కొంచెం థ్రిల్- కొంచెం సెంటిమెంట్: ‘భజే వాయు వేగం’  మూవీ రివ్యూ
x

కొంచెం థ్రిల్- కొంచెం సెంటిమెంట్: ‘భజే వాయు వేగం’ మూవీ రివ్యూ

ఈ వేసవి చివరి శుక్రవారం (31.5.24) ఒకేసారి మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో " భజే వాయు వేగం" ఒకటి.


ఈ వేసవి చివరి శుక్రవారం (31.5.24) ఒకేసారి మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో " భజే వాయు వేగం" ఒకటి. తన తొలి సినిమా ఆర్ ఎక్స్-100 సక్సెస్ అయిన తర్వాత, కార్తికేయ సినిమాలు ఏవి పెద్దగా ఆడలేదు. నాని గ్యాంగ్ లీడర్, వలిమై(తమిళ్) సినిమాలో విలన్‌గా నటించాడు. అవి పెద్దగా విజయవంతం కాలేదు. ‘భజే వాయువేగం’కు ముందు, చావు కబురు చల్లగా, విక్రమార్క కూడా నిరాశపరిచాయి. 2023 లో వచ్చిన "బెదురులంక 2012" మాత్రం కొంత ఊరట ఇచ్చింది. ఇప్పుడు భారీ అంచనాలతో, యు వి క్రియేషన్స్ సహకారంతో " భజే వాయువేగం" అనే ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా వచ్చింది.

పాత కథతో కొత్త కథనం

ఈ మధ్యకాలంలో వస్తున్న అన్ని సినిమాలు మాదిరే, దీనికి కూడా టీజర్‌లు, ట్రైలర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లతో సినిమాను బాగానే ప్రమోట్ చేశారు.యువ దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాతో తెరంగేట్రం చేశాడు. కథా పరంగా చూస్తే సాధారణమైంది. రాజన్నపేట అనే గ్రామంలో వెంకట్(కార్తికేయ) తండ్రి అప్పులు తీర్చలేక చనిపోతే, అదే ఊర్లో ఉన్న లక్ష్మయ్య(తనికెళ్ల భరణి) అప్పు తీర్చి వెంకట్రావు కూడా తన కొడుకులాగే చూసుకుంటాడు. క్రికెటర్ కావాలన్న లక్ష్యంతో వెంకట్, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలనుకున్న లక్ష్మయ్య సొంత కొడుకు రాజు(రాహుల్ టైసన్) తో హైదరాబాద్ వస్తాడు. క్రికెటర్ కావాలంటే పది లక్షలు ఇవ్వాలని సెలక్టర్ చెబుతాడు. అలాగే రాజు కి కూడా ఉద్యోగం కావాలంటే ఐదు లక్షల ఇవ్వాలని ఒక కంపెనీ ఎంప్లాయి డిమాండ్ చేస్తాడు. రాజు 5 లక్షలు ఇచ్చి మోసపోతాడు.

ఇంకోవైపు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు డేవిడ్ (రవి శంకర్), జార్జ్ (శరత్ లోహితిస్వ) లు హైదరాబాద్ నగరం మొత్తాన్ని కంట్రోల్‌లో పెట్టుకొని నడిపిస్తుంటారు. రాజు, వెంకట్ ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటూ తమ ప్రయత్నాలు చేస్తుంటారు. అదే బస్తిలో ఉన్న ఇందు(ఐశ్వర్య మీనన్) తో వెంకట్ ప్రేమలో పడతాడు. ఇలా ఉండగా హైదరాబాద్ మేయర్‌గా ఉన్న జార్జ్ తమ్ముడు డేవిడ్‌తో వెంకట్‌కు ఘర్షణ మొదలవుతుంది. దానికి కారణం ఊర్లో ఉన్న తండ్రి అనారోగ్యం పాలు కాగా, డబ్బుల కోసం వెంకట్ క్రికెట్ బెట్టింగ్ ఆడడం. దాంతో వెంకట్, రాజుల జీవితం గందరగోళం అవుతుంది. డేవిడ్ మనుషుల నుంచి తప్పించుకోవడం కోసం అన్నదమ్ములు ఇద్దరు పరుగులు పెట్టడం. మేయర్ కొడుకు చనిపోవడం. అతని శవం దాచిపెట్టిన కారుని అన్నదమ్ములు డేవిడ్ మనుషులకు అందకుండ దాచిపెట్టడం వంటి వాటితో సినిమా నడుస్తుంది.

మధ్యలో నెమ్మదించి.. సాగిన ప్రయాణం

ఈ మధ్యకాలంలో వస్తున్న ట్రెండుకు అనుగుణంగా సినిమా మొదలు పెట్టడమే పోలిస్ స్టేషన్లో మేయర్ కొడుకుని చంపినట్లు ఒప్పుకోవడం, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్‌లో సినిమా మొదలవుతుంది. కథపరంగా చూస్తే మామూలు కథనే అయినా, కథనంతో సినిమా నడిపించాడు దర్శకుడు. ఊర్లో తండ్రి, కొడుకుల మధ్య అనుబంధం, హైదరాబాదులో వాళ్లు పడే కష్టాలు, ఇందుతో వెంకట్ ప్రేమాయణం, డేవిడ్‌తో వారి ఘర్షణ, చివరికి ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ.

దర్శకుడు కథను బాగానే రాసుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న అన్ని సినిమాల మాదిరే, కథనంలో తడబడ్డాడు. కథనం ఒక తీగలాగా సాగకుండా, బిట్లు బిట్లుగా రాసుకున్న సన్నివేశాలతో అక్కడక్కడ వేగంగా, కొన్ని చోట్ల నత్తనడకగా, మరికొన్ని చోట్ల కన్ఫ్యూజింగ్‌గా నడుస్తుంది. ఇది దర్శకుడికి మొదటి సినిమా కావడంవల్ల అలా జరిగిందని అర్థం చేసుకున్నప్పటికీ, రెండో సగంలో సినిమా అది వేగంగా, మరికొన్నిసార్లు నిదానంగా నడపడం వల్ల కావలసినంత ఎఫెక్ట్ రాలేదు.

లోపాలు పట్టించుకోకుంటే చూడదగ్గ సినిమా

ఈ సినిమాలో అన్ని అంశాలు కొంచెం కొంచెంగా బాగున్నాయి. సినిమాలో ఉన్న చిన్న చిన్న ట్విస్టులు ఎప్పుడు అయిపోతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. అయితే మొత్తంగా చూస్తే సినిమా కొంతవరకు బాగున్నట్లే. దీనికి ప్రధాన కారణం కొంతమంది నటీనటులు. అందులో మొదటిగా ర్యాంకు డేవిడ్‌గా వేసిన రవిశంకర్‌ది. బొమ్మాలి అని అరుంధతిలో భయపెట్టిన రవిశంకర్ ఈ సినిమాలో కూడా విలన్‌గా దాదాపు భయపెట్టాడు. తమిళ నటుడు లోహిత్‌కు ఇటువంటి పాత్రలు కొట్టిన పిండే. హ్యాపీ డేస్‌లో నటించిన రాహుల్ టైసన్ ఒక లో ప్రొఫైల్ తమ్ముడుగా పర్వాలేదు అనిపించే స్థాయిలో నటించాడు. గతంలో స్పై సినిమాలో నటించిన మలయాళీ భామ ఐశ్వర్య మీనన్‌కు ఈ సినిమాలో పెద్దగా పాత్ర లేదు. అయితే ఉన్నంత మేరకు బాగానే చేసింది.

అయితే ఆమె టాలెంట్‌కు సరిపోయే పాత్ర కాదు. ఇంక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కార్తికేయ గురించి, ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగానే చేశాడు. ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమాలో కార్తికేయకు మంచి పాత్ర దొరికినట్టే. సంగీతం గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఫోటోగ్రఫీ కూడా అంతే. ఈ మధ్యకాలంలో వస్తున్న అన్ని యువ దర్శకుల సినిమాల్లో ఉన్న సమస్య దీనికి కూడా ఉంది. అది ఒక 20 నిమిషాల దాకా సినిమాని ట్రిమ్ చేసి ఉంటే బాగుంటుంది అనిపించడం. తన మొదటి సినిమానే ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథను ఎన్నుకోవడం సాహసమే. అలాంటి సాహసం చేసిన ప్రశాంత్ రెడ్డి కొంతవరకు అభినందనీయుడే.

సినీ హీరో శర్వానంద్,. " ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది". కార్తికేయ మాస్ యాక్షన్ కామెడీ ఇలా అన్నీ చేయగల ఓ ఆల్ రౌండర్. తను ఒక సూపర్ స్టార్ అవుతాడు.”అని చెప్పాడు. అది కొంతవరకు నిజమే. చివరగా చెప్పాలంటే తన మొదటి సినిమా అయినప్పటికీ, మెచ్చుకోదగ్గ ప్రయత్నం చేసిన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఒక విధంగా చూడదగ్గ సినిమా తీసినట్లే. ఈ సినిమా కార్తికేయకు కూడా కొంత ఊరటను ఇవ్వవచ్చు. ఈ మధ్యకాలంలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన ఎన్నో సినిమాలతో పోలిస్తే , లోపాల ను పట్టించుకోకుండా ఉంటే చాలా వరకు చూడదగ్గ సినిమానే అని చెప్పవచ్చు

నటీనటులు: కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహిత్స

దర్శకత్వం: ప్రశాంత్ రెడ్డి

డైలాగ్స్: మధు శ్రీనివాస్

సంగీతం: కపిల్ కుమార్

సినిమాటోగ్రఫీ: సత్య.జి

ఎడిటర్: ఆర్.డి. రాజశేఖర్

సహనిర్మాత: అజయ్ కుమార్ రాజు.పి

నిర్మాణ సంస్థ: యు.వి. కాన్సెప్ట్స్

విడుదల: మే 31, 2024

Read More
Next Story