేసారు. అందులో తప్పేమీ లేదు. అయితే వచ్చిన చిక్కల్లా ఈ కథను ఓ ఇరవై ఏళ్ల క్రితం నాటి స్క్రీన్ ప్లే తో ముందుకు తీసుకెళ్లటమే. ఇందులో డేటింగ్ యాప్ అనేది తప్పించి కొత్తదనం ఏమీ లేదు అనిపిస్తుంది. దాంతో సినిమా మొత్తం చాలా ప్రెడిక్టబుల్ గా మారిపోయింది.ఇలాంటి కథలు ఒకప్పుడు మ్యూజికల్ హిట్స్ గా వచ్చేవి. దాంతో ఆ పాటలు మోజులో సినిమా కథ,కథనం కొట్టుకుపోయేది.అదే ఈ సినిమాకూ ట్రై చేసారు. ఓ రకంగా అదే ఫార్ములా ఉన్నంతలో చాలావరకు కలిసొచ్చింది. సినిమాకు హైలెట్ గా నిలిచింది సచిన్-జిగర్ ఇచ్చిన సంగీతమే. అదే లేకపోతే చూసే మన పరిస్దితి థియేటర్స్ లో డాన్సే.
ఇక ఈ సినిమాకు అత్యవసమైన కథ, స్క్రీన్ ప్లే అసలు మ్యాజిక్ చెయ్యలేదు. పోనీ లీడ్ రోల్స్ పోషించిన వాళ్లు కూడా సాదా సాదీగా రొటీన్ గా చేసుకుంటూ పోయారు. ఇక చూసిన వాళ్లు మాత్రం కలెక్షన్స్ తో ఏమి మ్యాజిక్ చేస్తారు.
అయినా హిందీ కథలో కేరళ కథ ఏమిటంటారా.. ఈ మధ్యన బాలీవుడ్ పరిశ్రమ ..ఇక్కడ సౌత్ లో కలెక్షన్స్ కోసం ఇక్కడ మార్కెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకోసం కథలో .. నార్త్, సౌత్ భారతీయ సంస్కృతులను కలపాలని ప్రయత్నం చేయటం మొదలెట్టింది. షారూఖ్ తో చేసిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ అలాంటిదే. అలాగే ‘కిసీ కా భాయి కిసీ కీ జాన్’ హిందీ–తెలుగు కాంబోతో ప్రయత్నించి ఘోరంగా ఫ్లాప్ అయింది.
ఇప్పుడు అదే తరహాలో, ‘పరమ్ సుందరి’ హిందీ, మలయాళ్ సంస్కృతితో మిళితం చేయాలని ప్రయత్నించింది. ఇప్పుడూ ఫలించినట్లు అనిపించటం లేదు. కామెడీ, రొమాన్స్ ఏదీ అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాకపోవటంతో చాలా చోట్ల విసిగెత్తించింది. ఎమోషనల్ గానూ వర్కవుట్ కాకపోవటం పెద్ద డ్రాబ్యాక్.
*టెక్నికల్ గా..
ఇలాంటి సినిమాలకు కావాల్సింది కెమెరా వర్క్, మ్యూజిక్ డిపార్మెంట్. ఇందులో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఉన్నంతలో చాలా ప్లస్ అయ్యాయి. సోను నిగమ్ పాడిన పర్దేశియా పాట ను బ్యాక్ గ్రౌండ్ స్కోరుగా వాడుకోవడం సినిమాకు పెద్ద ప్లస్ గా మారింది. కెమెరా వర్క్ బాగుంది.
కేరళ అందాలను సినిమాటోగ్రాఫర్ సంతానకృష్ణ రవిచంద్రన్ అద్బుతంగా కెమెరాలో బంధించాడు. ఎడిటింగ్ సెకండాఫ్ లో తేలిపోయింది. స్క్రిప్టు సరిగ్గా లేకపోవటం ఏ డిపార్టమెంట్ బాగున్నా ఫలితం లేకుండా పోయింది. ఇక తుషార్ జలోటా డైరక్షన్ విషయానికి వస్తే.. జస్ట్ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
*నటీనటుల్లో ..
సిద్ధార్థ్ మల్హోత్రా తన చార్మింగ్ లుక్స్ తో ఉన్నాడు. బాగా చేసాడు. అలాగే జాన్వీ కపూర్ కూడా మళయాళి అమ్మాయిగా ఫ్రెష్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బావుంది. కానీ, రొటీన్ స్టోరీలో ఏమీ చేయలేకపోయారు. కేరళ బ్యాక్‌డ్రాప్ కూడా సినిమాను కాపాడలేకపోయింది.
* పైనల్ థాట్
పాటలు కోసం ఈ సినిమాకు వెళ్లచ్చు. అంతకు మించి సినిమాలో ఏమీ లేదు. జాహ్నవి కపూర్ కు పెద్దగా కలిసొచ్చేదేమీ లేదు. ఆమె అభిమానులు కూడా ఈ సినిమా నుంచి ఆశించి పొందేదేమీ ఉండదు.