వైభవం ఉన్నా, ఆత్మను కోల్పోయిన ప్రీక్వెల్
x

వైభవం ఉన్నా, ఆత్మను కోల్పోయిన ప్రీక్వెల్

అనుభూతి మాత్రమే, రివ్యూ కాదు - కాంతారా: చాప్టర్ 1


'మగధీర' నుండి గమనిస్తున్నా, భారతీయ/తెలుగు సినిమా భవిష్యత్తు వైపు కాకుండా, పురాతన, పురాణాల,పుక్కిట కథలతో వెనక్కి వెళ్లడం మొదలుపెట్టింది. ఒకప్పుడు కొత్తగా అనిపించిన ఈ తరహా ప్రయోగం ఇప్పుడు బాక్సాఫీస్ ఫార్ములాగా మారిపోయింది.కానీ ఇప్పుడు విసుగొస్తోంది,మొహం మొత్తినట్టు తయారైయింది. కాంతారా బాగుండడానికి కారణం పంజ్రులి, తండ్రి కొడుకుల సమ్మోహన బంధం, దైవం మనిషిని పూనిన నటన. అవి బాగున్నాయి కదా అని వెడితే ఎలా ఉందంటే, మునక్కాయ బాగుందంటే, మొత్తం అన్ని వంటకాలు దాంతోనే చేసినట్టుంది.

కాంతారా: చాప్టర్ 1తో, ఈ ధోరణిలోని లోపాలన్నీ బయటపడినట్టు ఉన్నాయి. వినోదం పేరుతో ఇది ఒక నిరాశాజనకమైన గత కాలంలోకి తీసుకెళ్లే కథనాన్ని అందిస్తూ, ఇదే ఆలోచనను పునరావృతమవుతున్నట్టుగా ఈ దెబ్బతో బలంగానే తెలిసొచ్చింది. దీని విజయంతో ఇక ఈ దర్శకులు ఇప్పట్లో తిరిగిరారని నా నమ్మకం.
ఇంకా బాధాకరం ఏమిటంటే, చాలా మంది సమీక్షకులు ఈ లోపాలను విస్మరించి, కేవలం దాని విజువల్‌ అద్భుతాన్ని, సంపాదించినా బాక్సాఫీస్ కలెక్షన్స్, రిషబ్ శెట్టి నటన గొప్పతనం పొగడటం ఎబ్బెట్టుగా తోచింది. ఇలాగ వీరందరూ కళ్లు మూసుకోవడం కొంచం ఆందోళన కలిగించే విషయం. చెప్పవలసిన వాళ్ళే చెప్పకపోతే, ఇలాంటి సినిమాలు తీసే వాళ్లకు ఎవరు చెబుతారు, వాళ్ళు చేసిన పొరపాట్లు ఎలా తెలుసుకుంటారు.
సినిమాను విలువైనదిగా భావించే నాకు, కథ లేకున్నా ఫరవాలేదు, బలమైన నటనతో, లోతున్న దృశ్యాలతో ప్రేక్షకులను మమేకం చేయగలవు అని నమ్మేవాడ్ని. కానీ, ఇక్కడ ఆ కాంతారా సినిమాలోని సూక్ష్మతే లేదు. ప్రేక్షకులను కట్టిపడేయాల్సింది పోయి, విసుగుకు గురిచేస్తుంది. జరుగుతున్న సన్నివేశాలకు నేను “ఉఫ్, ఇష్, హా,అబ్బా, ఓహ్” అని అనుకోవడం, చివరికి తోటి ప్రేక్షకులు కూడా అదే స్వరంలో నన్ను కలవడం ఇందుకు నిదర్శనం.
దృశ్య మోతాదు తప్ప, ఆత్మ లేని అనుభవం ఇచ్చిన సినిమాగా ఉంది. కానీ భారీతనం గొప్పతనానికి సమానం కాదు. 2022లోని కాంతారాని మరపురాని దానిగా, ఓ భావోద్వేగ ఆత్మనుభూతిని కలిగించే కథ ఇక్కడ కనిపించదు. విజువల్స్ ఆకర్షిస్తాయి కానీ, ఆ పాత్రలు వేసే కేకలు, కథ నడిచే తీరు ఎక్కడా మనసులో నిలిచిపోవు. హీరో చివర్లో చేసే యుద్ధం, సినిమాలో ఎప్పుడైనా చేసుండొచ్చు.అలా చేస్తే సినిమా అయిపోతుందని కాబోలు ఇలా లాగించేసారు. కాంతారా లోని పాత్రల వలె ఇందులోనూ ప్రతినాయకుడ్ని ప్రశాంతమైన, మంచివాడైనట్టుగా, అందమైన మొహం వెనుక దాచేసి మళ్లీ అలాంటి స్పృహ మనకు కలిగించడంతోనే, దర్శకుడు కథపై పని చెయ్యలేదని తెలిసిపోతుంది.
సాగిపోయిన ప్రారంభం, సమయా సృహ లేని హాస్యం. ఇందులో మొదటి భాగం అతిగా పొడిగించబడడమే కాక, సాగుతూనే ఉండే పాత్రల పరిచయాలు విసుగును కలిగిస్తాయి. హాస్యం సందర్భానుసారంగా కాక, ఉత్కంఠత ఉండే సన్నివేశాలలో చొచ్చుకొచ్చి ఆ సన్నివేశ పదును నాశనం చెయ్యడం నచ్చలేదు. ఇదంతా అనవసరమని ప్రతి ప్రేక్షకుడికి తెలుసు.
ఓ మార్మికత(mysticity) నుంచి Hollywood మార్వెల్‌ సినిమాల బాణి వైపు సాగిపోతున్నట్టుగా ఉంది. అసలు సినిమాలో పంజ్రులి యాక్ట్ పవిత్రమైన గుండె చప్పుళ్లా నిలిచింది, అది ఒకసారి చూస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది. కానీ చాప్టర్ 1లో అదే యాక్ట్ మళ్లీ మళ్లీ వాడటం వలన తన మర్మత్వం (mysticism) కోల్పోయింది. ఇది దేవతా అనుభూతిలా కాకుండా, మార్వెల్‌ సూపర్‌హీరో ఎంట్రీలా కనిపిస్తుంది. ఓ స్పైడర్మాన్ లా, బాట్మాన్, సూపర్ మాన్ లా ఎప్పుడు క్లిష్టమైన సందర్భం వుంటుందో, అప్పుడంతా ఈ పంజ్రులి పూనకంతో వచ్చి అందర్నీ తుది ముట్టించడం హాస్యాస్పదం. ఓ రకంగా ఆ పాత్ర మీద గౌరవం పోవోడం, ఆ పాత్రలోని పవిత్రతను spectacle గా మార్చి, ఆ మాధుర్యాన్ని కోల్పోయిందనే చెప్పాలి. సూక్ష్మత కోల్పోవడమే కాదు, ఇప్పుడు కేవలం వాణిజ్య సూత్రంగా మారిపోయింది.
అసలు , అప్పుడు కాంతారా నుంచి బయటకు వస్తుంటే, ఒక జీవితాంతం గుర్తుండే అనుభూతి మిగిలింది. ఒక మనిషి దేవుడిగా మారి తన తండ్రిని కలిసే క్షణం నన్ను చాల బాగా అలరించింది. చాప్టర్ 1 ఆ ఎత్తుకు ఎప్పటికీ చేరదు. ఆ ఉద్వేగాన్ని అతిగా చూపించడం, అసహజ వివరణ ఇవ్వడం, అలసిపోయిన ఫార్ములాలను వాడడం, ఇవన్నీ దానిని ఆత్మలేని అద్భుతంగా,మసి అంటిన అద్దంలా, పీలికలైపోయిన పట్టువస్త్రంలా మార్చేశాయి.
ముఖ్యంగా, కాంతారా కథకు జీవం పోసిన మర్మత్వం ఇప్పుడు పూర్తిగా కోల్పోయింది. చివరికి, ఇది కొద్దిసేపు పిచ్చి వినోదాన్ని ఇస్తుంది కానీ ఎటువంటి లోతైన ప్రతిధ్వనిని మనలో మిగల్చదు. ఆ కాంతారా చెవ్వుల్లో మార్మోగిపోతే, ఇదేమో చెవులు మరమత్తు చేసుకునేలా చెయ్యడం గర్హించదగ్గది. బాగుందని తెలుగు ప్రేక్షకులు మెచ్చుకున్నామని, ఇలా బలహీనపర్చడం భావ్యం కాదు. కాంతారాను అప్పుడు ప్రేక్షకులు సంగీతంలో రిషభంగా ఆస్వాదిస్తే, ఇప్పుడు వృషభమై కుమ్మేయడం దర్శకుడు చేసిన అమర్యాదే.

-రామ్.చింతకుంట


Read More
Next Story