కొంప ముంచిన కొరటాల శివ:  ఫస్టాఫ్ దురాశ – సెకండాఫ్ నిరాశ
x
Photo: Twitter

కొంప ముంచిన కొరటాల శివ: ఫస్టాఫ్ దురాశ – సెకండాఫ్ నిరాశ

The biggest disappointment of the year. సినిమా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటి? ఏడీ దేవర? కనిపించడేం?



-తాడి ప్రకాశ్


మబ్బుల్ని తాకే మహా పర్వతాలు.

కనుచూపు మేర విస్తరించిన కీకారణ్యం.

రాకాసి అలలు ఎగసిపడే సముద్రం.

అజేయుడూ,ధీరోదాత్తుడూ ‘దేవర’.

ఇదొక పర్ ఫెక్ట్ కమర్షియల్ స్కీం.

కోట్లు కొల్లగొట్టే బ్లాక్ బస్టర్ థీమ్.

కల్లోల సముద్ర కెరటాల్లోంచి ఎన్టీ ఆర్ ఎగిరి వస్తాడు. మెజెస్టిక్ గా,మేన్లీగా రియల్ ఎనర్జీతో దూసుకొస్తాడు. శివ శివా! కొరటాల పడిన శ్రమ అంతా ఇంతా కాదు. దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. సినిమా అంటేనే విజువల్ ప్రెజెంటేషన్. సినిమాటోగ్రఫీ జీనియస్ గా పేరున్న రత్నవేల్ కళ్ళు చెదిరేలా సీను వెంట సీన్ని పరుస్తాడు. అనిరుధ్ సంగీతం కదం తొక్కుతుంది. సముద్రం వొడ్డున తడి ఇసుకలో ఎన్ టి ఆర్ నడిచి వస్తుంటే ఆ సౌందర్యమే వేరు. And it’s a one man show all the way.

ఇంత పకడ్బందీగా తీసిన ‘దేవర’ ఎందుకు జనాన్ని నిరాశపరిచింది?

సినిమా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటి?

అన్ని తరగతుల ప్రేక్షకులూ ఒకేలా ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు?

సమాజాన్ని ఉద్దరించడం కోసమో ,లోక కళ్యాణం కోసమో ఈ సినిమా తీయలేదు. ఫక్తు వ్యాపార చిత్రం. కనుక ఇందులోని వాణిజ్య విలువల్ని తప్పుబట్టడానికేమి లేదు. వన్ మేన్ ఆర్మీ ఎన్ టి ఆర్ ,హీరోకి ధీటుగా నిలబడి దుమ్ము రేపిన విలన్ సైఫ్ అలీ ఖాన్ ,ప్రకాష్ రాజ్ ,శ్రీకాంత్ ,ఒక సెక్సీ హీరోయిన్ ,ఒక మంచి పాట,పహిల్వాన్లు ...కుస్తీలు ..నరుక్కోవడాలూ ,హింస ...నెత్తురు సముద్రం కావడం, పెద్ద ఓడల మీద నుంచి కల్లోల కెరటాల్లోకి దూకడం,అండర్ వాటర్ యాక్షన్ సీన్లు ....అన్ని ఓకే.

మరి, finally what went wrong?

సినిమా పూర్తవగానే జనం ఎందుకు నిశ్శబ్దంగా అయిపోయారు?ఒక ఘోరమైన లోపమేదో జరిగింది. అది తెర మీద 70 ఎం.ఎం లో కనిపించింది.ఆ డిస్ కంఫర్ట్ ప్రేక్షకుల్లో నిరాశగా గూడు కట్టుకుపోయింది.

