‘లాలో-కృష్ణ సదా సహాయతే’ OTT రివ్యూ
x

‘లాలో-కృష్ణ సదా సహాయతే’ OTT రివ్యూ

మనిషి కర్మ, పశ్చాత్తాపం, విముక్తి !


గుజరాత్‌లోని జునాగడ్ నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. అక్కడ ఒక సామాన్య ఆటో డ్రైవర్ లాల్జీ అలియాస్ ‘లాలో’ (కరణ్ జోషి). అతను ప్రేమించిన అమ్మాయి తులసి (రీవా రచ్) ని పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటాడు. దాంతో అటు తన తన వైపు, అటు మామగారి వైపు సపోర్ట్ ఉండదు. వాళ్లకో పాప ఖుషీ (మిష్టి కడేచా). ఓ రోజు ఖుషీ కి జరిగిన ప్రమాదం వల్ల 5 లక్షల అప్పుల్లో కూరుకుపోతాడు లాల్జీ . ఆ బాధను తట్టుకోలేక మద్యానికి బానిసైన లాల్జీకి, ఒకరోజు ఒక వింత ప్రయాణికుడు (శ్రుహద్‌ గోస్వామి) తారసపడతాడు. అతను ఇచ్చిన బోనస్ డబ్బుతో ఎంజాయ్ చేసి ఇంటికొచ్చిన లాల్జీకి, భార్యతో గొడవ జరగడంతో మనసు కలత చెందుతుంది.

ఆ ఒక్క తప్పు.. ప్రాణాల మీదకు తెచ్చింది!

కట్ చేస్తే, ఒక ప్రయాణికుడు తన బ్యాగ్‌లో భారీగా డబ్బు ఉందని ఫోన్‌లో మాట్లాడటం విన్న లాల్జీ, ఆశతో అతడిని వెంబడిస్తాడు. ఆ క్రమంలో ఒక నిర్మానుష్యమైన ఫామ్‌హౌస్‌లోకి వెళ్లిన లాల్జీ, అక్కడ చిక్కుకుపోతాడు. అది ఎలక్ట్రానిక్ లాక్ ఉన్న గది కావడంతో, బయటకు వచ్చే దారి లేక రోజుల తరబడి ఆకలితో, దాహంతో అలమటిస్తాడు. అటు పోలీసులు, ఇటు భార్య గాలిస్తున్నా లాల్జీ జాడ దొరకదు.

ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న లాల్జీ దగ్గరకు, గతంలో పరిచయమైన అదే వింత ప్రయాణికుడు మళ్ళీ వస్తాడు. తాను మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడినే అని చెప్పడంతో లాల్జీ మైండ్ బ్లాక్ అవుతుంది. అప్పుడు ఏమౌంతుంది. అసలు శ్రీకృష్ణుడు ఎందుకు ఈ ఆటో డ్రైవర్ దగ్గరకు వచ్చాడు. చివరకు ఆ గది నుంచి ఎలా బయిటపడ్డాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్

ఈ సినిమా మన తెలుగు మూవీ 'గోపాల గోపాల', రాజ్‌కుమార్ రావు హిందీ మూవీ 'ట్రాప్డ్' రెండింటినీ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అయితేనేం దీని ప్రత్యేకత దీనికి ఉంది. అందుకే ఈసినిమా అంత పెద్ద సూపర్ హిట్ అయ్యింది.

కొన్ని సినిమాలు ఉంటాయి. అవి పెద్ద ట్విస్టులు, భారీ డ్రామాలు లేకుండానే మనసును తాకుతాయి. ఎందుకంటే అవి కాగితంపై రాసిన కథలుగా కాకుండా, మానవ అనుభవాల ప్రతిబింబాలు గా ఉండాయి... ఈ స్క్రీన్‌ప్లే కూడా అచ్చంగా అలాంటి అనుభూతినే ఇవ్వటం జరిగింది. ఒక మనిషి అంతర్గత సంక్షోభం నుంచి పుట్టిన భావోద్వేగ ప్రయాణంలా కనిపిస్తుంది.

లాల్‌జీ, తులసి, ఖుషీ అనే చిన్న కుటుంబం చుట్టూ తిరిగే ఈ కథలో, పాత్రల మధ్య ఉన్న చిన్న చిన్న సంభాషణలు, జీవితానికి దగ్గరగా ఉన్న పరిస్థితులు చాలా సహజంగా కనిపిస్తాయి. ముఖ్యంగా లాల్‌జీకి ఉన్న స్నేహితులు అతన్ని మద్యం తాగమని ప్రోత్సహించడం, “మర్ద్” అంటే భార్యపై ఆధిపత్యం చూపించేవాడని చెప్పడం – ఇవి మన సమాజంలో కనిపించే పితృస్వామ్యపు మైండ్‌సెట్‌ను చాలా నిశితంగా చూపిస్తాయి. స్క్రీన్‌ప్లే ఈ విషయాన్ని ఉపదేశంగా చెప్పదు. అది సంభాషణల ద్వారా, చిన్న చిన్న పరిస్థితుల ద్వారా చూపిస్తుంది.

లాల్‌జీపై సమాజం పెట్టే ఒత్తిడి, అతని వ్యక్తిగత బలహీనతలు, అతను తీసుకునే తప్పు నిర్ణయాలు – ఇవన్నీ కలిసి అతని వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటూ వాటినుంచి సంఘటనలను రప్పిస్తూ స్క్రీన్ ప్లే సాగుతుంది.

కథలో అత్యంత ఆసక్తికరమైన భాగం ఫార్మ్‌హౌస్‌లో చిక్కుకుపోయిన లాల్‌జీ. ఇది మొదట చూస్తే ఒక థ్రిల్లర్ సిట్యువేషన్ లా అనిపిస్తుంది.

కానీ కథ ముందుకు సాగేకొద్దీ ఇది ఒక మెటాఫర్ అని తెలుస్తుంది. అలాగే లాల్‌జీ ఫార్మ్‌హౌస్‌లో చిక్కుకుపోయినప్పుడు బయట నిలబడి ఉన్న లాలో (శ్రీకృష్ణుడు) అతనితో మాట్లాడుతాడు. “నీ కర్మ మెరుగుపడినప్పుడే నువ్వు బయటపడగలవు.” ఇది సినిమా యొక్క మొత్తం కీ పాయింట్. వాస్తవానికి లాల్‌జీని అక్కడ ఆపేసింది చుట్టూ ఉన్న గోడలు కాదు… అతని గత నిర్ణయాలు, అతని తప్పులు, అతని బలహీనతలు.

మానవ సహజ అసహాయతలు. ఇక్కడే ఈ కథ తన అసలు తాత్వికతను బయటపెడుతుంది.

అలాగే ఈ సినిమా కథ చాలా సింపుల్. అదే ఈ సినిమా బలం. దర్శకుడు అంకిత్ సఖియా కథను క్లిష్టంగా చేయడానికి ప్రయత్నించలేదు. అతను కథ ఎక్కడికి వెళ్లాలనుకుంటుందో బాగా తెలుసు. అందుకే అనవసరమైన మలుపులు లేకుండా, నేరుగా ప్రేక్షకుడిని ఆ ప్రయాణంలో తీసుకెళ్తాడు. అన్నిటికి కన్నా ముఖ్యమైన మరో విషయం. ఈ సినిమాలో కథను ముందుకు నడిపేది యాక్షన్ కాదు… భావోద్వేగం.

దర్శకుడు అంకిత్ సఖియా ఎటువంటి డైవియేషన్ లేకుండా చాలా ఫోకస్డ్‌గా సందేశాన్ని అందించారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి

ఫైనల్ గా ...

కేవలం ₹50 లక్షల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా, ₹100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, మొదటి ₹100 కోట్ల గుజరాతీ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయడం గొప్ప విషయం. ఇక ఈ సినిమాలో ఒక డైలాగ్ పదే పదే వినిపిస్తుంది: “దేవుడు నీలోనే ఉన్నాడు… బయట వెతకకు.” ఈ ఒక్క వాక్యం కథ మొత్తం చెప్పే సందేశాన్ని సారాంశంగా చెప్పేస్తుంది. మనిషి తనలో ఉన్న బలాన్ని గుర్తించాలి. సంతోషం కూడా బయట ఎవరో ఇచ్చేది కాదు – మనం మనకు అనుమతించుకోవాల్సిన భావన.

ఎక్కడ చూడచ్చు

సోనీ లివ్ (Sony LIV) ఓటీటిలో ప్రస్తుతానికి హిందీ వెర్షన్ లో చూడచ్చు.

Read More
Next Story