
‘మేడ్ ఇన్ కొరియా’ మూవీ రివ్యూ
కే-డ్రామా కల కాస్తా.. కఠిన వాస్తవంగా మారితే?
తమిళనాడులోని ఓ కొండ గ్రామం. అక్కడ నెట్‌వర్క్ కూడా సరిగ్గా లేదు… బయట ప్రపంచం అంటే ఊహల్లో మాత్రమే. అలాంటి చోట పెరిగిన ఓ అమాయకపు అమ్మాయి ఒక్కసారిగా “నేను కొరియా వెళ్లాలి” అని ఫిక్స్ అయిపోతే?
అది కేవలం కోరిక కాదు… అబ్సెషన్. ఆ అమ్మాయి శెన్బా (ప్రియాంక అరుళ్ మోహన్). చిన్నప్పుడు స్కూల్ ఫంక్షన్‌లో కొరియా రాణి పాత్ర పోషించిన రోజు నుంచి ఆమె మనసులో ఒక చిన్న స్పార్క్ పడుతుంది. ఆ స్పార్క్ పెద్ద ఫైర్‌గా మారుతుంది. వయసు పెరిగేకొద్దీ — “కొరియా వెళ్లాలి” అనేది ఆమె జీవిత లక్ష్యంగా మారిపోతుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు కథ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
రైలెక్కి నేరుగా కొరియా వెళ్లిపోదామనుకునేంత అమాయకం శెన్బా. ఈ అమాయకత్వమే ఆమె బలహీనత కూడా. ఆమె తల్లిదండ్రులు ఈ ఆలోచనను అడ్డుకోవడానికి పెళ్లి మాటలు తీసుకొస్తారు. కానీ శెన్బా మాత్రం మరో ప్లాన్ వేస్తుంది. తన ప్రేమికుడు మణిని నమ్ముతుంది.
బార్‌లో పని చేసే మణి… “మనిద్దరం పెళ్లి చేసుకుని కొరియాలో సెటిల్ అవుదాం” అని కలలు చూపిస్తాడు. ఆమె నమ్ముతుంది. తన ఇంటిని, తన ప్రపంచాన్ని వదిలి అతనితో కలిసి సముద్రాలు దాటుతుంది. ఇక్కడ వరకు ఇది ఒక లవ్ స్టోరీలా అనిపిస్తుంది.
కానీ… కొరియా చేరుకున్న తర్వాత — రియాలిటీ గట్టిగా తాకుతుంది. మణి అసలు రంగు బయటపడుతుంది. అతనికి ప్రేమ కాదు… డబ్బే ముఖ్యం. శెన్బాను ఉపయోగించుకుని వదిలేస్తాడు. ఒక్కసారిగా ఆమె ఒంటరిగా మిగిలిపోతుంది. చేతిలో డబ్బు లేదు. భాష రాదు. తెలిసిన వాళ్లు లేరు.
కేవలం K-డ్రామాలు చూసి ఊహించుకున్న “డ్రీమ్ కొరియా” ఒక్కసారిగా “సర్వైవల్ జోన్”గా మారిపోతుంది. ఇదే అసలు టర్నింగ్ పాయింట్. ఇక్కడినుంచి శెన్బా బ్రేక్ అవుతుందా? లేక స్ట్రాంగ్ అవుతుందా? ఆమె పడిపోదు. ఫైట్ చేయడం మొదలు పెడుతుంది. భాషా సమస్యలు, ఒంటరితనం, అనిశ్చితి — ఇవన్నీ ఉన్నా ఆమె వెనక్కి తగ్గదు. ఈ ప్రయాణంలో ఆమెకు ఎదురయ్యే కొన్ని చిన్న చిన్న పరిచయాలు, అనుకోని స్నేహాలు ఆమెకు కొత్త ఊపిరినిస్తాయి. వేర్వేరు వయసుల వాళ్లు… వేర్వేరు కథలు… కానీ అందరిలోనూ ఒక కామన్ విషయం — ఆమెను ముందుకు నడిపించే చిన్న హ్యూమన్ కనెక్షన్.
ఇక్కడే సినిమా ఒక సింపుల్ లవ్ స్టోరీ నుంచి… సెల్ఫ్ డిస్కవరీ జర్నీగా మారుతుంది. ఊరు కానీ ఉళ్లో శెన్బా చివరకు నిలబడగలిగిందా? కొరియా ఆమెను మార్చిందా… లేక ఆమె కొరియాను అర్థం చేసుకుందా? ఆమె కల నిజమైందా… లేక అది ఒక గట్టి లెసన్‌గా మిగిలిపోయిందా? ఇవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
ఒక పల్లెటూరు అమ్మాయి… కొరియా వెళ్తుంది… తనను తాను తెలుసుకుంటుంది. వినటానికి బాగుంది కదా.. కానీ సమస్య ఏమిటంటే… ఈ సినిమా తనే తనని తెలుసుకోలేకపోయింది.
దర్శకుడు రా కార్తిక్ ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు — తమిళ-కొరియన్ కనెక్షన్. కొరియాలో ఉన్న తమిళ మూలాల కథల నుంచి ప్రారంభమయ్యే ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఇది. కానీ ఆ ఆలోచనను లోతుగా తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం కనిపించదు. కొరియా అనే దేశం ఈ కథలో ఒక పాత్రలా మారాల్సింది. కానీ ఇక్కడ అది కేవలం ఒక అందమైన బ్యాక్‌డ్రాప్‌గా మాత్రమే మిగిలిపోయింది. హాల్యూ వేవ్, K-culture, Korean society… ఏదీ డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేయదు. అంటే అక్కడ కొరియా కాకపోయినా మరొక ప్రాంతం అయినా కథ అదే ఉంటుంది.
షెన్బా అనే హీరోయిన్ పాత్ర మొదట్లో చాలా సహజంగా కనిపిస్తుంది. ఆమె జీవితంలో స్పష్టత లేదు, నిర్ణయాలు తీసుకోవడంలో అస్పష్టత ఉంది. ఈ స్థితి నుంచి ఆమె ఒక కొత్త దేశానికి వెళ్లి, కొత్త అనుభవాల ద్వారా ఎదగాల్సింది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఆమె ప్రయాణం సహజంగా ఎదగదు. సమస్యలు వస్తాయి, కానీ వాటిని ఎదుర్కొనే పోరాటం కనిపించదు. కష్టాల వల్ల మారడం కంటే, సహాయం వల్ల మారిపోతుంది. ఓవరాల్ గా ఆమె జర్నీ ఆర్గానిక్‌గా ఎదగదు, సిట్యుయేషన్స్ ఆమెను మార్చవు.
జాబ్ స్కామ్ అవుతుంది. బాయ్‌ఫ్రెండ్ మిస్సింగ్ . అప్పుడు “ఏంజెల్స్” లాంటి మంచి మనష్యులు ఎంటర్ అవుతారు. ఇది రియాలిటీ కాదు… ఇది ఫెయిరీ టేల్. కొరియాలోకి వెళ్లిన తర్వాత, ఆమెకు ఎదురయ్యే వ్యక్తులు చాలా సులభంగా, చాలా మంచివాళ్లుగా కనిపిస్తారు. ఒక యువకుడు, ఒక వృద్ధ మహిళ — వీరు ఆమె జీవితంలోకి వచ్చి, ఆమెను నడిపిస్తారు. కానీ వీరి పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా అనిపించవు. అవి కథలో అవసరానికి వచ్చిన మార్గదర్శకుల్లా ఉంటాయి. లోపాలు, సంఘర్షణలు లేని పాత్రలు నిజంగా అనిపించవు.
షెన్బా పాత్రలో ప్రియాంక మోహన్ ప్రయత్నం కనిపిస్తుంది. ఆమె ఒక అమాయక, దారితప్పిన యువతిగా బాగా నటించేందుకు కృషి చేసింది. కొన్ని సందర్భాల్లో ఆమె పాత్ర “క్వీన్” సినిమాలోని రాణిని గుర్తు చేస్తుంది. కానీ అక్కడ ఉన్న ఆత్మవిశ్వాసం, వెరైటీ అనుభవాలు, జీవితాన్ని ఎదుర్కొనే తత్వం ఇక్కడ కనిపించదు. దీనికి ప్రధాన కారణం రచనలో లోతు లేకపోవడమే.
ప్రియాంక మోహన్ వన్ మేన్ షో
ఈ చిత్రానికి అతిపెద్ద బలం ప్రియాంక మోహన్ నటన. అటు పల్లెటూరి అమ్మాయిగా, ఇటు గమ్యం తెలియని దేశంలో ఒంటరిగా పోరాడే యువతిగా ఆమె ఒదిగిపోయింది. మరీ అతిగా ప్రవర్తించకుండా, చాలా హుందాగా, సహజంగా శెన్బా పాత్రను పండించింది.
టెక్నికల్ గా..
ఈ సినిమా చాలా సహజంగా సాగుతుంది. సియోల్ నగరాన్ని కేవలం ఒక గ్లామరస్ పర్యాటక ప్రాంతంలా కాకుండా, మనకు పరిచయం ఉన్న వాడల్లే చాలా నేచురల్‌గా చూపించారు. సినిమా మూడ్‌కి తగ్గట్టే సంగీతం కూడా చాలా సాఫ్ట్‌గా, హాయిగా అనిపిస్తుంది. ఎక్కడా అనవసరమైన హడావిడి లేకుండా, కథకు ఎంత అవసరమో అంతే సింపుల్‌గా సాంకేతిక హంగులను ఉపయోగించుకోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్.
ఫైనల్ థాట్
ఒకసారి చూడొచ్చు అనిపించే సినిమా. కానీ చూసాక ఎక్కువసేపు మనసులో మిగిలిపోయేంత ప్రభావం చూపించదు. మంచి ఐడియా… కానీ పూర్తి స్థాయిలో ఎక్స్‌ప్లోర్ చేయని ప్రయత్నం అని చెప్పాలి.
ఎక్కడ చూడచ్చు
నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో తెలుగులో ఉంది.

