
కిరణ్ అబ్బవరం 'దిల్ రూబా' మూవీ రివ్యూ
ఈ సినిమా ఎలా ఉంది, సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ కు ఏ మేరకు కలిసొచ్చింది వంటి విషయాలు చూద్దాం.
కిరణ్ అబ్బవరం లో ఈజ్ ఉన్న మంచి నటుడు ఉన్నా అనుకున్న స్దాయిలో కెరీర్ లో దూసుకుపోలేకపోయాడు. అందుకు కారణం కథల విషయంలో జడ్జిమెంట్ లేకపోవటం, రొటీన్ స్క్రిప్టులు ఎంపిక చేసుకోవటం. కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం తర్వాత ఏదీ సరైన హిట్ పడలేదు. అయితే అతని ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.‘క’. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ ఉత్సాహంలో రిలీజ్ చేసిన సినిమా ‘దిల్ రూబా’. ఈ సినిమా ఎలా ఉంది, సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ కు ఏ మేరకు కలిసొచ్చింది వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
సిద్ధు రెడ్డి (కిరణ్ అబ్బవరం) తన చిననాటి స్నేహితురాలు మ్యాగీ (క్యాతి డేవిసన్) ను ప్రేమిస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల మ్యాగీతో సిద్ధుకు బ్రేకప్ అవుతుంది. ఇక అప్పటి నుంచే తన జీవితంలో సారీ, థ్యాంక్స్ అనే మాటలకు దూరంగా ఉండాలని సిద్ధు నిర్జయించుకుంటాడు. బ్రేకప్ నుంచి మూవ్ ఆన్ అవడానికి బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అవుతాడు సిద్ధు. అక్కడ పరిచయమైన అంజలి (రుక్సర్ థిల్లాన్)తో ప్రేమలో పడతాడు.
అయితే కాలేజీలో జరిగిన ఓ గొడవ వల్ల వీళ్లిద్దరు కూడా విడిపోవాల్సి వస్తుంది. అప్పుడు అమెరికాలో ఉంటున్న మ్యాగీ ఈ విషయం తెలుసుకుని ఇండియాకు వస్తుంది. ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుంది. అయితే బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోయిన మ్యాగీకు వీళ్లద్దరినీ కలపాల్సిన అవసరం ఏమి ఏర్పడింది. సిద్ధు-అంజలి ఇద్దరిని మ్యాగీ ఎలా కలిపింది? అసలు వీళ్లద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి, చివరకు ఏమైంది అనేది మిగతా కథాంశం.
ఎలా ఉంది
‘క’ సినిమా చేసిన వాళ్లు కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో కూడా ఏదో చూపించే ఉంటాడు. ఖచ్చితంగా సక్సెస్ కొడతాడు. ఇక కిరణ్ గాడిలో పడ్డాడనే అంతా అనుకున్నారు. కానీ తన లేటెస్ట్ రిలీజ్ ‘దిల్ రూబా’ తో మళ్లీ అతను పాత బాటలోకే వెళ్లిపోయాడు. అందరికీ పాత ఫ్లాఫ్ ల రోజులే గుర్తుకు వచ్చాయి. ‘క’ తర్వాత కిరణ్ ఇలాంటి సినిమా చేశాడేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ సినిమా‘క’ కంటే ముందే చేసిన సినిమా ‘దిల్ రూబా’. కానీ ఈ సినిమాపై నమ్మకం లేక హోల్డ్‌లో పెట్టి ‘క’ సినిమా రిలీజ్ చేశాడు.
అది ప్రక్కన పెడితే ఈ కథ చాలా సాదా సీదాగా ఏదో యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ వస్తుంది. కిరణ్ అబ్బవరం మినిమం కథను కూడా చూసుకోలేదా అనిపిస్తుంది. అలాగే సినిమాలో హైలెట్స్ గా చెప్తున్న లైఫ్ లో ఎవరికీ థ్యాంక్స్, సారీ చెప్పను అనేది కూడా పెద్దగా పండలేదు. ఏవో అక్కడక్కడా కొన్ని సీన్స్, కథ, కథనాలపై ఇంట్రెస్ట్ కలిగించినా ఆ తరువాత దర్శకుడు చేతులు ఎత్తేసాడు. ఫస్టాఫ్ సోసోగా ఉన్నా,సెకండాఫ్ ఆ మాత్రం పేస్ ని కూడా కొనసాగించలేకపోయింది.
టెక్నికల్ గా
ఈ సినిమా డైలాగ్స్ ఓ మాదిరిగా ఉంటాయి. పాత తెలుగు సినిమాల్లో హిట్ డైలాగులను అనుకరిస్తున్నట్లు కనిపిస్తాయి.ఇక సామ్ సీఎస్ సంగీతం ఓకే. డేనియల్ విశ్వాస్ ఫోటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. డైరక్షన్ లో మెరుపులు లేకపోయినా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగానే ఖర్చు పెట్టారనిపిస్తుంది.
నటీనటుల్లో కిరణ్ అబ్బవరం బాగా ఉషారుగా తెరపై కనిపించాడు. అంజలిగా రుక్సర్ బాగా చేసింది. ఆమె పాత్ర ఆకట్టుకుంటుంది. మ్యాగీ పాత్రలో క్యాతి డేవిసన్ కు పర్‌ఫార్మెన్స్ సోసోగా ఉంది.
చూడచ్చా
సినిమా సోసోగా ఉంది. ఏదొకటి చూడాలి అనుకుంటే చూడటమే లేకపోతే ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేయటమే.