
సుదీప్ 'K3 కోటికొక్కడు' ఓటీటీ మూవీ రివ్యూ!
రాజమౌళి ‘ఈగ’ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన కిచ్చా సుదీప్ సినిమా
రాజమౌళి ‘ఈగ’ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన కిచ్చా సుదీప్ సినిమాల్ని ఏదీ వదలకుండా తెలుగు డబ్బింగ్ చేసి వదులుతున్నారు. ఇప్పుడు ఓటీటీ వారు కూడా వాటని స్ట్రీమింగ్ చేస్తున్నారు. నిజానికి ఈగ తర్వాత సుదీప్ కు చెప్పుకోదగ్గ సినిమానే లేదు. ఆ మధ్యన విక్రాంత్ రోణ అనే సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తే ఓ పాట పెద్ద హిట్టైంది. సినిమా యావరేజ్ రేంజి అయ్యింది. ఈ క్రమంలో రీసెంట్ గా కూడా మ్యాక్స్ అంటూ ఓ చిత్రం రిలీజ్ చేశారు. బాగుంది అన్నారు కానీ థియేటర్ కు వెళ్లి చూసిన వారు లేరు. ఇప్పుడు ఈ 'K3 కోటికొక్కడు' ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ టైటిల్ ఏమిటి ఇలా ఉంది.. ఈ చిత్రం కథేంటి, ఎలా ఉంది ? చూడదగ్గ సినిమానేనా
కథేంటి
సత్య (సుదీప్) చాలా జాలి హృదయం ఉన్నవాడు. తన పరిధిలో అనాథలకు ఎడతెగని సాయం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తనలాగే మరో అనాధ అయిన 'జాను' అనే పాపకు విదేశాల్లో ఆపరేషన్ చేయించడానికి రెడీ అవుతాడు. అదే టైమ్ లో ప్రియ ( మడోన్నా సెబాస్టియన్) తో పరిచయమవుతుంది. అతన్ని ఇష్టపడుతుంది. ఈ మధ్యలో సత్యతో గొడవ పెట్టుకున్న కారణంగా లోకల్ రౌడీ లీడర్ 'బషీర్' జైలుకు వెళతాడు. అలాగే ఆల్రెడీ సత్య కారణంగానే జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఏసీపీ కిశోర్ (రవిశంకర్), తాను బయటికి రాగానే అతన్ని అంతం చేయాలని ఫిక్స్ అవుతాడు.
వీళ్లిద్దరు చాలదన్నట్లు ఇంటర్ పోల్ ఆఫీసర్లు శరత్ - కంగనా ఇద్దరూ కూడా సత్య కోసం గాలిస్తుంటారు. అయితే సత్య కోసం వీళ్లందరూ ఎందుకు వెతుకుతున్నారు. ఈ సంఘటనలకు కారణం శివనా? సత్యనా? అనే డౌట్ వస్తుంది. ఈ విషయంలో కంక్లూజన్ కోసం ప్రయత్నిస్తూంటారు. అయితే సత్య,శివ ఇద్దరు కాదు .. ఒక్కరేనని ఏసీపీ కిశోర్ చెబుతూ ఉంటాడు.
ఏది నిజం అని తెలుసుకునే లోగా... జాను ట్రీట్మెంట్ సమయంలోనే దేవేంద్ర భూపతి ( నవాబ్ షా) గురించి సత్య కు తెలుస్తుంది. తను ఎదగడం కోసం అతను ఫార్మా రంగాన్ని ప్రభావితం చేస్తుంటాడు. అతనితో సత్యకు వైరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శివ .. సత్య ఇద్దరు ఒకటేనా?కాదా అనే విషయం క్లారిటీ వస్తుంది? అదే సమయంలో దేవేంద్ర కారణంగా సత్య కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటి? ఫైనల్ గా జాను ప్రాణాలను సత్య కాపాడగలుగుతాడా? అనేది మిగతా కథ.
విశ్లేషణ
ఈ సినిమాకు బేస్ ...చాలా కాలం క్రితం (2021) విష్ణు వర్దన్ హీరోగా వచ్చిన కొటి గొబ్బ అనే సినిమా. భాషా ఫార్మెట్ లో వచ్చిన ఆ సినిమా బాగా ఆడింది. అయితే ఇప్పుడు ఆ సినిమాకు కంటిన్యూటి కాదు కానీ, అదే టైటిల్ ని మాత్రం కంటిన్యూ చేస్తూ కే2-కోటికొక్కడు అంటూ సుదీప్ హీరోగా, నిత్యామేనన్ హీరోయిన్‌గా 2016లో ఓ సినిమా తీశారు. ఆ తర్వాత దానికి సీక్వెల్ అన్నట్టుగా తీసిన కే3 కోటిగొబ్బ అనే సినిమాను తెలుగులోకి డబ్ చేసి, కే3-కోటికొక్కడు టైటిల్ తో దింపారు.
కొద్ది పాటి మామూలు లోకల్ ట్విస్ట్ లు, ఇంటర్నేషనల్ లొకేషన్స్ తో సినిమా అలా అలా సాగిపోతుంది. అయితే కే2 కోటికొక్కడు అయినా చూస్తే ఈ సినిమా కాస్త క్లారిటీ గా అర్థమవుతుంది. చూడకపోయినా ఓ మామూలు యాక్షన్ సినిమా చూస్తున్న ఫీల్ వస్తుంది. ఫస్టాఫ్ బాగానే ఉంది అనిపించినా సెకండాఫ్ బాగా ప్రిడిక్టబుల్ గా సాగుతుంది. అయితే సినిమా చూసాక కూడా కొన్ని క్వశ్చన్స్ అలాగే ఉండిపోతాయి. మరో సీక్వెల్ కు ప్లాన్ చేసారో ఏమో దర్శక,నిర్మాతలు.
ఎవరెలా చేశారు
సుదీప్ చేసిన పక్కా మాస్ యాక్షన్ సినిమాల్లో ఇదొకటి. సెబాస్టియన్ కు, రవి శంకర్ కు పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంతా సుదీప్ చుట్టూనే ప్లాట్ తిరుగుతుంది. దర్శకుడు తెలిసిన ట్విస్ట్ తో తెలివిగా సుదీప్ ఇమేజ్ ని అడ్డం పెట్టి ఒడ్డున పడిపోదామనుకున్నాడని అర్దమవుతుంది. కథ, కథనం ఎలా ఉన్నా టెక్నికల్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. విజువల్ ట్రీట్ గా , హై ఆక్టెన్ యాక్షన్ సీక్వెన్స్ తో సాగిపోతుంది. అలాగే ఛేజింగ్ సీక్వెన్స్ లు కొత్తగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ శేఖర్ చంద్రు ని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. ఫస్టాఫ్ లాగే సెకండాఫ్ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగిపోతే ఏ ఇబ్బంది లేకపోయేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ సోసోగా ఉంది.
చూడచ్చా
సుదీప్ కు వీరాభిమానులు కాని వారికి ఈ సినిమా నచ్చదు. యాక్షన్ సినిమాగా కూడా చివరి దాకా చూడలేరు.
ఎక్కడుంది
అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది