ప్రేక్షకులను అబ్బురపరిచే థ్రిల్లర్ " మహారాజ" మూవీ రివ్యూ
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘మహారాజ’. ఇందులో అనురాగ్ కశ్యప్ తన విలనిజంతో ఔరా అనిపించాడు. స్థూలంగా ఈ సినిమా ఎలా ఉందంటే..
ఈ శుక్రవారం(14.6.24) తెలుగులో రిలీజ్ అయిన విజయ్ సేతుపతి 50వ సినిమా "మహారాజా". ఇది ఒక వైవిధ్యమైన ఫ్యామిలీ థ్రిల్లర్. దీనికి తెలుగులో కూడా ప్రమోషన్ బాగా చేశారు. ఈ సినిమాను తెలుగులో విడుదల చేసింది ఎస్వీఆర్ సినిమా వారు. విజయ సేతుపతి అభిప్రాయం ప్రకారం ఇది కమర్షియల్ సినిమా కాదు. అలాగని ఆర్ట్ సినిమా కూడా కాదు. ఒక వ్యక్తి తన కుటుంబం కోసం ఏం చేశాడు. అన్నది స్థూలంగా ఈ సినిమా కథ.
ఈ సినిమా కథ హెయిర్ కటింగ్ సెలూన్ నడుపుతున్న "మహారాజా" అనే వ్యక్తి కథ. యాక్సిడెంట్లో తన కళ్లెదురుగా భార్య చనిపోగా, కూతురు జ్యోతి తో పాటు, సిటీకి దూరంగా ఉన్న ఒక ఇంట్లో జీవనం గడుపుతుంటాడు. ఒకరోజు గాయంతో పోలీస్ స్టేషన్కి తన "లక్ష్మి" ని ఎవరో ఎత్తుకెళ్లారని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. లక్ష్మి అంటే ఏదో అనుకున్న పోలీసులు, అది ఒక చెత్త డబ్బా అని తెలుసుకొని ఆశ్చర్యపోతారు.
ఆ తర్వాత కథ మొత్తం దాన్ని చుట్టే నడుస్తుంది. నాన్ లీనియర్ పద్ధతిలో (సంఘటనలు ఒక క్రమ పద్ధతిలో ఉండవు. అయితే చివరికి అన్ని చుక్కలు కలిపి, సినిమాకు ఒక రూపం ఇచ్చే విధానం) ఈ సినిమా రాసుకున్న దర్శకుడు, కథనాన్ని వైవిధ్యమైన విధానంలో నడిపి చివరకు ప్రేక్షకులను అబ్బురపరుస్తాడు. దర్శకుడు ఇంతకుముందు తీసిన కురంగు బొమ్మయి(కోతి బొమ్మ) సినిమా కూడా ఒక క్రైమ్ థ్రిల్లరే. రెండు సినిమాలే తీసినప్పటికీ, సినిమా చూసినవారికి దర్శకుడికి ఉన్న క్లారిటీ పూర్తిగా అర్థమవుతుంది.
ఊహకందని ట్విస్టుల సమాహారం
ఈ సినిమాలో ఎన్నో ట్విస్టులు, ఒక దానికి మరొకటి సంబంధం లేని సన్నివేశాలు, ప్రేక్షకులను కొంత సేపు కన్ఫ్యూజ్ చేసినప్పటికీ, ఒక్కొక్క ముడిని విప్పుతూ పోయే విధానం, నటీనటుల నటన, ఈ సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్తుంది. అలా ఒక్కొక్క పోర తొలగిపోయే కొద్ది, ప్రేక్షకులు సినిమాలో పూర్తిగా లీనమవుతారు. దర్శకుడికి ఇది రెండో సినిమా అయినప్పటికీ తన ప్రతిభతో ఆకట్టుకుంటాడు. ఒకదానికి ఒకటి పొంతనలేని సంఘటనల తో కూడిన సన్నివేశాలు కనెక్టింగ్ ది డాట్స్(చుక్కలు కలపడం) పద్ధతిలో కలపటం అనే ప్రక్రియ రిస్కుతో కూడుకున్న వ్యవహారం.
ఏమాత్రం తేడా వచ్చిన అది సినిమా మొత్తాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. దానికి తోడు అలా సంబంధం లేని సంఘటనలను ఎక్కువ సేపు చూపించినప్పుడు, ప్రేక్షకులు పూర్తిస్థాయి గందరగోళానికి లోనయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో దర్శకుడు అన్ని చుక్కలను కరెక్టుగా కలపడం వల్ల, ప్రేక్షకులకు చివరికి సినిమా పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా అది సినిమా ను ఆస్వాదించడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనికి సహకరించింది అజనీష్ లోక్ నాథ్ ("కాంతారా" సినిమా కు కూడా ఇతనే సంగీత దర్శకుడు) సంగీతం.
విజయ్ సేతుపతి వన్ మాన్ షో
ఈ సినిమాకు ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకటి నిశ్శబ్ద నటుడు, కేవలం తన నటనతో సినిమాను ఒక లెవెల్ కి తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న విజయ్ సేతుపతి. ఇంకొకరు దర్శకుడు నితిలన్ సామినాథన్. ప్రేక్షకులు కొంత సమయం గందరగోళానికి లోనైనప్పటికీ, దర్శకుడికి మాత్రం పూర్తి క్లారిటీ ఉంది. ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినట్లు ప్రతి పాత్రను, చెక్కుతూపోయాడు. దీనికి కొంత సమయం తీసుకున్నప్పటికీ, ప్రేక్షకులు కొంత అసహనానికి లోనైనప్పటికి, నటీనటుల నటన దాన్నిమరిపించింది. ఈ సినిమా లో విజయ్ సేతుపతి తో పాటు, అనురాగ్ కశ్యప్ కూడా తన విలనిజంతో సినిమా చాలా ఉత్కంఠతతో నడవడానికి పనికొచ్చాడు.
విజయ్ సేతుపతి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో చూపించిన భావోద్వేగాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. చాలా సింపుల్‌గా కనపడే విజయ్ సేతుపతి పాత్ర రాను రాను సంక్లిష్టంగా మారి, ప్రేక్షకులను సినిమాలో పూర్తిగా చేస్తుంది. దర్శకుడు ఈ పాత్రకి ఎవరైతే బాగుంటుందని లేదా పర్ఫెక్ట్‌గా ఉంటారని అనుకున్నాడో, దానికి నూరు శాతం న్యాయం చేసిన వాడు విజయ్ సేతుపతి. అదే విధంగా ఇతర నటుల గురించి చెప్పాలంటే, ఇన్స్పెక్టర్‌గా వేసిన నటరాజ్, ఈ దర్శకుడి మొదటి సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ప్రముఖ డైరెక్టర్ భారతి రాజా ఇందులో కూడా ఒక చిన్న పాత్రలో నటించి మెప్పించాడు, విలన్ సెల్వం(అనురాగ్) భార్య పాత్రలో నటించిన అభిరామి కూడా తమ పాత్రలను దర్శకుడి కథకు కథనానికి అనుగుణంగా నడపగలిగారు.
ఎవరైనా సరే చూడదగ్గ సినిమా
నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో తెలుగు తో సహా ఏ భాషలో కూడా ఇలాంటి సినిమా రాలేదు. విడుదలైన చాలా సినిమాలు ప్రేక్షకులు నిరాశపరిచాయి. కానీ ఇది మాత్రం నిరాశపరచదు. చివరగా చెప్పాలంటే ఈ సినిమాలో మైనస్ పాయింట్ లు లేవని కాదు. అయితే అవి ఒక నీలి ఆకాశంలో అక్కడక్కడ కనిపించే మబ్బులు లాంటివి. అవి ప్రేక్షకులను పెద్దగా ఇబ్బంది పెట్టవు. దర్శకుడు, నిర్మాతలు ఈ సినిమా ముగింపు(క్లైమాక్స్ కూడా) దయచేసి ఎవరికీ చెప్పవద్దని, చెప్పడం సబబుగానే అనిపిస్తుంది. అందుకే దాని గురించి చెప్పడం లేదు. ఇంతకు ముందే చెప్పినట్టు అక్కడక్కడ ప్రేక్షకులు కొంత అర్థం కాక, సన్నివేశాల క్రమం తప్పినట్లు అనిపించినప్పటికి, ఇది ఎవరైనా సరే చూడదగ్గ సినిమానే.
నటీనటులు: విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి (నటరాజ్),
భారతీరాజా, అభిరామ్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ మణికందన్, కల్కి,
దర్శకుడు: నితిలన్ సామినాథన్
సంగీత దర్శకుడు: అజనీష్ లోక్ నాథ్
సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
నిర్మాతలు : సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి