
విజయ్ సేతుపతి ‘కాట్టాన్’ రివ్యూ
ఈ వెబ్ సిరీస్ మాస్టర్ పీసా లేక టైమ్ వేస్టా?
తమిళనాడులోని ఒక మారుమూల అటవీ ప్రాంతం.. అక్కడ ఒక చిన్న పోలీస్ స్టేషన్. విచిత్రం ఏమిటంటే గత మూడేళ్లుగా అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో పనిలేని ఆ స్టేషన్‌ను ఎత్తేయాలని అధికారులు నిర్ణయించుకుంటారు. కానీ అదే ఊరికి చెందిన కానిస్టేబుల్ కాళీ పాండియన్‌కు (వడివేల్ మురుగన్) మాత్రం ఇది ఇష్టం లేదు. స్టేషన్ పోతే తన ఊరు వదిలి వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్న తరుణంలోనే, ఊహించని విధంగా ఆ ఊరి పొలిమేరలో మొండెం లేని ఒక తల దొరుకుతుంది. ఆ ఒక్క తల ఆ పోలీస్ స్టేషన్ తలరాతనే కాదు, ఎంతో మంది జీవితాల్లోని చీకటి కోణాలను వెలికితీస్తుందని అప్పటికి తెలియదు.
ఎవరీ ముత్తు? ఒక్కొక్కరిది ఒక్కో కథ!
దొరికిన తల ముత్తు అలియాస్ కాట్టన్ (విజయ్ సేతుపతి) అనే వ్యక్తిదని పోలీసులు గుర్తిస్తారు. ఎస్ఐ సిద్ధార్థన్ (ముత్తుకుమార్), కాళీ పాండియన్ దర్యాప్తు మొదలుపెట్టగా ముత్తు గురించి విస్తుపోయే నిజాలు బయటపడతాయి. ముత్తు ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్ శివన్న (మిళింద్ సోమన్) దగ్గర పని చేసేవాడు, ఆ తర్వాత డ్యాన్స్ గ్రూప్ మేనేజర్‌గా, గడియారాల మెకానిక్‌గా, చివరకు గొర్రెల ఎరువు అమ్మేవాడిగా రకరకాల అవతారాలు ఎత్తాడు. ఇంత సాదాసీదాగా కనిపించే ముత్తు దగ్గర కోట్ల కొద్దీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బును అతడు అవసరంలో ఉన్న వారికి ఎందుకు పంచాడు?
అలాగే ముత్తు పెళ్లి చేసుకోవాలని ఆశపడిన సింధు ఎలా చనిపోయింది? అతని జీవితంలోకి వచ్చిన మీనా ఎవరు? డ్రగ్ డీలర్ జానీతో (సుదేవ్ నాయర్) ముత్తుకు ఉన్న గొడవ ఏంటి? ఒక జాతరలో జరిగిన జంట హత్యలకు, ముత్తుకు ఉన్న సంబంధం ఏంటి? అన్న ప్రశ్నలు పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ముత్తు ప్రాణాలు తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది? కేరళ మంత్రి బెన్నీకి ఈ కథతో ఉన్న లింక్ ఏంటి? దర్యాప్తు సాగుతున్న కొద్దీ ముత్తు ఒక మనిషి కాదు, ఒక అంతుచిక్కని మిస్టరీ అని అర్థమవుతుంది.
ఈ క్రమంలో ముత్తు మరణం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్‌ను ఎస్ఐ సిద్ధార్థన్, కానిస్టేబుల్ కాళీ పాండియన్ కనిపెట్టగలిగారా? కాళీ పాండియన్ ఇంట్లో పనిచేసే కరుప్పుకు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? అన్నది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
ఎనాలసిస్ :
కథ పరంగా చూస్తే ఇదేమీ కొత్తది కాదు. ప్రేమించిన వాళ్లను కోల్పోయిన ఓ వ్యక్తి, అందుకు కారణమైన వాళ్లపై రివేంజ్ తీర్చుకోవడం. ఈ జానర్‌లో మనం ఎన్నో కథలు చూసాం. కానీ వాటిని ఎలా చెబుతున్నారు అన్నదే ఎప్పుడూ అసలు గేమ్. ‘కాట్టాన్’ కూడా అదే ట్రై చేసింది. ఒక సింపుల్ స్టోరీని మల్టీ లేయర్డ్ న్యారేషన్‌తో చెప్పడం.
సిరీస్ మొదటి ఎపిసోడ్ పూర్తిగా సెటప్ మీదే ఉంటుంది. పోలీస్ స్టేషన్, కాళిపాండియన్ క్యారెక్టర్, ఇతర పాత్రలు. ఇవన్నీ పరిచయం అవుతాయి. కానీ అసలు కథ మొదలయ్యేది ముత్తు తల దొరికే సీన్ నుంచే. అక్కడినుంచి ఇన్వెస్టిగేషన్ రూపంలో ముత్తు లైఫ్ ఒక్కో లేయర్‌గా బయటపడుతుంది. ఇక్కడ డైరెక్టర్ వాడిన నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే టెక్నిక్ ఒక ఆసక్తికరమైన అంశం. టైమ్‌లైన్‌ల మధ్య జంప్ అవుతూ, ప్రతి ఫ్లాష్‌బ్యాక్ ఒక పజిల్ పీస్‌లా డిజైన్ చేసారు. ఈ టెక్నిక్ కథనపరంగా బాగున్నా... క్లారిటీ ఇవ్వాల్సిన చోట కాస్తా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఆడియెన్స్ కథలోకి లీనమవ్వాల్సిన చోట ఇబ్బంది పెట్టింది.
అలాగే ఇలాంటి కథలకు కావాల్సిన ఎమోషనల్ డెప్త్ లేకపోవడం పూర్తి స్థాయిలో ఎలివేట్ చేయలేకపోయింది. కొన్ని ట్రాక్స్ సీరియస్ టోన్ మధ్యలో సడన్‌గా తేలిపోయినట్లుగా అనిపిస్తాయి. సిరీస్‌లో పెద్ద సమస్య లెంగ్త్. పది ఎపిసోడ్స్ అవసరం లేకపోయినా, కథను అంత వరకు లాగిన ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా కాళిపాండియన్ ఫ్యామిలీ ట్రాక్. ఈ ట్రాక్ కథా పరంగా ఇన్వెస్టిగేషన్‌కు ఏం పనికిరాదు, కానీ స్క్రీన్ టైమ్ మాత్రం తినేస్తుంది.
మరో ఆసక్తికర అంశం — మోరాలిటీ. సిరీస్ తరచుగా ఒక ప్రశ్న వేస్తుంది: “చేసిన తప్పు, మంచి కోసం అయితే క్షమించదగినదా?” కానీ ఈ ప్రశ్నకు ఇచ్చే సమాధానం అంతగా కన్విన్సింగ్‌గా ఉండదు. క్యారెక్టర్స్ తీసుకునే నిర్ణయాలను రైటింగ్ పూర్తి స్థాయిలో జస్టిఫై చేయలేకపోతుంది.
ఎవరెలా చేసారు
విజయ్ సేతుపతి లాంటి స్టార్ నటుడు ఉన్నప్పుడు ప్రేక్షకులు భారీగా ఆశిస్తారు. కానీ 'కాట్టాన్' సిరీస్‌లో ఆయన నటన గొప్పగానూ లేదు..అలాగని తీసిపారేసాలాగానూ లేదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా నటించిన వడివేల్ మురుగన్, ముత్తుకుమార్, మరియు సింగంపులి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ గా
విజయ్ సేతుపతి కేవలం హీరోగానే కాకుండా, ఈ సిరీస్‌కు నిర్మాతగానూ వ్యవహరించి తన అభిరుచిని చాటుకున్నారు. ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. విజువల్స్ పరంగా ఎక్కడా తగ్గకుండా రిచ్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా రాజేష్ మురుగేషన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ఆ సన్నివేశాలను మరో లెవల్‌కు తీసుకెళ్లింది.
దర్శకుడు మణికందన్ ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ, దానిని నడిపించే స్క్రీన్ ప్లేలో మాత్రం మెరుపులు మిస్ అయ్యాయి. మేకింగ్ పరంగా ఎంత బలంగా ఉన్నా, కథనంలో వేగం లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.
ఫైనల్ గా...
మొత్తానికి ‘కాట్టాన్’ ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. ఐడియా బలంగా ఉంది, క్యారెక్టర్‌లో పొటెన్షియల్ ఉంది, కొన్ని ఎపిసోడ్స్‌లో ఇంపాక్ట్ కూడా ఉంది. కానీ మొత్తం సిరీస్‌గా చూసినప్పుడు ఎగ్జిక్యూషన్ సెట్ కాలేదనిపిస్తుంది.
ఎక్కడ చూడచ్చు..
జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది

