Laapataa Ladies- మంచికి కళ్లు, మనసుకు కళ్ళజోడు (ఇది రివ్యూకాదు)
x

Laapataa Ladies- మంచికి కళ్లు, మనసుకు కళ్ళజోడు (ఇది రివ్యూకాదు)

మనిషి వెళ్లిన చోటంతా మంచికి ప్రచారం కల్పిస్తే, మిగతావన్నీ అవే సర్దుకుపోతాయి. దాన్ని గుర్తిస్తే బోల్డు కనిపించనివి కనిపిస్తాయి. ఆ కళ్లు, కళ్లజోడు ఈ సినిమా.


సి.రామ్

ప్రస్తుతం, మంచి అన్నారంటేనే మిమ్మల్ని సత్య కాలపు మనిషిని చేసి, మీ మీద జోకులు వేసే సమూహంలో ఉన్నాం. అంతేనా, మంచి ఉందని నమ్మించడమే మహాకార్యంగా మారిన ఈ రోజుల్లో, మంచి జరిగితే ఇలా ఉంటుందా, మనమెందుకు ఇలా ఆలోచించట్లేదు, మంచంటే అక్కడెక్కడో ఎదో జరగడం మాత్రమే కాదు కదా, మనలో ఎంత మంచి ఉందొ తెలుసుకోలేకపోవడం ఏంటి, అంటూ కథతో మనసు, కథనంతో ఉత్సాహాన్ని నింపిన సినిమా 'Laapataa Ladies' (2023). నా తెలుగునంతా కూడబలుకొన్ని రాయడానికి ఇది మహా గొప్ప సినిమా అని కాదు, అరే! మంచి ఒక్కటి చాలు పరిష్కరించడానికి, పురోగమించడానికి అని చూపించిన శైలిని నాకు కలిగించిన స్ఫురణ ఆధారంగా ఇలా పంచుకొంటున్నాను.

మన సినిమాల్లో మాములుగా మంచి జరగాలంటే, ఓ పెద్ద యుద్ధం జరగాలని నమ్ముతారు. నెత్తురు ఏరులై పొంగాలి. కుప్పలు తెప్పలుగా ప్రాణాలు కోల్పోవాలి. రణగొణ విన్యాసాలు జరగాలి. అక్కడెక్కడో ఓ కారణ జన్ముడు పుట్టాలి, రావాలని. ఓ నాయకుడు, ప్రతి నాయకుడుండాలి. వాళ్ళు ఇద్దరు పెద్ద తేడాలేని చేసే వికృత చేష్టలు చూడాలి. వాళ్ళ చుట్టూ అదేదో ఊరంతా వేరే పని లేకుండా బోలెడు రౌడీలు, ఆయుధాలు, హింస ఇంకేవేవో ఉండాలి. వీరందిరిని ఒక్కడే ఎదిరించి మట్టుబెట్టాలి, మిగతా వారంతే వీడ్ని దేవుడని కీర్తించాలి. వీడు చివరికి ఏమి చేస్తాడంటే అందరికి మంచే చేస్తాడని చూపిస్తారు. కానీ ఈ సినిమా చూస్తే మంచి జరగాలంటే ఇవేవి అవసరం లేకుండా కూడా జరగొచ్చు అని నిరూపించిన చిత్రం.

ఓ చీకటి రాత్రిలో, అనుకోకుండా హడావిడి, అతృతతో కారణాన జరిగిన ఓ పొరపాటు, రెండు కొత్త పెళ్ళి జంటల చుట్టూ తిరిగే కథ. ఇంతకూ మించి నేను ఎక్కవ చెప్పదల్చుకోలేదు. ఇక్కడ దర్శకురాలిని తప్పకుండా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఈ కథను, నేటి పరిస్థులను ప్రతిబింబిస్తూ ఘోరంగా చూపించే అవకాశం ఉన్నా, హత్తుకొనే లాగా, ఆనందంగా ఉండే స్థితిని చూస్తున్నంత సేపు మనకు ఈ మధ్య కాలంలో దొరికే గొప్ప ఉపశమనం.

తారుమారైన పెళ్లి జంటల జీవితంలో అంతా మంచి చుట్టే జరిగితే, మంచితోనే కొనసాగితే, మంచి కోసమే ముగింపు పలికితే, ఇక అడిగేదేముంది. ఇది దారిన పడాలె కానీ, మంచికి దొరికే సహకారం విస్తృతం అని నమ్ముతున్నారా, ఐతే ఆ పాత సూత్రాన్ని తుడిచేయండి. కానీ నిజ జీవితం ఇలా ఉండదు కదా, మరి ఇలా ఎందుకు తీశారు అని తోచవచ్చు. మనిషికి మంచి జరిగితే, మిగతావన్నీ స్వయం సంవృద్ధమే, అని చెప్పే శైలి, మిగతావన్నీ ఆ ఆదరణే ఆకట్టుకొంటుంది. కానీ జరగవలసినదొక్కటి మంచి మాత్రమే. అసలు మంచి వాళ్లరెవరు. వారెక్కడైనా ప్రత్యేకంగా, విడిగా ఉండే తెగలాగా ఉంటారా, అనే అందరిని తొలిచేసే సంశయం పటాపంచలు చేసిన కథ ఇది.

మంచి జరగాలంటే ఒక్క అడుగే కావాలి, ఓ ఆలోచనే చాలు, కొంత తోడ్పాటు చాలు, ఓ చిరు ప్రయత్నం అంతే, ఆ తరువాత వాటి మూలాన ఆ తరువాత దశ, దిశ మారిపోతాయి. ఆ ప్రయత్న ఫలితాలు దిమ్మదిరిగేలాగా ఉంటాయి. కానీ ఇలాంటి వాటి పైన ఎవరికి నమ్మకం లేని కాలంలో వచ్చిన సినిమా ఇది. మంచి జరిగినప్పుడు ఓ చిన్న చినుకంతే జరిగినా, దాని అనుభవ పరిధి అనంతం.మంచి చిరు ప్రయత్నమే, కానీ దానితో తృప్తిపడలేని వారు, ఆహ్వానించలేని వారిని ఏమనాలి.

మార్పు మంచితోనే సాధ్యం. అందులో మర్మమేమి లేదు. దేవుడు చేసే పని మంచే. భక్తి తెచ్చే అనుభూతి మంచే. సమాజం ఉండేది మంచికి తోడ్పాటు ఇచ్చేనందుకే. మంచికి మించిన సాధన అవసరం లేదు. మనిషి తాను సృష్టించుకున్న సహజ శక్తి వనరు మంచి. వెళ్లిన చోటంతా మంచికి ప్రచారం కల్పించాల్సింది జరిగితే, మిగతావన్నీ అవే సర్దుకుపోతాయి. దాన్ని గుర్తిస్తే బోల్డు కనిపించనివి కనిపిస్తాయి. ఆ కళ్లు, కళ్లజోడు ఈ సినిమా.

Read More
Next Story