‘మహరాజ్’ మూవీ, మరొక రివ్యూ
విలన్ జయదీప్ అహల్వత్ నటన అమోఘం. చెరగని చిరునవ్వుతో విలన్ గా నటించడం సులభం కాదు.
మతం ఒక నమ్మకమైతే ... నమ్మకం ఉన్నచోటే మోసం జరుగుతుందనే వాస్తవాన్ని గుర్తిస్తే... మతం ముసుగులో నాటి నుంచి నేటిదాకా జరుగుతున్న అరాచకాలను మనం పసిగట్టగలుగుతాం. మతం ఈనాడు మత్తుమందు అయింది. వినాయక చవితి వేలం వెర్రి ఉత్సవాలను చూస్తుంటే మతపిచ్చి తారస్థాయికి చేరుకుందన్న విషయం స్పష్టమైంది.
సంస్కృతిని కాపాడే బాధ్యత మతం స్త్రీలపై రుద్దింది. ఫలితంగా స్త్రీలు త మకు తెలియకుండానే బలిపశువులవుతున్నారు. మతోద్ధరణను తమ భుజస్కంధాలపై వేసుకున్న కొందరు స్వామీజీలు చేసే అరాచకాలకు తక్కువేమీ లేదు. సంప్రదాయాలు, ఆచారాల పేరిట మతం ముసుగులో స్త్రీలను లైంగికంగా లొంగదీసుకోవడం చాలా చోట్ల జరిగింది. ఇందుకు బోలెడు సంఘటనలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
18వ శతాబ్దంలో బాంబేలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా 'మహారాజ్ ' సినిమాను నిర్మించారు. మత రాజకీయాలు బాహాటంగా పడగలు విప్పి బుసలు కొడుతున్న నేటి తరుణంలో ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఈ సినిమాను అందరూ చూడాలి. మత విశ్వాసాలకు పురుషులు అతీతం కాకపోయినప్పటికీ బాధితులు మాత్రం మహిళలే. కాబట్టి మహిళలందరూ తప్పక చూడవలసిన సినిమా ఇది. ( విజయ సేతుపతి నటించిన మహారాజా సినిమా కాదు ). ఈసినిమాను హిందీలో నిర్మించినప్పటికీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇది సాంఘిక దురాచారాన్ని తీవ్రంగా ఎదిరించిన సినిమా. 1862 లో లైబల్ కేసుకు దారి తీసిన వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన సినిమా ' మహారాజ్ '. భారత దేశంలో సుప్రీం కోర్టు బాంబేలో ఉన్నప్పుడు ఈ కేసు నడిచింది. సురభ్ షా రాసిన మహరాజ్ అనే పుస్తకం ఈ సినిమా నిర్మాణానికి ఆధారం.
ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలయింది. సినిమా విడుదలైతే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని కొందరు గుజరాత్లో కోర్టుకు వెళ్ళారు. ముందర థియేటర్లలో సినిమా విడుదలను ఆపేసిన గుజరాత్ హైకోర్టు తరువాత ఓటీటీలో విడుదలకు అనుమతిచ్చింది.
ఈ కథ 1832 లో గుజరాత్ లోని వడాల్ గ్రామంలో మొదలై 1862 వరకు బాంబేలో జరుగుతుంది. వైష్ణవులైన కుల్జీ దేవరాజ్ దంపతులకు కర్సన్ జన్మిస్తాడు. చిన్నప్పటి నుంచీ వాళ్ళ ఆచార వ్యవహారాలను పరిశీలిస్తూ, వాటిని ప్రశ్నిస్తూ పెరుగుతాడు. ఆ అబ్బాయికి అతనికి తెలియకుండానే హేతువాద దృక్పథం ఉంటుంది. ఒక సందర్భంలో ...... మనం రోజూగుడికి ఎందుకు వెళుతున్నాం? హోమంలో ధాన్యాలు ఎందుకు వేస్తున్నారు? అమ్మ , పెద్దమ్మ ముఖాలకు ముసుగు ఎందుకు వేసుకుంటారు? దాని వల్ల వాళ్ళు ఎలా చూడగలుగుతారు? లాంటి ప్రశ్నలు వేస్తాడు. పదేళ్ళ వయసులో అతని తల్లి మరణించడంతో తండ్రి మరో పెళ్ళి చేసుకుంటాడు. మేనమామ కర్శన్ ను బాంబేకు తీసుకపోతాడు. అప్పటికే భర్త చనిపోయిన పెద్దమ్మ అక్కడ ఉంటుంది. ఆమె ప్రేమతో అతనిని పెంచుతుంది. అభ్యుదయ భావాలతో ఎదుగుతాడు. ఒక ప్రెస్ లో విలేఖరిగా పని చేస్తుంటాడు. ఆ క్రమంలో కిశోరితో ప్రేమలో పడతాడు. పెళ్ళి నిశ్చయమవుతుంది. ఆమె చదువు పూర్తియేవరకు పెళ్లిని వాయిదా వేస్తాడు.
ఆ ప్రాంతంలో ఒక కృష్ణ మందిరం ఉంటుంది. అక్కడ ఉదయం నుంచీ సాయంత్రం దాకా భక్తులతో సందడి ఉంటుంది. బ్రిటిష్ పరిపాలనలో ఉన్న ఆ ఆలయానికి మహరాజ్ ( JJ )ప్రతినిధిగా ఉంటాడు. తనను తాను దేవుడిగా ప్రకటించుకొని, తనను సేవించడం వలన భక్తుల జీవితాలు తరిస్తాయని ఖవాస్ అనే వ్యక్తి ద్వారా ప్రచారం చేయిస్తాడు. మహరాజ్ తనకు నచ్చిన మహిళలను చరణసేవ పేరుతో తన మందిరానికి పిలిపించుకొని వాళ్ళను లొంగదీసుకోవడం వాడి అలవాటు. పైగా ఆ చరణసేవను ఇతరులు చూసే ఏర్పాటు కూడా చేస్తాడు. ఇలా ఎంతో మంది పురుషులు ముక్తి కోసం తమ భార్యలను, తల్లులను, అక్కచెల్లెళ్ళను మహరాజ్ చరణసేవకు పంపించి, తరించామని వాళ్ళ వాళ్ళ కుటుంబాలు పండగ చేసుకుంటూ ఉంటాయి. ఒకసారి హోలీపండుగ వేడుకలలో
మహారాజ్ కిశోరిని చూస్తాడు. ఆమె మీద కోరిక కలుగుతుంది. అంతే ...... చరణసేవ వంకతో ఆమెను తన మందిరానికి పిలిపించుకుంటాడు. దానిని తమ అదృష్టంగా భావించిన ఆమె కుటుంబం కూడా పండుగ చేసుకుంటుంది. దీనిని కర్సన్ చూస్తాడు. మహరాజ్ కపట రూపాన్ని కిశోరికి తెలియజెప్పడానికి ప్రయత్నించి విఫలుడవుతడు. దాంతో పెళ్లిని రద్దు చేసుకుంటాడు. ఆ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటాడు.
తరువాత కిశోరి చెల్లెలును కూడా చరణసేవకు పిలిపించి లొంగదీసుకునే ప్రయత్నంలో కిశోరి అడ్డుపడుతుంది. అప్పుడు ఆమెకు అతడు ఆధ్యాత్మిక ముసుగులో ఉన్న కామపిశాచి అని అర్థమవుతుంది. కర్సన్ ఎంత చెప్పినా అర్థం చేసుకోలేకపోయినందుకు పశ్చాత్తాపడుతుంది. అదే సమయంలో లీలావతి అనే మహిళ కూడా మహారాజ్ వల్ల మోసపోతుంది. ఆమె అన్నయ్య శ్యాం జీ కర్సన్ సహాయాన్ని కోరుతాడు.
