'లంబసింగి' (హాట్ స్టార్) మువీ రివ్యూ
నక్సలైట్ కుటుంబంలో అమ్మాయి, ఓ పోలీసు అబ్బాయికి మధ్య జరిగే ప్రేమకథే ‘లంబసింగి’ సినిమా. ఈ మూవీ ఎలా ఉందంటే..
చాలా కాలంగా నక్సలిజంపై సినిమాలు వర్కవుట్ కావడం లేదు. పెద్ద స్టార్స్ కూడా నక్సలిజం నేపథ్యంలో సినిమా చేసినా చూసేవాళ్లు కరువు అవుతున్నారు. సమాజంలో మాయమైపోయిన నక్సలిజం కల్చర్‌ని ఎందుకు మళ్లీ తెస్తున్నారని విసుక్కునే వాళ్లూ ఉన్నారు. అయితే జనాలు విభిన్న నేపథ్యంలో వస్తున్న చిత్రాలను ఆదరిస్తున్నప్పుడు ఎందుకు తీయకూడదు అని నిర్మాతలు, దర్శకులు ధైర్యం చేస్తున్నారు. రీసెంట్‌గా నక్సలిజం బ్యాక్ డ్రాప్‌లో 'లంబసింగి' వచ్చింది. థియేటర్‌లో అంతంత మాత్రం అనిపించుకున్న ఈ సినిమా ఓటిటిలోకి వచ్చింది.
అసలు ఇంతకీ సినిమాలో ఏముంది
వీరబాబు(జై భరత్ రాజు) కి పోలీస్ కానిస్టేబుల్‌గా లంబసింగిలో పోస్టింగ్ వస్తుంది. ఆ ఊరు మాజీ నక్సలైట్లు ప్రభుత్వం పునరావాసం గ్రామం. ఆ ఊరి సంతలో మన కానిస్టేబుల్ తొలిసారిగా హరిత ( దివి)ని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేస్తాడు. ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచి ఆమె ఎప్పుడు కనపడుతుందా అని అన్ని చోట్లా వెతుకుతూంటాడు. కానీ కనపడదు. అనుకోకుండా ఓ రోజు డ్యూటీలో భాగంగా మాజీ నక్సలైట్ కోనప్ప (వంశీరాజ్) ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆమె కనిపిస్తుంది. ఆమె మరెవరో కాదు కోనప్ప కూతురే. అప్పటినుంచి ఆ ఇంటికి ఏదో వంకతో తిరుగుతూ ఆమె పరిచయం కోసం తహతహలాడుతూంటాడు.
ఆమె మంచితనం, సహాయం చేసే తత్వం చూసి మరింతగా ప్రేమలో కూరుకుపోతాడు. పనిలో పనిగా ఓ మంచి రోజు చూసి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆమె నో చెప్తుంది. తీవ్రంగా నిరాశ చెందుతాడు వీరబాబు. అతనా ప్రేమ విరహంలోనే డ్యూటీ చేస్తూంటాడు. ఓ రాత్రి లంబసింగి పోలీస్ స్టేషన్‌కి వీరబాబు నైట్ డ్యూటీలో ఉండగా కొంతమంది అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి వీరబాబుని గాయపరిచి, అక్కడ ఉన్న ఆయుధాల్ని ఎత్తుకెళ్తారు. శారీరక గాయమే కాకుండా మానసికంగా మరో షాక్ తగులుతుంది. ఆ దాడి చేసిన వారిలో తను ప్రేమించిన హరిత కూడా ఉంటుంది. అసలు హరిత పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన వారిలో ఎందుకు ఉంది.? ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? చివరకు ఏమైంది? అనేది మిగిలిన కథ.
కొన్ని టైటిల్స్ చూడగానే ఆసక్తిని కలగచేస్తాయి. ఓ లుక్కేద్దామా అనిపిస్తుంది. అయితే రిలీజయ్యాక సినిమా చూస్తే అరెరే ఏదేదో ఊహించుకున్నామే అనిపిస్తుంది. మరికొన్ని టైటిల్, పోస్టర్స్ జస్ట్ ఓకే అనిపించినా ఏ ఓటీటీలోనో మరో చోటో చూసి థియేటర్‌లో మిస్సయ్యామే అనిపిస్తాయి. 'లంబసింగి' ఈ రెండింటిలో ఏ వర్గానికి చెందింది. చూడదగ్గ సినిమాయేనా... మొదటి టైపే...జస్ట్ ఓకే అని చెప్పాలి. నక్సలైట్ల కథకు తెలుగు రెగ్యులర్ సినిమా టచ్ ఇస్తూ రాసుకున్న కథ ఇది. ఒక పోలీస్ .. ఒక నక్సలైట్ ఫ్యామిలీలోని యువతి ప్రేమలో పడటం వలన ఏం జరుగుతుంది? అనేదే మెయిన్ పాయింట్. పోలీసుకు .. నక్సలైట్లకు మధ్య జరిగే లవ్ స్టోరీకి 'లంబసింగి' ఓ వేదికగా తీసుకున్నాడు.
అలాగని లంబసింగిలో లవ్ స్టోరీ అనగానే ఏదో ఆహ్లదకరమైన వాతావరణంలో అదిరిపోయే విజువల్స్‌ని ఊహిస్తే పూర్తిగా దెబ్బతింటాము. ప్రకృతిని కథలో కలపలేకపోయారు దర్శకుడు. అయితే ఉన్నంతలో ఎంటర్టైన్మెంట్‌ని కలపటం కాస్త చూసేవారికి రిలీఫ్. అలాగే చివరి వరకు హీరో, హీరోయిన్ల ప్రేమ కథ ఎలా ముగుస్తుంది అనే క్యూరియాసిటీ కలిగించటంలోనూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ ఫెరఫెక్ట్‌గా ఉంది. ఈ సినిమాకి బంగారు రాజు, సోగ్గాడే చిన్నినాయన లాంటి హిట్ సినిమాలతో దర్శకుడిగా మెప్పించిన కళ్యాణ్ కృష్ణ నిర్మాతగా మారారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండేలా చూసుకుని నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
చూడచ్చా?
వెంటనే వెతుక్కుని చూసేటంత గొప్ప సినిమా కాదు కానీ… కనపడినప్పుడు ఓ లుక్కేసినా నష్టం లేకుండా చల్తాహై అనిపించే ఫిల్మ్.
ఎక్కడుంది
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో (తెలుగులో)