‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ
వెండి తెరపై విజువల్ ఎఫెక్ట్స్ విన్యాసాల వినోదం భవిష్యత్తును కళ్లెదుట నిలిపిన పౌరాణిక, ఫిక్షన్ థ్రిల్లర్
ప్రేక్షకులతో పాటు సినీ ప్రపంచం కూడా నాలుగు సంవత్సరాల నుంచి ఆసక్తితో ఎదురుచూస్తున్న భారీ సినిమా (అన్ని విధాలుగా) "కల్కి 2898 ఏడి" ఎన్నికల దృష్ట్యా మే 9న విడుదల కావలసిన సినిమా ఎట్టకేలకు ఈ గురువారం (27-6-24) దాదాపు అన్ని భారతీయ భాషల్లో విడుదల అయింది. గత మూడు నెలలుగా ట్రైలర్లు, టీజర్లు, ప్రమోషన్ ఈవెంట్ లు వంటి అనేక కార్యక్రమాలతో ప్రేక్షకులను బిజీగా ఉంచిన సినిమా ఇది. రాజమౌళి బాహుబలి తర్వాత, వచ్చిన 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన అతిపెద్ద సినిమా. వైవిధ్యమైన కథాంశాలతో "ఎవడే సుబ్రహ్మణ్యం", " మహానటి" వంటి రెండు సినిమాలు తీసిన క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు ముచ్చటగా మూడో సినిమా ఇది.
ఈసారి నాగ్ అశ్విన్ భారతీయ పురాణ, ఐతిహాసిక మహాభారతం నేపథ్యంతో ఈ సినిమా కథను రాసుకున్నాడు, అందరికీ తెలిసిన విష్ణు మూర్తి పదవ అవతారం "కల్కి" ముఖ్యమైన పాత్రగా ఈ సినిమా తీశాడు. ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే, గతం, భవిష్యత్తు, వర్తమానం అనే మూడు కాలాల కథ. మహాభారత యుద్ధం తర్వాత 6000 సంవత్సరాలకు అంటే 3102 బీసీ నుంచి- 2898 వరకు జరిగిన కథ. అంటే కలియుగం మొదలైనప్పటి నుంచి ముగిసే దశ వరకు అన్నమాట.మహాభారతం ప్రకారం అశ్వద్ధామ (అమితాబచ్చన్)ను చిరంజీవిగా మిగిలిపోతావని కృష్ణ భగవానుడు శపించడంతో సినిమా మొదలవుతుంది. చివరికి కల్కి కథ (కల్కి సినిమాటిక్ యూనివర్స్) ఇంకా ఉందని చూపడంతో ముగుస్తుంది. దీనికి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సీక్వెల్స్ రావచ్చు అన్న సూచన కూడా ఇస్తుంది.
అబ్బురపరిచే విజువల్ వినోదం
భూమ్మీద మిగిలిన ఒకే ఒక నగరం కాశి. అది దాదాపు ఎడారిగా మారే పరిస్థితిలో ఉంటుంది. దానికి ఎదురులేని, నిరంకుశ పరిపాలకుడు సుప్రీం యాస్కిన్(కమలహాసన్). కాశీ నగరం పైన గాలిలో తేలియాడే ఒక ఎత్తైన, పిరమిడ్ లాంటి " కాంప్లెక్స్" అనే మహా కట్టడంలో ఉంటాడు. కాశీలో ఉన్నవారికి అందులో ప్రవేశం లేదు. ఒకవేళ ఎవరైనా అందులో ప్రవేశించాలంటే కనీసం ఒక మిలియన్ యూనిట్ల విలువ కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలో సుమతి(దీపికా పదుకొనే) అనే ఒక యువతి కడుపులో పెరుగుతున్న దేవుడిని కాపాడే క్రమంలో, అశ్వద్ధామ ఏం చేశాడు? చివరికి ఏం జరిగింది అన్నది సినిమా కథ.
సినిమా గురించి మొత్తం చెప్పాలంటే, అదిరిపోయే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. ఇంతవరకు భారతదేశపు ఏ వెండితెర మీద కూడా కనిపించని ఈ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి. ఇందులో అనుమానం ఏమీ లేదు. బాహుబలి తర్వాత, చాలా సమయం తీసుకున్న ఈ సినిమా ఎలా ఉందో అంశాల వారీగా ఒకసారి చూద్దాం
దర్శకుడి సృజానాత్మకత కు నిదర్శనం
ముందుగా చెప్పాల్సింది దర్శకుడు గురించి. ఎన్నుకున్న సబ్జెక్టును ప్రేమించి, అనేక రకాలుగా పరిశోధించి వైవిధ్యంగా సినిమా తీయడం అన్నది మొదటి రెండు సినిమాల్లో చూపించిన నాగ్ అశ్విన్, ఈ సినిమాలో కూడా అలాగే చేశాడు. ముఖ్యంగా మహాభారతం లోని అంశాలను, సినిమాటిక్ గా రిలేట్ చేసి, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా తీయడం నాగ్ అశ్విన్ కు బాగా తెలుసు. ఈ సినిమాలో కూడా ప్రారంభంలో కురుక్షేత్ర యుద్ధం విజువల్స్ గా చూపించడం, కృష్ణుడికి అశ్వద్ధామకు మధ్య జరిగిన సంభాషణలు, సినిమా తదుపరి ఎలా ఉంటుందని ప్రేక్షకులకు చిన్న క్లూ ఇవ్వడం, అశ్వద్ధామ పాత్ర తీర్చిదిద్దిన విధానం, ఊహాజనిత కాశీ నగరం, కాంప్లెక్స్ కట్టడం, శంభల నగరం వంటివి నాగ్ అశ్విన్ ప్రతిభను తెలియజేస్తాయి. నాలుగేళ్లపాటు ఎలాంటి రీసెర్చ్ చేశాడో అర్థమవుతుంది. సినీమా ప్రారంభం నుంచి చివరి వరకు(అక్కడక్కడ స్క్రీన్ ప్లే లో స్పీడ్ బ్రేకర్ లు ఉన్నప్పటికీ) ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా తీయడం అనేది ప్రశంసించదగ్గది.
హేమా హేమీల నటనా చాతుర్యం
కొన్ని పాతకాలపు సినిమాలలో, ఎంత మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారో, ఈ సినిమాలో అంతమంది పేరు పొందిన వివిధ భాషల నటీనటులు ఉన్నారు. సినిమాలో వారి పేరు ఏమిటో గుర్తుపెట్టుకోవడం కష్టం. ముఖ్య తారాగణంలో ఉన్న అమితాబచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, శోభన, పశుపతి కాకుండా, అతిథి పాత్రల్లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అవసరాల శ్రీనివాస్ లాంటి వారు ఉన్నారు. దీనికి అదనంగా ఇద్దరు ప్రముఖ దర్శకులు, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. కేవలం కామెడీ కోసమే కాసేపు బ్రహ్మానందం కూడా ఉన్నాడు. ప్రధాన నటీనటుల్లో అమితాబచ్చన్ గురించి చెప్పేదేముంది. అశ్వద్ధామ గా సినిమాకు ప్రధాన బలమయ్యాడు. ఇతనితో 39 సంవత్సరాల తర్వాత మళ్లీ నటించిన గొప్ప నటుడు కమలహాసన్ గురించి కూడా చెప్పేదేముంటుంది. కనిపించింది కొద్దిసేపే అయినా తను ఎలాంటి నటుడు అన్నది చూపించాడు. ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను అలరిస్తాడు.
ప్రేక్షకులను అలరించిన "బుజ్జి"
మొదటిసారి తెలుగు సినిమాలో నటిస్తున్న పాపులర్ హిందీ నటి దీపికా పదుకొనే, తెలుగులో తన డబ్బింగ్ తానే చెప్పుకొని, పరవాలేదన్న స్థాయిలో నటించింది. మలయళ, తెలుగు నటి శోభన ఈ సినిమాకి సర్ప్రైజ్ ప్యాకేజీ. మరియం పాత్రలో మెచ్చుకోదగ్గ స్థాయిలో చేసింది. ఈ సినిమాకి మరొక సర్ప్రైజ్ ప్యాకేజీ హెలెన్ అనే సినిమాలో నటించిన మలయాళ నటి అన్నా బెన్, కాసేపు ఉన్నప్పటికీ చలాకీగా నటించి ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. అది 6 కోట్లతో తయారుచేసిన బుజ్జి అనే కారు. ఇది సినిమాలో ఒక ప్రధాన పాత్రధారి అయింది. ప్రభాస్ ఈ కారును వాడిన సన్నివేశాలు థియేటర్లో ఈలలు. చప్పట్లకు దారితీసాయి. అదే కాకుండా బుజ్జికి గాత్రం అందించిన కీర్తి సురేష్ కూడా మెచ్చుకోదగ్గ పని చేసింది.
తమిళ నటుడు పశుపతి తనదైన స్థాయిలో నటించి ఆకట్టుకుంటాడు. బెంగాలీ నటుడు శాశ్వత చటర్జీ విలన్ గా బాగానే చేసాడు. ఈ సినిమాలో ఇతనికి కాస్త నిడివి ఉన్న పాత్ర దొరికింది. మరికొన్ని తెలుగు సినిమాల్లో విలన్ గా వచ్చే అవకాశం ఉంది. అలాగే సుప్రీం యాస్కిన్ ప్రధాన అనుచరుడిగా అనిల్ జార్జ్ కూడా పర్వాలేదనిపించాడు.
కనిపించి, వినిపించిన దర్శకులు
రాజమౌళి ఒక సీన్లో ఉన్నప్పటికీ, ప్రభాస్ " ఇతనికి దొరికితే ఐదు సంవత్సరాలు ఆడుకుంటాడు" అని చెప్పడం సరదాగా ఉంది. అలాగే రాజమౌళి కూడా " ఎక్కడికి పోతావ్ రా దొరికితే ఈసారి 10 సంవత్సరాలు ఆడుకుంటాను" అని చెప్పడం బాహుబలి సినిమా నిర్మాణ సమయాన్ని గుర్తు చేస్తుంది. రాంగోపాల్ వర్మ, అవసరాల శ్రీనివాస్, మృణాల్ ఠాకూర్ ఒకసారి మాత్రమే కనిపిస్తారు.
ఉన్నత స్థాయి చాయాగ్రహణం- నేపథ్య సంగీతం
ఈ సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్లిన అంశాల్లో మొదటిది తెలుగువారికి నోరు తిరగని పేరున్న సెర్బియా ప్రాంతానికి చెందిన సినిమాటోగ్రాఫర్(Djordje Stojiljkovic) పనితనం. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కి సరిగ్గా సరిపోయింది. సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలమైంది. ప్రస్తావించాల్సిన మరొక పేరు కళాదర్శకత్వం వహించిన అనిల్ జాదవ్. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు పనితనం బాగున్నప్పటికీ నిడివి కొంచెం తగ్గించే(దర్శకుడు అనుమతితో) ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఇలాంటి సినిమాలకి ఈ నాలుగు విభాగాలే చాలా ముఖ్యం. ఈ నలుగురు కలిసి సినిమాని అబ్బురపరిచేలా తీర్చిదిద్దారు.
ఈ సినిమా లో చెప్పుకోవాల్సిన మరో అంశం డైలాగులు. నాగ్ అశ్విన్ తో కలిసి, బుర్ర సాయి మాధవ్ రాసిన డైలాగులు బాగున్నాయి. మచ్చుకి " నిజానికి నమ్మకంతో పనిలేదు", " అంతిమంగా యుద్ధంలో గెలిచేది మృత్యువు ఒక్కటే" అనే డైలాగులు
లోపాలను అధిగమించి, ఆకట్టుకునే సినిమా
ఇంక సినిమాకు కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కువ నిడివి ఉండడం, పకడ్బందీ స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల దర్శకుడు అశ్విన్ అక్కడక్కడ తడబడ్డాడు. అనవసరమైన సన్నివేశాలు అవసరానికి మించి ఉండడం, సినిమాను కొంత స్లో చేసింది. కొన్ని సన్నివేశాలు నిడివి ఎక్కువై సినిమాను నెమ్మదించాయి. ప్రభాస్ అమితాబచ్చన్ మధ్యన నడిచిన ఫైట్ సన్నివేశం ఒక ఉదాహరణ. అలాగే క్లైమాక్స్ లో జరిగిన యుద్ధ సన్నివేశాలు. ఇక ప్రభాస్ లాంటి నటుడికి, అందులో ఎటువంటి సినిమాలో కామెడీ సరిపోదు అని ఈ సినిమా మరోసారి తెలియజేసింది. బ్రహ్మానందాన్ని బలవంతంగా స్క్రిప్ట్ లో చొప్పించారనిపిస్తుంది. కథకు కథనానికి అది ఏమాత్రం ఉపకరించలేదు. ఎక్కువమంది నటులు ఉండడం వల్ల, వారందరికీ సమయం కేటాయించడం అన్నది ఫుటేజ్ ప్రాబ్లం. దానివల్ల సినిమా నిడివి పెరిగింది. దాంతో సినిమా అక్కడక్కడ తేలిపోయింది. సీక్వెల్లో ఈ విషయాలన్నీ దర్శకుడు నాగ్ అశ్విన్ సరి చేసుకుంటాడని ఆశిద్దాం.
కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, సినిమా చిత్రీకరణ, విజువల్ ఎఫెక్ట్స్, డైలాగులు దర్శకుడి క్రియేటివిటీ, అమితాబచ్చన్, కమలహాసన్, ప్రభాస్, దీపిక ల నటన సినిమాని ఎవరైనా సరే ఒకసారి చూడదగ్గ సినిమాగా మలిచాయి.
నటీనటులు: ప్రభాస్,అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొనే,దిశాపటానీ,రాజేంద్రప్రసాద్,
పశుపతి,అన్నా బెన్, శోభన, శాశ్వత ఛటర్జీ, బ్రహ్మానందం
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నాగ్ అశ్విన్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ (Djordje Stojiljkovic)
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: సి. అశ్వని దత్, ప్రియాంక దత్,స్వప్నా దత్
నిర్మాణ సంస్థ: వైజయంతి మూవీస్
విడుదల: జూన్ 27, 2024