‘మహావతార్ నరసింహ’ రివ్యూ
x

‘మహావతార్ నరసింహ’ రివ్యూ

భక్తి, భావం, విజువల్స్ – మూడు బలాల సమ్మేళనం!


‘భాగవతం’లోని అత్యంత శక్తివంతమైన అధ్యాయం – ప్రహ్లాద భక్తి, హిరణ్యకశిప సంహారాన్ని ఆధారంగా చేసుకుని, గతంలో ‘భక్త ప్రహ్లాద’ టైటిల్ తో ఓ సినిమా వచ్చి ఘన విజయం సాధించింది. ఇప్పటికీ ఆ పాటలు, అందులో సంఘటనలు,విజువల్స్ ని మనవాళ్లు తరుచూ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఆ తర్వాత మరోసారి అదే పురాణ కథను ఆదారం చేసుకుని తెలుగులో ఓ సినిమా తేవాలన్న ప్రయత్నం జరిగినా, అవి రకరకాల కారణాలతో ముందుకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు అదే గాథను గ్లోబల్ విజన్‌తో, విజువల్ వండర్‌గా మలుస్తానంటూ ముందుకు వచ్చింది ‘మహావతార్ నరసింహ (2025)’ అనే భారీ చిత్రం. ఈ చిత్రం ఎలా ఉంది. అప్పటికి, ఇప్పటికి కథ,కథనం చెప్పే తీరులో వచ్చిన మార్పేమిటి, ఎలా ఉంది వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

సత్యయుగం ప్రారంభంలోనే జరిగిన ఓ దేవ-దానవ సంఘర్షణ ఈ కథకు ప్రాధమిక మూలం. సృష్టి నియమాలను కామోత్సాహంలో విస్మరించిన ఋషి కశ్యపుడు, దితి సంయోగంతో జన్మించినవాడే హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు. వీరిద్దరూ అసురత్వానికి ప్రతి రూపాలు.

వేళ కాని వేళ పుట్టిన కామంతో పుట్టిన వాడు వేళ కాని వేళ విచిత్ర పరిస్దితులలో మరణించాలని రాసి ఉంది. అలా పుట్టిన హిరణ్యకశ్యపుడు మానవ లోకంపై భయంకరమైన పాలన సాగిస్తాడు.

వీరి అకృత్యాలకు ఆది,అంతం లేదు. వీరిని తమ దానవ జాతికి శత్రువుగా భావించే మహా విష్ణువుకి శత్రువులుగా వారి గురువు శుక్రాచార్యుడు పెంచుతాడు. ఈ క్రమంలో తర్వాత జరిగిన పరిణామాలతో విష్ణు అవతారాల్లో ఒకటైన వారాహి అవతారం హిరణ్యాక్షుని హతమారుస్తాడు. దానితో హిరణ్య కశిపునికి విష్ణువుపై మరింత ద్వేషం రెట్టింపు అవుతుంది. దాంతో కఠోర తపస్సు చేసి బ్రహ్మ నుంచి ఓ వరాన్ని పొందుతాడు.

అప్పుడు ప్రత్యక్ష్యమైన బ్రహ్మనిచ్చిన వరం – "అతని మరణం ఏ మానవుడిచేతైనా కాదు, ప్రాణికాలంలో కాదు, దినరాత్రులలో కాదు, ఏ అస్త్రశస్త్రాలచేతా కాదు" . ఈ అపారమైన రక్షణతో అతను మానవాళిపై విరుచుకుపడతాడు. తానే దేవుడు, తానే సృష్టికర్త అనే గర్వంతో ధర్మాన్ని నాశనం చేయటం మొదలెడతాడు. కానీ అదే సమయంలో అతని ఇంట్లో, అతని సొంత కుమారుడు ప్రహ్లాదుడు అతనికి శత్రువై పుడతాడు.

ప్రహ్లాదుడు నిరంతరం విష్ణు భక్తి, శ్రద్ధ, దైవనిష్ఠలకు ప్రతిరూపంగా పెరిగిపోతాడు. ఇది హిరణ్య కశిపునికి అసలు నచ్చదు. తన కొడుకైనా తన శత్రువుగా భావించే విష్ణువుని పూజించటం నచ్చదు. అక్కడ నుంచి కథ ఎలా మారింది?ఆఖరికి విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి ఎలా అసుర సంహారం చేసారు అనేది తెరపై చూడాల్సిన మిగతా కథ.

విశ్లేషణ

"ఒక దృశ్యం ఎంత గొప్పగా ఉంటుందో కాదు, అది ప్రేక్షకుడి గుండెను ఎలా తాకుతుందో అదే అసలైన విజయం!"

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని లైవ్-ఆక్షన్ కాకుండా యానిమేటెడ్ ఫార్మాట్‌లో తీసుకోవడం ఒక సాహసోపేత నిర్ణయం. సాధారణంగా, స్టార్ న‌టుల‌తో పౌరాణిక చిత్రాలు చేస్తే ప్రేక్షకుల్లో పాత్ర కంటే నటుడి ఇమేజ్ మీదే ఫోకస్ ఎక్కువవుతుంది. కానీ, యానిమేషన్ రూపంలో తీసుకోవడం వలన – "పాత్రల ఆత్మను మాత్రమే చూసే దృష్టికోణం ప్రేక్షకుల్లో పెరుగుతుంది." ఈ చిత్రంలో మనం హిరణ్యకశిపుడిని హీరోగా చూసము కాదు, ప్రహ్లాదుని పాత్రలో నటిస్తున్న చిన్నారిని కాకుండా భక్తుడినే చూస్తాం.

ఇది పౌరాణిక విశ్వాసానికి గొప్ప స్థితి. మరీ ముఖ్యంగా “నా అవతారం నీ వరాలకూ అతీతం – నేను కాలం కాదు, నీవే కాలానికి కారణం!” అనే భావనతో నరసింహుడి రూపం లోనికి వచ్చే సందర్భం — అత్యుత్తమ దృశ్యరూపంకి ఉదాహరణగా చెప్పచ్చు.స్క్రీన్‌ప్లేలో ఎమోషనల్ టైట్స్ ఎప్పుడూ పాత్రలపై కాకుండా, భావాలపై ఉండాలి. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే ఇదే సూత్రాన్ని పాటించింది. యానిమేషన్ ఫార్మాట్‌లో రూపొందించబడిన ఈ చిత్రం, కథలోని ఆధ్యాత్మికతను తగ్గించకుండా, భావోద్వేగాలను సమతుల్యంగా మేళవించడంలో అసాధారణంగా విజయవంతమైంది.

అయితే సినిమా ఓ కొంత స్లో అయ్యిందన్నది నిజం. అలాగే తెలిసున్న కథ కావటంతో తర్వాత ఏం జరుగుతుందనేది తెలియటంతో కాస్తంత ఇబ్బంది ఉంటుంది. క్లైమాక్స్ ఇంకాస్త డ్రామా కలిసి తీస్తే నెక్ట్స్ లెవిల్ లో ఉంటుందనిపిస్తుంది. అయితే విజువల్స్ వాటిని దాటించే ప్రయత్నం చేస్తాయి.

టెక్నికల్ గా

భారతీయ యానిమేషన్‌కు ఇంకా గ్లోబల్ స్థాయికి చేరుకోవాలంటే చాలా దూరం ఉంది అన్నది నిజమే. అయితే, ‘మహావతార్ నరసింహ’ ఆ దిశగా వేసిన అడుగు మాత్రం ఒక పెద్ద మెట్టు అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో పాత్రల రూపకల్పన, మహోన్నతమైన మైతలిక దృశ్యాలు (mythical landscapes), ముఖ్యంగా నరసింహుడి పతాక ప్రవేశం – ఇవన్నీ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ప్రేక్షకుడినీ ప్రభావితం చేస్తాయి.


సాధారణంగా మనం యానిమేషన్ సినిమాలకు "పిల్లల కోసం" అనిపిస్తాయి. కానీ ఈ చిత్రం చూపించిన విజువల్ గ్రాండియర్తో… "ఇది అన్ని వయసుల వారికీ ఆస్వాదించదగ్గ అనుభవం! గా అనిపించటంతో టెక్నికల్ టీమ్ అందరూ తమ శక్తిని చూపించారు. అయితే బ్యాక్‌గ్రౌండ్ సీక్వెన్సులు, జనాల గుంపుల సీన్స్, కొన్ని సీన్స్ మధ్య ట్రాన్సిషన్‌లు — ఇవన్నీ ఇంకాస్త పాలిష్ పట్టాల్సిన అవసరం ఉంది.

ఫైనల్ థాట్

‘మహావతార్ నరసింహ’ ఒక యానిమేటెడ్ సినిమా అనే ముద్రను దాటి, భక్తి, ధర్మం, ఆధ్యాత్మికత అనే విలువైన విలువలను కొత్త తరం ముందుంచే శ్రద్ధామయమైన ప్రయత్నం. టెక్నాలజీని ఆధారంగా తీసుకొని, సంస్కృతిని కలుపుతూ ఎలాంటి ఆసక్తికరమైన సినిమా చేయవచ్చో చూపించిన చిత్రంగా మహావతార్ నరసింహ నిలుస్తుంది.

చూడచ్చా

ఖచ్చితంగా మీ పిల్లలకు చూపించటమే కాదు, మీరూ చూడాల్సిన సినిమా. మన పురణాలను, మారుతున్న సినిమా టెక్నాలిజీని ఈ సినిమా ప్రతిబింబిస్తుంది.

Read More
Next Story