ట్రైబల్ థ్రిల్లర్ మహాసేన మూవీ రివ్యూ!
x

ట్రైబల్ థ్రిల్లర్ 'మహాసేన' మూవీ రివ్యూ!

అడవిలో విగ్రహం వేట.. గజరాజు రక్షించాడా?


అదొక అడవి. అక్కడ రెండు వేర్వేరు గూడాలకు చెందిన శింగోట్టవ (వేమల్), గంగ (మహిమ గుప్తా) ప్రాణంగా ప్రేమించుకుంటారు. కానీ, విధి ఆడిన వింత నాటకం వల్ల శింగోట్టవ తండ్రి వల్ల గంగ తండ్రి ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ప్రేమ కాస్తా పగగా మారుతుంది. పగతో రగిలిపోయిన గంగ, శింగోట్టవ తండ్రిని హత్య చేయిస్తుంది. దీంతో వీరిద్దరూ విడిపోయి వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకుంటారు. శింగోట్టవ పెళ్లి 'భూమి' (సృష్టి డాంగే)తో జరుగుతుంది. అలాగే గంగ పెళ్లి 'ఇడుంబన్'తో జరుగుతుంది. అప్పటి నుంచి కొండ పైన శింగోట్టవ వర్గం, కొండ కింద గంగ వర్గం నివసిస్తూ.. నిత్యం శత్రుత్వంతో రగిలిపోతుంటారు.

కోట్ల విలువైన 'యాలేశ్వర' విగ్రహం.. ఫారెస్ట్ ఆఫీసర్ ప్లాన్!

శింగోట్టవ గూడెం ప్రజలు 'యాలేశ్వర' దేవతను తమ కులదైవంగా పూజిస్తారు. ఆ విగ్రహం ప్రాచీనమైనది మాత్రమే కాదు.. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్లలో ఉంటుంది. ఈ విగ్రహంపై కన్నింటిన ఫారెస్ట్ ఆఫీసర్ ప్రతాప్ (జాన్ విజయ్), ఎలాగైనా దాన్ని కాజేయాలని ప్లాన్ చేస్తాడు. దీని కోసం శింగోట్టవకు శత్రువుగా మారిన గంగ వర్గాన్ని పావుగా వాడుకుంటాడు.

మహాసేన.. ఆ గజరాజే అండ!

ఆ విగ్రహాన్ని కాపాడే బాధ్యత 'మహాసేన' అనే ఒక ఏనుగుది. ఆ ఏనుగుకు శింగోట్టవ సంరక్షకుడిగా ఉంటాడు. ఏటా జరిగే జాతరలో విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రతాప్ వేసిన ప్లాన్ ఏంటి? అదే సమయంలో ట్రెక్కింగ్ కోసం వచ్చిన విద్యార్థుల బృందం ఈ గొడవల్లో ఎలా చిక్కుకుంది?

అసలు ప్రతాప్ వెనుకున్న అసలు మనుషులు ఎవరు? ఆ విగ్రహం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? శత్రువులుగా మారిన రెండు గూడెం ప్రజలు తమ దైవాన్ని కాపాడుకున్నారా లేదా? అనేదే సినిమా క్లైమాక్స్.

ఎనాలసిస్

'మహాసేన' సినిమా చూశాక ప్రేక్షకుడికి ఒక మంచి ఫారెస్ట్ థ్రిల్లర్ చూశామన్న ఫీలింగ్ కలిగినా, కథనంలో కొన్ని లూప్ హోల్స్ మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. సినిమా ప్రారంభంలో గిరిజన గూడాల మధ్య శత్రుత్వం, అటవీ శాఖ కుతంత్రాలు కథపై ఆసక్తిని కలిగిస్తాయి.

అలాగే సినిమా పేసింగ్ (వేగం) బాగున్నప్పటికీ, ఒక ట్రాక్ నుంచి మరో ట్రాక్‌కి వెళ్లేటప్పుడు జంపింగ్ గా అనిపిస్తుంది.ఇక యాలేశ్వర స్వామి చుట్టూ అల్లిన పురాణ గాథ (Mythology) వినడానికి బాగున్నా, స్క్రీన్‌ప్లేలో దానిని ఇంకాస్త డెప్త్ గా చూపించి ఉంటే బాగుండేది.

సెకండ్ హాఫ్ లో కథ మలుపులు తిరిగి ఆధ్యాత్మిక, రహస్య అంశాలు జోడించినప్పటికీ, కథనం సాఫీగా సాగదు. ముఖ్యంగా హీరో వేమల్, ఏనుగు సేన మధ్య ఉండాల్సిన బలమైన ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకుడికి సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. కొన్ని సబ్-ప్లాట్లు అర్థాంతరంగా ముగిసినట్లు అనిపిస్తాయి.

చిత్ర పౌర్ణమి నాడు మాత్రమే కనిపించే 'యాళి' విగ్రహం కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఉంది. కానీ, దర్శకుడు దీనిని మాటల్లో చెప్పినంత గొప్పగా విజువల్ గా చూపించలేకపోయారు. ఇలాంటి మిస్టికల్ ఎలిమెంట్స్ ను గ్రాఫిక్ గా లేదా విజువల్ గా పవర్ ఫుల్ గా చూపిస్తే సినిమా రేంజ్ మరోలా ఉండేది. విజువల్స్, స్టోరీ ఐడియాకు తగ్గ విజువల్స్ సెట్ కాలేదు.

నటీనటుల్లో..

హీరోగా వేమల్ తన పాత్ర పరిధి మేరకు నిజాయితీగా నటించాడు, కానీ ఒక పవర్ ఫుల్ లీడ్ హీరోగా కంటే ఒక మామూలు క్యారెక్టర్ లాగే కనిపిస్తాడు. సృష్టి డాంగే పాత్ర పేపర్ మీద బలంగా ఉన్నా, స్క్రీన్ మీద పండించాల్సిన ఇంటెన్సిటీని చూపించడంలో తడబడింది.సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్ జాన్ విజయ్ పర్ఫార్మెన్స్. ఫారెస్ట్ ఆఫీసర్ ప్రతాప్ గా ఆయన స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ ఇంటెన్సిటీ పెరుగుతుంది. విలనిజాన్ని చాలా నేచురల్ గా పండించారు.

క్లైమాక్స్ లో కబీర్ దుహన్ సింగ్ ఎంట్రీ సినిమాకు ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్. అయితే, ఆయన పాత్రను కథలో ఇంకా ముందే ఇంట్రడ్యూస్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేది. ఒక్కసారిగా చివరి నిమిషంలో రావడం వల్ల ఆ పాత్రకు ఉండాల్సిన వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో యోగి బాబు కామెడీ అస్సలు వర్కవుట్ కాలేదు, నవ్వించలేకపోయింది.

టెక్నికల్ గా..

కెమెరా వర్క్ బాగుంది. అడవి లొకేషన్లు భలేగా చూపించారు. అలాగే సీన్లలో టెన్షన్ పెంచేలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరింది. ఎడిటింగ్ మాత్రం దెబ్బకొట్టింది! సీన్లు ఒకదానికొకటి పొంతన లేకుండా సాగడంతో కాస్త కన్ఫ్యూజన్‌గా ఉంటుంది.

ఫైనల్ గా...

'మహాసేన' – ఐడియా లెవిల్ లో బాగున్నా.. ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయిన ట్రైబల్ థ్రిల్లర్!

చూడచ్చా..

ఓ కొత్త తరహా సినిమాగా దీన్ని చూస్తే బాగానే ఉందనిపిస్తుంది. ఓ లుక్కేయచ్చు.

ఎక్కడ చూడచ్చు?

అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది.

Read More
Next Story