తమిళ డబ్బింగ్ స్టార్ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ !
x

తమిళ డబ్బింగ్ 'స్టార్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ !

తమిళంలో 'స్టార్' అనే సినిమా వచ్చింది. సినిమా హీరో కావాలనుకునే ఓ కుర్రాడి కథతో వచ్చిన ఈ చిత్రం రీసెంట్ గా అమేజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.


సినిమా కష్టాలు, సినిమా చుట్టూ తిరిగే కథలతో సినిమాలు ఆడవని మనవాళ్లకో నమ్మకం. అది చాలా సార్లు నిజం అవుతూంటుంది కూడా. సినిమా కెరీర్ ని జీవితంగా ఎంచుకున్నప్పుడు వచ్చే కష్టాలను తెరపై చూసి ఎంజాయ్ చేయటానికి ఎవరూ రెడీ గా ఉండరు. అయితే తీసేవాళ్లు తీస్తూనే ఉంటారు. తాజాగా తమిళంలో 'స్టార్' అనే సినిమా వచ్చింది. సినిమా హీరో కావాలనుకునే ఓ కుర్రాడి కథతో వచ్చిన ఈ చిత్రం రీసెంట్ గా అమేజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథాంశం

మిడిల్ క్లాస్ కుర్రాడు కలైయరసన్ (కెవిన్) చిన్నప్పటి నుంచీ జీవితాశయం సినిమాల్లో సెటిల్ అవ్వాలని. దాన్ని అతని తండ్రి (లాల్) కూడా ప్రోత్సహిస్తూంటాడు. తన కొడుకు హీరో అవుతాడు అని నమ్ముతూంటాడు. చిన్నప్పుడు సరదా అనుకున్నా కాలేజ్ లైఫ్ కు వచ్చేసరికి హీరో అవ్వాలనే డెసిషన్ తీసుకుంటాడు. తను ఇంక ఏ ఉద్యోగం చూసుకోనని ఆ విషయం ఇంట్లో వాళ్లకు చెప్తాడు. అయితే అతని దురదృష్టవశాత్తు తండ్రికి అప్పటికే అనారోగ్యం వస్తుంది.

దాంతో కుటుంబ పోషణా బాధ్యత మాత్రమే కాకుండా తన అక్కకి పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన బాధ్యత కూడా పడుతుంది. ఈ క్రమంలో ఇంట్లో ఇలాంటి సిట్యువేషన్స్ ని పెట్టుకుని సినిమాల్లోకి వెళతానంటావేంటి అని తల్లి నిలదీస్తుంది. అసహనం వ్యక్తం చేస్తుంది. అయినా తగ్గేదే లేదు అన్నట్లు నటనకు సంబంధించిన వర్క్ షాప్ కు హాజరు కావటానికి ముంబై బయిలుదేరతాడు. తండ్రి కూడా సపోర్ట్ గా కొంత డబ్బు ఏర్పాటు చేస్తాడు.

ఎంతసేపు హీరో కథే చెప్తే ఎలా? కథకు హీరోయిన్ కావాలి కదా. కాబట్టి కథ ప్రకారం అతను అప్పటికే మీరా (ప్రీతి) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఆమె కూడా మనవాడిలో విపరీతమైన టాలెంట్ ఉందని నమ్మి పెద్ద హీరో అవ్వమని ఎంకరేజ్ చేస్తుంది. అలా ముంబైలో అడుగుపెట్టిన అతను అక్కడ సరిగ్గా ఇమడలేకపోతాడు. వర్క్ షాప్ లో వారు అతనిలో నటుడు లేడు అన్నట్లుగా మాట్లాడతారు. చుట్టూ చూస్తే తనలాంటి చాలా మంది ఔత్సాహికులు. వాళ్లందరిలో టాలెంట్ ఉంది. ఏం చేయాలి... ఇంటికి వెళ్లిపోదామా అనిపిస్తుంది. అయినా సరే తండ్రి అక్కడ కూడా ధైర్యం చెప్తాడు.