ఎన్టీ ఆర్ భార్య ఒక ప్రధానమైన లోపం. ఆమె మనకెవరికీ తెలియని మరాఠి నటి . పేరు శృతి. ఎన్ టి ఆర్ లాంటి ఎమోషనల్ రొమాంటిక్ హీరో పక్కన సమంతనో, అనుష్కనో ,మరో స్టార్ హీరోయిన్నో ...ప్రేక్షకుడు ఇష్టపడతాడు. ఫ్లాట్ గా పేలవంగా ఉన్న శృతి వల్ల సినిమా గతి తప్పింది. ఎన్ టి ఆర్ ది డబుల్ రోల్. ఫస్టాఫ్ లో తండ్రీ,సెకాండాఫ్ లో కొడుకూ.అతడే గనక, చిన్న ఎన్టీ ఆర్ కి గ్లామరస్ జాన్వీ కపూర్ వుంది గనుక,తండ్రికి శ్రుతిని అంటగట్టారు. అక్కడే సినిమా కుంటుపడింది,లేదా తేలిపోయింది.

కొండ మీద నాలుగు గ్రామాలుంటాయి. అక్కడి జనం అంతా సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు. ఆ ప్రాంతానికో పురాతన సంప్రదాయం ఉంటుంది. ప్రతి యేటా జరగబోయే జాతరలో ఒక్కో గ్రామం నుంచీ ఇద్దరేసీ పహిల్వాన్లు కుస్తీ పోటీల్లో పాల్గొంటారు. గెలిచిన వీరుడి గ్రామానికి అతి పురాతన ఆయుధ సంపద అందుతుంది. అలా,ఆ గ్రామానికి శుభం జరుగుతుందని ఒక నమ్మకం. ఆ వస్తాదుల మల్ల యుద్ధం దృశ్యాల్ని, కింద ఇసుక నుంచి వాళ్ళు వేసుకున్న దుస్తుల దాకా రకరకాల బ్రౌన్ కాలర్ షేడ్స్ లో బ్యూటీఫుల్ గా కంపోజ్ చేశారు. మకురు దున్నపోతుల్లాంటి మనుషుల్ని ఎంపిక చేశారు. మానవ మృగాల్ని చూస్తున్నట్టే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎన్టీ ఆర్ ఎగిరి తన్ని ,ఎత్తి గాల్లో గిరగిరా తిప్పి పారేస్తాడు. విజయం సాధిస్తాడు. ఇచట, ఒక కార్టూన్ ఫిల్మ్ చూసినట్టుగా ఎంజాయ్ చేయవలెను. ఆ మొరటు పశువులే మన సముద్ర దొంగలు. అంతులేని సముద్రంలోకి తెగించి వెళ్ళుట,ఓడలు ఎక్కుట,ఆయుధాలు నింపిన పెట్టెలు దొంగలించుట...ఈఎడ్వంచర్ ఒక్కసారి బావుంటుంది. రిపీట్ చేసినప్పుడు,’ఇందాక చూసిందేగా’అనిపిస్తుంది.ఆ కుస్తీపోటీలు అంతే! ఇంతకీ,ఇంటర్వెల్ ఎప్పటికీ రాదు,మరో గొడవ,మరిన్ని హత్యలు, హమ్మయ్య.... ఇంటర్వెల్ అని తెర మీద వేసేసరికి,ఒక పూర్తి సినిమా చూసినంత అలసట ,ఒకింత అసహనం ....ఒక వేడి చాయ్ తాగి, సిగిరెట్ రెండు దమ్ములు లాగాక, ఇంటికెళిపోదామా?..అన్పిస్తుంది. అమ్మో, జాన్వీ ఇంకా రాలేదు,ఆ రసగుల్లాని ఎలా మిస్సవుతామ్! అని ఆశపడే ప్రేక్షకుడు తిరిగి థియేటర్లోకి వెళ్ళే సాహసం చేస్తాడు.

ఎర్ర సముద్ర కెరటాలు హింస కోసం పరితపిస్తుంటాయి. సముద్రంలో కెళ్ళి ఆయుధాల పెట్టెలు తేవడానికి దున్నపోతులు తహతహలాడుతుంటాయి.


