
‘లక్కీ ది సూపర్ స్టార్’ ఓటిటి మూవీ రివ్యూ!
కుక్కే హీరో… కానీ క్లైమాక్స్‌లో మాత్రం రివర్స్
ఒక చెరువు గట్టున సరళ (కోవై సరళ వాయిస్ ఓవర్) అనే కుక్క నాలుగు పిల్లలకు జన్మనిస్తుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే.. వరదల వల్ల అందులో మూడు పిల్లలు నీళ్లలో మునిగి చనిపోతాయి. ప్రాణాలతో బయటపడిన ఆ ఒక్క కుక్కపిల్లకే 'లక్కీ' అని పేరు పెడతారు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో తన తల్లికి దూరమైన ఆ కుక్కపిల్ల.. మరో 'లక్కీ' అలియాస్ లక్ష్మణన్ (జీవీ ప్రకాష్) చేతికి చిక్కుతుంది. దాన్ని ఇంటికి తీసుకు వస్తాడు.
ఇంతకీ లక్ష్మణ్ ఎవరూ అంటే..అతనో నిరుద్యోగి. తన అక్క, బావల దగ్గర ఉంటూ ఉద్యోగప్రయత్నాలు చేస్తూంటాడు. అతనికో మేనకోడలు అమ్ములు. ఆ పిల్ల కి ఆటిజం సమస్య ఉంటుంది. వీధి కుక్క పిల్లను ఇంటికి తీసుకురావటం లక్ష్మణ్ బావకు ఇష్టం లేకపోయినా తన కూతురులో ఆ కుక్క పిల్ల వచ్చిన దగ్గర నుంచి హెల్త్ పరంగా మంచి మార్పు కనపడుతుంది. దాంతో ఆ కుక్క పిల్లను తమ దగ్గరే పెట్టుకుంటారు. అయితే కొద్ది రోజులకే వారికి ఆ ఆనందం దూరం అవుతుంది.
కొన్ని పరిస్దితుల్లో లక్ష్మణ్ తో గొడవపడిన కౌన్సిలర్ గణేశ్ మూర్తి మనుషులు, 'లక్కీ'ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. దాంతో అమ్ములు పరిస్దితి మళ్లీ యధాస్దితికి వస్తుంది. ఆ కుక్క పిల్ల కోసం బెంగ పెట్టుకుంటుంది. దాంతో ఆ కుక్క పిల్ల కాకపోయినా మరో కుక్కపిల్లని అయినా తెచ్చి తన మేనకోడలుని సంతోష పెట్టాలనుకుంటాడు. ఆ ప్రాజెస్ లో లక్ష్మణ్ కీ, కీర్తి (అనశ్వర రాజన్) తారసపడుతుంది.
ఇదిలా ఉండగా ఆ కుక్క పిల్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన కౌన్సిలర్ ఓ విషయం మెల్లిగా అర్దం అవుతుంది. అదేమిటంటే..ఆ కుక్క పిల్ల ఎక్కడుంటే అక్కడ అదృష్టం కలిసి వస్తుంది. దాంతో ఆ కుక్క పిల్లను ఎమ్మల్యే ఇంటికి తీసుకెళ్తారు. అక్కడా అతనికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత ఆ అదృష్టం కోసం ముఖ్యమంత్రి కూడా ఆ కుక్క పిల్లను ఇంటికి తీసుకెళ్తారు.
అలా కుక్క పిల్ల ఒక చోట నుంచి మరో చోటకు వెళ్తూంటుంది. అదే సమయంలో కుక్క పిల్లపై బెంగ పెట్టుకున్న అమ్ములు ఆరోగ్య పరిస్దితి మరింత దిగ జారి హాస్పటిల్ లో చేరుస్తారు. దాంతో ఎలాగైనా అమ్ములు కోసం ఆ లక్కి అనే కుక్క పిల్లను ముఖ్యమంత్రి నుంచి తీసుకురావాలని లక్ష్మణ్ ఫిక్స్ అవుతాడు. అందుకోసం అతనేం చేసాడు. చివరకు ఏమైంది.. లక్కి తన తల్లిని చేరుకుందా అనేది మిగతా కథ.
ఎనాలసిస్
ఒక సినిమా ఐడియా ఎంత బాగుంటుందో కాదు… ఆ ఐడియాను ఎక్కడ ప్రారంభిస్తావు — ఎక్కడ ముగిస్తారు అన్న పాయింటే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. డైరక్టర్ దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది… కానీ స్క్రీన్‌ప్లే అనుకున్న స్దాయిలో సెట్ కాలేదు. దాంతో అక్కడక్కడా బాగానే నవ్వించింది కానీ అనుకున్న స్దాయిలో పేలలేదు. సినిమా మొత్తానికి బేస్ Lucky అనే కుక్కకు ఉన్న “సూపర్‌పవర్”. కానీ సమస్య అక్కడే మొదలవుతుంది. స్క్రీన్‌ప్లేలో మొదటి 20 నిమిషాల్లోనే ఆ పవర్ రివీల్ అవుతుంది. ఇది మంచి నిర్ణయం — ఎందుకంటే ప్రేక్షకుడు కథలో త్వరగా ఇన్వెస్ట్ అవుతాడు. కానీ ఆ కుక్కకు ఉన్న పవర్ ఏంటో తెలిసింది… కానీ కథ డవలప్ కాలేదు.
Lucky ఒక్కో రాజకీయ నాయకుడిని కలవటం → వాళ్ల ఎలక్షన్ గెలవటం. ఇది మొదట ఫన్‌గా అనిపిస్తుంది. కానీ అదే ప్యాటర్న్ మళ్లీ మళ్లీ వస్తుంది. స్క్రీన్ ప్లే రిపీట్ అవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే సీన్స్ వరగా వస్తూంటాయి. కథ ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది — కానీ వాస్తవానికి అదే సీన్ మళ్లీ జరుగుతూంటుంది. దాంతో కథలో కాంప్లిక్ట్ పాయింట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఆగిపోయింది. అమ్ములు అనే పాపకు ఆ లక్కీ కావాలి అనే విషయం సినిమా ప్రారంభంలో ఎలా ఉందో, చివరకు కూడా అలాగే ఉండిపోయింది.
అలాగే ఈ కుక్క చుట్టూ తిరిగే సినిమాకు లాజిక్స్ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ...మొదట ఒక కౌన్సిలర్‌ని కలవడం వంటివి బాగానే ఉన్నా...అతి సాధారణమైన హీరో,హీరోయిన్స్ ముఖ్యమంత్రిని సులభంగా కలవటం దగ్గర మాత్రం లాజిక్ కొట్టేస్తుంది. ఎంత సినిమా అయినా సినిమాటెక్ ప్రపంచంలో అయినా నమ్మించాలి కదా. చూస్తున్నంత సేపూ కథ నిజమని అనిపించాలి. కానీ ఇక్కడ సినిమా ముందుకు వెళ్లే కొద్దీ కార్టూన్ లాజిక్ వైపు మళ్ళుతుంది. దాంతో క్లైమాక్స్ లో Lucky (ఆ కుక్క పిల్ల) కి ప్రమాదం ఉన్నా మనం టెన్షన్ పడము. అది స్క్రీన్‌ప్లే ఫెయిల్యూర్.
అలాగే ఈ సినిమా అసలు హీరో ఎవరు? సినిమా మొదట చెప్పిన అనిపించేది “ఇది కుక్కల కథ”. అంటే అవే హీరోలు. కానీ చివరికి ఏమవుతుంది? “హీరో లక్ష్మణ్ కథ”. క్లైమాక్స్ లో హీరోయిజం పెంచటానికి కుక్కలను పెద్ద ప్రమాదం లో చూపించారు. ఇది కథ కోర్ ఐడియాను దెబ్బతీసింది. ఇలాంటి సినిమాలు ఆసక్తికరంగా మారేది ఎప్పుడు అంటే: కుక్కలే రేస్క్యూ చేస్తే లేదా మనిషి + కుక్కలు కలిసి పనిచేస్తే ప్రత్యేకంగా ఉండేది. కానీ రచయిత సేఫ్ కమర్షియల్ ట్రాక్ ఎంచుకున్నాడు.
ఎవరెలా..
జీవీ ప్రకాష్ తన నేచురల్ యాక్టింగ్‌తో సినిమాను నిలబెట్టగా.. అనస్వర రాజన్ రోల్ మాత్రం జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతుంది. అసలు కిక్కు మాత్రం కుక్కలకు వాయిస్ ఇచ్చిన ఆర్టిస్టుల మధ్య వచ్చే ఫన్నీ సంభాషణలే.. మిగిలిన క్యారెక్టర్లు అలా వచ్చి పోతుంటాయి అంతే! టెక్నికల్ గా చూస్తే యావరేజ్ అని చెప్పాలి.
ఫైనల్ థాట్:
జంతువుల పట్ల ఉండాల్సిన ప్రేమ, పెట్స్ వల్ల పిల్లల్లో వచ్చే మార్పులను చాలా ఎమోషనల్‌గా చూపించడంలో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఆ కుక్కపిల్లలు చేసే అల్లరి, సింపుల్ నెరేషన్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి పక్కాగా కనెక్ట్ అవుతాయి. కానీ, కథలో పెద్దగా ట్విస్టులు లేకపోవడం, సెకండ్ హాఫ్ సాగదీసినట్లు అనిపించడం, కొన్ని సబ్-ప్లాట్స్ అసలు క్లారిటీ లేకపోవడంతో.. ఒక మంచి ఐడియా కాస్త యావరేజ్ ఎగ్జిక్యూషన్‌గా మిగిలిపోయింది. వన్ టైమ్ వాచ్‌కి అయితే పర్లేదు! బోర్ కొట్టే సినిమా కాదు. అలాగని గుర్తుండిపోయే సినిమా అసలే కాదు.
ఎక్కడ చూడచ్చు?
జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది

