
మధ్య తరగతి చేదు నిజం: 'కార్మేని సెల్వం' రివ్యూ
EMIల మధ్య నలిగే జీవితం
సొంత ఇల్లు, లగ్జరీ కారు, సొసైటీలో ఫుల్ రెస్పెక్ట్.. ఇవే కదా మనందరి కలలు? కానీ ఆ కలలను నిజం చేసుకునే క్రమంలో ఒక సామాన్య డ్రైవర్ వేసిన తప్పడగులు అతన్ని ఏ తీరానికి చేర్చాయి? అనేదే ఈ 'సెల్వం' జీవితం.
సెల్వం (సముద్రఖని) ఒక దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. బిజినెస్ మ్యాన్ సంపత్ (గౌతమ్ మీనన్), ఆయన భార్య దేవి (అభినయ) వద్ద కార్ డ్రైవర్‌గా నమ్మకంగా పనిచేస్తుంటాడు. సంపత్ కుటుంబం సెల్వంను తమ ఇంట్లోని ఒక వ్యక్తిలా చూస్తుంటారు. సెల్వం భార్య శాంతి (లక్ష్మీ ప్రియ) తన భర్తకు చేదోడువాదోడుగా ఇడ్లీ బండి నడుపుతూ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది. వాళ్లకు బాలు అనే కొడుకు. అందరిలాగే తాము సొంతంగా ఒక కారు కొనుక్కోవాలని, ఒక ఇల్లు కట్టుకుని అందరిలో గౌరవంగా బతకాలని ఈ చిన్న కుటుంబం ఎన్నో ఆశలతో పైసా పైసా కూడబెడుతుంటుంది. కానీ ఒక చిన్న ఇన్సల్ట్ వాళ్ల జీవితాన్ని తలకిందులు చేసింది.
మేనకోడలి ఫంక్షన్‌లో జరిగిన చిన్న అవమానం సెల్వం భార్య శాంతికి ఇగో దెబ్బ తగిలేలా చేసింది. దాంతో దాచుకున్న డబ్బు, మెడలోని నగలు అన్నీ పెట్టి 'సారె' పంపడంతో వాళ్ల ఆశలన్నీ ఆవిరయ్యాయి. సరిగ్గా అదే టైమ్‌లో కొడుకు యాక్సిడెంట్ అవ్వడం, హాస్పిటల్ బిల్స్ కోసం చేసిన అప్పులు సెల్వంను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ముఖ్యంగా ఆసుపత్రి ఖర్చుల కోసం సెల్వం భారీగా అప్పు చేయాల్సి వస్తుంది.
ఆ అప్పులు తీర్చడానికి సెల్వం ఎంచుకున్న దారి అతన్ని మరింత గోతిలోకి నెట్టింది. యజమాని సంపత్ (గౌతమ్ మీనన్) లేని టైమ్‌లో ఆయన కారుని దొంగచాటుగా క్యాబ్ గా తిప్పడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో పరిచయమైన వాళ్ల మాటలు విని క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ షాపింగ్, అనవసరమైన ప్లాట్లు అంటూ తన తాహతుకు మించిన లగ్జరీకి అలవాటు పడటం మొదలెడతాడు. క్రెడిట్ కార్డులు, ఈఎంఐల మధ్య నలిగిపోతూ ఫ్యామిలీకి టైమ్ ఇవ్వలేక చిక్కుల్లో పడతాడు. దానికి తోడు చేసిన అప్పుల చికాకులు పెరుగుతున్న తరుణంలోనే అనుకోకుండా కారు ప్రమాదానికి గురవుతుంది.
అప్పుల వాళ్ల భయం, చేసిన తప్పులు బయటపడతాయనే టెన్షన్ తో సెల్వం చివరకు షార్జాకు పారిపోవాల్సి వస్తుంది. అసలు అక్కడ సెల్వం ఏం కోల్పోయాడు? యజమాని సంపత్ సార్ ఇచ్చిన సర్‌ప్రైజ్ ఏంటి? తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బు సంపాదించాలనే పిచ్చి అతన్ని ఎక్కడికి తీసుకెళ్లింది? అనేదే ఈ సినిమా ఇచ్చే స్ట్రాంగ్ మెసేజ్.