మరో ప్రక్కన ముంబై మహానగరంలో అతను డబ్బులు పోగొట్టుకుంటాడు. ఆ పని, ఈ పని చేస్తూ తన టార్గెట్ చేరాలని ఆశపడతాడు. భవిష్యత్తు తనదే అనుకుంటాడు. కానీ విధి అతన్ని మరో సారి దెబ్బ కొడుతుంది. ఈ సారి యాక్సిడెంట్ అవుతుంది. చూస్తే యాక్సిడెంట్ లో అతని మొహంపై మచ్చ ఏర్పడుతుంది. అది లైఫ్ లాంగ్ ఉంటుందని తెలుస్తుంది. దాంతో తన కెరీర్ ఇంక పరిసమాప్తే అని ఫీలై డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. తన లవర్, తండ్రి ఇలా అందరూ ధైర్యం చెప్పినా కోలుకోవటం కష్టం అవుతుంది. అప్పుడు అతను ఏం నిర్ణయం తీసుకున్నాడు, తను అనుకున్నట్లుగా స్టార్ అవ్వగలిగాడా అనేది మిగతా కథ.

ఈ సినిమా గౌతమ్ మీనన్ ఏం మాయ చేశావే తరహాలో చేద్దామని డైరక్టర్ ట్రై చేశాడు. కానీ సెట్ కాలేదు. అదే సెటప్ పెట్టుకున్నారు. హీరోయిన్ పాత్రను జెస్సీ (సమంత)లా చూపెడదామనుకున్నారు. అలాగే అందులో లాగానే హీరోయిన్ కు ఓ సోదరుడు ఉండి అడ్డుపడటం, వార్నింగ్ లు గట్రా ఇవ్వటం పెట్టుకున్నారు. అయితే గౌతమ్ మీనన్ సినిమా ఓ విధమైన ప్లేవర్ తో నడుస్తుంది. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు. మిడిల్ క్లాస్ కష్టాలు కన్నీళ్లతో నడిపారు. ఆ కష్టాలు టీవీ సీరియల్ లాగా సాగుతూనే ఉంటాయి. ఎంతకీ ముగియవు. సినిమా క్లైమాక్స్ కు చేరినా హీరోకు పాపం కష్టాలు తీరవు.

ఆ డిప్రెషన్ చూసి మనం డిప్రెషన్ లోకి వెళ్తాము. సినిమాలో కోర్ ఐడియా ఎక్కడ ఎలాంటి పరిస్దితుల్లో అయినా ధైర్యం కోల్పోకూడదని, కానీ మనకు ఈ సినిమా చూస్తూంటే ఉన్న ధైర్యం కూడా పోతుంది. ఎవరైనా సినిమాల్లోకి వెళ్లాలన్నా భయపడతారు అలా ఉంది. అలాగే రొమాన్స్, కామెడీ, యాక్షన్ సమపాళ్లు మిక్స్ కాలేదు. డైరక్టర్ ఉద్దేశ్యం ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టడమే అయితే ఖచ్చితంగా అది నేరవేరుతుందనటంలో సందేహం లేదు.

నటీనటుల విషయానికి వస్తే... తమిళంలో ఎదుగుతున్న హీరోల్లో కెవిన్ ఒకరు. 2012లో వచ్చిన 'పిజ్జా' తో పరిచయమై తన ప్రస్తానం కొనసాగిస్తున్నాడు. ఇక టెక్నికల్ గా చూస్తే యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం, పాటలు కాస్తంత ఓల్డ్ ట్రాక్ లోనే వెళ్తాయి. దాన్ని టీమ్ మెలోడి అని సరిపెట్టుకోవచ్చు. అరసు ఫోటోగ్రఫి.. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ నడిచిపోతుంది.

చూడచ్చా?

ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదని చెప్పాలని ప్రయత్నించిన ఈ సినిమా చూడటానికి ఓపిక చాలా కావాలి. అది తక్కువైతే చూడటం కష్టం.

ఏ ఓటిటిలో ఉంది?

అమేజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది.

Read More
Next Story