అతను సహాయం చేయడానికి వచ్చేసరికి మహరాజ్ వాళ్ళను మాయం చేస్తాడు. దాంతో కర్సన్ ఆలోచనలో పడి మనసు మార్చుకుంటాడు. కానీ కిశోరి చనిపోయిందని తెలుస్తుంది. మహరాజ్ అసలు రూపం ఈ సమాజానికి తెలిసేలా చేయమని ఆమె రాసిన ఉత్తరం కిశోరి చెల్లెలు హీరోకు ఇస్తుంది. మహరాజ్ అరాచకాలను బయట పెట్టడానికి హీరో ఎంచుకున్న మార్గాలు, ఆ క్రమంలో అతనికి ఎదురైన ఇబ్బందులు, అతనిని అడ్డుతప్పించడానికి మహరాజ్ పన్నిన పన్నాగాలు, అవి ఫలించక చివరకు మతోద్ధరణకు ఆటంకం కలిగిందని మహరాజ్ కోర్టుకెక్కుతాడు.
అప్పుడు మహరాజ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ( బాధిత మహిళలు కూడా ) ముందుకు రారు. ఈ సందర్భంలో కర్సన్ సాక్షి బోనులో నిలబడి వాదించిన తీరు అర్థవంతమైంది. తనకు ఎవరు అండగా ఉన్నా లేకున్నా ఒంటరిగానైనా చివరికి జైలునుంచి అయినా ఆ దురాచారాన్ని ప్రశ్నిస్తానని అన్నప్పుడు అతని పెద్దమ్మ అండగా తాను ఉన్నానంటూ తాను JJ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెపుతానని ముందుకు రాగానే మిగిలిన మహిళలందరూ సాక్ష్యం చెపుతమని ముందుకు వస్తరు. తరువాత ఏడు రోజులలో దాదాపు 32 మంది మహిళలు గళం విప్పి సాక్ష్యం చెప్పారు. పురుషులు కూడా తమ మహిళలకు జరిగిన అన్యాయాలను విన్నవించారు. కర్సన్ దాస్ ను నిర్దోషిగా వెల్లడిస్తూ.... మహరాజ్ కు పరువు నష్టం ఏర్పడింది కర్సన్ దాసు వల్ల కాదని, అతని నీచమైన ప్రవర్తన వల్ల అని 1862 ఏప్రిల్ 22 వ తేదీన జడ్జి సర్. మాథ్యూ రిచర్డ్ సాస్, సర్. జోసెఫ్ ఆర్నాల్డ్ సంచలన తీర్పునిస్తూ మహరాజ్ మీద క్రిమినల్ చర్య తీసుకోవాలని ఆదేశించారు.
ఆ తీర్పు చరణసేవకు చరమగీతం పాడింది. కానీ నేటికీ మరో రూపంలో మహిళలపట్ల అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
దర్శకుడు సిద్ధార్థ్ పి మల్హోత్రా ప్రతిభ సినిమా అంతటా కనిపిస్తుంది. ప్రేక్షకులను 18వ. శతాబ్దంలోకి తీసుకపోతడు. కథ ఆ కాలానికి చెందినది కాబట్టి నేపథ్య సంగీతం, సన్నివేశాలు, ఫోటోగ్రఫీ, కాస్ట్యూమ్స్, పాత్రలు అన్నీ కాలానుగుణంగా చిత్రీకరిస్తూ మతపరమైన సామాజిక దురాచారాన్ని ప్రశ్నిస్తూ సినిమాను తెరకెక్కించిన తీరు అత్యద్భుతం. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ కు మొదటి సినిమా అయినా నటన ఫర్వాలేదు.
జెజె (JJ )గా వేసిన (మహారాజ్) విలన్ జయదీప్ అహల్వత్ నటన అమోఘం. చెరగని చిరునవ్వుతో విలన్ గా నటించడం సులభం కాదు. మిగతా నటీనటులందరి చేత తమ తమ పాత్రానుగుణంగా నటింపజేయడం కూడా దర్శకుడి ప్రతిభనే...... అయితే ఈ సినిమాలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. మొదటినుంచీ హేతువాదిగా ఉన్న కర్సన్ దాసు సినిమా చివరలో వైష్ణవమతాభిమానిగా మారిపోతాడు. ఈ మార్పు ఎలా జరిగిందో ఎప్పుడు, ఎందుకు జరిగిందో సినిమాలో ఎక్కడా కనిపించదు. సినిమా విడుదల అనుమతి కొరకు బహుశః దర్శకుడు అలా మార్చి ఉండవచ్చు.
గిరిజ పైడిమర్రి