లాల్ సలాం మూవీ రివ్యూ
x

'లాల్ సలాం' మూవీ రివ్యూ

ఇదొక స్పోర్ట్స్ డ్రామా. సినిమా కథ చాలా సింపుల్ గా కనిపిస్తుంది గాని, ఎన్నో మలుపులతో కాంప్లికేటెడ్ గా స్క్రీన్ పై కనిపిస్తుంది.


"లాల్ సలాం" సినిమా కథపరంగా, కాన్సెప్ట్ పరంగా బాగానే అనిపిస్తుంది. కానీ స్క్రీన్ పై వరకు వచ్చేసరికి కొంత కన్ఫ్యూషన్ ఉంది. రజినీకాంత్ సినిమా విడుదలకు ముందు ఇచ్చిన ఒక స్పీచ్ లో " నా కూతురు ఈ సినిమా కథా నాకు చెప్పింది. కానీ నాకు నచ్చలేదు. వద్దని చెప్పాను." అన్నాడు. తర్వాత ఐశ్వర్య ఈ సినిమా కథను చాలామందికి చెప్పిందట. వాళ్ళు మొహమాటం కొద్ది విన్నా సరే తర్వాత చూద్దామని దాటవేతగా సమాధానం చెప్పారు. చివరికి సుభాష్కరన్ ఈ సినిమా తీయడానికి ఒప్పుకున్నాడు. అలా ఈ సినిమా ఎట్టకేలకు తెరకెక్కింది.


ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే కసుమూర్ అనే ఒక ఊరిలో జరిగిన కథ (ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుదగ్గర ఉన్న ప్రఖ్యాత దర్గా ఈ ఊర్లోనే ఉంది.) లో రెండు ప్రధాన వర్గాలైన హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. తర్వాత ఊర్లో క్రికెట్ వల్ల హిందూ ముస్లిం గొడవలు వస్తాయి. దీనికి కారణం ఊర్లోనే ఉన్న ఒక పొలిటికల్ లీడర్, ఆయన అల్లుడు. ఊర్లో జరిగే జాతర లో వివాదాలు ఘర్షణలు, రజినీకాంత్ బొంబాయి కి వెళ్లిపోవడం, చివరకు మళ్ళీ అందరూ కలిసిపోవడం, హిందూ ముస్లింలు కలిసి జాతర జరుపుకోవడం. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే కసుమూరు-క్రికెట్-పాలిటిక్స్-ముంబై- జాతర. రజనీకాంత్ ఈ సినిమాలో అతిథి పాత్ర అని ముందు చెప్పారు. కానీ తర్వాత పొడిగించబడిన అతిధి పాత్ర అన్నారు(extended cameo). కానీ సినిమా లో ప్రధాన పాత్రగా మారింది. దానితో సమస్య లేదు. ఉన్న సమస్య అంతా క్లారిటీ ఉన్న స్క్రీన్ ప్లే లేకపోవడం. మంచి మంచి సీన్లను స్పష్టమైన స్క్రీన్ ప్లే ద్వారా కనెక్ట్ చేసుకోలేకపోవడం. మరొక సమస్య క్రియేటివ్ గా ఉన్న సీన్లు సాగదీయబడడం. మూడో ముఖ్యమైన సమస్య చాలా సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాక్. అయినా ఓకే. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు అయిపోతుందో మనకు తెలియదు. ఒకసారి సడన్ గా అయిపోతుంది, మళ్ళీ మనం తల అలా తిప్పేలోగా మళ్లీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతుంది. ఈ సినిమాకి ఎడిటింగ్ సరిగా చేయకపోవడం వల్ల కూడా కొంచెం ముందు వెనక అయినట్లు కనపడుతుంది.

ఈ సినిమా కథ చాలా సింపుల్ గా కనిపిస్తుంది గాని, ఎన్నో మలుపులతో కాంప్లికేటెడ్ గా స్క్రీన్ పై కనిపిస్తుంది.

ఇంతకు ముందు 3 (త్రీ ) సినిమాలో సున్నితమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలను చక్కగా చిత్రీకరించిన ఐశ్వర్య ఈ సినిమాలో కూడా అలాగే చేసింది. అయితే వాటిని ఎక్కువసేపు నడిపించడం వల్ల అవి సినిమా వేగాన్ని బాగా తగ్గించాయి. సినిమాలో చాలా సన్నివేశాలు అంతే. అలా నడుస్తూనే ఉంటాయి(ఫ్లాష్ బ్యాక్ చాలా సుదీర్ఘమైనది). పైగా సన్నివేశాల మధ్య సమన్వయం చాలా చోట్ల తప్పింది. దాంతో కథ కూడా గాడి తప్పింది. అదే సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్.
ఉదాహరణకు కొడుకు ఫోటో ముందు ఊహాజనితంగా క్రికెట్ ఆడటం. చాలా క్రియేటివ్ గా ఉంది. సరదాగా కూడా ఉంది. కానీ ఎక్కువ కాలం ఇలాంటి సీన్లు నడపడం వల్ల కథ కుంటుపడుతుంది.

తన కొడుకు రంజీ ట్రోఫీ జట్టుకి ఎంపికయాడని కపిలే ఫోన్ చేసినప్పుడు రజనీకాంత్ సహా అందరూ చాలా సంతోషపడతారు, ఆనందంతో కేరింతలు కొడతారు . ఈ సన్నివేశం చాలా సేపు నడవడం వల్ల తేలిపోయింది. క్రికెట్ కు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువ సేపు చూపించడం వల్ల సినిమాకు మూలమైన హిందూ ముస్లిం సౌఖ్యత సమస్య మరుగున పడిపోయింది.

రజనీకాంత్ బొంబాయి సన్నివేశాలు, కూడా సుదీర్ఘంగా ఉన్నాయి. అవి సినిమాకు పెద్దగా ఉపయోగపడనివి కూడా. తమిళంలో ఈ సినిమా రజనీకాంత్ వల్ల బాగానే ఆడవచ్చు కానీ, తెలుగు ప్రేక్షకులకి తమిళ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన "జాతర" కు సంబంధించిన సన్నివేశాలు మలిచిన తీరు, వాటి నిడివి తెలుగు ప్రేక్షకులకు ఎక్కకపోవచ్చు. కసుమూరులో జాతర లో భాగమైన తేరు సంబంధించి ఎక్కువ ఫుటేజ్ ఇవ్వడం అంత అవసరం లేదు. అది కూడా సినిమాని నత్తనడక గా నడిపించడంలో భాగమైంది.

అయితే ఈ సినిమాలో రజినీకాంత్ మాయ షరా మామూలుగానే అన్ని సన్నివేశాల్లో కనబడింది.

మొయిద్దిన్ భాయ్ గా రజనీకాంత్ తనదైన స్టైల్ లో " మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వం అందరితో పంచుకో.. ఇండియన్ గా నేర్చుకోవాల్సింది ఇదే" లాంటి డైలాగు లతో పాటు, ఒకటి రెండు రజిని స్టైల్ ఫైట్స్ తో ఎప్పటిలాగే ప్రేక్షకుల ను అలరించే అవకాశం ఉంది.

తర్వాత ప్రధాన పాత్రలో యువ నటుడు విష్ణు విశాల్(గురు) బాగానే చేసినప్పటికీ, కొన్ని సన్నివేశాల నిడివి ఎక్కువ కావడం సినిమాకు భారం అయ్యాయి. అతనికి పోటీగా మరో యువ నటుడు విక్రాంత్(శంషుద్దీన్) కూడా పోటీపడి నటించాడు. చాలా మటుకు క్రికెట్ సన్నివేశాలు, మతకల్లోలాలకు సంబంధించిన సన్నివేశాలు ట్రిం చేసి ఉంటే, బాగుండేది. ఈ సినిమాలో విశాల్ తల్లి(రాణి) తెలుగు నటి జీవిత కొంతవరకు బాగానే చేసినప్పటికీ, కీలకమైన సన్నివేశాల్లో ఆమె నటన తేలిపోయింది. మిగతా నటి నటుల గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. రజినీకాంత్ భార్యగా నిరోషా అస్సలు సూట్ కాలేదు. ఈ పాత్రకు ఆమెనే ఎందుకు ఎన్నుకున్నారో మరి!

ఒక మాటలో చెప్పాలంటే " అసలు కన్న కొసరు ఎక్కువైనట్లు" సినిమాలో ముఖ్యమైన దానికన్నా క్రికెట్ ఎక్కువైపోయి, ఇది సోషియో పొలిటికల్ డ్రామా కాకుండా, స్పోర్ట్స్ డ్రామాగా మారిపోయింది. సినిమా అక్కడే దెబ్బతినింది. చాలా చోట్ల కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నప్పటికీ, ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం " పల్లెటూరి పిల్ల" అనే పాటతో పాటు ఒక రెండు పాటలు క్యాచి గా ఉండడం, సూపర్ స్టార్ రజినీకాంత్ అతిధి పాత్ర నుండి, ముఖ్యమైన పాత్రగా అలరించినప్పటికీ, సినిమా మాత్రం సాధారణ సినిమా గానే ఉండిపోయింది.

"ఎప్పుడు మొదలుపెట్టామన్నది ముఖ్యం కాదు. ఎలా ముగించామన్నది ముఖ్యం" అని ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అది ఈ సినిమా కూడా వర్తిస్తుంది.

కొన్ని సుదీర్ఘమైన సన్నివేశాలు కొంతవరకు కత్తిరించి, క్రికెట్ కన్నా హిందూ ముస్లింల ఏజ్ ఓల్డ్ సమస్యకి ప్రాధాన్యతనిచ్చి, నిడివి ఒక అరగంట తగ్గించి, సన్నివేశాల మధ్య బిగువైన స్క్రీన్ ప్లే తో సమన్వయం సాధించి చిత్రీకరించి ఉంటే సినిమా కొంతవరకు బాగుండే అవకాశం ఉండేది. ఇప్పుడు ఇది కేవలం కొంతమంది తమిళ ప్రేక్షకులు, రజనీకాంత్ ఫ్యాన్స్ మాత్రమే ఎంజాయ్ చేయగల సినిమా గా మిగిలిపోయింది.. మిగతా ప్రేక్షకులను ఇది ఆకట్టుకునే అవకాశాలు తక్కువే.


నటీనటులు: రజనీ కాంత్, విష్ణు విశాల్, విక్రాంత్,లివింగ్టన్,సెంథిల్,
జీవిత, తంబి రామయ్య, నిరోషా
దర్శకత్వం : ఐశ్వర్యా రజనీకాంత్
స్కీన్ ప్లే: ఐశ్వర్యా రజనీకాంత్, విష్ణు రంగసామి
కథ : విష్ణు రంగసామి
సినిమటోగ్రఫీ : విష్ణు రంగసామి
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
ఎడిటింగ్: ప్రవీణ్ భాస్కర్
నిర్మాత: సుభాస్కరన్ అల్లిరాజ
విడుదల తే ది: 9 ఫిబ్రవరి 2024


Read More
Next Story