ఏడీ దేవర? కనిపించడేం?


ఆవల అక్కడెక్కడో చీకటి ఆవరించిన అడవుల్లోకి వెళ్ళిపోతాడు. తలవొంచని ధీరుడూ, సింహబలుడు అయిన ఎన్టీ ఆర్ ఎందుకు కనిపించకుండా పోతాడో ఎవరికీ అర్థం కాదు. దానికి జస్టిఫికేషన్ కూడా ఉండదు. ఆ రెండో పార్ట్ వచ్చేదాకా నాలుగేళ్ళు ఆగలేవా,మరీ తొందర నీకు అంటే నేనేమి చేయలేను! ఆ విపత్కర పరిస్థితిలో ,పూల చొక్కా వేసుకున్న షోకిల్లా కుర్ర ఎన్టీ ఆర్ సముద్రంలోంచి ‘సొర’౦గ ప్రవేశం చేస్తాడు. అనగా ఒక భారీ సొర చేపని లాక్కొస్తాడు.పెద్ద సాహసం ఏమి చేయలేదనీ, చచ్చిన చేపకి తాళ్లు కట్టి లాక్కొచ్చానని తర్వాత చెబుతాడు. వర అనే చిన్న ఎన్టీఆర్, బెరుగ్గా భయస్తుడిగా ఉంటాడు, లేదా నటిస్తాడు. అది కేవలం నటనే అనీ,తండ్రి ఆశయ సాధన కోసం నడుం కట్టిన యోధుడనీ కాస్త లేటుగా తెలుస్తుంది. అరివీర భయంకరమైన ‘దేవర’ను చూసి వున్న ప్రేక్షకుడికి వర వోవర్ యాక్షన్ చిరాకు తెప్పిస్తుంది. అక్కడే కథ కొండ మీది నుంచి లోయలోకి జారిపడిపోతుంది. సైఫలీఖాన్ విలనీతో,నెత్తురోడే హత్యలతో సినిమా మరీ సీరియస్ అయిపోతున్న ఆపత్కాలంలో ...ఎంటర్ జాన్వీ కపూర్. ఆ నవయవ్వన సుందరి కుర్రాళ్ళని రెచ్చగొట్టే తొందరలో ఒక పాట పాడుతుంది. చిన్న రిలీఫ్. జాన్వీ పేరు తంగ. అతన్ని చూస్తే, పొంగి , ఉప్పొంగిపోతుంది అంటుంది తంగ. ‘ఆ బొంగులే’అంటుంది ఆమె చెలికత్తె. ఇంత దిగజారిన చిల్లర సంభాషణలు ఎన్ని వున్నా సినిమా జనాన్ని కవ్వించనూ లేదు .కన్విన్స్ చేయనూ లేదు.

బీభత్సమైన క్లయిమాక్స్ కు ముందు మరో కాటా కుస్తీ. జాతర బరిలోకి ఈసారి వర దిగుతాడు, బెదురు చూపులతో. పహిల్వాన్లకు మత్తు మందు కలిపిన కల్లు తాగిస్తారు. వాళ్ళంతా పిచ్చి వెధవలూ,హీరో ఒక్కడే తెలివైనవాడూ కదా మరి. బరిలోని ఇసకని చేత్తో రేపి ,చిన్ని సైజు ఇసుక తుఫాను సృష్టించి,మత్తులో జోగుతున్న మల్లయోధుల్ని చిత్తుగా వోడిస్తాడు చిన్న ఎన్టీ ఆర్.

ఏది ఏమైనా సరే,సముద్రంలో కెళ్ళి ఓడల్లోకి చొరబడాలనుకున్న సొంత మనుషుల్ని అందర్నీ వర క్రూరంగా గాయపరుస్తాడు, వీపులు చీరుతుంటే నెత్తురు కారుతుంది. ఆ హృదయవిదారక దృశ్యం చూసి విలవిల్లాడిపోయిన ఎన్టీ ఆర్ తనను తానే గాయపరుచుకుని తడి ఇసుక మీద విరుచుకుపడిపోతాడు. చటుక్కున ఒక దృశ్యం ....దేవరను పదిపన్నెండేళ్ళ కొడుకు కత్తితో పొడుస్తుంటాడు. హఠాత్తుగా సినిమా అయిపోతుంది. కంగుతిన్న ప్రేక్షకుడు బాహుబలి కట్టప్పని తలుచుకుంటూ వాష్ రూమ్ వైపు నడిచి వెళతాడు. నోర్మూసుకుని సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి అని దర్శకుడి సందేశం అన్నమాట! అపుడు మనకు ‘జనతా గ్యారేజ్’ అనే మంచి సినిమా తీసింది ఈ కొరటాల శివేనా అని పిస్తుంది.

కొరటాల శివ పడిన కష్టం, సాబూ సిరిల్ వెట్టి చాకిరీ ,రత్నవేల్ క్రియేటివ్ కన్ను ,అనిరుధ్ వీరబాదుడు,ఉత్సాహం వురకలెత్తించే ఎన్టీ ఆర్ నటన ...అన్నీ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇంకా,కొత్త రకం మారణాయుధాలు ,మనుషుల్ని ఎన్ని రకాలుగా చంపొచ్చో ... మనల్ని ఎడ్యుకేట్ చేసే ‘వ్యక్తిత్వ వికారం’ విజువల్స్. వొడ్డుని తాకుతున్న నెత్తుటి కెరటాల హోరు,నిష్కారణంగా కిరాతక హత్యలు,వెరైటీ కోసం మధ్యలో తుపాకులతో కాల్చి చంపడాలు ...దేవుడా!ఎన్నని చెప్పేది?అన్నీ వున్నాయి ఈ సినిమాలో.ఒక్కటి మాత్రమే లేదు .దాని పేరు ఆత్మ. ఈ మొరటు సినిమా నీ శరీరాన్ని మాత్రమే తాకుతుంది. హృదయాన్ని కదిలించలేదు.

రాజమౌళి....సుకుమార్ .... ప్రశాంత్ నీల్… ఒక్కొక్కడు పుంజాలు తెంపుకు పారిపోవాలనే దుగ్దతో ... ఒక బ్లాక్ బస్టర్ తీసి బహుబలిని మించిపోవాలనే ఆరాటంతో ,తెలుగు సినిమా చరిత్రని తిరగరాయాలనే ఆత్రుతతో...పడవల్లో వందల కోట్ల నోట్ల కట్టల్ని తీసికెళ్ళి నడి సముద్రంలో పోసేశారు.ఒకవేళ పెట్టిన ఖర్చు తిరిగి వచ్చినా,లాభాలు కూడా సంపాదించినా-‘దేవర’ఒక పాన్ ఇండియన్ ట్రాజెడీగా మిగిలిపోతుంది. నిజం చెప్పాలంటే,ద మేకింగ్ ఆఫ్ దేవర -తెలుగు కమర్షియల్ సినిమా తనకు తాను చేసుకున్న ద్రోహం!

చివరి మాట: మనశ్శాంతి కోసం ,మానవత్వపు జాజిపూల పరిమళాన్ని ఒకింత ఆస్వాదించడం కోసం ...’సత్యం సుందరం ‘అనే సినిమా చూడొచ్చు. భారతీయ సృజనాత్మక సినిమా ఔన్నత్యం ఏమిటో మరోసారి తెలుసుకుని,మంచి కాఫీ తాగి సెలబ్రేట్ చేసుకోవచ్చు. జూనియర్ ఎన్టీ ఆర్ ఒక బంగారం లాంటి మాట అన్నాడు: “నాకు వెట్రిమారన్ తో సినిమా చేయాలని వుందని!”

It speaks volumes!


Read More
Next Story