సైతాన్ కొంతవరకు భయపెట్టే హారర్ మూవీ
x
Source: Twitter

"సైతాన్" కొంతవరకు భయపెట్టే హారర్ మూవీ

అజయ్ దేవగన్, ఆర్ మాధవ్ ప్రధాన పాత్రల్లో బ్లాక్ మాజిక్ నేపథ్యంలో వచ్చిన సినిమా సైతాన్. ఈ మూవీ ఎలా ఉందంటే..


అజయ్ దేవగన్ మరోసారి దృశ్యం లాంటి ఒక థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసారి అది సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్. సైతాన్ సినిమాలో మరోసారి కూతుర్ని ఒక సమస్య నుంచి కాపాడే తండ్రిగా కనిపిస్తాడు. సైతాన్ సినిమా ఎక్కువ భాగం ఒక ఫామ్ హౌస్‌లో నడుస్తుంది. ఇది పూర్తిగా మాధవన్ సినిమా. మాధవన్ చేత, మాధవన్ వల్ల అక్కడక్కడ భయపెడుతూ, కొన్నిచోట్ల ఒళ్ళు జలదరించేలా చేస్తుంది. ఈ సినిమాలో ఇంకొక సర్ప్రైజ్ ప్యాకేజీ అజయ్ దేవగన్ కూతురు జాన్వి పాత్రలో నటించిన ‘జానకి బోడి వాలా’. సైతాన్ సినిమాకు మాతృక అయిన గుజరాతి హిట్ సినిమా "వశ్"(వశం) లో కూడా ఈ అమ్మాయే నటించింది. హిందీ సినిమాలో అజయ్ దేవగన్, జ్యోతిక ఆమె తల్లిదండ్రులుగా నటించారు.


బ్ల్యాక్ మ్యాజిక్ మాయాజాలం

బ్లాక్ మ్యాజిక్ మీద ఆధారపడిన సినిమా ఇది. చాలా భాగం ప్రేక్షకులు ఈ సినిమాలో లీనమవుతారు. కేవలం మూడు నాలుగు పాత్రలతో, సినిమాలో అధిక భాగాన్ని ఒకే ఇంట్లో సినిమా నడపడం కత్తి మీద సాము లాంటిదే. అయితే పకడ్బందీగా రాసుకున్న కథ, కథనం ద్వారా దర్శకుడు వికాస్ బహల్ కొంతవరకు భయపెట్టి, చాలా వరకు సక్సెస్ అయ్యాడు. మొదట్లో మామూలు కాఫీ లాగా అనిపించి, తర్వాత చిక్కదన్నాన్ని సంతరించుకొని, చివర్లో కొంచెం పలుచనైనప్పటికీ, ఈ కాఫీ కొంచెం రుచికరంగానే ఉంది. కనుక తాగొచ్చు.

మురిపించిన మాధవన్, జానకి బోడివాలా

ఈ సినిమా కథ కొంతవరకు దృశ్యం లాంటిదే. భార్య జ్యోతి( జ్యోతిక) ఇద్దరు పిల్లలు, జాన్వి(జానకి బోడివాలా), ధ్రువ్(అంగద్ రాజ్) లతో హ్యాపీగా ఉన్న కబీర్( అజయ్ దేవగన్) కుటుంబంలోకి బ్లాక్ మేజిక్ బాగా తెలిసిన వన్రాజ్(మాధవన్) ప్రవేశించడంతో సమస్య మొదలవుతుంది. కబీర్ కూతుర్ని వశపరచుకున్న వన్రాజ్ ఏం చేశాడు? చివరికి ఏం జరిగింది? అన్నదే సైతాన్ సినిమా కథ. ఇంతకు ముందే చెప్పినట్లు స్టైలిష్, శాడిస్టిక్ విలన్‌గా మాధవన్ నటన ఈ సినిమాకు ప్రధాన బలం. కూతురు జాన్వి పాత్రలో జానకి బోడివాలా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
మొదట్లో కథ వేగంగా సాగుతుంది. కబీర్ కుటుంబాన్ని పరిచయం చేయడం. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎక్కువ టైం తీసుకోకుండా చూపించగలిగిన దర్శకుడు, కథ ఫామ్ హౌస్ కు చేరిన తర్వాత కొంచెం నిదానించాడు. అయితే మళ్లీ మధ్యలో పుంజుకొని కొంత వేగాంగా,ప్రేక్షకులు భయపడేలా నడిపాడు. దీనికి కారణం సన్నివేశాల్లో బిగువు, క్లారిటీ నటీనటుల నటన. ఇక్కడ పోలిస్ ఇన్స్పెక్టర్ హాఠాత్తుగా ఫాం హౌస్ లోకి వచ్చే ఐదు సన్నివేశం ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. సినిమా ఎక్కువ భాగం మాధవన్, జానకీ బోడివాలా నటన మీదే ఆధారపడింది.
బ్లాక్ మ్యాజిక్ కు లోనైనా ఒక టీనేజ్ పాత్రలో నటించడం అంత సులువు కాదు. అయితే ఆ పాత్రలో వేసిన జానకీ బోడివాలా చాలా ఈజీగా, మంచి ఈజ్ తో నటించడం మెచ్చుకోదగ్గది. ఈ అమ్మాయి గుజరాతి నటి అయినప్పటికీ, ఇకమీదట హిందీలో కూడా కొన్ని సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. అజయ్ దేవగన్ కు ఇలాంటి పాత్రలు మామూలు అయిపోయాయి. జ్యోతిక కూడా కూతుర్ని చూసి తల్లడిల్లే తల్లి పాత్రలో తన ప్రతిభ చూపించింది. ధ్రువ్ పాత్రలో అంగద్ రాజ్ ఫర్వాలేదు.

సరైన సంగీతం- ఫోటోగ్రఫీ

సినిమా నిడివి తగ్గించి ఉంటే మరింత ఆసక్తికరంగా ఉండేది. సినిమాలో ఒక దశలో ఏం జరుగుతుందోనని ప్రేక్షకులు ఎదురుచూసే సన్నివేశాలు కొన్నే ఉన్నప్పటికీ, వాటిని తీసిన విధానం కొత్తగా ఉండటం వల్ల కొంతవరకు సినిమాని ఎలివేట్ చేస్తాయి. ఇలాంటి హారర్ సినిమాలకు నేపథ్య సంగీతం ముఖ్యమైన అంశం. అమిత్ త్రివేది సంగీతం ఫర్వాలేదు. సినిమా మూడ్ కు సరిపోయింది.. వర్షం బ్యాక్ డ్రాప్ లో సరైన లైటింగ్,క్లోజప్ షాట్స్ తో యక్కంటి సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫి కూడా దానికి తోడయ్యింది.
కానీ చివరికి వచ్చేసరికి సినిమా కొంత తేలిపోయింది. సాధారణంగా ఉంది. క్లైమాక్స్ కొంత సాగదీసినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ సినిమాను మాధవన్ కోసం, జానకి బోడివాలా కోసం చూడొచ్చు. హారర్,సూపర్ న్యాచురల్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా చాలావరకు నచ్చుతుంది. మిగతా వారికి కొంతైనా నచ్చుతుంది.

తారాగణం
నటీనటులు : అజయ్ దేవగన్ ,ఆర్.మాధవన్,జ్యోతిక, జానకి బోడివాలా,అంగద్ రాజ్
సంగీతం : అమిత్ త్రివేది
ఛాయాగ్రహణం: సుధాకర్ రెడ్డి యక్కంటి
ఎడిటర్ : సందీప్ ఫ్రాన్సిస్
దర్శకత్వం: వికాస్ బహల్
రచన: ఆమిల్ కీయాన్ ఖాన్
కథ : కృష్ణదేవ్ యాగ్నిక్
మూలం: గుజరాతి సినిమా “వష్”
నిర్మాతలు: అజయ్ దేవగన్ ,జ్యోతి దేశ్ పాండే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్
నిర్మాణ సంస్థలు : జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్,పనోరమా స్టూడియోస్
విడుదల తేదీ: 2024 మార్చి 8


Read More
Next Story