ఎనాలసిస్
ఈ మధ్యకాలంలో ఇలా సామాన్యుడు జీవితాలను తెరపై చూపే సినిమాలు రావటం లేదు. అప్పట్లో దాసరిగారు, తమిళ దర్శకుడు విసు వంటి వారు ఇలాంటి సినిమాలు తీసేవారు. దర్శకుడు రామ్ చక్రి ఈ చిత్రంలో నేటి సమాజంలోని రెండు ప్రధాన సమస్యలను టచ్ చేశారు. ఒకటి ఆడంబరాల కోసం చేసే అప్పులు, రెండు.. సంపాదన వేటలో పడి కుటుంబంతో గడపాల్సిన మధుర క్షణాలను కోల్పోవడం. సెల్వం, శాంతిల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తమ కథే అనిపిస్తుంది.
దాదాపు ప్రీ-క్లైమాక్స్ వరకు సెల్వం కష్టాలను చూపిస్తూనే, మరోవైపు యజమాని సంపత్ (గౌతమ్ మీనన్) పాత్ర ద్వారా ఒక గొప్ప పాఠం చెప్పించారు. ఉరుకుల పరుగుల జీవితంలో డబ్బు వెనక పడి మనం ఏం కోల్పోతున్నామో సంపత్ డైలాగులు కంటతడి పెట్టిస్తాయి. అప్పులు తీర్చడానికి కుటుంబాన్ని వదిలి షార్జా వెళ్లిన సెల్వం పడే వేదన, అక్కడ అతను పొందిన అనుభవాలు చూస్తే గుండె బరువెక్కుతుంది.
స్లో నెరేషన్.. కానీ స్ట్రాంగ్ మెసేజ్!
సినిమాలో ప్రధాన మైనస్ పాయింట్ అంటే అది కథనం నెమ్మదిగా సాగడమే. పాయింట్ చిన్నదైనా, దాన్ని తిప్పి తిప్పి అవే సీన్స్ తో చెప్పటం వల్ల సాగదీసినట్లు అనిపించటంతో అక్కడక్కడా బోర్ కొడుతుంది. చాలా సీన్స్ మన ఊహకు అందేస్తూంటాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కే ఎక్కువ టైమ్ తీసుకున్నారు. గౌతమ్ మీనన్, అభినయ ట్రాక్‌ను ఇంకా బలంగా వాడుకుని ఉంటే ఎమోషన్స్ మరింత పీక్స్‌లో ఉండేవి. అయితే సెకండాఫ్‌లో వచ్చే సెంటిమెంట్ సీన్స్, క్లైమాక్స్‌లో సంపత్ ఇచ్చే సర్‌ప్రైజ్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి.
ఎవరెలా చేసారు
సముద్రఖని వన్ మ్యాన్ షో: ఒక మధ్యతరగతి తండ్రిగా, అప్పుల ఊబిలో చిక్కుకున్న సామాన్యుడిగా సముద్రఖని జీవించేశారు. డైలాగులు లేని సీన్స్‌లో కూడా కేవలం తన కళ్లతోనే బాధను పండించి ఆకట్టుకున్నారు.
లక్ష్మీప్రియ అద్భుతం: భర్తకు అండగా నిలిచే మధ్యతరగతి భార్య పాత్రలో లక్ష్మీప్రియ నటన చాలా సహజంగా ఉంది. ఈ పాత్రకు ఆమెను ఎంచుకోవడం సినిమాకు ప్లస్ అయ్యింది.
గౌతమ్ మీనన్ & అభినయ: వీరిద్దరి పాత్రలు తక్కువ సమయమే ఉన్నా, కథలో బలమైన ముద్ర వేస్తాయి. ముఖ్యంగా గౌతమ్ మీనన్ తన క్లాస్ యాక్టింగ్‌తో సెల్వం జీవితానికి ఒక దిశను చూపిస్తారు.
టెక్నికల్ గానూ సినిమా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. మ్యూజిక్ , కెమెరా వర్క్ బాగా ప్లస్ అయ్యింది. రిపీట్ సీన్స్ ని తీసేస్తే ఇంకా బాగుండేది.
ఫైనల్ థాట్
ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నిజం కాదు. ఎవరో పెట్టిన స్టేటస్‌లు చూసో, పది మందిలో గొప్పగా కనపడాలనో అప్పులు చేసి ఆడంబరాలకు పోతే.. చివరకు మిగిలేది కన్నీళ్లే అని చెప్పే ఈ సినిమా మిడిల్ క్లాస్ మహానుభావులంతా చూడదగ్గదే. మన లైఫ్ స్టైల్‌ను ఒక్కసారి రీ-చెక్ చేసుకోవడానికి ఈ సినిమా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.

